Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఇక ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే

$
0
0

సంగారెడ్డి,జూన్ 17: ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే జరిగేలా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులతో వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రజలకు సులువుగా అర్థమయ్యేల అన్ని శాఖలలో తెలుగులో ఉత్తరప్రత్యుత్తరాలు జరపాలన్నారు. ఈ సంవత్సరం తెలుగుబాష సంస్కృతి వికాస సంవత్సరంగా ప్రకటించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాలన్ని తెలుగులో చెప్పినట్లైతే సామాన్య ప్రజలు సులభంగా అర్థం చేసుకొని ఆయా పథకాలలో లబ్దిపొందే అవకాశముంటుందన్నారు. అన్ని శాఖలలో హాజరు రిజిష్టర్‌లో తెలుగులోనే సంతకం చేయడం, సెలవుదరఖాస్తులు, వివరణ పత్రాలు, ఉత్తర్వులు తెలుగులో ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమైనందున జిల్లాలో దోమలు విజృంభించకుండ, అంటువ్యాధులు ప్రభలకుండ, మలేరియా వ్యాధి నివారణపై దృష్టిసారించాలని మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులు, ప్రత్యేక అధికారులను ఆదేశించారు. విద్యాసంవత్సరం ప్రారంభమైనందున వసతి గృహాల సంక్షేమాధికారులు ఏలాంటి అలసత్వం వహించకుండా విద్యార్థినీ,విద్యార్థులకు ఆరోగ్య, ఆహారపు అలవాట్లపై జాగృతం చేయాలన్నారు. ప్రత్యేకాధికారులు గ్రామాలకు వెళ్లినప్పుడు పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీతో అన్ని విషయాలపై సమగ్రంగా చర్చించి సమాచారం సేకరించాలన్నారు.జిల్లాలో డ్రాప్ అవుట్ పిల్లలు ఉండకూడదని, డ్రాప్ అవుట్ పిల్లల విషయంలో తీసుకుంటున్న చర్యలు, కనబరుస్తున్న శ్రద్ధపై జిల్లా విద్యాధికారిని కలెక్టర్ అభినందించారు.జిల్లాను బాలకార్మికులు లేని జిల్లాగా రూపొందించాలని, కార్మికశాఖాధికారులు విస్తృతంగా పర్యటించి ప్రణాళికబద్దంగా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా స్థాయిలోనే కాకుండ గ్రామీణ స్థాయిలో ఆయా శాఖల సేవలు కేంద్రీకృతమయ్యేలా చూడాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. జూలై 2న అర్బన్ డేను పురస్కరించుకొని ఏ రోజుకారోజు వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపర్చాలన్నారు.జిల్లాకు అంచనాల మేరకు అవసరమైన విత్తనాలు, ఎరువులు వస్తున్నాయని, కృత్రిమ కొరత సృష్టించకుండా నివారించడానికి ఆయా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లాకు మంజూరైన సబ్ సెంటర్ల భవనాల నిర్మాణ జాప్యం లేకుండా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు. కస్తూరీభాగాంధీ బాలికల విద్యాలయాలు,సాంఘీక,గిరిజన సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు ఉపకార వేతనాల నుండి అన్ని విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.జాయింట్ కలెక్టర్ ఎ.శరత్ మాట్లాడుతూ అమ్మహస్తం పథకం కింద విధిగా 9రకాల నిత్యావసర వస్తువులు వచ్చే మాసం నుండి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపుజాయింట్ కలెక్టర్ మూర్తి, డిఆర్‌ఓ ప్రకాష్‌కుమార్, జెడ్‌పి సిఈఓ ఆశీర్వాదం, వివిధ శాఖల అధికారులు, ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

21న పాఠశాలలు బంద్
* ఎబివిపి పిలుపు
సంగారెడ్డి,జూన్ 17: విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు పరచాలని, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో 91 జీవోను అమలు చేయాలని తదితర సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21న ఎబివిపి తలపెట్టిన పాఠశాలల బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎబివిపి రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కె.యాదగిరి పిలుపునిచ్చారు. పేదవిద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలో 25 శాతం సీట్లు కేటాయించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కల్పించాలని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, గుర్తింపులేని పాఠశాలలను రద్దు చేయాలన్న డిమాండ్ల పరిష్కారానికి ఈ బంద్‌ను నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.

