నెల రోజుల తరువాత గుడికి వచ్చారు మామ్మగారు. కంటికి ఆపరేషన్ చేయించుకున్నారని తెలిశాక, ‘ఎవరు చేయించారు? పెద్దకొడుకా? చిన్న కొడుకా?’ అడిగాను నవ్వుతూ. ‘‘వాళ్లు కాదమ్మా... దైవం మానుష రూపేణా అంటారు కదా..! ఆ త్రిమూర్తులే నన్ను కాపాడారు’’-అంటూ కల్యాణ మండపంలో తోరణాలను కడుతూ బిజీగా ఉన్న ముగ్గురిని చూపించారావిడ. ఆ ముగ్గురినీ అక్కడివారు ‘త్రిమూర్తులు’ అంటారు. బాల్యం నుంచి కలిసి చదువుకుని, రిటైరయ్యాక ఖాళీగా కూర్చోకుండా తమకు వచ్చే పెన్షన్‌లో సగభాగాన్ని సమాజసేవకు వినియోగిస్తూ... దైవ కార్యక్రమాలను శ్రద్ధగా చేసే ఆ ముగ్గురిని చూస్తుంటే... ‘వృద్ధాప్యం వయసుకేగానీ మనసుకు కాదని’ అనిపిస్తోంది. ‘మానవసేవే మాధవసేవ’ అని మహనీయుల బోధనలను ఆచరణలో పెడుతున్న ఆ ముగ్గురూ అక్కడివారి హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు.
భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని మంచిపనులకు వినియోగిస్తూ వారు తమ జీవితాలను చరితార్థం చేసుకుంటున్నారు. ఇలాంటివారి గురించి ఓ మంచిమాటను అక్షరజ్ఞానం లేనివారికి ఎవరు చెబుతారు? నా కొడుక్కి, మనవడికి, భార్యకి ఎన్నికల్లో టిక్కెట్లంటూ ఎనభైదాటినా ప్రజాసేవ ముసుగులో కోట్లాదిరూపాయలు కూడబెట్టి దాన్ని కాపాడుకోవటానికి ‘పవర్’ కావాలని ఆరాటపడేవారిని చూస్తుంటే జాలేస్తోంది. బాగా చదువుకున్నవారే ఇలావుంటే.. ఇక చదువురానివారికి ‘మంచి’ గురించి ఎవరు చెబుతారు?
పదిమందికీ దానధర్మాల విశిష్టత, సంఘ సేవలో కలిగే ఆనందం, తృప్తి గురించి చెబితే సమాజంలో మార్పు రాకుండా పోతుందా? సామాజిక మార్పేమి ఆసాధ్యం కాదు. బాగా చదువుకున్నవారు తాము మోనార్క్‌లని అనుకుంటూ మాట వినడానికి కూడా ఇష్టపడరు. వారిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. కొందరు విని ఆచరణలో పెట్టి తద్వారా కలిగే ఆనంద పరిమళాలను చుట్టూ వెదజల్లితే అక్కడి వాతావరణమే మారిపోదూ! ఇపుడు అలాంటివారే కావాలి. కొంతమంది మంచిచేయకపోగా మాటలతో చెడుని బాగా చేస్తున్నారు. అటువంటివారికి మనమే దూరంగా వుండాలి. తస్మాత్ జాగ్రత్త...!
మంచిపనుల విశిష్టతను పదుగురితో పంచుకోండి. వారిని మంచిపనులు చేయడానికి ప్రోత్సహించండి. నాలుగు మంచిమాటలు చెప్పడానికి ఎవరైనా ఫరవాలేదు. దానికో అధికార పీఠం, మైకు వంటి ఆర్భాటాలు ఎంతమాత్రం అవసరం లేదని గ్రహించండి.
నెల రోజుల తరువాత గుడికి వచ్చారు మామ్మగారు
english title:
manchi
Date:
Tuesday, June 18, 2013