మహబూబ్‌నగర్, జూన్ 17: తెరాసలో ముందస్తు కోలాహలం కనబడుతోంది. ఇప్పటి నుండే గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు కెసిఆర్ ప్రత్యేకంగా మహబూబ్‌నగర్ జిల్లాపై దృష్టి పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే సంవత్సరం ఎన్నికలు ఏప్రిల్, లేక మేలో జరుగనున్న నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాలలోనే జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు తెలిసింది. అందుకు గాను కొంతమంది నేతలకు కొన్ని బాధ్యతలు కూడా అప్పజెప్పినట్లు తెలిసింది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఎంపి మంద జగన్నాథం, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నిరంజన్‌రెడ్డికి ఆ పని అప్పజెప్పినట్లు తెలిసింది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఈ పరిధిలోని అన్ని మండలాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాలని కూడా కెసిఆర్ ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే కొల్లాపూర్‌కు జూపల్లి కృష్ణారావు ప్రాతినిథ్యం వహిస్తుండటం, ఎంపి మంద జగన్నాథం కూడా ఇటీవల టిఆర్‌ఎస్‌లోకి రావడంతో ఈ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మెరుగైందని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని కూడా కెసిఆర్ ధృవీకరించినట్లు కూడా తెలిసింది. గత రెండు రోజుల క్రితం ఎంపి మంద జగన్నాథం అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల నేతలు, కుల సంఘాల నేలతో హైదరాబాద్‌లో రహస్యంగా మంతనాలు జరిపినట్లు కూడా సమాచారం. అందులో ప్రధానంగా రెండు వర్గాలకు చెందిన పెద్ద మనుషులు కూడా మంద జగన్నాథంతో భేటి కావడంతో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలో తెరాస బలోపేతం కోసమే ఈ సమావేశం జరిగినట్లు తెలిసింది. అంతేకాకుండా ఉద్యోగ సంఘాల నేతలు కూడా మంద జగన్నాథంతో కొందరు భేటి అయినట్లు తెలిసింది. అలంపూర్ నియోజకవర్గం నుండి మంద జగన్నాథం తనయుడిని రాబోయే ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా రంగంలోకి దింపనున్న నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నట్లు తెలిసింది. తెరాస పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి కూడా ఎలాగైనా నడిగడ్డలో గులాబీ జెండాను ఎగుర వేయాలని వ్యూహాలను రచించుకుంటున్నట్లు కూడా సమాచారం. మంద, జితేందర్‌రెడ్డిలకు ఆ రెండు నియోజకవర్గాలలో మంచి పరిచయాలు ఉండటంతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. ముందస్తుగా కెసిఆర్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉండటంతోనే ఇలాంటి సమావేశాలు జరుగుతున్నాయని కూడా తెరాస వర్గాలు భావిస్తున్నాయి. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలపై కెసిఆర్ దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఈ నియోజకవర్గాల ఇన్‌చార్జిలకు బలమైన నాయకత్వం లేదనే సమాచారం కెసిఆర్‌కు అందడంతో ఈ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు రెండు, మూడు నెలల్లోపు క్యాడర్‌ను పెంచుకుని నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలుస్తారనే ప్రచారం జరిగితే ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్‌చార్జిలకే భవిష్యత్తులో టికెట్లు దక్కే అవకాశాలు ఉంటాయి. లేనిపక్షంలో ఇతరులకు కెసిఆర్ టికెట్లు ఇచ్చి అక్కడ పోటీ చేయించే అవకాశాలు కూడా లేకపోలేవు. కొందరు నాయకులు ఈ మూడు నియోజకవర్గాల కోసం టికెట్లను ఆశిస్తున్నారు. వారితో కొందరు నాయకులు మంతనాలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తుంది. కెసిఆర్ ప్రాతినిథ్యం వహించే మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో నాయకత్వ లోపం ఉండటంతో ఆ నియోజకవర్గాలలో పార్టీని పటిష్టం చేయాలని కూడా మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్యలకు కూడా కెసిఆర్ సూచించినట్లు తెలిసింది. ఏదిఏమైనా మహబూబ్‌నగర్ జిల్లాపై తెరాస అధినేత కెసిఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం.
