నెల్లూరు, జూన్ 17: తీర్థయాత్రల నిమిత్తం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశికి వెళ్లిన వారిలో నెల్లూరువాసులంతా సురక్షితంగా ఉన్నారని అధికార వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఉత్తరకాశిలోని వివిధ పుణ్యక్షేత్రాల్ని సందర్శించడంతో సహా సరస్వతి నది పుష్కరాల్లో భాగంగా పవిత్ర స్నానమాచరించేందుకు స్థానికులు తరలివెళ్లారు. గంగోత్రి నుంచి యమునోత్రి మీదుగా వెళ్లే సందర్భంలో చోటుచేసుకున్న అకాల వర్ష బీభత్సంతో ఉత్తరకాశి అటవీ ప్రాంతంలో నెల్లూరు జిల్లాకు చెందిన 118 మంది చిక్కుకుపోయారు. జిల్లాలోని నెల్లూరు నగరంతో సహా కోవూరు, బుచ్చి మండలాలకు చెందిన 78 మంది రైళ్లలో రెండు విడతలుగా (54మంది+ 24మంది) బయలుదేరి వెళ్లారు. వీరికి సంబంధించిన సమాచారం మాత్రమే అధికార్ల వద్దకు చేరుతుంది. అలాగే ముత్తుకూరు మండలానికి చెందిన ఇంకో నలభై మంది ప్రైవేట్ బస్సులో వెళ్లగా, వీరి సమాచారం అధికార్ల వద్ద లేదు. సెల్‌ఫోన్ల ద్వారా సమాచారం తెలుసుకుంటే వీరు కూడా సురక్షితంగానే ఉన్నామని చెపుతున్నారు. మొత్తం 118 మంది సురక్షితంగానే ఉండటంతో స్థానికంగా ఉన్న వారి బంధుమిత్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. రాత్రివేళల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఒకింత భయాందోళనకు గురవుతున్న సంగతిని కూడా వివరిస్తున్నారు. కొండ చరియలు విరిగిపడి వివిధ రహదార్లు ధ్వంసం కావడంతో నాలుగురోజుల తరువాతగాని తిరుగు ప్రయాణానికి పరిస్థితులు అనుకూలించే అవకాశాల్లేవని అక్కడ నుంచి అందుతున్న సమాచారం. వాస్తవంగా అయితే మంగళవారం తిరుగు ప్రయాణం ప్రారంభించాల్సి ఉంది. తిరుగు ప్రయాణానికి అవసరమైన ఖర్చులు తామే భరిస్తామంటూ రావూస్ ట్రావెల్స్ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు.
బాధితులను ఆదుకుంటాం: కలెక్టర్
నెల్లూరు అర్బన్: నెల్లూరు, కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం ప్రాంతాల నుండి కాశీ తీర్ధయాత్రలకు వెళ్లి వరదల కారణంగా, కొండ చరియలు విరిగిపడటంతో చిక్కుకున్న బాధితులకు సహాయం చేసి సొంత ప్రాంతానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. సోమవారం ఆయన తన చాంబర్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ రావు ట్రావెల్స్ బస్సులో 78 మంది ప్రయాణీకులు కాశీకని వెళ్లి, మార్గమధ్యంలో కొండ చరియలు విరిగిపడిన కారణంగా డూండా ప్రాంతంలో కొంత మంది, ఉత్తర కశీలోని హరిఓం స్కూలులో కొంత మంది సురక్షితంగా ఉన్నప్పటికీ, వారు సొంత ప్రాంతాలకు తిరిగి రాకపోవటంతో, వారి బంధువులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. అక్కడ వున్న సుబ్బారావు నుండి వివరాల తెలుసుకుంటున్నామని, అక్కడ ఉన్న వారికి భోజన, వసతి సదుపాయాలు బాగా ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. బాధితుల బంధువులు ఉత్తర కాశీలోవున్న వారి వివరాలు తెలుసుకునేందుకు రావు ట్రావెల్స్ యజమాని సుధాకర్‌కు ఫోను 9849090100కుగాని, కలెక్టర్ ఆఫీసు నెంబర్ 0861 2331477, 2331261కుగాని, ఉత్తర కాశీ హరిఓంలోని 09849790133కు ఫోను చేస్తే సమాచారం తెలుసుకోవచ్చన్నారు. 78 మంది ప్రయాణీకులకు 18వ తేదీ మంగళవారంతో రిజర్వేషన్ సౌకర్యం అయిపోవటంతో, వారిని సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్థిక మంత్రి, చీఫ్ సెక్రటరీతో మాట్లాడామని తెలిపారు. ఎట్టకేలకు వారిని ఎలాగైనా నెల్లూరుకు తీసుకువస్తామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. ఈకార్యక్రమంలో డిఆర్‌ఓ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బుచ్చి యాత్రికులు క్షేమం
