Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

$
0
0

విజయవాడ, జూన్ 17: కృష్ణా జిల్లాతో సన్నిహిత సంబంధం కలిగిన ఏలూరు పార్లమెంట్ సభ్యులు కావూరి సాంబశివరావుకు తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించడంపై జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన వెనువెంటనే కావూరికి జౌళి, చేనేత శాఖను అప్పగించారు. కావూరి మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పలుమార్లు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నా జిల్లాలోని నూజివీడు, కైకలూరు శాసనసభా స్థానాలు ఏలూరు పార్లమెంట్ స్థానం పరిధిలోనే ఉన్నాయి. ఏదిఏమైనా కావూరికి కేంద్రంలో కీలకపదవి లభించడం వల్ల జిల్లా అభివృద్ధికి ఆయన సహకరిస్తారని భావిస్తున్నారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు కార్యకర్తలందరితో కావూరికి సత్సంబంధాలున్నాయి. ప్రఖ్యాత ఇంజనీర్ కెఎల్ రావు తరువాత సుదీర్ఘ కాలం 40ఏళ్లకు కావూరికి మంత్రి పదవి లభించింది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ పార్టీ సభ్యునిగా పర్వతనేని ఉపేంద్ర కూడా నాడు కేంద్ర మంత్రిగా పనిచేశారు. మళ్లీ ఇన్నాళ్లకు కావూరిని కేంద్ర మంత్రి పదవి వరించటంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తవౌతోంది.
కేంద్ర కేబినెట్‌లో జిల్లా మంత్రులు ముగ్గురు!
విజయవాడ, జూన్ 17: ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా జిల్లాకు చెందిన వారు ముగ్గురు ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న కావూరి సాంబశివరావు కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం దోసపాడుకు చెందిన వారు. ఈయన బందరు పార్లమెంట్ స్థానానికి ఐదుసార్లు పోటీ చేశారు. కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి కృష్ణా జిల్లా నిమ్మకూరు ఆడపడుచు. పనబాక లక్ష్మి గుడివాడ రూరల్ మండలం సత్యవేడుకు చెందినవారు. ఈమె తరచూ అక్కడకు వస్తుంటారు కూడా.

రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో కాకలు తీరిన యోధుడు
విజయవాడ, జూన్ 17: కాంగ్రెస్ కురువృద్ధుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ జిఎస్ రాజు (93) తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మరణించారన్న వార్త విన్న జిల్లా వాసులు కన్నీరుమున్నీరయ్యారు. ఆయన మృతదేహాన్ని సోమవారం రాత్రి 8 గంటల సమయంలో విజయవాడలోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు. వీరికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారులు గోకరాజు రామరాజు, గోకరాజు సుబ్బరాజు సిరీస్ సంస్థలో డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. దశాబ్ద కాలం క్రితం సిరీస్ కంపెనీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో రెండో కుమార్తె కె.బంగారమ్మ భర్త రాయపరాజు సజీవ దహనమయ్యారు. 1983లో శాసనమండలి రద్దుకు పూర్వం డాక్టర్ రాజు శాసనమండలి సభ్యునిగా, శాసనమండలి చైర్మన్‌గా, ఉడా చైర్మన్‌గా పనిచేశారు. 1985 ప్రాంతంలో కాంగ్రెస్ నగర అధ్యక్షునిగా పనిచేశారు. రాజు మరణవార్త తెలిసిన వెంటనే పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుర్లపాటి కుటుంబరావు, నగర ప్రముఖులు పలువురు జిఎస్ రాజు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన భౌతికకాయానికి పలువురు నివాళులు అర్పించారు. శాసనసభ సమావేశాల్లో ఉన్న స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎంపి లగడపాటి రాజగోపాల్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు అడపానాగేంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేశ్వరరావు, కాంగ్రెస్ నగర మహిళా అధ్యక్షురాలు వాసిరెడ్డి అనూరాధ, మాజీ మేయర్ ఎంవి రత్నబిందు, కాంగ్రెస్ నగర శాఖ మాజీ అధ్యక్షుడు పైలా సోమినాయుడు తదితరులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. రాజు మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పలువురు పేర్కొన్నారు. తెలుగుదేశం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేశినేని నాని జిఎస్ రాజు మృతిపట్ల సంతాపం తెలిపారు.

