Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

గిరిజన హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

$
0
0

మిర్యాలగూడ, జూన్ 17: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు గిరిజనుల హక్కులను కాలరాస్తున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఆరోపించారు. పట్టణంలోని టిఎన్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన గిరిజన సంఘం 5వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన గిరిజన సాధికారత సెమినార్‌లో ఆమె పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో కీలకపాత్ర పోషించిన గిరిజనుల త్యాగాలు ప్రభుత్వాలకు గుర్తుకురావడం లేదా అని ఆమె అన్నారు. స్వాతంత్ర పోరాటంలో పనిచేసిన గిరిజనులకు ప్రభుత్వం నుండి సరైన గుర్తింపు లభించడం లేదని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్, బిజెపి సొంత ప్రయోజనాల కోసం చారిత్రక ఆస్తులను కొల్లకొడుతున్నారని, కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు పెట్టుబడిదారులకు ప్రయోజనకరంగా మారాయి. కానీ, స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన గిరిజనులకు ఆర్థిక సంస్కరణల ఫలితాలు ఏరకంగాను మేలు చేయలేదని కారత్ అన్నారు. శ్రామిక వ్యవసాయ కూలీలు దేశాన్ని నిలపెడుతున్నాయని, శ్రామిక వర్గానికి అభివృద్ధిలో వాటా ఇవ్వకపోవడం బాధాకరమని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వం కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి చేస్తున్నామని ప్రకటనలు చేస్తుందని, ఫొటోలు చూపి ఇవే అభివృద్ధికి ప్రగతి చిహ్నాలని ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం చూపిస్తున్న ప్రకటనలకు విరుద్ధంగా ప్రస్తుత పరిస్థితుల్లో వంద గిరిజన కుటుంబాల్లో 30 కుటుంబాలు తినడానికి తిండిదొరక్క, చేయడానికి పనిలేక ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. కేంద్రప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కాని గిరిజనులకు మాత్రం పనులు కల్పించడం లేదని, పని పొందడం అందరి హక్కని, పని ప్రభుత్వం ఎందుకు కల్పించడం లేదని ఆమె విమర్శించారు. గిరిజనులకు విద్యా, వైద్యం అందక అల్లాడుతున్నారని, అడవుల్లోని గిరిజనులకు చెందిన భూముల హక్కులను కారరాస్తూ బుల్డోజర్లా నడుపుతుందని ఆమె ఆరోపించారు. గిరిజనుల జనాభాకు అనుగుణంగా నిధులను కేటాయించాలని, తెలంగాణాలోని గిరిజనులకు అన్యాయం జరుగుతుందని ఆమె విమర్శించారు. దేశంలో గిరిజనులకు సమగ్రంగా అభివృద్ధి చేయాలని ట్రైబల్ సబ్‌ప్లాన్‌కు నిధులు ఖర్చు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 1161 తండాల్లో విద్యుత్ సౌకర్యం లేదని, గిరిజన విద్యార్థులు విద్యనభ్యసించేందుకు కేవలం 48 గిరిజన ఆశ్రమ పాఠశాలలున్నాయని, గిరిజనులు చచ్చినా బతికినా ప్రభుత్వాలకు పట్టడం లేదని ఆమె ఆరోపించారు. గిరిజన స్ర్తిలకు పౌష్టికాహారం అందక అనారోగ్యంగా ఉంటున్నారని, గిరిజనులు పిల్లలను పోషించలేక అమ్ముకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. కడుపునింపుకోవడం కోసం పిల్లలను అమ్ముకుంటున్న గిరిజనులను ఆదుకోవాల్సిందిపోయి వారిపై కేసులుపెట్టి జైలుకు పంపుతున్నారని ఆమె అన్నారు. గిరిజన శిశువుల అమ్మకాలను నిరోధించాలని, ఆర్థిక సమస్యలతోపాటు సామాజికంగా అభివృద్ధి చెందాలని ఆమె