గిరిజనులకు ప్రధాని ఇచ్చిన భూములను లాక్కోవద్దు
సంగారెడ్డి,జూన్ 17: సంగారెడ్డి మండలంలోని ఎర్దనూర్ గ్రామ గిరిజనులకు ప్రధానమంత్రి పంచిన భూములను లాక్కొని క్రషర్‌లకు అప్పజెప్పే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబుకు వినతిపత్రం సమర్పించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సాయిలు మాట్లాడుతూ ఎర్దనూర్ గ్రామంలోని 20 గిరిజన కుటుంబాలకు 2005 సంవత్సరంలో భూపంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రధాని చేతులమీదుగా సర్వే నంబరు 259 లో 20 ఎకరాలకు పట్టాలు ఇచ్చారని నాటినుండి గిరిజనుల సాగులోనే భూమి ఉందన్నారు. ఇదే భూమిని హైదరాబాద్‌కు చెందిన క్రషర్ యజమానికి కేటాయించారని ఆ వ్యక్తి తన అనుచరులను వెంటబెట్టుకొని వచ్చి గిరిజనులను వారి భూములను సాగుచేయనీయకుండా అడ్డుకొని బెదిరింపులకు గురిచేస్తున్నాడని, గిరిజనులకు కేటాయించిన భూములను క్రషర్‌ల యజమానులకు ఎలా కేటాయిస్తారన్నారు.స్వయాన ప్రధాని పంచిన భూములనే లాక్కొంటే పేద గిరిజనులకు రక్షణ ఎక్కడిదని ఆవేదన వ్యక్తం చేశారు.ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పేద,దళిత,గిరిజనులదేనంటూ వారికిచ్చిన భూములను లాక్కొని బడాబాబులకివ్వడం ఏమేరకు సమంజసమన్నారు.వెంటనే గిరిజనుల భూములను తిరిగి వారికే ఇవ్వని పక్షంలో వ్యకాస ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పి.అశోక్,ఎన్.శ్రీనివాస్,సత్యానందం తదితరులు పాల్గొన్నారు.

బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న
రేషన్‌బియ్యం పట్టివేత
* వాహనం సీజ్
తొగుట, జూన్ 17: మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలోని రేషన్ షాపు నుంచి అక్రమంగా తరలిస్తున్న 9 క్వింటాళ్ళ బియ్యాన్ని గ్రామస్థులు పట్టుకున్న సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సత్యనారాయణ రేషన్ దుకాణం నుండి ఆదివారం రాత్రి ఎపి 23ఎక్స్ 5932 నెంబర్ గల టాటాఏసి వాహనంలో 9 క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన గ్రామస్థులు వాటిని పట్టుకుని తహశీల్దార్ నజీబ్ ఆహ్మద్‌కు సమాచారం అందించగా తహశిల్దార్ ఆదేశాల మేరకు ఆర్‌ఐ వంశీ, విఆర్వో శ్రావణ్‌లు గ్రామానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. బియ్యంతో పాటు టాటా ఏసిని స్వాధీనం చేసుకుని సీజ్‌చేసి రేషన్ డీలర్‌పై కేసు నమోదు చేసినట్లు తహశీల్దార్ నజీబ్‌అహ్మద్ తెలిపారు. రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

