కమాన్‌పూర్, జూన్ 17: తాను పదవుల కోసమో.. టిక్కెట్ల కోసమో పార్టీ మారలేదని, తెలంగాణ సాధనే తమ ముఖ్య ధ్యే యమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వివేకానంద అన్నారు. సోమవారం కమాన్‌పూర్ మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా క్రాస్‌రోడ్డు వద్ద స్వాగతం పలికి బైక్ ర్యాలీతో తొలుకొ ని వచ్చారు. అలాగే స్థానిక బస్టాండ్ వద్ద టిఆర్‌ఎస్ జెండాను ఎగురవేశారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపైన నమ్మకం లేకనే విసికి వేసారి తెలంగాణ సాధన కోసం టిఆర్‌ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. తన తండ్రి ఆశ యం ఒక్కటే ప్రత్యేక తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. తె లంగాణ రాష్ట్రం సాధించే సత్తా టిఆర్‌ఎస్‌కే ఉందని పేర్కొన్నా రు. మల్హర్ మండలంలో జరిగిన రచ్చబండలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడనివ్వకుండా తమ గొంతు నొక్కియత్నించి అడ్డు తగిలారని, ఆసమయంలో తెలంగాణ గురించి మాట్లాడగా సి ఎం జీర్ణించుకోలేక నాపై కక్ష కట్టాడని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్‌ను విడే ఉద్దేశ్యంతో ఉన్నారని, ఆజాద్ తెలంగాణ ఉద్యమంపై కేంద్రానికి స్పష్టత ఇవ్వక తప్పుడు సంకేతాలు పంపారని ఆరోపించారు. నూతనంగా ఎన్నికైన ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ తెలంగాణాకు సానుకూలంగానే వ్యవహరిస్తాడనే నమ్మకం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలోని వనరులు దోచుకునేందుకు రాష్ట్రాన్ని వేరు కానివ్వడం లేదని, దీనిలో భాగంగా తాడిచర్ల బొగ్గు గనులు సీమాంధ్ర వాసులకు అప్పగించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సాధించే వరకు కలిసికట్టుగా పోరాడుదామని ఆయన అన్నారు. ఎంపి సమక్షంలో ముత్తారం మండల మాజీ కో ఆప్షన్ సభ్యుడు జానీతోపాటు కొలిపాక లక్ష్మీ, ఇరుగురాల్ల లక్ష్మీలతోపాటు తదితరులు టి ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి, నాయకులు సునీల్ రెడ్డి, కోరుకంటి చందర్, గంట వెంకట రమణారెడ్డి, గుర్రం లక్ష్మీమల్లు, నల్లవెల్లి శంకర్, కాపురబోయిన భాస్కర్, మేకల సంపత్, ఇంతియాజ్, అలుగువేని కృష్ణవేణి, జ్యోతిరెడ్డి, పిడుగు అంజి, మచ్చ గట్టయ్య, దామర దేవయ్యలతోపాటు తదితరులు పాల్గొన్నారు.
సిఎం, స్పీకర్
దిష్టిబొమ్మల దగ్ధం
కరీంనగర్ టౌన్, జూన్ 17: టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి రెండు రోజుల పాటు సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక్‌లో సోమవారం సాయంత్రం సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నాయకులు, కార్యకర్తలు సిఎం, స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు సర్దార్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ శాసనసభలో తెలంగాణ పదం వినపడవద్దని సీమాంధ్ర సిఎం, స్పీకర్, ప్రతిపక్ష నేత చంద్రబాబులు కుట్రలు పన్ని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఇలాగే సస్పెండ్‌లు చేసుకుంటూ పోతే రాబోయే 2014 ఎన్నికల్లో ప్రజలకు సీమాంధ్ర నాయకులను సస్పెండ్ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, అనంతుల రమేష్, మైఖేల్ శ్రీను, పెండ్యాల మహేష్, మాజిద్, శ్రీనివాస్‌గౌడ్, సంపత్, సుధాకర్, ఓంప్రకాష్, అరుణ రేణుక, సత్యనారాయణ, శ్రావణ్‌లతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పందిల్లలో పొలం పనుల్లో బయల్పడిన ప్రాచీన విగ్రహం
హుస్నాబాద్,జూన్ 17: పందిల్ల గ్రామంలో గడ్డం సంపత్ అనే రైతు వ్యవసాయపనుల్లో భాగంగా ట్రాక్టర్‌తో దున్నుతుండగా ఓ ప్రాచీన విగ్రహం మంగళవారం నాడు బయల్పడింది. ఈ విగ్రహం అలనాటి జైన మతానికి చెందినదా.. లేక బయ్యన్న దేవుడిదా తెలియక గ్రామస్థులు నాటి పురాణ ఇతిహాసాలను తిరగేస్తున్నారు. కాగా ముందుగా హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహిచేందుకు సిద్ధమయ్యారు.