సూచించారు. గిరిజన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆమె అన్నారు. గిరిజన హక్కులను పరిరక్షించాలని కేంద్రం ముందు ఉంచుతామని ఆమె అన్నారు. సమావేశంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాంనాయక్, సిపిఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహ్మారెడ్డి, ఎయు ప్రోఫెసర్ నేచర్ల ప్రసాద్‌రావు, భుక్య భంగ్యానాయక్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పాపానాయక్, ధీరావత్ రవినాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ డి.మల్లేష్, యుటిఎఫ్ అసోసియేట్ అధ్యక్షుడు లక్పతినాయక్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదు
* దిగ్విజయ్ నియామకమే ఇందుకు నిదర్శనం
* బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు
కట్టంగూర్, జూన్ 17: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదని, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడిగా తెలంగాణను వ్యతిరేకించే దిగ్విజయ్‌సింగ్‌ను నియమించడమే ఇందుకు నిదర్శనమని భారతీయ జనతాపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు మండిపడ్డారు. పులిచింతల ముంపు గ్రామాలను పరిశీలించేందుకు వెళ్తున్న ఆయనకు సోమవారం జిల్లా బిజెపి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనస్వాగతం పలికారు. జిల్లాపార్టీ అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డిలు పూలమాలలతో స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ విషయంలో దిగ్విజయ్‌కు అవగాహనలేదని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే ఆయనను రాష్ట్ర పరిశీలకుడిగా నియమించడం ఎంఐఎం పార్టీని మచ్చిక చేసుకోవడం కోసమేనని విమర్శించారు. ప్రజావిశ్వాసం కొల్పోయిన యుపిఎ ప్రభుత్వాన్ని గద్దెదింపి అవినీతినుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు తమపార్టీ పోరాడుతుందని చెప్పారు. ఈకార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు నూకల వెంకట్‌నారాయణరెడ్డి, దాసరి మల్లేషం, కర్నాటి ధనుంజయ, పోతంశెట్టి రవీందర్, జిల్లా ప్రధానకార్యదర్శి పోతపాక సాంబయ్య, మండల అధ్యక్షుడు మండల వెంకన్న పాల్గొన్నారు.

విద్యాపక్షోత్సవాలకు పాఠశాలల ముస్తాబు
* 21కోట్లతో తరగతి భవనాల ప్రారంభోత్సవాలు
నల్లగొండ, జూన్ 17: విద్యాపక్షోత్సవాల సన్నాహాల్లో భాగంగా జిల్లాలో అదనపుతరగతి గదులు, నూతన కసూర్తిబా పాఠశాలల భవనాల ప్రారంభోత్సవాలను జరుపుకునేందుకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైంది. జిల్లాలో 20నుండి 26వరకు విద్యాపక్షోత్సవాలు నిర్వహించనుండగా జిల్లా మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలతో పాఠశాలల తరగతి గదులను ప్రారంభించనున్నారు. జిల్లాలో 21కోట్లతో 12అసెంబ్లీ నియోజకవర్గాల్లో 155అదనపుతరగతి గదులను, 10కస్తూరిభా పాఠశాలల భవనాలను విద్యాపక్షోత్సవాల్లో భాగంగా ప్రారంభించేందుకు తుది దశ నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నారు. నిజానికి జిల్లాలో కస్తూరిబా పాఠశాలల భవనాలతో పాటు వివిధ పాఠశాలల అదనపు తరగతి గదుల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నట్లుగా విమర్శలు ఉన్నాయి. నిర్మాణ పనుల్లో అలసత్వం కారణంగా జిల్లాలోని అనేక పాఠశాలల్లో విద్యార్థులకు ఈ ఏడాది కూడా ఆరుబయట, చెట్ల కింది చదువులు