భూకబ్జాలకు పాల్పడితే
కఠిన చర్యలు
మెదక్, జూన్ 17: ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల కబ్జాలకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మెదక్ సబ్ కలెక్టర్ భారతి హొళ్లికేరి అధికారులను అదేశించారు. సోమవారం నాడు జరిగిన ప్రజాదర్భార్ కార్యక్రమంలో మెదక్ డివిజన్‌లోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు 36 దరఖాస్తులు అందజేసి తమ సమస్యలను సబ్ కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. అనంతరం జరిగిన డివిజన్ స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో పలు సంక్షేమ కార్యక్రమాలపైన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో లబ్దిదారులకు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని అమె అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధుల కోరత లేదని ఆమె వెల్లడించారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి వెంట వెంట బిల్లులు అందజేయాలని ఆమె తెలిపారు. ఎక్కువ సంఖ్యలో మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు అధికారులు చొరవ చుపాలని ఆమె కోరారు. ఎరువులు విత్తనాలు సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చుడాలని ఎడి మనోహారను సబ్ కలెక్టర్ ఆదేశించారు. రసాయన ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై పొందేందుకు రైతులు పట్టా పాసుపుస్తకాలతో సంబంధించిన వ్యవసాయ అధికారి విస్తరణ అధికారిని సంప్రదించేలా రైతులకు అవగాహాక కల్పించాలని ఆమె ఆదేశించారు. ఎరువులు, విత్తనాలు అమ్మె డీలర్ల దుకాణాల వద్ద విధిగా ష్టాక్ వివరాలను, ఎరువుల ధరలను తప్పనిసరిగా సూచిక బోర్డును ఏర్పాడు చేయాలని సబ్ తెలిపారు. ఎరువులు, విత్తనాలు అమ్మకాలలో డీలర్లు అవకతవకలకు పాల్పడితే వారి దుకాణాలను సీజ్ చేసి లైసెన్స్‌లు రద్దు చేస్తామని సబ్ కలెక్టర్ హెచ్చరించారు. మెదక్ పట్టణంలో చాలా ప్రాంతాల్లో చెత్తచెదారం ఎక్కడపడితే అక్కడ ఉందని వీటిని శుభ్రపరిచేందుకు చర్యలు తీసుకొవాలని మున్సిపల్ కమీషనర్ ప్రభాకర్‌ను ఆమె అదేశించారు. ఈ కార్యక్రమంలో మెదక్ తహశీల్దార్ పుష్పలత, ఎంపిడిఓ శారద, డిఎల్‌పిఓ శ్రీనివాస్‌రావు, మున్సిపల్ కమీషనర్ ప్రభాకర్, వ్యవసాయ శాఖ ఎడి మనోహార, బిసి వెల్‌ఫేర్ అధికారి రాంరెడ్డి, సురేష్, వసంత, మంగ నాగభూషనంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అప్పుల బాధతో రైతుకూలీ ఆత్మహత్య
తొగుట, జూన్ 17: బతుకుతెరువు కోసం సిద్దిపేటకు వలసవెళ్లిన ఓ రైతు కూలీ అప్పుల బాధ తాళలేక పురగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ పోషణ, కుమార్తెల వివాహాల కోసం, కుమారుల చదువుల కోసం చేసిన అప్పులకు తోడు భార్యకు కాన్సర్ వ్యాధి చికిత్సకోసం చేసిన అప్పులు అధికం అవడంతో వాటిని తీర్చేదారి కానరాక రైతు కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని పెద్దమాసాన్‌పల్లి మదిర ఇందిరానగర్‌కు చెందిన నర్ర సత్తయ్య(56)కు గ్రామంలో ఎకరం మేర భూమి ఉంది. కుటుంబ పోషణ కష్టంగా మారడంతో కొనే్నళ్ల క్రితం కుటుంబంతో సిద్దిపేటకు వలసవెళ్ళాడు. సిద్దిపేటలోని ఓ సామిల్‌లో పనిచేస్తూనే సత్తయ్య కుటుంబాన్ని పోషిస్తూ ఇద్దరు కుమార్తెల వివాహం చేశాడు. ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివించాడు. వారికోసం వెచ్చించిన డబ్బులు కూడా అప్పుచేశాడు. దీనికి తోడు సత్తయ్య భార్య లక్ష్మికి రెండెళ్ల క్రితం కాన్సర్ వ్యాధి బయటపడింది. ఆమె చికిత్స కోసం సత్తయ్య కుటుంబాన్ని పోషిస్తునే లక్షలాదిగా వెచ్చించాడు. బార్య చికిత్సకు కుమార్తెల వివాహాలకు, కుమారుల చదువులకు చేసిన అప్పులు అధికమయ్యాయి. ఈ మద్య బార్య లక్ష్మి ఆరోగ్యం మరింత క్షీణించింది. దీనితో మానసికంగా కృంగిపోయిన సత్తయ్య ఆదివారం సిద్దిపేటలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