బుచ్చిరెడ్డిపాళెం: తీర్ధయాత్రలను పురస్కరించుకొని ఉత్తర కాశీకి వెళ్ళిన యాత్రికులు క్షేమంగా ఉన్నట్టు వారి కుటుంబ సభ్యులకు ఫోను ద్వారా సమాచారం అందింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీని దర్శించటానికి బుచ్చిరెడ్డిపాళెం నుండి 17 మంది, జొన్నవాడ నుండి ముగ్గురు, కొడవలూరు మండలం నికిలింపేటకు చెందిన హజరత్తయ్య ఆధ్వర్యంలో బయలుదేరిన వీరి యాత్ర ప్రకృతి విపత్తివల్ల అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం దానితోపాటు గంగా యమున నదిలు ఉధృతంగా ప్రవహించటం వల్ల తామంతా సరస్వతి విద్యాపీఠంలో తలదాచుకుంటున్నట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వీరంతా ఉత్తరకాశీయాత్రకు బయలుదేరిన తర్వాత హరిద్వార్, రుషికేష్ చూసి హరిద్వార్‌లోని ఒక హోటల్‌లో బస చేసారు. అనంతరం షార్‌హాం యాత్ర కేథరీనాధ్, బద్రీనాద్, గంగోత్రి వెళ్లానుకున్నారు. ఈక్రమంలో రెండు రోజుల పర్యటన అనంతరం హరిద్వార్ హోటల్‌లో కొంత లగేజీ ఉంచి కేదరీనాద్ బయలుదేరారు. కాని అక్కడికి వెళ్ళాలంటే గుర్రపు బండ్లలో వెళ్ళాల్సి ఉంది. గుర్రాల యజమానులు బంద్ నిర్వహిస్తుండటంతో 13 కిలోమీటర్ల ప్రయాణాన్ని నడిచివెళ్ళటం కష్టమే అయినా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. బంద్ అనంతరం ఒకటిన్నర రోజు తర్వాత గుర్రపు బండ్లపై ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో షెహరీ జిల్లా నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న డూండా గ్రామానికి చేరుకునేటప్పుటికి భారీగా వర్షం, మంచుకొండలు విరిగి రోడ్డుపై పడటంతో రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి. ఆగ్రామంలో వసతులు అరుదుగా ఉన్నట్టు యాత్రికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడే వున్న సరస్వతి విద్యాపీఠంలో తలదాచుకుంటున్నట్టు తెలిపారు. కాని రెండు రోజుల తర్వాత ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఆహార వస్తువులు అయిపోయాయి. వీరిలో ఎక్కువ మంది షుగర్, బిపి వ్యాధులతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వర్షం తగ్గితేకాని రాకపోకలు పునరుద్ధరించే పరిస్థితి లేదని వారు తెలిపారు. అప్పటి వరకు విద్యాపీఠంలోనే తలదాచుకునే పరిస్థితి ఉందని వారు బంధువులకు తెలిపారు. అక్కడ చిక్కుకున్న వారిలో నెల్లూరు జివిఆర్ కళాశాల విశ్రాంతి ప్రిన్సిపాల్, బుచ్చిరెడ్డిపాళెం వాసి బాలుసుబ్బారావు దంపతులు, అచ్చమ్మ దంపతులు, వారి కుమార్తె సుబ్బమ్మ, కె ఆనందరావు, శారదమ్మ దంపతులు, అమరసేన దంపతులు, మల్లికార్జునరావు, లక్ష్మి దంపతులు, చింతాల ధనమ్మ, చింతాల వెంకటశేషమ్మ, చింతాల వౌనిక, సర్వేయర్ శ్రీనివాసరావు దంపతులు, సత్యంస్వామి, వంగర భాస్కరరావు తదితరులు ఉన్నారు.
