ఒకప్పుడు తెలుగు చలనచిత్ర వినీలాకాశంలో అటు నటన పరంగా, ఇటు సంగీతపరంగా కొందరు ధృవతారలుగా వెలిగి చరిత్ర సృష్టించిన మహానుభావులుండేవారు. కీర్తిశేషులు చిత్తూరు నాగయ్య, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, పి.సూరిబాబు, రఘురామయ్య, వేమూరి గగ్గయ్య, అద్దంకి శ్రీరామమూర్తి, శ్రీమతులు టంగుటూ రి సూర్యకుమారి, కృష్ణకుమారి, శాంతకుమారి, కన్నాంబ, జి.వరలక్ష్మి, ఎస్.వరలక్ష్మి, పి.్భనుమతి, మాలతి- వీరందరూ ముఖంలో హావభావాలు పలికించడంలోను, గళంలో స్వర మాధుర్యాలు నింపడంలోను జగత్ ప్రసిద్ధులు. అయితే కన్నాంబ, జి.వరలక్ష్మి, ఋష్యేంద్రమణి, మాలతులు మధ్యలోనే అర్ధాంతరంగా తమ సంగీత శకానికి స్వస్తిపలికారు. నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాక కృష్ణవేణి గళం వినిపించడం మానుకున్నారు.
చివరికంటా అవకాశం ఉన్నంత వరకూ తమ స్వరమాధురి వినిపిస్తునే వచ్చిన నటీమణులు శాంతకుమారి, భానుమతి, ఎస్‌వరలక్ష్మి, సూర్యకుమారిలు. అయితే వీరందరు ఇప్పుడు కీర్తి శేషులు. అలాగే చివరి శ్వాస వరకూ నటనతోపాటు స్వరార్చనా చేసిన నటులు సూరిబాబు, రఘురామయ్యలు. సిఎస్‌ఆర్, నాగయ్యలు మధ్యలోనే ఆపివేశారు. ఇతరులూ అంతే.
ప్రత్యేకించి ‘నేపథ్యగానం’ ఒక తప్పనిసరి అవసరమైన యుగం ఆవిర్భవించినపుడు ఎం.ఎస్ రామారావు, ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, ఎ.ఎం.రాజా, మాధవపెద్ది, పిఠాపురంలు ఇటు, అటు టి.ఎం.సౌందరరాజన్, శర్కాళి గోవిందరాజన్లు తమిళ చిత్రరంగంలో ఒక ‘మహత్తర సంగీత శకాన్ని’ సృష్టించిన సంగీత మహనీయులు.
‘వెళిపోయారెళిపోయారు’. నిన్న మొన్న ఎనిమిది దశకాల ప్రాయం దాటి పి.బి.శ్రీనివాసు, తొమ్మిది దశకాలు దాటి టి.ఎం.సౌందరాజనూ పరమపద సోపానం అధిరోహించడంతో-అటు తమిళ, ఇటు తెలుగు చలనచిత్ర రంగంలో ఒకప్పటి శకకర్తలుగా విరాజిల్లి చిత్ర సంగీత ప్రపంచాన్ని శాసించిన మధుర గాయనీ గాయకుల శకం పూర్తిగా ముగిసిపోయినట్లే.
కేవలం ఆకాశవాణి ‘ఆపాత మధురాలలోనో’, దూరదర్శన్ ‘మధుర గీతాలు’లోనో వారి గళ మాధుర్యాన్ని ఆస్వాదించడమే మనకు మిగిలింది. ఆ దినాలలో విషాద గీతాలకయితే ఈ గళం, ప్రేమ గీతాలకయితే ఈ గొంతు, హాస్య గీతాలకంటే ఈ స్వరాలు అన్ని ఆరోగ్యకర సాంప్రదాయం ఉండేంది. కనుకనే ఆ మహానుభావులందరూ సంగీత శకకర్తలయ్యారు. అలాగే సంగీత దర్శకులు కూడా. నాగయ్యా, ఓగిరాల, అద్దేపల్లి, వెంకట్రామన్ తదితరులు మంచి సంగీతమే అందించినా వారు ‘శకాన్ని‘ ఏమీ సృష్టించలేదు. కానీ, ఘంటసాల, సాలూరు, పెండ్యాల, సుబ్బరామన్, కె.వి.మహదేవన్, ఎం.ఎస్.విశ్వనాధ్‌లు ‘సంగీత స్వర శకకర్తలు’గా మిగిలిపోయారు. ఈదినాలలో ఎందరు ఎన్ని వందల చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించినా, ఎన్ని వేల గీతాలు వినిపించినా శకకర్తలుగా కీర్తిగాంచడం అసంభవమే! లేదూపోదూ అంటే ఈ వర్తమానం భవిష్యత్తులో భూతకాలంగా పరిణమించే నాటికి, ఒక ఎస్పీబాలసుబ్రహ్మణ్యం స్వర మాధుర్యానికి ఒక ‘శకకర్తగా’ సంగీత సృష్టికి ఒక రమేష్ నాయుడు, ఇళయరాజాలు సంగీత దర్శక శకకర్తలుగా నిలబడవచ్చు.
గాయనీమణులు లీల, జిక్కిలు కీర్తిశేషులు. వారి శకమూ అంతరించింది. పి.సుశీల, జానకిల శకమూ ముగిసింది. బాలసరస్వతి, కోమల, జమునారాణి, వైదేహి (సీ), స్వర్ణలత (సీ) రాణి, ఉడత సరోజని, ఎల్.రాజేశ్వరిలు కేవల గాయనీమణులే. వీరి శకమంటూ ప్రత్యేకించి చెప్పుకునే రికార్డులేవీ లేవు. రాబోయే తరానికి నేటి ‘చిత్ర’ ఒక శకరాజ్ఞి కావచ్చేమో అంతే తప్ప వెనకటిలా ‘ఐదు, పదుల’ సంఖ్యలలో ఈ రంగంలో ఏ శాఖవాళ్లూ భవిష్యత్తులో ‘శకం ముగించిన వాళ్ల’ కీర్తిని మోసేవాళ్లు మాత్రం కాలేరు. చాలామందికీ‘తీర్మానం’ రుచించకపోయినా ఇది చేదు నిజం!
ఒకప్పుడు తెలుగు చలనచిత్ర వినీలాకాశంలో అటు నటన పరంగా
english title:
sangeetha shakam
Date:
Monday, June 17, 2013