డయల్ యువర్ కలెక్టర్‌తో సమస్యలు పరిష్కారం
కరీంనగర్, జూన్ 17: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ద్వారా ప్రతి సోమవారం ప్రజలు ఫోన్ ద్వారా తెలిపిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఇంచార్జి కలెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులను సమావేశ పరిచి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. సుల్తామాబాద్‌కు చెందిన కిశోర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి సంబంధించిన 41దుకాణాలు బహిరంగ వేలం నిర్వహించాల్సి ఉందని తెలుపగా ఇంచార్జి కలెక్టర్ స్పందిస్తూ పరిశీలించి చర్య తీసుకుంటామని తెలిపారు. వేములవాడ నుండి శ్రీనివాస్ మాట్లాడుతూ నగర పంచాయతీ పరిధిలో ఫినో సంస్థ ద్వారా వృద్ధాప్య, వితంతు పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయడం లేదని తెలిసిందన్నారు.
విత్తనాల కోసం మళ్లీ రోడ్డెక్కిన రైతులు
మల్లాపూర్, జూన్ 17: మల్లాపూర్‌లో సోనియాబీన్ విత్తనాల కోసం రైతన్నలు సోమవారం మళ్లీ రోడ్డెక్కి 3గంటలపాటు ధర్నా,రాస్తారోకో చేశారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయ. ట్రాఫిక్ స్తంభించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు సర్థిచెప్పినా ససేమిరా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను శాంతపర్చేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. గత నాలుగు రోజుల క్రితం సోయాబీన్ విత్తనాల కోసం రోడ్డెక్కి ఆందోళన చేస్తే రెండు రోజుల్లో విత్తనాలు సరఫరా చేస్తామని ఇచ్చిన హామీ అధికారులు నిలుపుకోకుండా అన్నదాతలను అష్టకష్టాలు చేస్తున్నారని ఆగ్రహంతో ఊగిపోతూ ఆగ్రోస్ సెంటర్ ఎదుట 300మంది రైతులు మళ్లీ సోమవారం బైఠాయించి సోయాబిన్ విత్తనాలు అందించే వరకు ఆందోళన విరమించబోమని భీస్మించుకు కూర్చొని ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ విషయం తెలుసుకున్న తహశీల్దార్ జయరాజ్, ఎస్సై చిట్టిబాబు సంఘటన స్థలానికి చేరుకొని రైతులను శాంతించే ప్రయత్నం చేయగా ఆగ్రహించిన రైతులు విత్తనాలు సరఫరా చేసే వరకు ఆందోళన ఆపమంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో మెట్‌పల్లి వ్యవసాయ శాఖ ఎడి అజారోద్దీన్ తహశీల్దాన్ ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా సోయాబిన్‌విత్తనాల కొరత మల్లాపూర్‌లోనే కాదు..జిల్లా వ్యాప్తంగా ఉందని, ప్రభుత్వం బీహార్ రాష్ట్రం నుండి సోయాబిన్ విత్తనాలను మరో 2,3రోజుల్లో దిగుమతి చేసుకొని రైతులకు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. 3రోజుల్లోగా సోయాబీన్ విత్తనాలు అందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
మళ్లీ మొదటికొచ్చిన చెరువు పంచాయతీ..