తప్పని పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో కోటి 25లక్షల వ్యయంతో 12కస్తూరిబా పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాల్సి వుండగా ప్రస్తుతం గుండాల, వలిగొండ, పోచంపల్లి, నడిగూడెం, మునగాల, మిర్యాలగూడ, మునుగోడు, కట్టంగూర్, మోత్కూర్, జాజిరెడ్డిగూడెంలలో మాత్రం నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. వాటిల్లో నాలుగైదు కూడా ఈ విద్యాపక్షోత్సవాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసుకోవడం అసాధ్యంగా కనిపిస్తుంది. అదనపు తరగతి గదులు జిల్లాలో 415మంజూరుకాగా ఓక్కో తరగతి గదిని 5.30లక్షలతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం విద్యాపక్షోత్సవాల నాటికి కేవలం 155గదులను మాత్రమే ప్రారంభించుకునే పరిస్థితుల్లో ఉండటం గమనార్హం. ఇక మరుగుదొడ్లు, మంచినీటి వసతులు, ప్రహరీ నిర్మాణాలు వంటి వౌలిక వసతులకు అధిక శాతం పాఠశాలలు దూరంగా ఉండటంపై విద్యార్థి సంఘాలు, బాలల హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రారంభోత్సవాలకు సిద్ధమైన తరగతి గదులు
ఆలేరు నియోజకవర్గంలో 35లక్షలతో ఐదు పాఠశాలల్లో 7తరగతి గదులు నిర్మాణ పనులు పూర్తికాగా, భువనగిరి నియోజకవర్గం పరిధిలో 1కోటి 68లక్షలతో 13పాఠశాలల్లో 18గదులు, దేవరకొండ నియోజకవర్గంలో 10పాఠశాలల్లో 68లక్షలతో11పాఠశాలల్లో 14గదుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి ఈ విద్యాపక్షోత్సవాల్లో ప్రారంభించనున్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 7పాఠశాలల్లో 40లక్షలతో 8గదులు, కోదాడ నియోజకవర్గం పరిధిలో 10పాఠశాలల్లో 90లక్షలతో 18గదులు, మిర్యాలగూడ నియోజకవర్గంలో 47లక్షలతో 5పాఠశాలల్లో 10గదులు, మునుడోగుడ నియోజకవర్గంలో 60లక్షలతో 11పాఠశాలల్లో 14గదులు, సాగర్ నియోజకవర్గంలో 14పాఠశాలల్లో 1కోటి 55లక్షలతో 22గదులు, నకిరేకల్ నియోజకవర్గంలో 3పాఠశాలల్లో 15లక్షలతో 3గదులు, నల్లగొండ నియోజకవర్గంలో 4పాఠశాలల్లో 48లక్షలతో 8గదులు, సూర్యాపేట నియోజకవర్గంలో 9పాఠశాలల్లో 15గదులు, తుంగతుర్తి నియోజకవర్గంలో 12పాఠశాలల్లో 18గదులతో 10కసూర్త్భి పాఠశాలల భవనాలను విద్యాపక్షోత్సవాల్లో ప్రారంభించేందుకు ఆర్‌విఎం సన్నాహాలు చేపట్టింది.

విత్తనాల కోసం రోడ్డెక్కిన రైతన్న
హాలియా, జూన్ 17: విత్తనాల కోసం హాలియాలో సోమవారం నాడు రైతన్నలు రోడ్డెక్కి ధర్నాకి దిగి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా ప్రధాన రహదారిపై వ్యవసాయ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటికి వ్యవసాయాధికారులు రైతులకు వరి, పెసర, జీలుగ వంటి విత్తనాలు సరఫరా చేయడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకివ్వాల్సిన విత్తనాలను అధికారులు బ్లాక్ మార్కెట్లోకి తరలిస్తున్నారని ఆరోపించారు. సుమారు గంటకు పైగా రాస్తారోకో చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. త్రిపురారం మండలానికి చెందిన వరివిత్తనాలు ఆటోలో బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయని టిఆర్‌ఎస్ నేతలు ఆటోలో వెళ్తున్న విత్తనాలను అడ్డుకున్నారు. దీంతో రైతులు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. సంఘటన స్థలానికి హాలియా సిఐ ఆనంద్‌రెడ్డి చేరుకుని ఆందోళన విరమింపచేశారు. అనంతరం ఎడిఎ ప్రతాప్, ఎఓ విజయేందర్‌రెడ్డితో మాట్లాడి రైతులకు కావాల్సిన విత్తనాలను వెంటనే అందచేయాలని సిఐ కోరడంతో ఆందోళన విరమింపచేశారు. టిఆర్‌ఎస్‌నాయకులు వర్ర వెంకట్‌రెడ్డి, వడ్డె సతీష్‌రెడ్డి, సురభిరాంబాబు, తెలంగాణ సత్యం, బిజేపి నాయకులు చెన్ను వెంకటనారాయణరెడ్డి, సిపిఐ నాయకులు రాములు, కెవిపిఎస్ నాయకులు కొండేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ పథకాలు అందించడమే లక్ష్యం