విద్యా దాత జిఎస్ రాజు
సీమాంధ్రలో తొలిసారిగా 1926లో విజయవాడలో ప్రారంభమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం 1930 దశకంలో విశాఖపట్నం తరలివెళ్లింది. దీంతో నాగార్జున విశ్వ విద్యాలయ అభివృద్ధికి రాజు కోటి 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఔషధ ఉత్పత్తి విభాగానికి ఆయన కోటిన్నర విరాళమిచ్చారు. యోగ విద్యా భవన్‌లో శిక్షణ కేంద్రం స్థాపనకు 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. డాక్టర్ రాజు భూరి విరాళంతో ఫార్మసీ, యోగ, ధ్యాన రంగాలలో రెండు కళాశాలల ఏర్పాటుతో యూనివర్శిటీ కొత్త పుంతలు తొక్కింది. వ్యక్తిగతంగా ఈ రెండు రంగాలు ఆయనకు ఎంతో ఆత్మీయమయ్యాయి. డాక్టర్ రాజు అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఫార్మసీ రంగంలో అత్యున్నత డిగ్రీ సాధించారు. ఆ రంగంలో అమెరికా ఆయనకు పెలోషిప్ ఆఫ్ ది అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అనే అవార్డు ప్రదానం చేసింది. ఆయన అనేక దేశాల్లో పర్యటించి ఆ పరిజ్ఞానంతో విజయవాడలో సిరీస్ కంపెనీ నెలకొల్పారు. 1958లో అవతరించిన ఆంధ్రప్రదేశ్ డాక్టర్ రాజు ప్రథమ డిప్యూటీ చైర్మన్. నాడు మాడపాటి హనుమంతరావు చైర్మన్‌గా వ్యవహరించారు. భావాతీత ధ్యాన యోగం పట్ల డాక్టర్ రాజుకు ప్రగాఢ విశ్వాసం. మహేష్ యోగి ఆదర్శం. అందుకే తన సిరీస్ సంస్థలో ఉద్యోగులకు యోగా శిక్షణ ఏర్పాటు చేశారు. యోగశాలను మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాంతో పాటు ఎందరో జాతీయ నాయకులు సందర్శించారు. ప్రపంచ శాంతికి యోగ, ధ్యానం అనే విషయంపై పిహెచ్‌డి చేశారు. 93 ఏళ్ల వయసులో కూడా ఆయన ఆరోగ్యంగా, ధారుడ్యంతో కనిపించేవారు.