ఎల్లారెడ్డిపేట, జూన్ 17: ఎల్లారెడ్డిపేట మండలం గుండారంలో చేపల చెరువు పంచాయతీ మళ్లీ తార స్థాయికి చేరింది. ఇరువర్గాల్లో నిప్పులు పోసింది. తమకు అనుమతులు ఉన్నాయని పేర్కొంటూ ఓ సామాజిక వర్గం సోమవారం ‘ఖాకీ’ నీడలో చేపల కోసం వల విసిరింది. చేపలెలా పడుతారంటూ జనం తిరగబడింది. వలలను లాక్కోవడానికి యత్నించింది. చెరువు వద్ద ఇరు వర్గాల నడుమ మాటల యుద్ధానికి దారి తీసింది. తాము చెరువు మరమ్మత్తుకు చెమటోడ్చామని మండి పడింది. ఇదేం న్యాయం అంటూ పోలీసులను నిలదీసింది. ఆగ్రహించిన పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఆందోళకారులను చెదరగొట్టారు. సుమారు ఐదు గంటల పాటు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. స్థానికుల కథనం మేరకు.. గత పదేళ్ల కిందట గ్రామ శివారులో ప్రజల భాగస్వామ్యంతో పసర్ల చెరువు నిర్మించారు. అందులో చేపల పెంపకం చేపట్టి వచ్చిన ఆదాయాన్ని గ్రామస్థులు సమానంగా పంచుకునేవారు. ఇటీవల ఓ సామాజిక వర్గానికి చెందిన మాజీ, తాజా ప్రజాప్రతినిధి పంచాయతీ సభ్యుల తీర్మాణం లేకుండానే చెరువును వారి సంఘం పేరిట నమోదు చేయించారు. చెరువులో చేపల పెంపకం తమకే చెందుతుందని కోర్టును ఆశ్రయించారు. దాంతో పంచాయతీ మొదలైంది. గతంలో వివాదంపై అప్పటి ఆర్డీవో సునంద, సిరిసిల్ల గ్రామీణ, పట్టణ సీ ఐలు మహేశ్‌గౌడ్, సర్వర్ విచారణ జరిపారు. అందరు కలిసి పెంపకాన్ని చేపట్టాలని సూచించారు. ఓ వర్గం వారు అంగీకరించలేదు. కోర్టు ఆదేశాల మేరకు మత్స్య శాఖ అధికారులు గతంలో గ్రామస్థులతో సమావేశమయ్యారు. చెరువులో ప్రజలు, సంఘం వారికి హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో సామాజిక వర్గం కోర్టును ఆశ్రయించి చెరువులోని చేపలను పట్టుకోవడానికి అనుమతులున్నాయని పేర్కొంటూ సిద్ధమైంది. అందుకు పోలీసుల సహాయం కోరింది. విషయం తెలుసుకున్న జనం చెరువు వద్దకు చేరుకుంది. భారీ ఆందోళన చేపట్టింది. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వివాదానికి దిగింది. మహిళలు చెరువులోనికి చొచ్చుకుపోవడానికి యత్నించారు. ఆగ్రహించిన పోలీసులు లాఠీచార్జీ చేశారు. గ్రామస్థులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. చేపలు పట్టడాన్ని నిలిపి వేయాలని ఆదేశించారు. ఎస్సై దామోదర్‌రెడ్డి నేతృత్వంలోని పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కోర్టు ఆదేశాల మేరకు తాము బందోబస్తు కల్పించామని పేర్కొన్నారు. ఇరు వర్గాల వారితో సమావేశమై శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పట్టిన చేపలను ఇరువర్గాల వారు లాక్కున్నారు. అటవీ శాఖ అధికారులు చెరువు రిజర్వ్ అటవీ పరిధిలోకి వస్తుందని చేపలు పట్టడానికి వీలు లేదని స్పష్టం చేశారు.
తెలంగాణకు దిగ్విజయ్‌సింగ్ సానుకూలమే - పెద్దపల్లి ఎంపి వివేక్ -
english title:
vivek
Date:
Tuesday, June 18, 2013