కొత్త రకాల వంటలను
నేర్చుకోడం, తాము
నేర్చుకున్న వాటిని
నలుగురికీ నేర్పించడం
స్ర్తిలందరూ ఇష్టపడే
పనులు. కొత్త
వంటకాలను పదిమందికీ
తెలియచెప్పడానికి
పత్రికలు (టివి చానెళ్ళు
కూడా) అవకాశం
కల్పించడం
ఆనందించతగిన విషయం.
అయితే
‘కన్యాశుల్కం’లోని
వెంకమ్మ వారసులకు
ఇంగ్లీషు మీద
మోజున్నంతగా
మాతృభాషపై మమకారం
లేదు. తెలుగులో పదమే
లేనప్పుడు (ఉదాహరణకు
బేకింగ్) లేదా తెలుగు
పదంకన్నా ఇంగ్లీషు మాట
ఎక్కువ వాడకంలో
ఉన్నప్పుడు (ఉదాహరణ
ఆపిల్) ఇంగ్లీషు పదం
వాడడంలో తప్పులేదు.
కానీ ఇంగ్లీషు వాడడం
హోదాకి
చిహ్నమనుకుంటేనే
మాతృభాషాభిమానులకి
బాధ కలుగుతుంది. ఈ
క్రింది వాక్యాలు
గమనించండి.
‘‘రైస్ బాయిల్ చెయ్యండి’’
‘‘పాన్‌లో పొటాటోస్ ఫ్రై
చెయ్యండి’’
‘‘మినప్పప్పు నానపెట్టి
గ్రైండ్ చెయ్యండి’’
‘‘జీడిపప్పు కట్ చెయ్యండి’’
ఎన్ని ఉదాహరణలైనా
ఇవ్వవచ్చు. ఇవే
వాక్యాలను కింది విధంగా
రాయడం అసాధ్యమా?
‘‘అన్నం వండండి’’
‘‘మూకుడు (లేదా
బాణలి)లో
బంగాళాదుంపలు
వేయించండి’’
‘‘మినపప్పు నానపెట్టి
రుబ్బండి’’
‘‘జీడిపప్పు చిన్నముక్కలు
చెయ్యండి’’
మాతృభాషపై
అభిమానమున్నవారి
మనస్సును పిండేసేలా
ఉన్న వాక్యాలను చదివితే
ఆంగ్ల భాషాభిమానులు
సంతోషిస్తారా? భాషను
ఖూనీ చేస్తున్నారని
బాధపడతారా?
ఎందుకంటే ఇంగ్లీషులోనే
వెలగబెట్టాలనుకుంటే
రాయాల్సిన వాక్యాలిలా
ఉండాలి.
రైస్‌ని స్టీమ్ చెయ్యండి
అనాలి తప్ప బాయిల్
చెయ్యండి అని ఇంగ్లీషు
వచ్చినవారెవరూ అనరు.
పాన్ అంటే దోసెలు, అట్లు
వేసుకునే పెనం. కూరలు
వేయించే మూకుడుని
స్కిల్లెట్ అంటారు. స్కిల్లెట్
మన మూకుళ్ళలా
కాకుండా అడుగు భాగం
బల్లపరుపుగా ఉంటుంది
(ఇప్పుడు ఇండియాలోనూ
అటువంటివి
దొరుకుతున్నాయి). మన
మూకుడు లాంటివి
పాశ్చాత్య దేశాలలో చైనీస్
వంటకాల పుణ్యమాని
ఈమధ్యనే
వాడుతున్నారు. చైనీస్
మూకుడుని వాక్ (ఆ, ఓ
కారాలమధ్యగా పలకాలి)
అంటారు. పాశ్చాత్యులు
చైనీస్ పదాన్ని తమ
భాషలో చేర్చుకున్నారు.
స్కిల్లెట్‌ని సాటీన్ అని
కూడా అంటారు.
