పిల్లలకైనా, పెద్దలకైనా ‘సింద్‌బాద్ సాహస యాత్రలు’ పరిచయమున్న పుస్తకమే. కథ మొదట్లో సింద్‌బాద్ ఇంటిముందు కూచున్న ఒక పేదవాడు (అతడి పేరు కూడా సింద్‌బాద్) తన దారిద్య్రం గురించి, సింద్‌బాద్ సంపద గురించి వాపోతాడు. అతడ్ని లోపలకు పిలిచి సింద్‌బాద్ తాను ధనవంతుడవడానికి పడ్డ కష్టాలను కథల రూపంలో చెప్తాడు. నిజానికి సంపద పెరగడానికి కష్టపడాలి. పేదరికానికి మాత్రం సులభమైన పది మార్గాలివిగో...
* ఇరుగు పొరుగుల వద్ద, బంధువుల వద్ద మీ గొప్పదనం ప్రదర్శించండి.
ఈ విషయంలో ప్రతి ఒక్కరికీ కొద్దోగొప్పో కోరిక వుంటుంది. పక్కింటి వారి అభిప్రాయం మనకి చాలా ముఖ్యం. ఇంటికెవరైనా వస్తే కాఫీ, బిస్కెట్లూ ఇచ్చి పంపితే ఏం బావుంటుంది? ప్రతి పెళ్లికీ పచ్చ పట్టుచీరే కట్టుకెళితే ఎంత అవమానం? మగవారైతే బుల్లెట్ మోటార్ వాహనంపై ఆఫీసుకెళ్ళాలి కానీ సెకెండ్ హాండ్ స్కూటరా?
నిజమే మరి. పక్కవాళ్ళకీ, ఫ్రెండ్స్‌కీ, బంధువులకీ, సహోద్యోగులకీ పనేముంది? మీరెంతటి ఘనకార్యాలు సాధిస్తున్నారో అన్న విషయం గురించే ఆలోచించడం తప్ప.
* పెద్ద ఇల్లు కొనుక్కోండి
రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రకటనల ప్రభంజనమో, ప్రభుత్వం వడ్డీ రేట్లు తగ్గించిపారెయ్యడమో కానీ సొంతింటి కల నిజం చేసుకోవడం మీద అంతా దృష్టి సారిస్తున్నారు. ఇల్లనేది ఒక్కసారేగా కొంటాం లేదా కట్టుకుంటాం. కాస్త పెద్దదైతే మేలు. అంత పెద్ద ఇల్లు కొనుక్కున్నాక షో కేసులు లేకపోతే ఎలా? వంటింటికి టైల్సు వేయించొద్దా.. ఆ లిస్టుకి అంతమేముంది.
అయ్యో.. ఇంత ఇల్లు కట్టుకున్నాక నలుగురూ చూసి అభినందించాలి కదా! గృహప్రవేశానికి అయ్యే ఖర్చుతో ఇంకో రెండు గదులు కట్టవచ్చు. ఎవరికి ఈ ఆలోచన వచ్చేది?
* హాబీలుండాలి మరి
గాజు గ్లాసులపై పెయింటింగు, చీరలమీద అప్లిక్ వర్కు, బొమ్మల తయారీ, పూసల డిజైన్లు- ఎన్నైనా చెయ్యచ్చు. ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటామన్న ప్రశ్నలేదు. బూజు పట్టకుండా చూసుకునే ఓపికా ఉండదు. ఎంత చెట్టుకి అంత గాలి- అన్నట్లు విదేశాల్లో అయితే గోల్ఫ్, బోటింగు వంటి ఖరీదైన హాబీలుంటాయి. ఏ రాయైతేనేం పళ్ళూడగొట్టుకునేందుకని జేబుకి చిల్లు తప్పదు.
* పిల్లలను గారంగా పెంచండి..
వాళ్లు ఏదడిగినా కాదనవద్దు..
