‘చందమామ రావే.. జాబిల్లి రావే..’- అంటూ ఆకాశంలో దాగిన జాబిల్లిని చూపిస్తూ బిడ్డకు గోరుముద్దలు తినిపించడం తల్లులకు తెలిసిందే. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళ - నేడు అదే చందమామ చెంతకు చేరుకుని అద్భుతాలను ఆవిష్కరిస్తోంది. అంతరిక్ష పాఠాలను తన బిడ్డకు బోధించే స్థాయకి ఎదిగింది. రోదసీ యానంలోనూ తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుని స్వర్ణోత్సవ సంబరాలను జరుపుకుంటోంది. ‘ఆకాశంలో సగం మాదేనం’టూ రుజువు చేసేలా అతివలు రోదసీయాత్రలో ఎన్నో మైలురాళ్లను అధిగమించారని సాక్షాత్తూ అ మెరికాలోని జాతీయ వైమానిక, అంతరిక్ష నిర్వహణ సంస్థ (నాసా) ప్రశంసించింది.
ప్రపంచంలో తొలి మహిళా వ్యోమగామిగా వలెంటీనా తెరెస్కోవా ప్రారంభించిన విజయప్రస్థానం ఎందరెందరికో స్ఫూర్తిదాయకంగా మారింది. 1984లో స్వెత్లానా సావిత్సాయా అంతరిక్షంలో వేసిన తొలి అడుగుజాడలను స్ఫూర్తిగా తీసుకుని 2012లో భారతీయ సంతతికి చెందిన సునీతా విలియమ్స్ అంతరిక్షంలో నడిచారు. రష్యాకు చెందిన వలెంటీనా తెరెస్కోవా అంతరిక్షంలోకి అడుగుపెట్టి సరిగ్గా ఈ నెల 16 నాటికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పలు దేశాల్లో ప్రస్తుతం సంబరాలు చేస్తున్నారు. ఈ స్వర్ణోత్సవ సంబరాలను పురస్కరించుకుని మరింతమంది మహిళలను రోదసీయాత్రలో భాగస్వాములను చేసేందుకు ‘నాసా’ సమా యత్తమవుతోంది. ఇప్పటికే చైనా రెండవ మహిళా వ్యోమగామిని అంతరిక్షం లోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది.
రష్యా తొలి మహిళా వ్యోమగామిని పంపిన 20 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి శాల్లీరైడ్ అంతరిక్షయానం చేశారు. ఇలా అనేక దేశాల నుంచి మహిళలు అంతరిక్షయానం చేసి తమ దేశాల పేర్లను చరిత్రలో లిఖించారు. వలెంటీనా తెరెస్కోవా ఇప్పటికీ మహిళలను అంతరిక్ష రంగంలో ముందుకు నడిపించేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తూనే ఉన్నారు. ప్రపంచంలోనే రోదసిపై కాలుమోపిన తొలివ్యక్తిగా రష్యా జాతీయుడు యూరీ గగారిన్ ఆ ఘనతను సాధించిన రెండేళ్లకే తెరిస్కోవాకు అవకాశం రావటం కాకతాళీయంగా జరిగిందేమీ కాదు.
తెరిస్కోవా ఓ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో తల్లితో పాటు కార్మికురాలిగా పనిచేసేది. పట్టుమని పదేళ్లు కూడా స్కూలు విద్యాభ్యాసం చేయలేదు. పనిచేసుకుంటూనే కరస్పాండెన్స్ కోర్సు ద్వారా విద్యాభ్యాసం పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచి ‘స్కై డైవింగ్’ అంటే ఆమెకు మక్కువ. 22 ఏళ్ల వయసులో తొలిసారిగా స్కై జంప్ చేసింది. 1961లో సెర్గేవ్ కోరోల్యావ్ సోవియట్ రాకెట్ చీఫ్ ఇంజనీర్‌గా వచ్చారు. పురుషులతో పాటు మహిళలనూ అంతరిక్షంలోకి పంపాలనే ఆలోచన ఆయన చేశారు. తెరిస్కోవా (1962 ఫిబ్రవరి 16న) తొలి మహిళా వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఈమెతో పాటు మరో ఇద్దరు మహిళలు ఎంపికైనా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళా వ్యోమగామిగా తెరస్కోవానే నిలిచారు. అంతరిక్షయానంలో 48 సార్లు ఆమె భూమిని చుట్టివచ్చారు. జూన్ 16, 1963లో ‘ఒస్టాక్ 6’ అనే రాకెట్‌లో ఆమె చేసిన సాహసయాత్రను మెచ్చి అప్పటి సోవియట్ ప్రభుత్వం సముచితంగా గౌరవించింది.
తెరిస్కోవా సోవియట్ కమ్యూనిస్టు పార్టీలో సభ్యురాలిగా ఉండేవారు. అంచెలంచెలుగా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ క్రీయాశీలక పాత్ర పోషించారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్‌కు అధ్యక్షురాలిగానూ, సోవియట్-అల్గేరియన్ ఫ్రెండ్‌షిప్ సొసైటీకి అధ్యక్షురాలిగానూ పనిచేశారు. ఆనాడు రష్యాలో అత్యున్నత పురస్కారమైన ‘సోవియట్ మెడల్’ తెరెస్కోవాకు దక్కింది. యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ డాక్టరేట్‌ను ఇచ్చి గౌరవించింది. సోవియట్ యూనియన్ పతనానంతరం ఆమె రాజకీయ జీవితం మసకబారినా, తొలి వ్యోమగామిగా ఇప్పటికీ అందరూ గౌరవిస్తారు. ఆమె అందించిన స్ఫూర్తితో వివిధ దేశాలు మహిళలను వ్యోమగాములుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాయి. అమెరికా నుంచి 1984లో శాల్లీరైడ్ తొలి మహిళా వ్యోమగామిగా రోదసీయాత్ర చేశారు. ఆ తర్వాత కెనడా నుంచి రాబర్ట్ బొందార్, జపాన్ నుంచి చైకిముకై, చైనా నుంచి లియుయంగ్ రోదసీయాత్ర చేశారు. అనేక దేశాల్లో మహిళలు అంతరిక్ష విజ్ఞానం పట్ల ఆసక్తి చూపుతున్నారు. టెర్రస్ మీద పడుకుని ఆకాశంలోని నక్షత్రాలను చూడటం కాదు, రోదసిలోకి అడుగుపెట్టి స్వెత్లానా సవిత్సయా, సునీతా విలియమ్స్ లాంటివారు ఆ నక్షత్రాల సరసన తమ పేర్లను లిఖించుకుంటున్నారు. నేడు అంతరిక్షరంగంలో తమ ప్రతిభను చాటుకునేందుకు విద్యావంతులైన మహిళలు ఎంతోమంది వస్తున్నారు. ఇంకా రావాల్సిన ఆవశ్యకత ఉందని తెరిస్కోవా అంటారు. ‘ఒక్క రెక్కతో పక్షి ఎలా ఎగరలేదో, అంతరిక్షం అనే విమానం కూడా మహిళల భాగస్వామ్యం లేకుండా ఎగరలేదని, భూమ్యాకాశాలను శోధించే విషయంలో మహిళల భాగస్వామ్యం అవసరం’ అని ఆమె అంటారు. (చిత్రం) వలెంటీనా తెరెస్కోవా
సబ్ ఫీచర్
english title:
sub feature
Date:
Tuesday, June 18, 2013