సార్వా పనుల్లో రైతులు బిజీ
తోట్లవల్లూరు,జూన్ 17: తొలకరి పలకరింపుతో రైతులు సార్వా పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. వరుణుడు అనుకూలంగా ఉన్నా ప్రభుత్వం అనుకూలత లేదని రైతులు అంటున్నారు. అనుకున్న సమయానికంటే ముందుగానే వానలు రావటంతో పొలాలు దుక్కి దున్నటానికి, నారుమడులు పోయటానికి అవకాశం లభించింది. ప్రస్తుతం సార్వా వరిసాగు చేపట్టే రైతులు పొలం పనుల్లో నిగ్నమయ్యారు. పొలాలను ట్రాక్టర్లతో దున్నించటం, నారుమడులు పోస్తూ బిజీ అయ్యారు. బోర్లు ఉన్న రైతులందరూ నారుమడులు సిద్ధం చేస్తున్నారు. బోర్లు లేని రైతులు అష్టకష్టాలు పడుతూ పంట బోదెల్లో నిల్వ ఉన్న వాననీటిని బకెట్టుతో వేస్తూ మడులు సిద్ధం చేస్తున్నారు. మండలంలో సుమారు 8760 ఎకరాలలో ఈ సార్వా సీజన్‌కు వరి సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ విస్తరణాధికారి సునిల్‌గవాస్కర్ చెప్పారు. ఇందుకు తగ్గట్టు రైతులకు వరి విత్తనాలు అందుబాటులోకి రాకపోవటం శాపంగా మారింది. మండలంలోని 16 గ్రామాలకు ఒక్క తోట్లవల్లూరులోని నార్త్‌వల్లూరు పిఎసిఎస్‌కు మాత్రమే 1061 రకం వరి విత్తనాలు 17 టన్నులు వచ్చాయి. ఈ విత్తనాల పంపిణీ ఈ నెల 6న మొదలుపెట్టగా 9వ తేదీకే అయిపోయాయి. కేవలం మూడు రోజుల్లో 17 టన్నుల వరి విత్తనాలను రైతులు తీసుకువెళ్ళారు. నాలుగు రోజుల నుంచి రైతులు వరి విత్తనాల కోసం తిరిగి వెళుతున్నారు. సోమవారం ఏడు టన్నుల వరి విత్తనాలు మాత్రమే రెండో విడతగా వచ్చాయని పిఎసిఎస్ అధ్యక్షుడు గుత్తా రామకృష్ణ చెప్పారు. రెండో విడతకు కూడా 17 టన్నుల ఇండేంట్ పెడితే కేవలం ఏడు టన్నులు మాత్రమే వచ్చాయన్నారు. ఈ విత్తనాలు రైతులకు ఏ మాత్రం సరిపోవు. ఇంకా మండలంలోని భద్రిరాజుపాలెం, చాగంటిపాడు, దేవరపల్లి, ఐలూరు, పెనమకూరు, కుమ్మమూరు, గరికపర్రు, వల్లూరుపాలెం, బొడ్డపాడు, రొయ్యూరు గ్రామాల్లోని సహకార సంఘాలకు వరి విత్తనాలు రాకపోవటం ఆయా గ్రామాల రైతులకు శాపంగా మారింది. బయట గ్రామాలకు, ప్రైవేటు వ్యాపారుల వద్దకు వెళ్ళి విత్తనాలను కొనుగోలు చేసుకు వస్తున్నామని రైతులు చెపుతున్నారు. తోట్లవల్లూరు వచ్చినా ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళాల్సి వస్తోందంటున్నారు. నారుమడుల సమయానికి రైతన్నలకు పుష్కలంగావిత్తనాలను అందుబాటులోకి తీసుకురాకపోవటం వారిని కష్టాలకు గురిచేస్తోంది. ఇదిలా ఉండగా ఎక్కువగా సాగుచేసే బిపిటిలు (తెలుపు రకం) వరి విత్తనాలు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిపిటిల కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నామని అనేకమంది రైతులు చెపుతున్నారు. కీలక సమయంలో వ్యవసాయాధికారి సెలవుతో రైతులకు ఇక్కట్లు: రైతులు సార్వా పనుల్లో బిజి అయిన తరుణంలో మండల వ్యవసాయాధికారి సెలవులో ఉండటం పెద్ద లోపంగా తయారయిందని పలువురు రైతులు అంటున్నారు. పిఎసిఎస్‌లకు వరి విత్తనాలను ఎసిసీడ్స్ నుంచి తీసుకు రావటంలో వ్యవసాయాధికారి కీలక పాత్ర పోషించాల్సి ఉంది. ఏ సొసైటీకి ఎన్ని టన్నులు అందించాలో ఎఓ నిర్ణయిస్తారు. అయితే కొన్ని బలమైన కారణాల వల్ల ఎఓ శివప్రసాద్ నెలరోజులు సెలవు పెట్టాల్సి వచ్చింది. లంక పొలాల్లో ఇసుక మేటలు తొలగించుకునేందుకు రైతులకు అనుమతులు ఇవ్వటంలో ఎఓ సర్ట్ఫికెట్ ఇవ్వటం ఎంతో ముఖ్యమైనది. ఇసుక పాయలను రైతుల పొలాలుగా చూపటంతో అందులో ఇసుక తవ్వటానికి అనుమతులు ఇవ్వటం తనవల్ల కాదని, నిబంధనలకు విరుద్ధంగా చేయలేనని ఎఓ కుండబద్దలు కొట్టినట్టు అధికార పార్టీ నాయకులకు తేల్చి చెప్పటంతో సెలవు పెట్టమని ఒత్తిడి చేయటంతో ఆయన నెల రోజులు సెలవుపై వెళ్ళారు. అప్పటి నుంచి ఎఇఓ సునిల్‌గవాస్కర్ మాత్రమే కార్యాలయానికి వస్తున్నారు. ఎఇఓ వివరణ: ఎఇఓ సునీల్ గవాస్కర్‌ను వరి విత్తనాలపై వివరణ కోరగా నార్తువల్లూరు పిఎసిఎస్‌కు 17 టన్నుల విత్తనాలు వచ్చాయని, అవి అయిపోయాయన్నారు. రెండో విడత కూడా వస్తాయన్నారు. మండల కేంద్రంలోని సొసైటీకి మాత్రమే విత్తనాలు వస్తున్నాయన్నారు. ఏది ఏమైనా గతంలో పోలిస్తే ఈ ఏడాది విత్తనాల సరఫరా తక్కువేనని రైతులు పెదవి విరుస్తున్నారు.