కలెక్టరేట్ ఎదుట స్వీపర్ల ధర్నా
మహబూబ్‌నగర్, జూన్ 17: జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న కంటింజెన్సీ స్వీపర్లు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ పార్ట్‌టైం కంటింజెన్సీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గట్టన్న మాట్లాడుతూ స్వీపర్ల సమస్యలను పరిష్కరించనందుకే నిరవధిక సమ్మెకు దిగామని, సమస్యలు పరిష్కరించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో 1700 మంది స్వీపర్లు వివిధ పాఠశాలల్లో పని చేస్తున్నారని, వీరిలో 250 మందికి నెలకు కేవలం రూ. 75 మాత్రమే వేతనాలు ఇస్తున్నారని, మిగతా వారికి రూ. 1623 వేతనం ఇస్తున్నారని తెలిపారు. మిగతా 150 మందికి ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని, పేరుకు పార్ట్‌టైం స్వీపర్లు అయినప్పటికీ ఫుల్‌టైంగానే పని చేస్తున్నారని, పాఠశాలల్లో పని చేస్తున్న స్వీపర్లందరిని 112 జిఓ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఎనిమిది నెలల వేతనాలు కూడా ఇవ్వలేదని, తక్షణమే ఆ వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్వీపర్ల సమ్మెకు మద్దతు పలికిన టిఆర్‌ఎస్ జిల్లా కోకన్వీనర్ బెక్కం జనార్దన్, ఐఎఫ్‌టియు నాయకులు కృష్ణయ్య, చిన్న, జెఎసి నాయకులు సత్యనారాయణ, రామకృష్ణారావులు కూడా మాట్లాడారు. స్వీపర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వీపర్ల సంఘం నాయకులు షబ్బీర్, చంద్రాయుడు, రాంచంద్రయ్య, ఫకీర్ ఆహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్రంలో బిజెపిదే అధికారం
* రాష్ట్రంలో బలీయమైన శక్తిగా ఎదుగుతాం
* బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మాలతిరాణి
మహబూబ్‌నగర్, జూన్ 17: ఎన్డీఎ భాగస్వామ్యంలోని జెడియు బయటకు పోయినంత మాత్రాన బిజెపికి ఎలాంటి నష్టం లేదని, మిత్ర ద్రోహానికి పాల్పడ్డ నితీష్‌కుమార్‌కు ఆ రాష్ట్ర ప్రజలు రాబోయే కాలంలో తగిన బుద్ధి చెబుతారని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మాలతిరాణి ఆరోపించారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశ ప్రజలు బిజెపి పాలనను కోరుకుంటున్నారని, నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయాలనే పట్టుదల రోజురోజుకు ప్రజల్లో పెరిగిపోతుందని, ఈ ఆదరణను చూసి కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని విమర్శించారు. ఎన్ని శక్తులు ఏకమైనా బిజెపి శక్తిని ఎవరు ఎదుర్కోలేరని, దేశంలో మరింత బలియమైన శక్తిగా బిజెపి ఎదుగుతుందని ఆమె అన్నారు. అన్ని సర్వేలు నరేంద్ర మోడీకి అనుకూలంగా చెబుతున్నాయని, ఎవరితో పొత్తు ఉన్నా, లేకున్నా బిజెపికి మాత్రం అధికారం రావడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో కూడా రాబోయే ఎన్నికల్లో ఊహించని పరిణామాలు కూడా జరుగుతాయని, బిజెపి ఇటు తెలంగాణ, అటు కోసాంధ్రంలో బలంగా సీట్లను గెలుస్తుందని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలుచుకుని రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించనున్నట్లు తెలిపారు. మరో రెండు, మూడు నెలల్లో రాష్ట్ర రాజకీయాలన్ని బిజెపి వైపు మల్లనున్నాయని తెలిపారు. బిజెపిలోకి పెద్దఎత్తున మహిళలు చేరుతున్నారని, అందుకు నిదర్శనం వనపర్తిలో జరిగిన మహిళా మోర్చా సదస్సుకు ఊహించని రీతిలో మహిళలు హాజరుకావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్లు ఉండటంతో బిజెపి తరఫున మహిళలు పోటీలో ఉంటారని, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకే మహిళా మోర్చా సదస్సులను నియోజకవర్గాల వారిగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. 2014 ఎన్నికల నాటికి బిజెపిలో మహిళా నాయకత్వం మరింత పెరగనుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మహిళా బిల్లును తీసుకురావడంలో చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు దేశం కోసం పనిచేసే పార్టీ కేవలం బిజెపియే కాబట్టి మహిళలు బిజెపి వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండురెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పార్టీ రోజురోజుకు బలంగా పెరుగుతుందని, నాగం జనార్దన్‌రెడ్డి బిజెపిలోకి రావడంతో పలు నియోజకవర్గాలలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు త్వరలోనే పెద్దఎత్తున బిజెపిలో చేరుతున్నట్లు తెలిపారు. ఈనెల 20న దళిత మోర్చా జిల్లా సదస్సు, 23న మజ్దూర్ కార్మిక సదస్సు, 25న యువమోర్చా సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బిజెపి అనుబంధ మోర్చాలను కూడా పటిష్ట పరిచి రాబోయే ఎన్నికల్లో సత్తా చాటుతామని అన్నారు. విలేఖరుల సమావేశంలో మహిళా మోర్చా నాయకురాళ్లు పద్మజారెడ్డి, రామేశ్వరి, ఉమాదేవి, అంజమ్మ, నాయకులు నరేందర్, నాగరాజు, అనంతరెడ్డి, అంజయ్య, బుడ్డన్న తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలను వంచించడానికి కుట్ర
* టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నిరంజన్ రెడ్డి
వనపర్తి, జూన్ 17: ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ ప్రజలను మరోసారి వంచించడానికి సీమాంధ్ర పార్టీలైన కాంగ్రెస్, టిడిపిలు ప్రయత్నిస్తున్నాయని టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ తెలంగాణకోసం చర్చలు జరుపుతున్నామని కాంగ్రెస్, తాము అనుకూలంగానే ఉన్నామని టిడిపి దొంగాట ఆడుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంపై పూర్తిగా నమ్మకం కోల్పోయిన కిరణ్‌కుమార్ రెడ్డి సర్కార్ ఉద్యమకారులపై నిర్బంధకాండ కొనసాగిస్తున్నదన్నారు. ప్రజల ఆకాంక్షను, సుదీర్గకాలంగా అపరిస్కృతంగా ఉన్న సమస్యను పరిస్కరించకపోగా ఉద్యమకారులపై నిర్భంధాన్ని కొనసాగిస్తూ కేంద్రం మెప్పు పొందడానికి ప్రయత్నిస్తున్నదన్నారు. సీమాంధ్ర పార్టీల కదలికలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, అవకాశం వచ్చినపుడు వారు ఓట్లద్వారా చూపిస్తారన్నారు. ఎఐసిసిలో సీమాంధ్రుల మాటలకున్న ప్రాధాన్యత తెలంగాణ ప్రాంత ప్రతినిధులకు లేదని తెలిసి ఎఐసిసిలో ఎంతపెద్దపదవి తీసుకున్నా వన్నరాదని, అపవాదే మిగులుతుందని ఆయన చిన్నారెడ్డినుద్దేశించి విమర్శించారు. 13 సంవత్సరాల క్రితం తెలంగాణకు ప్రత్యేక పిసిసి కావాలని కోరిన చిన్నారెడ్డి నేడు తెలంగాణ గురించి మాట్లాడకుండా ఎఐసిసిలో చేరడాన్ని తెలంగాణ ప్రజలు ఏవిధంగా అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. ఇది తెలంగణకు అనుకూలమా, ద్రోహమా అని ప్రశ్నించారు. టిడిపి సమైఖ్యవాదం వినిపించిన ఆరు సంవత్సరాలు అధికార ప్రతినిధిగా ఉన్న రావుల నేడు తెలంగాణ అంటే ఎలా చెల్లుబాటవుతుందన్నారు. టిడిపికి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జెఎస్సి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు పార్టీల స్థానిక నాయకులు తెలంగాణ ద్రోహులేనని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు గట్టుయాదవ్, నాగవరం వెంకట్, నాగమ్మ, జ్యోతి, సతీశ్‌కుమార్, చిలుక రవి, కిట్టు, లతీప్, గందం ఆంజనేయులు, రాము, చరణ్‌దీప్ తదితరులు పాల్గొన్నారు.
ఆధార్ కార్డులున్న విద్యార్థులకే ఉపకార వేతనాలు
* వివరాలు ఇవ్వని కళాశాలలను బ్లాక్‌లిస్టులో పెడతాం
* సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయప్రకాష్
నాగర్‌కర్నూల్, జూన్ 17: జిల్లాలోని వివిధ సంక్షేమ శాఖల ద్వారా ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌కోసం దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు విధిగా ఆధార్ కార్డును జతచేయాల్సి ఉంటుందని, ఆధార్ కార్డులు ఉన్నవారికే ఫలాలు అందుతాయని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటి డైరక్టర్ జయప్రకాష్ తెలిపారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందీరంలో జరిగిన డివిజన్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాల్స్ సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతేడాదికి సంబందించి విద్యార్థులు ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తులకు సంబందించిన వివరాలను చాలా కళాశాలలకు చెందిన వారు ఇంకా అందచేయలేదని, అట్టి కళాశాలల వారు వారం రోజుల్లో ఇవ్వకపోతే అట్టి కళాశాలలను బ్లాక్‌లీస్టులో పెడతామని హెచ్చరించారు. గత సంవత్సరం ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్ పొందిన వారిలో ఆధార్ కార్డు వివరాలు అందించని వారు కూడా వెంటనే తమ నెంబర్లను ఇచ్చేలా చూడాలన్నారు. విద్యార్థులకు ఆధార్ కార్డులను ఇచ్చేందుకు ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నాగర్‌కర్నూల్ ప్రాంతానికి చెందిన వారికి పట్టణంలోని సాధన డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని, అచ్చంపేటలో చైతన్య కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని విద్యార్థులు ఉపయోగించుకునేలా ప్రిన్సిపాల్స్ ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయా కళాశాలలకు మంజూరైన ఫీజు రియంబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు తదితర వాటిని సమీక్షించారు. ఈ సమావేశంలో ఎటిడబ్ల్యువో రాములు, ఎఎస్‌డబ్ల్యువో భీమయ్యగౌడ్, పర్యవేక్షకులు సత్యనారాయణ పాల్గొన్నారు.