* ఎంపి సుఖేందర్‌రెడ్డి
దేవరకొండ, జూన్ 17: అర్హులైన పేదవారందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే తమ లక్ష్యమని ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎంపిడివో కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఎమ్మెల్యే బాలూనాయక్‌తో కలిసి ఆయన దీపం పథకం లబ్ధిదారులకు గ్యాస్‌స్టవ్‌లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ కట్టెల పొయ్యి వాడడం వల్ల గ్రామీణ ప్రాంత మహిళలు అనేక అనారోగ్యాలకు గురవుతున్నారని మహిళల ఇబ్బందులను తొలగించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం దీపం పథకం కింద అన్ని వర్గాల మహిళలకు గ్యాస్‌స్టవ్‌లను పంపిణీ చేస్తోందని చెప్పారు. దేవరకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు ఇప్పటి వరకు దీపం పథకం కింద 3500 కనెక్షన్‌లను మంజూరు చేసినట్లు చెప్పారు. మరో అయిదు వందల కనెక్షన్‌లను మంజూరు చేసేందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ్ధర్‌బాబు హామీ ఇచ్చారని వీటిని కూడా త్వరలో పంపిణీ చేస్తామని గుత్తా హామీ ఇచ్చారు. దీపం పథకం కింద గతంలో 1250, రెండో విడత 1250, మూడో విడత 1000 కనెక్షన్‌లను పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 3.70 లక్షల మంది వికలాంగులు, వితంతువులకు పెన్షన్‌లను అందించినట్లు చెప్పారు. ఇంకా 35 వేల మంది అర్హులైన వారికి పెన్షన్‌లను మంజూరు చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. అర్హులైన పేదలకు పక్కాగృహాలను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 2 వేల గృహాలను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బాలూనాయక్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. దేవరకొండ నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ప్రసాదరావు, ఎంపిడివో విజయలక్ష్మి, రాములునాయక్, మార్కెట్ కమిటీ చైర్మెన్ తిప్పర్తి సురేశ్‌రెడ్డి, మాజీ జడ్పిటిసిలు గుంజ రేణుక, తేర గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపిపి ముత్యాల సర్వయ్య, మాజీ సర్పంచ్ ఆలంపల్లి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

డిఇవోను ఘెరావ్ చేసిన ఎబివిపి
నల్లగొండ , జూన్ 17: ప్రైవేటు విద్యాసంస్థల అర్భాటపు ప్రచారాన్ని నివారించి, టెక్నో, గ్రామర్ వంటి ఆకర్షణీయ పదాలతో కూడిన బోర్డులను తొలగించేందుకు డిఇవో చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తు సోమవారం ఎబివిపి ఆధ్వర్యంలో విద్యార్థులు డిఇవో ఆచార్య జగదీష్‌ను ఘెరావ్ చేసి నిరసన తెలిపారు. ఆర్‌విఎం కార్యాలయంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశంలో ఉన్న డిఇవోను ఎబివిపి విద్యార్థులు చుట్టుముట్టి గంటకుపైగా ఘెరావ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం విద్యార్థులను బయటకు లాగి స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట సాగింది.