కూరలను తక్కువ
మంటలో వేయించడం ‘ఫ్రై
చెయ్యడం’ కాదు. ఆ వంట
ప్రక్రియను సాటింగ్
అంటారు. పిండి విసరడం
గ్రెండింగ్. పిండి రుబ్బడం
వెట్ గ్రెండింగ్. పాశ్చాత్యుల
వంటలో వెట్ గ్రెండింగ్
అంతా కనబడదు. ఎక్కువ
వేడిలో నూనెల కూరలను
కలుపుతూనే వేయించడం
స్టిర్ ఫ్రై. గారెలు, పకోడీలు
వంటివి వేయించడం డీప్
ఫ్రై.
తల్లికి తిండి పెట్టనివాడు
పినతల్లికి బంగారు గాజులు
చేయించాడట అని ఒక
సామెత ఉంది.
మాతృభాషపై మమకారం
లేనివారు, మాతృభాష
నేర్చుకోవాలనుకోనివారు,
మాతృభాషపై పట్టు
సాధించనివారు పరాయి
భాషలో పాండిత్యం
సంపాదించడం చాలా
అరుదు. అందుకే
ముందుగా తెలుగు బాగా
నేర్చుకోవాలి. ఆపైన
ఇంగ్లీషు నేర్చుకుని ఆ
భాషలో బ్రహ్మాండంగా
దంచెయచ్చు.
‘కన్యాశుల్కం’లో
రామప్పంతులు ‘నాలుగు
బొట్లేరు ముక్కలు’
అంటాడు.
ఆంగ్లేయాధికారులకు
(1947కి పూర్వం)
వడ్డన చేసే స్వదేశీ బట్లర్లకు
ఇంగ్లీషు వచ్చేది కాదు.
కానీ ఇంగ్లీషులో
మాట్లాడడం తప్పనిసరి.
వారి ఎంగిలి మంగలమైన
ఇంగ్లీషుని బట్లర్ ఇంగ్లీష్
అనేవారు. వంటా, వడ్డానా
ప్రధానమైన రచనలలో
బట్లర్ ఇంగ్లీషే ఉంటుందా?
ఆంగ్ల భాషా పరిజ్ఞానానికి
చిన్న పరీక్ష.
సరళ ఇంటికి విరళ
భోజనానికి వెళ్ళింది. విరళ
కోసం సరళ చేసిన
వంటలలో చిన్న
ఉల్లిపాయల సాంబారుంది.
‘‘అదేమిటి శాటర్‌డే నేను
ఆనియన్స్ తినను కదా.
ఆనియన్స్ సాంబారు
చేశావేమిటి?’’ అని విరళ
అడిగింది.
సరళ నేనెక్కడ ఆనియన్స్
వేసి చేశానంది. అదేమిటి
సాంబారులో స్మాల్
ఆనియన్స్ వేశావుగా
అంది విరళ.
సరళ చెప్పింది నిజమా
లేక విరళ అన్నది సరైన
మాటా?
సరళ చెప్పింది నిజమేనని
ఇంగ్లీషు వచ్చినవారికి
తెలుస్తుంది. మనం చిన్న
ఉల్లిపాయలు, మద్రాసు
ఉల్లిపాయలు, సాంబారు
ఉల్లిపాయలు మొదలైన
పేర్లతో పిలిచేవాటిని
ఇంగ్లీషులో స్మాల్
ఆనియన్స్ అని అనరు.
ఆనియన్‌కి దగ్గరగా ఉన్న
ఏ పదమూ ఆ అర్థంలో
వాడరు. సాంబారు
ఉల్లిపాయలకు సరైన ఆంగ్ల
పదం షలాట్స్
(SHALLOTS).
ఇది ఉల్లి జాతికి చెందినదే
కానీ ఉల్లిపాయ కాదు.
శనివారం విరళ వంటివారు
ఉల్లిజాతికి చెందింది ఏదీ
తినరనుకోండి. అది వేరే
సంగతి. ఈ వ్యాసం ఆంగ్ల
భాషకు మాత్రమే
సంబంధించినది. తల్లికి
తిండీ లేదు, పినతల్లికి
బంగారు గాజులూ లేవు.
ఇద్దరు భాషామ తల్లుల
నెత్తినా ముళ్ళకిరీటాలే.