విధులకు డుమ్మాకొడితే కఠినచర్యలు
సంగారెడ్డి,జూన్ 17: కార్యాలయ విధులకు అనధికారికంగా గైర్హాజరైతే సిబ్బందిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబు హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ సముదాయంలో గల వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యవసాయ శాఖ జెడి కార్యాలయంలో సిబ్బంది హాజరు రిజిష్టర్‌ను పరిశీలిస్తూ సిబ్బంది హాజరు పట్టికలో సంతకం పెట్టి బయటకు వెళ్లిపోవడం, అనధికారికంగా గైర్హాజరవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోని సిబ్బంది నిర్వహణ పనుల అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కదలికల రిజిష్టర్ నిర్వహించాలని వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మను ఆదేశించారు.పశుసంవర్ధక శాఖ జెడి కార్యాలయంలో రిజిష్టర్‌ను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.

మహిళా జూనియర్ కళాశాల
భవన నిర్మాణానికి కృషి: జగ్గారెడ్డి
సంగారెడ్డి, జూన్ 17: సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల పాత భవనం స్థానంలో 14నూతన గదులు,ఒక ల్యాబ్ నిర్మాణానికి 2.85లక్షల రూపాయల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగింది, అతి త్వరలోనే మంజూరవుతాయని ప్రభుత్వ విప్,స్థానిక శాసన సభ్యులు తూర్పు జయప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని మహిళా జూనియన్ కళాశాలను సందర్శించి, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ పలు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. కుర్చీలు, టేబుళ్లు, తాగునీటికి మంజీర కనేక్షన్, కంప్యూటర్ స్కానర్, ప్రింటర్, పాత కళాశాలకు మరమ్మత్తులు, ఫ్యాన్లు, టాయిలెట్ల మరమ్మతులు తదితర అవసరాలు తీర్చాలని కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే టాయిలెట్ల మరమ్మతు పనుల కోసం 10వేల రూపాయల నగదును విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాశాల టీచర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