ఉత్తర కాశీలో చిక్కుకున్న జిల్లా వాసులు
మిర్యాలగూడ టౌన్, జూన్ 17: మిర్యాలగూడ పట్టణం నుండి ఈ నెల 3 కొంతమంది, 5న కొంతమంది ఉత్తర భారతం తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్లిన భక్తులు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ వద్ద చిక్కుకు పోవడంతో వారి కుటుంబాలకు ఆందోళనకు గురవుతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలకు కొండచరియలు విరిగిపడటంతో ఉత్తర కాశీ వద్ద భారీగా సుమారు 500 వాహనాలు నిలిచి పోయాయని అందులో నల్లగొండ జిల్లా నుండి వెళ్లిన సుమారు 55 మంది వరకు ఉన్నారని, అందులో మిర్యాలగూడ పట్టణానికి చెందిన రైస్‌మిల్లర్లు రంగా రంజిత్, కొండూరు శ్రీనివాస్, పద్మావతి, కమీషన్ మర్చంట్ రాయపూడి లవకుమార్, కల్యాణి దంపతులున్నారు. ఈ నెల 11న ఢిల్లీ నుండి వారు ఉత్తరాఖండ్‌కు ట్రావెల్స్‌లో తీర్థయాత్రలకు వెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. కొండ చరియలు విరిగి రోడ్డుపై పడటంతో ఎక్కడి వాహనాలు అక్కడనే నాలుగు రోజులుగా నిలిచిపోయాయని, దీంతో వాహనాల్లో తమ వెంట తీసుకు వెళ్లిన ఆహారం, తాగు నీరు అయిపోవచ్చిందని కుటుంబ సభ్యులకు తెలిపారు. అదే విధంగా సెల్‌ఫోన్‌ల చార్జీంగ్ అయిపోవడంతో ఒకరి సెల్ మరొకరు తీసుకుని తాజా సమాచారాన్ని చేరవేస్తున్నారు. టివిల్లో విస్తృత ప్రచారం జరగడంతో బంధువులు, స్నేహితులు ఫోన్‌లు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తన తమ్ముడు లవకుమార్‌తో మాట్లాడానని, ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడం జరగలేదని, ఇంకా గంటలు పట్ట వచ్చని అన్నారని రాయపూడి లోకనాధం, బంధువురోశయ్యలు అన్నారు. అదే విధంగా కొండూరు శ్రీనివాస్ కొంతమంద మిర్యాలగూడ వాసులతో కలిసి లేకున్నా, వేరే వాహనంలో ఉన్న క్షేమ సమాచారాన్ని అందిస్తున్నారని బంధువులు తెలిపారు. మొత్తం మీద తీర్ధయాత్రలకు వెళ్లి చిక్కుకుపోవడంతో ప్రతి ఒక్కరు ఆందోళనకు గురవుతున్నారు.

త్వరలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్
* జెడ్పి సిఈవో కోటిరెడ్డి
తుర్కపల్లి, జూన్ 17: పంచాయతీ రిజర్వేషన్ల కేటాయింపులపై ప్రభుత్వం నుంచి తుది నివేదిక వచ్చినట్లయితే ఈనెలాఖరులోగాని, జూలై మొదటివారంలోగాని పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేయనుందని జిల్లా పరిషత్ సిఈవో కోటిరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ఎంపిడివో కార్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అంటువ్యాధులు వ్యాపించకుండా మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాలని ఆయన పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు సమన్వయంతో అవగాహన ర్యాలీలు నిర్వహించాలని ఆయన కోరారు. 2012-13కు సంబంధించిన నిధులతో చేపట్టిన పనుల వివరాలను ఆయన ఎంపిడివోను అడిగి తెలుసుకున్నారు. బిఆర్‌జిఎఫ్ నిధులతో చేపట్టి అసంపూర్తిగా మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన ఎంపిడివోలకు ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఎంపిడివో కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ రవీందర్, ఈవోఆర్డీ శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
10వ పిఆర్‌సిని అమలు చేయాలి
* టిఎన్‌జియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి
వలిగొండ, జూన్ 17: ప్రభుత్వం 10వ పిఆర్‌సిని వెంటనే అమలు చేయాలని టిఎన్‌జియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మందాడి ఉపేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు వర్తించే 10వ పిఆర్‌సీని అమలు చేయాలని, 65శాతం ఫిట్‌నెస్‌తో అందించాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని అన్నారు. తెలంగాణ ఏర్పాటుతోనే ఈప్రాంత ఉద్యోగులకు ప్రయోజనం ఏర్పడుతుందని అన్నారు. ఈసమావేశంలో డిటి కృష్ణమూర్తి, ఆర్‌ఐ లాయక్‌అలీ, ఎంఆర్‌ఐ నర్సింహా, విఆర్‌వో సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఓటమి భయంతోనే రిజర్వేషన్ ప్రక్రియ జాప్యం
నల్లగొండ, జూన్ 17: కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతో రిజర్వేషన్ల ప్రక్రియలో జాప్యం చేస్తు ఎన్నికల నిర్వాహణకు వెనుకడుగు వేస్తుందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి, నకిరేకల్ నియోజకవర్గ ఇన్‌చార్జి పాల్వాయి రజనీకుమారి విమర్శించారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె టిడిపి రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి నెల్లూరి దుర్గాప్రసాద్‌లతో కలిసి మాట్లాడుతూ రిజర్వేషన్ల ఖరారులో మీనమేషాలు లెక్కిస్తు బిసి రిజర్వేషన్ల స్థానాలను తగ్గించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను టిడిపి తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. 34శాతం రిజర్వేషన్లు తగ్గకుండా బిసిలకు సర్పంచ్ స్థానాలకు కేటాయించాలని, వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని టిడిపి డిమాండ్ చేస్తుందన్నారు. వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ ఆ పార్టీ క్యాడర్‌ను రెచ్చగొడుతు జగన్‌ను, వైకాపాను తిట్టిన విపక్షాలపై భౌతిక దాడులు చేయాలంటు అప్రజాస్వామికంగా మాట్లాడటాన్ని టిడిపి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. సమావేశంలో ఎల్‌వి.యాదవ్, మధుసూధన్‌రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

బుజిలాపురంలో మధ్యాహ్న భోజనం బంద్
ఏజెన్సీ నిర్వాహణ సంఘాల మధ్య ఘర్షణే కారణం * పస్తులతో ఇంటికి వెళ్ళిన విద్యార్థులు
మోత్కూరు, జూన్ 17: మండలంలోని బుజిలాపురం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట ఏజెన్సీ నిర్వాహణ సంఘాల మధ్య సోమవారం ఘర్షణ జరిగింది. దీంతో వంద మంది విద్యార్థులు పస్తులతో ఇంటికి వెళ్ళారు. స్వయం సహాయక పొదుపు సంఘాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతిభ, విఘ్నేశ్వర సంఘాల మహిళలు పంగ సావిత్ర, అంబటి శాంతమ్మలు మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం నుండి వంట చేస్తున్నారు. ఈసంవత్సరం కొత్త సంఘానికి అవకాశం ఇవ్వాలని 26 సంఘాలకు చెందిన మహిళలు చుక్క ఎల్లమ్మ, పంగ సుగుణమ్మ, రాధ, అనిత, లత, సావిత్ర, విజయలక్ష్మి, వెంకటమ్మ, శోభలు, పాత వంట ఏజెన్సీ మహిళలు వంట సామాగ్రి కోసం తీవ్ర వాగ్వివాదం చేసుకొని ఘర్షణ పడ్డారు. పాత ఏజెన్సీ మహిళలను మిగతా గ్రూప్‌ల మహిళలు అడ్డుకోవడంతో మధ్యాహ్నం వంట నిలచి పోయింది. సంవత్సరానికి ఒక సంఘానికి అవకాశం ఇవ్వాలని, ఈ సంవత్సరం నుంచి శ్రీసాయిచైతన్య సంఘానికి వంట ఏజెన్సీకి అవకాశం ఇవ్వాలని 30 సంఘాల మహిళలు తీర్మానాలు చేశారని తెలిపారు. కొత్త సంఘానికి వంట ఏజెన్సీకి అవకాశం కల్పించాలని ప్రధానోపాధ్యాయుల కార్యాలయం ఎదుట బైఠాయించి మహిళలు ఆమెతో వాగ్వివాదానికి దిగారు. కొత్త సంఘం వంట చేయడానికి సంఘబంధం తీర్మానం తెచ్చినా ఎందుకు అవకాశం ఇవ్వడంలేదని ప్రధానోపాధ్యాయురాలు ఇందిరప్రేమజ్యోతిని నిలదీశారు. వంట ఎవరు చేయక పోవడంతో విద్యార్థులు పస్తులతో ఇంటికి వెళ్లారు. వంట ఏజన్సీ విషయంలో ఘర్షణ విషయాన్ని భువనగిరి డిప్యూటీ డిఇఓకు సమాచారం అందించగా ఎంఇఓ తో విచారణ జరిపించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని హెచ్‌ఎం జ్యోతి తెలిపారు.