సిఎంది నియంతృత్వ పాలన
* టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్య
మహబూబ్‌నగర్, జూన్ 17: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిది నియంతృత్వ పాలనలా కొనసాగుతుందని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్య ఆరోపించారు. సోమవారం మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విఠల్‌రావు ఆర్య మాట్లాడుతూ తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, నాలుగున్నర కోట్ల ప్రజలు తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపిస్తుంటే అణచివేయడానికి సిఎం కుట్ర పన్నాడని విమర్శించారు. సిఎంకు తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వత్తాసు పలుకుతుండటంతోనే నియంతలా వ్యవహరిస్తున్నాడని, ముఖ్యమంత్రి చరిత్రలు తెలుసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నియంతలా వ్యవహరించిన హిట్లరే కనుమరుగైన సంగతి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమ తాకిడికి అసెంబ్లీ ఒక్కరోజు కూడా కొనసాగడం లేదని, ఇలాంటి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎలా కూర్చుంటున్నారని, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి ఒక్క రూపాయి ఇవ్వనని బహిరంగంగా చెప్పిన ముఖ్యమంత్రిని మంత్రులు, ఎమ్మెల్యేలు నిలదీయకపోవడం ఈ ప్రాంత ప్రజలను అవమానించినట్లేనని అన్నారు. మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ చలో అసెంబ్లీకి పిలుపునిస్తే ముఖ్యమంత్రి ఉద్యమాన్ని పోలీసులతో అణచివేయడానికి 40వేల మంది పోలీసులను రప్పించుకుని సాధించిన విజయం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఉద్యమానికి భయపడి అసెంబ్లీకి ప్రైవేటు వాహనాలలో వెళ్లారంటే తెలంగాణ వాదుల విజయమా, లేక ముఖ్యమంత్రి విజయమో ప్రజలకు అర్థమైపోయిందని, ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమం ముందు ఓటమి చెందాడని ఎద్దేవా చేశారు. ఉద్యమంలో సిఎంతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రికి వత్తాసు పలుకుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు కాలగర్భంలో కలువకతప్పదని హెచ్చరించారు. టిఆర్‌ఎస్ జిల్లా కోకన్వీనర్ బెక్కం జనార్దన్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న టిడిపి, అవినీతిలో కూరుకుపోయిన వైకాపాలు ముమ్మాటికీ సమైక్యవాద పార్టీలేనని, ఆ పార్టీల జెండాలకు తెలంగాణ ప్రాంతంలో స్థానం లేకుండా చేస్తామని, భవిష్యత్తులో జరిగే ఉద్యమంలో సీమాంధ్ర పార్టీలకు జెండాలు ఎగురవేసే వారు కరువవుతారని ఎద్దేవా చేశారు. విలేఖరుల సమావేశంలో తెరాస నాయకులు కృష్ణ, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘ప్రజావాణి’కి ఫిర్యాదుల వెల్లువ
* సమస్యల పరిష్కారానికి పెద్దపీట : కలెక్టర్
మహబూబ్‌నగర్, జూన్ 17: ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించిన ప్రజావాణికి సోమవారం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ను కలిసి నేరుగా విన్నవించుకున్నారు. అదేవిధంగా గత వారంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై కూడా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కాగా ప్రజావాణికి వివిధ గ్రామాల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారులతో కలెక్టరేట్ ఆవరణలో బారులు తీరి నిల్చున్నారు. ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరించాలని, అందుకు గాను అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని అన్నారు. ప్రతి ఫిర్యాదును కంప్యూటరైజేషన్ చేసి వచ్చే వారానికి కల్లా సంబంధిత అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలో వచ్చిన ఫిర్యాదులు తరచూ రాకుండా ఉండేలా చూసినప్పుడే ప్రజావాణికి విలువ ఉంటుందని, ఫిర్యాదుదారులకు సమస్య పరిష్కారమైనట్లు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అన్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం అధికారుల పరిధిలో లేకుంటే ఆ విషయాన్ని కూడా ఫిర్యాదుదారుడికి సూచించాలని అన్నారు. భూతగాదాల విషయాలలో జాగ్రత్త వహించాలని, ఆ ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెసి శర్మన్, అదనపు జెసి రాజారాం తదితరులు పాల్గొన్నారు.