వీడని ట్రాఫిక్ అంతరాయం
నెరవేరని సలహా కమిటీ సమాలోచనలు
నెల్లూరు, జూన్ 17: నగరంలో ప్రధాన రహదార్లన్నీ ట్రాఫిక్ అంతరాయంతో సతమతమవుతున్నాయి. ఎక్కడికక్కడ పరిష్కార దిశగా తీసుకుంటున్న చర్యలు సమస్యను సమగ్రరూపంలో కొలిక్కి వచ్చేలా అక్కరకు రావడం లేదు. ఇటీవలకాలంలో నెల్లూరు నగరానికి దక్షిణదిశ సరిహద్దుగా భావించే అయ్యప్పగుడి కూడలి నుంచి బ్రహ్మానందపురం (బొల్లినేని ఆసుపత్రి వరకు రోడ్ల విస్తరణ చేపట్టారు. అక్కడ అటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఇటు స్టార్ హోటల్ నేపథ్యంలో ఆక్రమణల క్రమబద్దీకరణ అటకెక్కి అక్కడ నుంచి ఆర్టీసి, మద్రాస్ బస్టాండ్ మీదుగా రావాల్సిన రోడ్ల విస్తరణ వ్యవహారం కాస్తా అటకెక్కింది. అలాగే గత ఏడాది ట్రాఫిక్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో తీర్మానించుకున్న ట్రాఫిక్ ఐలాండ్‌ల కుదింపువ్యవహారం మరుగున పడినట్లే భావిస్తున్నారు. మూడు మాసాలకో పర్యాయం జరగాల్సిన ఈ కమిటీ సమావేశాన్ని గత ఏడాదికాలంలో నిర్వహించడానికి కూడా విరామం ప్రకటించినట్లు ప్రచారం. జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్, రవాణాశాఖ ఉప కమిషనర్, నగర పాలక సంస్థ కమిషనర్ వంటి ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్న ట్రాఫిక్ సలహా మండలి సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాలు కార్యాచరణకు నోచుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత జెసి, రవాణాశాఖ డిసి, నగర పాలక కమిషనర్లు వచ్చిన తరువాత ఈ సమావేశమైతే జరగనే లేదు. రవాణా డిసి, నగర కమిషనర్ వచ్చి ఒకటి రెండు మాసాలు కూడా జరగకపోగా జెసిగా బి లక్ష్మీకాంతం నియమితులై చాన్నాళ్లే అయింది. ఇదిలాఉంటే ఇటీవల నగరంలోని మద్రాస్ బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై ఆకుకూరలు, కూరగాయలు అమ్ముకునే చిన్న, సన్నకారు విక్రేతల కోసం కోనేరు స్థలాన్ని పూడ్చి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో షెడ్లు నిర్మించారు. వాటిని రాష్ట్ర మంత్రి ఆనం ప్రారంభించారు కూడా. అయితే ఇంతవరకు ఆ ప్రాంగణంలోకి విక్రేతలు అడుగిడలేదు. యధాప్రకారం మార్జిన్‌లో నిలబడి నడిరోడ్డు వరకు ట్రాఫిక్ అవాంతరం సాగించే క్రమంలోనే ఈ చిల్లర విక్రేతలు కొనసాగుతున్నారు. ఏదేమైనా నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ ప్రశ్నార్ధకంగా మారుతుందనే చెప్పాలి. ట్రాఫిక్ అంతరాయాలపై సరైన చర్యలు లేకపోవడంతో నగరవాసులు నరకయాతన పడుతున్నా రాజకీయ చిక్కుముళ్ల కారణంగానే సమస్యలు పరిష్కృతం కావడం లేదు. వివిధ కూడళ్లలో కొలువుదీరిన మహనీయుల విగ్రహాల చుట్టూ ఉన్న ఐలాండ్‌ల వైశాల్యాన్ని తగ్గించేలా ఉన్నతాధికారులు ట్రాఫిక్ సలహా కమిటీ తీర్మానం చేసినా ఆచరణకు అతీగతి