‘అభయగోల్డ్’ ఎండిపై చీటింగ్ కేసు
కైకలూరు, జూన్ 18: ఎంతో మంది పేద ప్రజలను మభ్యపెట్టి కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన శ్రీ అభయగోల్డ్ కంపెనీ రచ్చకెక్కింది. కైకలూరు బ్రాంచ్ మూతపడడంతో ఖాతాదారులు ఖంగుతిన్నారు. చివరకు బాధితుల ఫిర్యాదు మేరకు కైకలూరు పోలీసులు కంపెనీ ఎడీపైన, బ్రాంచి మేనేజర్‌పైన చీటింగ్ కేసులు నమోదు
చేశారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలు ఇలా వున్నాయి. 2010 సంవత్సరంలో కైకలూరు గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఓ భవనంలో శ్రీ అభయగోల్డ్ స్కీమ్ కార్యాలయాన్ని స్థాపించారు. ఏజెంట్ల ద్వారా వందలాది మంది ఖాతాదారులను చేర్చారు. సుమారు కోటి రూపాయల వరకు వ్యాపారం సాగించారు. చెల్లించాల్సిన
సొమ్ము చెల్లించకుండా తాత్సారం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17 బ్రాంచిల్లో కల్లోలం రేగింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదైయ్యాయి. విజయవాడలో ఇటీవల ఎడీ కూకట్ల శ్రీనివాస్‌ను అరెస్టు చేసి జిల్లా జైలుకు పంపారు. ఇదిలావుండగా కైకలూరులో రెండోవ తేదిన కేసు నమోదు చేశారు. ఈ మేరకు టౌన్ ఎస్‌ఐ అశోక్‌కుమార్ ఎడీ శ్రీనివాస్, కైకలూరు బ్రాంచ్ మేనేజర్ మునగాల శ్రీదేవిలపై చీటింగ్ కేసులు నమోదు చేశారు. ఆదివారం ఆకివీడు మండలంలో భీమవరంలో శ్రీదేవిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం కైకలూరు స్టేషన్‌కు తీసుకువచ్చారు. రాత్రి 7 గంటల సమయంలో సిఐ అశోక్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆమెను బ్రాంచ్ కార్యాలయానికి తీసుకువెళ్ళి రికార్డులు తనిఖీ చేసేందుకు ప్రయత్నం చేశారు. వీఆర్వో అందుబాటులో లేకపోవడంతో తిరిగి వచ్చేశారు. సోమవారం బ్రాంచ్ కార్యాలయాన్ని పరిశీలించి రికార్డులను, కంప్యూటర్లును స్వాధీనం చేసుకున్నారు. ఆఫీసుకు తాళాలు వేసి సీలు వేశారు. మేనేజర్ శ్రీదేవిని రూరల్ స్టేషన్‌లో విచారణ నిమిత్తం పోలీసుల అదుపులో ఉంచారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం కైకలూరు పోలీసులు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న అభయా గోల్డ్ ఎడీ శ్రీనివాస్‌ను పిటి అరెస్టు వారెంట్‌తో కైకలూరు కోర్టుకు హాజరుపరిచారు. కైకలూరు న్యాయమూర్తి లక్ష్మీవరప్రసాద్ నిందితుడికి రిమాండ్ విధించగా శ్రీనివాసును పోలీసు బందోబస్తుతో తిరిగి విజయవాడ జైలుకు తరలించారు. రెండు రోజుల తరువాత శ్రీనివాసును విచారణకు అనుమతి తీసుకుని వస్తామని సమగ్ర విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. సిఐ మాట్లాడుతూ ప్రస్తుతం బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసులు నమోదు చేశామని, కైకలూరు బ్రాంచి కార్యాలయానికి తాళాలు వేశామని, రికార్డులు, హార్ట్ డిస్కులు స్వాధీనం చేసుకున్నామని దీనిపై విచారణ నిర్వహిస్తున్నామని తదుపరి చర్యలు విచారణ అనంతరం తీసుకుంటామని తెలిపారు.
బాధితులందరికీ రికవరీ చేస్తాం: నిందితుడు శ్రీనివాస్
కైకలూరు కోర్టుకు వచ్చిన నిందితుడు అభయాగోల్డ్ ఎడీ శ్రీనివాస్ విలేకర్లతో మాట్లాడుతూ బాధితులందరికీ న్యాయం చేస్తామని, నూరుశాతం రికవరీ చేస్తామని అన్నారు. అధికారుల లెక్కల్లో ప్రజలకు తాను చెల్లించాల్సింది రూ.36 కోట్లుగా చూపిస్తున్నారనని, రూ.25 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. తమకు రూ.165 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయన్నాయని ప్రజలకు ఇంకా కట్టాల్సింది రూ.25 కోట్లు మాత్రమేనని ఖాతాదారులు కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. రెండు నెలల్లో జైలు నుంచి బయటకు వస్తానని అందరికీ న్యాయం చేస్తానని చెప్పారు.