పల్లెలతో సంబంధమున్న మధ్య వయసు వారికి తాటాకు బొమ్మలూ, ముంజికాయల బళ్ళూ గు ర్తుండి ఉండవచ్చు. వాటితో ఆడుకున్న పిల్లలకన్నా నేడు ఖరీదైన బొమ్మలతో ఆడుకుంటున్న పిల్లలే ఎక్కువ ఆనందంగా ఉన్నారని గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పగలమా? అయితేనేం ప్రేమ చూపించడానికి ఒక్కటే మార్గం. పిల్లలకు అన్నీ కొనివ్వడం, ఖరీదైన బట్టలుల తొడగడం, బ్రహ్మాండంగా బర్త్‌డే పార్టీలు చెయ్యడం, శ్రామిక వర్గాలలో సైతం కేక్ కొనందే పుట్టిన రోజు పూర్తవడంలేదు. ఇక-డబ్బు ఎలా మిగుల్తుంది?
* నలుగురితో నారాయణా..!
వయస్సు పెరిగినకొద్దీ, వయస్సుతోపాటు జ్ఞానం వృద్ధి చెందిన కొద్దీ మెజారిటీ మాడై రైటనే అభిప్రాయం తప్పు అని తెలుస్తుంది. కొందరికి ఎప్పటికీ తెలియకపోవచ్చు. అందరూ ఏం చేస్తే అది చెయ్యడమే కానీ- లాభనష్టాలు, కష్టసుఖాలు బే రీజు వేసుకుందామనిపించదు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలంటే కొనెయ్యడమే. ఫలానా షాపులో మంచి చీరలున్నాయంటే ఆఫీసుకి శెలవుపెట్టయినా పరిగెత్తడమే. ఆఫీసరయ్యావు ఇంకా పాత కారేమిటి? అంటే వెంటనే బుక్ చేసెయ్యడమే. అందరూ ప్లాస్మా టీవీ కొంటే మనమూ కొనెయ్యడమే. మనం మనలా, మనకి తగినట్లుగా జీవించడం మంచిది కదా.!
* ఇప్పటి నుంచే పొదుపెందుకు?
యవ్వనంలో సుఖపడాలి, ఇప్పటినుంచీ పొదుపేమిటి? అన్న మాట తరుచుగా వింటూంటాం. అలా విన్నప్పుడు 1980ల నాటి విషయమొకటి జ్ఞాపకమొస్తుంది. ఒక ప్రభుత్వోద్యోగికి ముగ్గురమ్మాయిలు. పిల్లల పెళ్లికి డబ్బు దాచమని ఎవరైనా చెప్తే మూడేళ్ళ (పై)సంపాదనతో ముగ్గురమ్మాయిల పెళ్ళిళ్ళూ చేసేస్తాననేవాడు. అకస్మాత్తుగా ప్రభుత్వం రిటైర్మెంటు వయసుని 58 నుంచి 55కి తగ్గించింది. ఉద్యోగ విరమణ చెయ్యాల్సి వచ్చింది. ఆపైన ఉద్యోగ సంఘాలు కోర్టుకి వెళ్లి 58 వయస్సుని పునరుద్ధరించుకున్నాయన్నది వేరే సంగతి. ప్రభుత్వం జీతం ఇచ్చినా ‘గీతం’ ఎవరూ ఇవ్వరు కదా! ఇదంతా- లంచగొండితనం సరైనది అని చెప్పడానికి కాదు. దేశ, కాలమాన పరిస్థితులు ఎప్పుడూ ఎలా మారతాయో ఎవరూ చెప్పలేరు. చాలా బాగా పనిచేస్తోందన్న కంపెనీ మూత పడవచ్చు. బిపిఓలు ఏ ఫిలిప్పైన్స్‌కో తరలిపోవచ్చు. అందుకే చిన్న వయసు నుంచే పొదుపు చెయ్యాలని ఆర్థికశాస్తవ్రేత్తలు చెప్తున్నారు.
* క్రెడిట్ కార్డ్ జిందాబాద్..
అప్పుచేసి పప్పుకూడు తినడం ఒకప్పుడు చులకనగా చూసేవారు. ప్రస్తుతం అంతా వ్యతిరేకంగా నడుస్తున్నది. ఏం కావాలన్నా బ్యాంకులూ, ఆర్థికసంస్థలూ, షాపులూ పోటీపడి అతి సులభంగా అప్పులిస్తున్నాయి. మా ఆఫీసుకి రానక్కరలేదని చేతిలో క్రెడిట్ కార్డు పెట్టేస్తున్నాయి. ఆఖరుకి విలాస యాత్రలకు వెళ్లాలన్నా అప్పులిచ్చేవాళ్ళు రెడీ! దారిద్య్రం నుంచి బయటపడడానికి ఒక్కటేమార్గం. అది డబ్బుంటేనే కొనుక్కోడం.