కరవే. ఈ అంశంలో అధికారపార్టీ నేతల రాజకీయ విన్యాసాలు ట్రాఫిక్ సమస్యకు గుదిబండగా పరిణమిస్తున్నాయి. ఐలాండ్‌ల్ని నిర్మించే ముందు అనుమతించిన క్రమంలో అస్పష్టత, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు సాగడం వలనే ఇప్పటి సమస్యలకు ప్రధాన కారణమని చెప్పాలి. గతంలో మున్సిపాలిటీ, ప్రస్తుత నగర పాలక సంస్థలు విగ్రహాల ప్రతిష్టాపన, వాటి చుట్టూ ఐలాండ్‌ల నిర్మాణానికి అనుమతిచ్చే సందర్భంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ట్రాఫిక్ ఇక్కట్లుండవనే చెప్పాలి. మహనీయులపై ఉన్న అభిమానాన్ని తప్పుపెట్టలేకున్నా ట్రాఫిక్‌కు అంతరాయం సృష్టించేలా కూడళ్లలో ఐలాండ్‌లతో రోడ్లను కబళిస్తున్న వైనం క్షంతవ్యం కాబోదనే భావించాలి. మహనీయుల విగ్రహాలతో ఏర్పాటైన ఐలాండ్లలో మొక్కలు, నీళ్లు వెదజల్లే ఫౌంటేన్లు ఏర్పాటుచేశారు. వీటిని నిర్వహిస్తున్న వైనం అంతంత మాత్రంగానే ఉంటుండగా చాలా చోట్ల ఏర్పాటైన ఐలాండ్‌లు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండటం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని ఆర్టీసి బస్టాండ్ కూడలి, రామలింగాపురం ముత్తుకూరు వంతెన కూడలి, దర్గామిట్ట కరెంట్ ఆఫీస్ సెంటర్, మినీ బైపాస్‌రోడ్డులో బాలాజీనగర్‌కు వెళ్లే కూడలి, తదితర ప్రాంతాల్లో ఈ అంశం చాలా సమస్యాత్మకమవుతోంది. ఈ కూడళ్లలో ఉండే ఐలాండ్‌లను క్రమబద్దీకరించేందుకు పోలీస్‌శాఖ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నా నగర పాలక సంస్థ కమిషనర్ విముఖత చూపుతున్నారట. ప్రధానంగా అధికార రాజకీయ పార్టీ నుంచి అభ్యంతరాల పరంపరతోనే నగర పాలక కమిషనర్ విముఖత చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రద్దీ సమయాల్లో వాహనాల రాకపోకలపరంగానేగాక పాదచారులు కాలినడకన వెళ్లేందుకు కూడా సమస్యలు తలెత్తుతున్నందున ఏమైనా ఐలాండ్‌ల కుదింపుతోనే వివిధ ప్రాంతాల్లో నిత్యం తలెత్తుతున్న ట్రాఫిక్ జామ్ సమస్య కొలిక్కి వస్తుందనేది సర్వత్రా వినిపిస్తున్న అభిప్రాయం.
‘రైతులకు సరైన
సలహాలు ఇవ్వండి’
సైదాపురం, జూన్ 17: మండలంలోని రైతులకు ఆయా గ్రామాల్లోని ఆదర్శ రైతులు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఎడిఎ ఉషారాణి కోరారు. స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో సోమవారం జరిగిన ఆదర్శ రైతుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మండలంలోని కొన్ని గ్రామాల్లో వేరుశనగ, వరిపైరు వేసివున్నారని, వారికి అవసరమైన సలహాలు ఇవ్వాలన్నారు. ఆదర్శ రైతులందరూ తప్పనిసరిగా బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండాలని, ఆదర్శరైతులకు వ్యవసాయ శాఖ డైరీలను ఆమె అందచేశారు. ఈ సమావేశంలో ఎవో రామారావు, ఎఇఓ వెంకటేశ్వరరావు, ఆదర్శరైతులు పాల్గొన్నారు.