అర్జీదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్
మచిలీపట్నం , జూన్ 17: ప్రజావాణి అర్జీదారులతో కలెక్టరేట్ సోమవారం కిక్కిరిసింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులు క్యూకట్టారు. కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం జ్యోతి, జాయింట్ కలెక్టర్ పి ఉషాకుమారి, డిఆర్‌వో ఎల్ విజయచందర్, అదనపు డిసిపి ప్రేమ్‌కుమార్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి అర్జీలను చిత్తశుద్ధితో పరిష్కరించాలన్నారు.
ప్రజావాణి అర్జీలు:
బందరు మండలం కరగ్రహారంలో 1992 సంవత్సరంలో సుమారు 50 కుటుంబాలకు 118 ఎకరాలు ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా చెరువుల నిమిత్తం పంపిణీ చేయగా, తరువాత ఆ స్థలాన్ని బలహీన వర్గాల ఇళ్ళ స్థలాల కోసం ప్రభుత్వం తీసుకుందని, దీనికి బదులుగా వేరే చోట చెరువులు లేదా వ్యవసాయం చేసుకోవడానికి భూమి కేటాయించాలని కోరుతూ ప్రజావాణిలో అర్జీ సమర్పించారు. రెవిన్యూ, డిఆర్‌డిఎ, డ్వామా, ఎస్‌సి కార్పొరేషన్ అధికారులు కరగ్రహారం గ్రామాన్ని వెంటనే సందర్శించి సమస్య పరిష్కారానికి తీసుకోవాలసిన చర్యలు గురించి నివేదిక సమర్పించాలని బందరు ఆర్డీవో సాయిబాబా, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి కె శివశంకరరావు, డ్వామా పీడి హనుమానాయక్‌కు కలెక్టర్ సూచించారు. గుడివాడ మున్సిపాలిటీ బిసి ఓటర్ల గణన సరిగా నిర్వహించలేదని మరీదు కృష్ణమూర్తి, కెఎన్ రాజా అర్జీ దాఖలు చేశారు. స్థానిక వలందపాలెంకు చెందిన ఖాజిబాబా స్వయం సహాయ సంఘం రైతు బజారులో స్టాలు కేటాయించాలని అర్జీ దాఖలు చేసింది. మొవ్వ మండలం నిడుమోలులో నివశిస్తున్న షెడ్యూల్డు కులాలకు చెందిన లావుడియా పున్నమ్మ, లావుడియా నాగమల్లేశ్వరితో పాటు 18 మందికి ఇళ్ళ స్థలాలు ఇప్పించాలని అర్జీ సమర్పించారు. పెనమలూరు అగ్నికులక్షత్రియ ఫిషర్‌మెన్ కో-ఆపరేటివ్ సొసైటీ పరిధిలో చెరువులు ఆక్రమణలు తొలగించి సర్వే చేసి హద్దులు చూపాలని ఎ దుర్గారావు అర్జీ దాఖలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పలువురు అర్జీదారులు అర్జీలను సమర్పించారు.

త్వరలో రేషన్‌కార్డులకు ఆధార్ నెంబర్లు సిద్ధం చేసుకోవాలి
కూచిపూడి, జూన్ 17: మొవ్వ మండలంలోని రైతులు నుండి 1422 ఫసలి నీటి తీరువా శిస్తు వసూళ్ళను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని తహశీల్దార్ జి భద్రు విఆర్‌ఓలను ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదు కార్యక్రమం 95 శాతం పూర్తయ్యిందన్నారు. ఈ నెల 23వ తేదీతో ముగియనున్న ఓటర్ల నమోదు కార్యక్రమం సందర్భంగా ఏరోజుకారోజు దరఖాస్తులను కంప్యూటరీకరణ చేయాలని విఆర్‌ఓలను ఆదేశించారు.
పాఠశాల విద్యార్థులకు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను తక్షణమే విచారణ జరిపి కంప్యూటరీకరణ చేయాలన్నారు. జూలై 1వ తేదీ నుండి 1423 ఫసలి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. మండలంలో 10,119 ఎల్‌పిజి గ్యాస్ కనెక్షన్‌ల లబ్ధిదారులు ఆధార్ కార్డులు, బ్యాంక్ ఎకౌంట్ నెంబర్లను సేకరించి ఫారాలను ఒక సెట్టు బ్యాంక్‌కు, తహశీల్దార్ కార్యాలయానికి ఒక సెట్టు, విఆర్‌ఓ వద్ద ఒక సెట్టు సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు. త్వరలో నగదు బదిలీ పథకాన్ని పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డులకు కూడా అమలుపర్చే అవకాశం ఉండటంతో రేషన్ కార్డుల నెంబరుతో పాటు ఆధార్ కార్డుల నెంబర్లను సేకరించుకుని సిద్ధం చేసుకోవాలని విఆర్‌ఓలకు సూచించారు.

బడిబయట పిల్లలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి
మచిలీపట్నం, జూన్ 17: బడిబయట పిల్లలను బడిలో చేర్పించి జిల్లాను బడిబయట పిల్లలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డా. బుద్ధప్రకాష్ ఎం జ్యోతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన విద్యా సంబరాల కార్యక్రమాల్లో భాగంగా మూడు వారాలలో బడిబయట పిల్లలను బడిలో చేర్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం పథకం, ప్రభుత్వం అమలుచేస్తున్న సౌకర్యాలను గురించి ప్రచారం నిర్వహించాలన్నారు. బడిబయట గుర్తించిన 1200 మంది చిన్నారులను బడిలో చేర్పించేందుకు మండల ప్రత్యేక అధికారులు, మండల విద్యా శాఖాధికారులు దృష్టి సారించాలన్నారు. వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో తాగునీటి వనరులు కలుషితం కాకుండా క్లోరినేషన్, బ్లీచింగ్ చేయాలన్నారు. ఆధార్ కార్డులు జారీ వేగవంతం చేయాలన్నారు. ఆగస్టు 1వ తేదీ నుండి వంట గ్యాస్ వినియోగదారులు ఆధార్ కార్డుల ద్వారా సబ్సిడీ నేరుగా బ్యాంకు ఖాతాలు ప్రారంభించి ఆధార్ నెంబర్లతో లింకప్ చేయడం, వాటిని గ్యాస్ కంపెనీలలోనమోదు చేయించడం వేగవంతం చేయాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను కూడా వేగవంతం చేయాలన్నారు. జిల్లాకు 2.41లక్షల బిటి పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం కాగా 2.50లక్షల ప్యాకెట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండి రైతులను మోసం చేసే కంపెనీలపై కేసులు నమోదు చేయాలన్నారు. ఉన్నతాధికారుల నుండి వచ్చే మెయిల్సును ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని ప్రత్యేకాధికారులకు సూచించారు.

అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై సమీక్ష
మచిలీపట్నం, జూన్ 17: పంట దిగుబడిలో నష్టపోయిన రైతులకు ఆర్థికంగా అదుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన నేషనల్ అగ్రికల్చర్ ఇన్యూరెన్సు పథకాన్ని మోడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్యూరెన్సు పథకంగా మార్పు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. బుద్ధప్రకాష్ ఎం జ్యోతి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో మోడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్యూరెన్సు పథకం అమలుతీరును కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి, జొన్న, కంది, పెసర, వేరుశనగ, పత్తి, మిర్చి, చెరకు పంటలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. చిన్న సన్నకారు రైతులతో పాటు అన్న కేటగిరిల రైతులు పథకానికి అర్హులన్నారు. రుణాలు తీసుకున్న రైతులందరు ఇన్సూరెన్సు ప్రీమియం చెల్లించాలని కలెక్టర్ చెప్పారు. రైతులందరు జూలై 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు గడువు పొడిగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయశాఖ జెడిని కోరారు.

ఈపాస్ వెబ్‌సైట్లలో కార్పొరేట్ కళాశాలల్లో అడ్మిషన్లు
మచిలీపట్నం (కల్చరల్), జూన్ 17: పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎ-1, ఎ-2, బి-1, బి-2 గ్రేడ్‌లతో ఉత్తీర్ణులైన విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల్లో అడ్మిషన్ల పథకం ద్వారా ప్రవేశం పొందడానికి ఈపాస్ వెబ్‌సైట్లలో అవకాశం కల్పించినట్లు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదాయ, కుల ధృవీకరణ పత్రము, ఫొటో, ఆధార్ కార్డు, రేషన్‌కార్డులతో హెచ్‌టిటిపిఎస్:// ఇపాస్ వెబ్‌సైట్. సిజిజి. జివోవి. ఇన్/కార్పొరేట్ అప్లికేషన్ ఫ్రమ్ డు అడ్రస్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ట్రాక్టర్ బోల్తా : డ్రైవర్ మృతి
కృత్తివెన్ను, జూన్ 17: మండల పరిధిలోని లక్ష్మీపురం పంచాయతీ హరిజనవాడలోని జాతీయ రహదారి వద్ద ట్రాక్టర్ పల్టీ కొట్టి డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా లోసరి బోనగాలదిబ్బలో ఉన్న ఆనంద్ ప్యాక్టరీలో పనిచేస్తున్న గూడ్లపాడు గ్రామానికి చెందిన వాన రాంబాబు (32) ప్యాక్టరీ నుండి రొయ్యల మేత ట్రాక్టర్‌పై లోడు చేసుకుని కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం ఒంటిల్లు గ్రామానికి వస్తుండగా మార్గమధ్యంలో వాహనానికి సైడ్ ఇస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్‌ఐ ఉస్మాన్‌ఖాన్ తెలిపారు. కుమార్తెను ఒడిలో పెట్టుకుని ట్రాక్టర్ నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడింది. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

25లోగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యార్థులు
ఆధార్ కార్డు నెంబర్లు నమోదు చేయించుకోవాలి
మచిలీపట్నం , జూన్ 17: కళాశాలలో చదువుతున్న ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోపు ఆధార్ కార్డు నెంబర్లు కళాశాలల్లో నమోదు చేయించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి ఉషాకుమారి అన్నారు. స్థానిక కృష్ణవేణి ఐటిఐ కళాశాలలో ఏర్పాటు చేసిన కళాశాలల ప్రిన్సిపాల్స్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2013-14 సంవత్సరానికి అన్ని కళాశాలల్లో ఈపాస్ వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్ చేయాలని, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను ఎస్‌సి, ఎస్‌టి, బిసి కార్యాలయాలకు పంపాలన్నారు. విద్యార్థుల ఆధార్ కార్డులను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఆధార్ కార్డుల వివరాలను ఆప్‌లోడ్ చేయని విద్యార్థికి ఉపకార వేతనం మంజూరు కాదన్నారు. తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఓటు నమోదు చేయించాలని, ప్రతి సంవత్సరం యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లను సంబంధిత కార్యాలయాలకు అందచేయాలని సూచించారు. ఉపకార వేతనాలకు అర్హులైన విద్యార్థులకు వర్కుషాపు నిర్వహించాలని కోరారు.

