నారాయణఖేడ్ ఫిబ్రవరి 24: ఖేడ్ మండలం చాంద్‌ఖాన్‌పల్లి గ్రామానికి చెందిన హన్మవ్వ (70)కి ముగ్గురు కుమారులున్నా పోషించే దిక్కులేని వైనంపై పత్రికల్లో వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన న్యాయమూర్తి హన్మవ్వ కుమారులకు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారు. హన్మవ్వ పెద్ద కుమారుడు నాగరత్నం విద్యుత్‌శాఖలో లైన్‌ఇన్స్‌ఫెక్టర్‌గా పనిచేస్తున్నాడు. రెండవ కుమారుడైన సత్యం విద్యుత్‌శాఖలో హెల్పర్‌గా పనిచేస్తుమృతి చెందాడు. మూడవ కుమారుడైన వెంకట్ హైద్రాబాద్‌లో కూలీపని చేస్తు జీవితం గడుపుతున్నాడు. ఉన్నరెండు ఎకరాల భూమి సైతం వారు పంచుకున్నారు. రెండవ కుమారుని భార్య చంద్రకళ విద్యుత్ శాఖలో జోగిపేటలో అటెండర్‌గా ఉద్యోగం నిర్వహిస్తున్నారు. హన్మవ్వ భర్త 7 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. కాగా అందరూ ఉన్నా తనకు పోషించే దిక్కులేదని గురువారంనాడు హన్మవ్వ ఖేడ్ తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగింది. ఈవార్త పత్రికల్లో రావడంతో శుక్ర వారంనాడు స్పందిం చిన న్యాయమూర్తి నాగరాణి పోలీసులద్వారా విద్యుత్‌శాఖలో పని చేస్తున్న నాగరత్నంను కోర్టుకు పిలిపించి న్యాయవాదుల ముందు కౌనె్సలింగ్ నిర్వహించారు. తల్లిని పోషించేందుకు ప్రతినెలా ఐదు వేల రుపాయలు చెల్లించేందుకు అంగీకరించారు. దీంతో అమె పేరుతో బ్యాంకులో అకౌంట్ తెరిపించేందుకు అదేశాలు ఇచ్చారు. మిగతా ఇద్దరికి సైతం సోమవారంనాడు కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమన్లు పంపారు. న్యాయమూర్తి తన్యాయం చేసినందుకు హన్మవ్వ కృతజ్ఞతలు తెలిపింది. ఇందులో న్యాయవాదులు వీరారెడ్డి, మారుతిరెడ్డి, అనంద్‌శెట్కార్, అంజ య్య, బోజిరెడ్డి, సంగమేశ్వర్‌రెడ్డి, గ్రామస్థులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వీరందరి సమక్షంలో పైవిధంగా అదేశాలు జారీ చేశారు.
డిపిఓ అవినీతి ఆరోపణలపై
జెసి విచారణ
పటన్‌చెరు, ఫిబ్రవరి 24: జిల్లా పంచాయతీ అధికారి అరుణపై వచ్చిన అవినీతి అరోపణలపై జిల్లా జాయింట్ కలెక్టర్ శరత్‌కుమార్ విచారణ చేపట్టారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో డిపిఓపై విచారణ ప్రారంభించారు. మెదక్ శాసనమండలి సభ్యుడు భూపాల్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ సురేష్‌కుమార్ ఆదేశాల ప్రకారం ఆయన విచారణ చేపట్టారు. పటన్‌చెరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వత్సలాదేవి, మండల పరిధిలోని అమీన్‌పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేందర్‌రెడ్డి, మండల పరిధిలోని రుద్రారం గ్రామ పంచాయతీ అధికారి తదితరులను జెసి శరత్‌కుమార్ ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల కార్యదర్శులను ఇష్టానుసారంగా బదిలీ చేశారని, పంచాయతీ కార్యదర్శుల డెప్యుటేషన్ విధానంలో పంచాయతీ రాజ్ చట్టం నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారని, అమీన్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 343 నిర్మాణాలకు చట్ట వ్యతిరేకంగా తాఖీదులు ఇచ్చారని, పంచాయతీ కార్యాలయాలకు సంబంధించి రికార్డుల నిమిత్తం కొనుగోలు చేసిన రిజిస్టర్లలో పలు అక్రమాలు జరిగాయని ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి జిల్లా కలెక్టర్ సురేష్‌కుమార్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇంతేకాకుండా తెలంగాణ క్రాంతిదళ్ జిల్లా అధ్యక్షుడు ముప్పారం ప్రకాష్ సైతం జిల్లా పంచాయతీ అధికారి అరుణపై పలు అరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ శుక్రవారం విచారణ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఆయన ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పలువురి ప్రశ్నించారు. చివరగా డిపిఓ అరుణను పిలిచి ఆమెపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేశారు. పటన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పంచాయతీ శివారులలో నిర్మించిన గీతం డ్రీమ్‌డ్ యూనివర్సిటీ విషయంలో ఆయన డిపిఓ అడిగి వివరాలు తెలుసుకున్నారు. రుద్రారం గ్రామ పంచాయతీ నుంచి కేవలం మూడు అంతస్థుల వరకు అనుమతి తీసుకుని గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఏకంగా తొమ్మిది అంతస్థులు నిర్మాణం జరిపారని జెసి వాఖ్యానించారు. దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపిన అనంతరము వివరాలు వెల్లడిస్తామన్నారు. జిల్లా పంచాయతీ అధికారి స్థాయిలో గీతం యూనివర్సిటీ కూల్చివేతకు నోటీసులు ఇవ్వడం నిజమేనన్నారు. జిల్లాలోని పంచాయతీ కార్యాలయాలకు సంబంధించిన రిజిస్టర్లు కొనుగోలు వరంగల్ జిల్లాలోని జనగామ ప్రాంతానికి చెందిన ప్రింటింగ్ ప్రెస్ నుంచి జరిపారని దీనిపై పలు అరోపణలు వచ్చాయని వివరించారు. తెలంగాణ క్రాంతి దళ్ జిల్లా అధ్యక్షుడు ముప్పారం ప్రకాష్ సైతం ఈ విషయమై ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. పలువురి నుంచి అందిన ఆరోపణలపై విచారణ జరిపామని, దీనిపై పూర్తి స్థాయిలో సమగ్రమైన దర్యాప్తు జరిపిన తర్వాత బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం తప్పదన్నారు. గతంలో అమీన్‌పూర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన గంగాధర్‌గౌడ్ ఇచ్చిన అనుమతులపై ప్రత్యేక అధికారిగా డిపిఓ అరుణ నోటీసులు జారీ చేశారన్నారు.
చట్ట పరిధిలోనే చర్యలు
పంచాయతీ రాజ్ చట్టం నిబంధనలకు లోబడి అన్ని చర్యలూ తీసుకోవడం జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి అరుణ తెలిపారు. ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకూ పాల్పడలేదన్నారు. జిల్లాలోని అనేక మారుమూల గ్రామాలకు కార్యదర్శులను బదిలీ చేయడం జరిగిందని, ఆయా గ్రామాలు సైతం అభివృద్ధి పథంలో ముందుండాలని అలా చేశామన్నారు. మంచి పనులు చేద్దామని ప్రయత్నిస్తుంటే ప్రజాప్రతినిధులు అడ్డుకోవడం బాధాకరమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డివిజన్ ఆర్‌డిఓ తదితరులు పాల్గొన్నారు.