విత్తనాలు, ఎరువుల కోసం రైతుల పాట్లు
* యూరియా దుకాణం వద్ద
బారులు తీరిన రైతులు
* ఎరువుల కౌంటర్ మెదక్‌లో...
సరఫరా మార్కెట్ యార్డులో..
* రైతుల పడిగాపులు
మెదక్, జూన్ 17: ఖరీఫ్ సీజన్ విత్తనాలు, ఎరువుల విషయంలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మృగశిర కార్తె ప్రారంభం కాగానే వర్షాలు భారీగా కురవడం, వర్షాలకు ఎడతెరపి కావడం వలన నారుమళ్లకు అవసరమైన విత్తనాల కోసం రైతులు అప్పులు చేసి సొసైటీల దగ్గరకు, డీలర్ల వద్దకు ఎగబడినా విత్తనాలు, ఎరువులు దొరకడం లేదని వాపోతున్నారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచే రైతులు మెదక్ సొసైటీ కార్యాలయంలో విత్తనాల కోసం తరలివచ్చారు. వచ్చిన రైతులు తమ పాదరక్షలను వరుస క్రమంలో పెట్టుకోవడం కనిపించింది. తిండిలేక ఉపవాసంతో విత్తనాల కోసం వచ్చి కూర్చున్నప్పటికీ ఉదయం 6 గంటల నుంచి 10:30 గంటల వరకు వేచిచూసినా అధికారులు రాకపోవడంతో ఆందోళనకు దిగారు. ఈలోగా సొసైటీ కార్యాలయం ప్రాంగణంలో వచ్చిన మెదక్ సొసైటి చైర్మన్ సత్యవర్ధన్‌రావు రైతుల డిమాండ్‌లను గుర్తించి అధికారులకు ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. అధికారుల నిర్లక్ష్యంపై రైతులు నిలదీశారు. 1010 రకం వరి విత్తనాలు 525 రుపాయలకు మాత్రమే అమ్మాలని హామాలీ చార్టీలు చెల్లించమని రైతులు డిమాండ్ చేశారు. విత్తనాలు, యూరియా విషయంలో ప్రభుత్వం సరఫరా చేయడంలో విఫలమైందన్నారు. భూములు దున్నకాలు మొదలుపెట్టామని రైతులు తెలిపారు. ప్రస్తుతం మొక్కజోన్నకు, చెరుకు పంటకు యూరియా చాలా అవసరంగా ఉందని రైతులు తెలిపారు. పాస్పెట్ తీసుకుంటేనే యూరియా ఇస్తామని డీలర్లు లింక్ పెడుతున్నారని రైతులు వాపోయారు. మెదక్ వ్యవసాయ శాఖ అధికారి దశరథం మాట్లాడుతూ యూరియా 7 టన్నులు మెదక్ పట్టణంలోని మనగ్రోమోర్ డీలర్‌కు 17 టన్నులు వచ్చినట్లు చెప్పారు. యూరియాకు రైతుల నుండి పాస్‌బుకులు కోరుతున్నట్లు ఆయన తెలిపారు. మనగ్రోమోర్ డీలర్‌కు మరో 17 టన్నుల 1010 రకం వరి సీడ్ రానున్నట్లు దశరథం తెలిపారు. వ్యవసాయ శాఖ ఎడి కార్యాలయంకు వచ్చిన మెదక్ సొసైటి చైర్మన్ సత్యవర్ధన్‌రావు రైతులతో చర్చించడం జరిగింది. యూరియా అవసరం లేకపోయిన ఎకరాకు నాలుగు బస్తాల వంతున రైతులు నిలువ చేసుకున్నారని తెలిపారు. 13 రోజుల క్రింద డిడి పంపితే ఆదివారం నాడు 1010 రకం విత్తనాలు సొసైటికి వచ్చాయని ఆయన తెలిపారు. పట్వారీ సీపారస్ లేనిదే యూరియా ఇవ్వమని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్న విధానాన్ని సర్ధన మాజీ సర్పంచ్ హన్మంతరావు తీవ్రంగా ఖండిచారు. పట్వారీ రైతులకు అందుబాటులో ఉండడని ఆయన తెలిపారు. అందువలన రైతు పాసుపుస్తకాల మీదనే యూరియా సరఫరా చేయాలని హాన్మంతరావు డిమాండ్ మేరకు వ్యవసాయ శాఖ అధికారి దశరథం అంగీకరించారు. ప్రభుత్వానికిగానీ, జిల్లా యంత్రంగానికి గానీ, వ్యవసాయ శాఖ అధికారులకు గానీ వ్యవసాయ సీజన్‌కు సంబంధించిన అవసరాలపై ముందు చూపులేదని యాక్షన్ ఫ్లాన్ లేదని హాన్మంతరావు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు రెండు నెలల ముందే మెదక్ జిల్లాలో సాగుభూమి ఎంత ఏ రకాల పంటలు పండిస్తారు, ఆ పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అవసరాన్ని యాక్షన్ ప్లాన్ క్రింద తయారు చేసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో రైతులు ఎరువుల కోసం విత్తనాల కోసం రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితులు మరొక సారి రాకుండా జిల్లా యంత్రాంగా చుసుకొవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. యూరియా ఒక ప్రైవేటు డీలర్‌కు వచ్చింది. ఆ ప్రైవేటు డీలర్ వ్యవసాయ శాఖ అధికారి సిఫారు ఉంటేనే యూరియా ఇస్తామంటున్నారని ఒక రైతు ఎడి కార్యాలయంకు వచ్చాడు. దీనిపైన హాన్మంతరావు, సొసైటి చైర్మన్ సత్యవర్ధన్‌రావు చర్చించడంతో దశరథం నేరుగా యూరియా సరఫరా చేసే మనగ్రోమోర్ సెంటర్‌కు తరలివెళ్లారు. అంతకు ముందు దశరథం మాట్లాడుతూ ప్రైవేటు డీలర్స్ అమ్మకాలు జరుపుతున్న ఎరువులు, విత్తనాల వద్ద ఇన్‌చార్జీలను ఏర్పాటు చేశామని తెలిపారు.

* సక్రమ అమలుకు అధికారులకు కలెక్టర్ ఆదేశం
english title: 
telugu

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>