త్వరలో 59 మండలాల్లో ‘ఆధార్’ ఏర్పాటు
* జిల్లాకు 25,101 దీపం కనెక్షన్లు * డిఎస్‌ఓ నాగేశ్వర్‌రావు
మిర్యాలగూడ, జూన్ 17: జిల్లాలో ఆధార్‌నమోదు కేంద్రాలను త్వరలో అన్ని మండలాల్లో ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా పౌరసరఫరా శాఖాధికారి నాగేశ్వర్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలోని రైతుబజార్‌లో ఏర్పాటు చేసిన బియ్యం అమ్మకం కేంద్రాన్ని, రైతుబజార్‌ను, రేషన్ దుకాణాలను, హెచ్‌పిగ్యాస్ ఏజెన్సి, మధ్యాహ్న భోజనపథకాన్ని, సివిల్‌సప్లైస్ గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెల్లరేషన్‌కార్డుదారులు ఆధార్‌కార్డు జిరాక్స్, బ్యాంకు పాసుబుక్ జిరాక్స్, సెల్‌నెంబర్‌ను చౌక ధరల దుకాణాల్లో అందచేయాలని ఆయన సూచించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే సబ్సిడిని లబ్ధిదారుల బ్యాంకుఖాతాల్లో నేరుగా జమచేయడం జరుగుతుందని, అందువల్ల ఆధార్‌కార్డు, బ్యాంకు పాసుపుస్తకాల జిరాక్స్‌లను చౌకధరల దుకాణాల్లో వెంటనే అందించాలని ఆయన సూచించారు. ఆధార్‌కార్డు నమోదు చేసేందుకు 29 మండలాల్లో కేంద్రాలను ప్రారంభించామని, మిగిలిన 30 మండలాల్లో కూడా ఆధార్ కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేసి ఆధార్‌కార్డుల నమోదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అమ్మహస్తం సరుకులను అందరికి అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అమ్మహస్తం సరుకులను ప్యాకింగ్ సమస్య తీవ్రంగా వేదిస్తుందని, సరుకుల ప్యాకింగ్‌కు అదనపు సిబ్బంది ఏర్పాటు చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. 1.50 లక్షల టన్నుల బియ్యం లక్ష్యంగా నిర్ణయించగా, 1.36 లక్షల టన్నుల మాత్రమే సరఫరా చేశారని, ఇంకా 14 వేల టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాల్సి ఉందని ఆయన అన్నారు. కస్టమ్‌మిల్లింగ్ 53 వేల టన్నులు లక్ష్యంగా నిర్ణయించగా 3 వేల టన్నులు మాత్రమే సేకరించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 25,101 దీపం కనెక్షన్లు మంజూరు కాగా 5792 లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, మిగిలిన 19,309 దీపం కనెక్షన్ల లబ్ధిదారుల ఎంపికను యుద్దప్రాతిపధికన చేపట్టాలని ఎంపిడిఓ, మున్సిపల్ కమిషనర్లను జేసి ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

గిరిజనుల త్యాగఫలాలు ప్రభుత్వాలకు గుర్తులేవా..? * గిరిజన సదస్సులో సిపిఎం నేత బృందాకారత్
english title: 
tribal rights

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>