పెట్రోల్ చార్జీల పెంపు ఉపసంహరించుకోవాలి
మచిలీపట్నం , జూన్ 17: ఆయిల్ కంపెనీలు పెట్రోల్ చార్జీల పెంపు ఉపసంహరించుకోవాలని ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లారుూస్ యూనియన్ బందరు డివిజన్ ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక కోనేరుసెంటరులో పెట్రోల్ చార్జీల పెంపుదలను నిరసిస్తూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ పెట్రోల్ ఛార్జీల నిర్వహణను ప్రభుత్వం మార్కెట్ శక్తులకు అప్పచెప్పిన కారణంగా లాభాపేక్షతో ఆయిల్ కంపెనీలు పెట్రోల్ ఛార్జీలను పెంచుతున్నాయన్నారు. రూపాయి విలువ పడిపోవటం వలన పెట్రోల్ చార్జీలు పెంచాల్సి వచ్చిందని చెప్పడం అసమంజసం అన్నారు. సిపిఐ పట్టణ కార్యదర్శి కొడాలి శర్మ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలన్నారు.

జంధ్యాలకు హాస్యనటుల నివాళి
సబ్‌కలెక్టరేట్, జూన్ 17: ‘హాస్యబ్రహ్మ’ జంధ్యాల చనిపోయారని చాలామంది భ్రమపడుతున్నారని మనందరి నవ్వుల్లో ఆయన ఎన్నటికి చిరస్థాయిగా నిలిచి ఉంటారని పలువురు హాస్యనటులు అన్నారు. సోమవారం సాయంత్రం నగరంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఆవరణలో కళామంజరి సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జంధ్యాల 12 వర్ధంతి కార్యక్రమం జరిగింది. ప్రముఖ హాస్యనటుడు ఏవిఎస్ మాట్లాడుతూ రవీంద్రభారతిలో గత పది సంవత్సరాలుగా జంధ్యాల వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. రెండు సంవత్సరాలుగా అనివార్య కారణాల వల్ల జంధ్యాల వర్ధంతి చేయలేకపోతున్నామని అందువల్ల నగరంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. చలనచిత్ర రంగంలో విభిన్న, విచిత్ర పాత్రలు సృష్టించిన వ్యక్తిగా జంధ్యాల చరిత్రలో నిలుస్తారన్నారు. జంధ్యాల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని చెప్పారు. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు రాజకీయ ఒత్తిడి భరించలేక తిరుపతి వచ్చి నాలుగు రోజుల పాటు జంధ్యాల సినిమాలు చూసి రిలీఫ్ అయ్యారని ఈ విషయాన్ని పి.వి.నరసింహారావు స్వయంగా చెప్పారని ఏవిఎస్ తెలిపారు. హాస్యం ఇలా వుంటుందని చెప్పిన మహానీయుడు జంధ్యాల అని కొనియాడారు. నవ్వు కోసం యూనివర్శిటిలు ప్రత్యేకంగా కోర్సు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ స్పీకర్ కూడా సభ్యులు నవ్వుతోనే ఏ విషయానైనా మాట్లాడాలని రూలింగ్ ఇవ్వాలంటూ నవ్వు ప్రాధాన్యతను తెలియజేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిహెచ్ శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ కళాకారులను ఆదుకోవాలన్నారు. వారికి చేతనైనంత సాయం చేసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. జంధ్యాల హాస్య నటులు నేటికీ సజీవంగా ఉన్నారన్నారు. హాస్య నటుడు గుండు హనుమంతరావు, అనంత్, జయలలిత మాట్లాడుతూ జంధ్యాల వల్లనే నేడు సినిమాల్లో నటిస్తున్నామని ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సమావేశంలో ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు, పిళ్ళా ప్రసాద్, నగరాల సీతారామస్వామి, మహాలక్ష్మమ్మ, దేవస్థానం అధ్యక్షుడు మరుపిళ్ళ హనుమంతరావు, జంధ్యాల సతీమణి అన్నపూర్ణ పాల్గొన్నారు. కళామంజరి సంస్థ అధ్యక్షుడు ఎ.వి.రమణ సభకు అధ్యక్షత వహించారు. సభకు ముందు కుమారి మద్దాలి సాయిచంద్రిక బృందం స్వాగత నృత్యాంజలి అలరించింది. ప్రముఖ రంగస్థల నటులు రంగావరల ఆదిశేషయ్య, బాయనేని సుబ్బారావులను ఆత్మీయ సత్కారం జరిగింది. సభ ముగిసిన తర్వాత గీతాంజలి ఆర్ట్స్ థియోటర్ వారి ‘మనసా కవ్వించకే’ హాస్య నాటిక ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. మంగళ, బుధవారాల్లో కూడా హాస్యనాటికలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.