* పిసినారితనం ఎందుకు?
గది బయటకు వస్తూ లైటాపినవాణ్ణి ‘పిసినారి వెధవ’ అనేవారికి కొదవలేదు. నీళ్ళు, కరెంటు, ఆహారం, అన్నిటికీ మించి సమయం వృథా చెయ్యడం దారిద్య్రానికి ప్రథమ సోపానం.
* దానం చేస్తే మంచిదే...
విన్న వెంటనే నమ్మశక్యం కాని విషయమిది. నలుగురికి ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా పెడితేనే సంపద వృద్ధి చెందుతుంది. భగవంతుడిపై సంపూర్ణ విశ్వాసమున్నవాళ్ళు దానం చేస్తే పుణ్యం వచ్చి తద్వారా సంపద పెరుగుతుందని నమ్మవచ్చు. విశ్వాసం లేనివారికి దానం వృథా ఖర్చు అన్పిస్తుంది. కాదని నమ్మడం కష్టం. గణాంక శాస్త్రాల ద్వారా రుజువైందని చెప్తే నమ్ముతారేమో. దానం ద్వారా సంపద పెరగడం ఎలా సాధ్యం? కష్టంలో ఉన్నవారిని అతి దగ్గరగా గమనించడంవల,్ల కష్టసుఖాల బేరీజు బాగా వేసుకోవడం వస్తుందేమో. కారణమేమైనా దానధర్మాలు సంపదకు కారణాలు.
* పెళ్ళిళ్ళూ, పేరంటాలూ
ఆర్భాటంగా చెయ్యడం
మా నాన్నగారిని ఒకసారి- వారి మేనమామల అరవై ఎకరాల ఆస్తి హారతి కర్పూరంలా ఎలా కరిగిపోయిందని అడిగాను. పెళ్ళిళ్ళు జమీందారీ ఫాయాలో చెయ్యడమే అన్నారు. అప్పట్లో పంచదార అపురూపం. సేనా మిఠాయి వడ్డించారంటే గొప్ప. పొలం మీద అప్పు తేవడం, అయిదు రోజుల పెళ్ళిళ్ళు చెయ్యడం. నేటికీ అదే పద్ధతి కొనసాగుతోంది. పెళ్ళిళ్ళలో అయితే మగపెళ్లివారి అజమాయిషీ ఉందనుకోవచ్చు. అమ్మాయి రజస్వల అయితే అప్పు చేసైనా ‘గ్రాండ్’గా ఫంక్షన్ చేస్తున్నారు. ఈ విషయంలో విదేశీయులని మెచ్చుకోవాలి. పెళ్ళికి వందమంది వస్తే గొప్ప. మనకి వెయ్యి విస్తళ్ళు తక్కువ లేస్తే నామోషీ.
పెళ్ళికయిన ఖర్చుని వధూవరుల పేరున డిపాజిట్ చెయ్యడమో, వారికి ఇల్లు కొనుక్కునేందుకు మొదట కట్టే ‘డౌన్ పేమెంట్’ చెయ్యడమో చేస్తే బాగుండదా? కన్యాదాతకి డబ్బులేక అప్పు చేస్తే.. పరిస్థితి ఘోరం కాదా?
పేదరికానికి పది మార్గాలే ఇక్కడ చెప్పినా, ఇంకా పదివేల మార్గాలున్నాయని తాను ఎంత కష్టపడి ధనవంతుడయ్యాడో సింద్‌బాద్ చెప్పాడు. నిచ్చెన మెట్లెక్కడం కష్టం. కిందికి జారి పడిపోవడం సులువు. ముందు కష్టపడి, తరువాత హాయిగా ఉండే మార్గం ఎంచుకుంటామా? ముందు సులభంగా అన్పించి తరువాత కష్టాలలోకి నెట్టే మార్గం ఎంచుకుంటామా? అన్నది మన చేతిలోనే ఉంది.
ఫీచర్
english title:
main feature
Date:
Tuesday, June 18, 2013