జాతీయస్థాయి ఈత పోటీలకు
జిల్లా క్రీడాకారులు
విజయవాడ , జూన్ 17: గోవాలో ఈ నెల 20 నుండి 23వ తేదీ వరకు జరుగనున్న 30వ సబ్ జూనియర్ జాతీయస్థాయి స్విమ్మింగ్ (ఈత) చాంపియన్‌షిప్‌కు జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా స్విమ్మింగ్ సంఘ కార్యదర్శి సిహెచ్ మధుకుమార్ తెలిపారు. ఎంపికైన జిల్లా క్రీడాకారులను జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి కెపి రావు, డిఎస్‌డిఓ పి.రామకృష్ణ, సంఘ సన్యులు తదితరులు అభినందించారు. ఎంపికైన క్రీడాకారులు వివరాలు ఇలా వున్నాయి.
బాలురు: ఎం.లోహిత్, ఆర్.పాండురంగారెడ్డి, పి.సుజన్‌చౌదరి, డి.కె.టి.సుశాంత్, ఎం.వాసురామ్, భార్గవ్ అనికేత్
బాలికలు: సిహెచ్ జ్ఞానేశ్వరి, ఎల్.మేఘన
భారత క్రికెట్ జట్టులో రిక్కీబోయ్
విజయవాడ , జూన్ 17: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) నుండి విశాఖపట్నానికి చెందిన రిక్కీబోయ్ భారత అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికైననట్లు ఆంధ్ర క్రికెట్ సంఘ కార్యదర్శి జి.గంగరాజు తెలిపారు. గాంధీనగర్‌లోని ఎసిఎ కార్యాలయంలో సోమవారం విలేఖర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిక్కీబోయ్ 2008 సంవత్సరం నుండి విశాఖపట్నం జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికవ్వడం అభినందనీయమన్నారు. ఎసిఎ నుండి కెఎస్ భరత్ ప్రాబబుల్స్ జట్టులో ఉన్నాడని, రానున్న రోజుల్లో మరింత మంది క్రికెటర్లు ఎసిఎ నుండి భారతజట్టుకు ప్రాతినిధ్యం వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎసిఎ అకాడమీలను ప్రారంభించి క్రికెట్‌తో పాటు చదువును కూడా అందజేయడం జరుగుతుందన్నారు. సౌత్‌జోన్ (కడప), నార్త్‌జోన్(విజయనగరం), సెంట్రల్‌జోన్ (మంగళగిరి)లో మూడు అకాడమీలు ప్రారంభించినట్లు తెలిపారు. మాజీ భారతజట్టు సభ్యుడు ఎంఎస్‌కె ప్రసాద్ ఆధ్వర్యంలో అకాడమీలు నడపబడుతున్నాయని, లెవల్-3 శిక్షకులు ద్వారా మెళకువలు నేర్పుతున్నట్లు పేర్కొన్నారు. ఇండియాలోనే మూడు అకాడమీలు స్థాపించి శిక్షణ ఇస్తున్న సంఘం ఆంధ్ర క్రికెట్ సంఘం అన్నారు. సెంట్రల్ జోన్ (మంగళగిరి) అకాడమీని మంగళవారం ఉదయం భారతజట్టు మాజీ సభ్యుడు పద్మశ్రీ వివిఎస్ లక్ష్మణ్ చేతల మీదగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎసిఎ సంయుక్త కార్యదర్శి సిహెచ్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ మూడు అకాడమీలు స్థాపించి శిక్షణ ఇచ్చి విద్యకు కూడా ప్రాముఖ్యతనిస్తున్నట్లు తెలిపారు. 9 కోట్ల వ్యయంతో అకాడమీలు ప్రారంభించడం జరిగిందని, ఇంకా 6 నెలల్లో అకాడమీలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయని, ఇండోర్‌లో శిక్షణకు కావల్సిన అన్ని సౌకర్యాలు అకాడమీలో ఉన్నాయన్నారు. అనంతరం ఎసిఎ కార్యదర్శి జి.గంగరాజు రిక్కిబోయ్‌కు లక్ష రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. విలేఖర్ల సమావేశంలో ఎసిఎ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఎంఎస్‌కె ప్రసాద్, సెంట్రల్ జోన్ కార్యదర్శి కె.రమేష్, జిల్లా సంఘ కార్యదర్శి ఎ.యల్లారావు, సిఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

* కావూరికి మంత్రి పదవిపై హర్షాతిరేకాలు
english title: 
kavuri

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>