‘వెన్నుపోటు సంస్కృతి మేకపాటిదే’
కలిగిరి, జూన్ 17: ఒకేమాట ఒకేపార్టీకి కట్టుబడి పనిచేసిన మమ్మలను వెన్నుపోటుదారులని అనడం మంచిదికాదని అలాంటి సంస్కృతి మేకపాటి సోదరులదేనని రాజన్నదళం నేతలు మాలేపాటి వెంకట సుబ్బయ్య, కర్తం శ్రీనివాసులురెడ్డిలు అన్నారు. సోమవారం కలిగిరి ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో రాజన్నదళం నేతలు మాట్లాడుతూ ఎన్నికల్లో కార్యకర్తలకు ఇవ్వాల్సిన డబ్బులపై ఆధారాలు చూపిస్తామని నగదు చెల్లింపు చేస్తారా అని ప్రశ్నించారు.
అలాగే 2004 ఎన్నికల్లో పార్వతమ్మ విజయానికికృషిచేసామని 2009,2012 ఎన్నికల్లో మేకపాటి సోదరుల విజయానికి కృషి చేశామన్నారు. 2012 ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకొన్నట్లు అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని వాటిని నిరూపించాలన్నారు.
మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి డిసిసిబి ఎన్నికల్లో సుమంత్‌రెడ్డి నుంచి 30లక్షల రూపాయిలు తీసుకొన్న విషయంగురించి అలాగే విజయమ్మ ముఖ్యమంత్రి అయితే కుటుంబ పాలన వస్తుందని చెప్పడం, కుడమలదినె్నపాడు సొసైటీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధికి మద్దతు ఇవ్వడంపై కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధం కావాలని మేముకూడా ప్రమాణానికి సిద్ధంగా వున్నామని సవాల్ విసిరారు.
అలాగే రాజన్నదళం నేతలు ప్రతి పంచాయితీల్లో ఎన్నికల బరిలో నిలుస్తారని త్వరలోనే నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో నగదును ఆదారాలు చూపిస్తే పాలూరి మాల్యాద్రిరెడ్డి డబ్బులు ఇస్తామని ప్రకటన చేయడంపై ఆధారాలు చూపించడానికి మేం సిద్ధమేనని, మీరు డబ్బులు ఇస్తారా అని అన్నారు. 2011 ఎం ఎల్‌సి ఎన్నికల్లో రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా మేకపాటి పనిచేసారన్నారు. అలాగే 2007 ఎం ఎల్‌సి ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధి అయిన పివి శేషారెడ్డిని కాదని బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి మద్దతు ఇచ్చారని తెలిపారు. మేము మొదటి నుంచి రాజశేఖర్‌రెడ్డి అభిమానులమని వై ఎస్ ఆర్‌సిపి విజయానికి కృషిచేసిన వారమేనని గుర్తు చేసారు.
ఈకార్యక్రమంలో మాలేపాటి వెంకట సుబ్బయ్య, మెట్టుకూరు అమరజీవిరెడ్డి, కర్తం శ్రీనివాసులురెడ్డి, మేదరమెట్ల వెంకటేశ్వర్లు, నర్రవుల అంకిరెడ్డి, గోవిందయ్య, కృష్ణారెడ్డి, ఇర్మియా, శ్రీరాములు, ఎడ్లపల్లి వెంకటాద్రి నాయుడు, మాల్యాద్రి, చివిలి రవీంద్రనాయుడు పాల్గొన్నారు.
తొలిసారి తెలుగులో తీర్పులు ఇచ్చిన
న్యాయస్థానం
కావలి, జూన్ 17: పట్టణంలోని ప్రధాన కనిష్ట పౌర న్యాయమూర్తివారి న్యాయస్థానం సోమవారం తొలిసారిగా వివిధ కేసులకు సంబంధించి తెలుగులో తీర్పులను వెలువరించింది. న్యాయమూర్తి రాజావెంకటాద్రి 7కేసులకు సంబంధించి ఒకేరోజు తీర్పులను వెలువరించారు.
రహదారుల నిర్మాణానికి 2,200 కోట్ల్ల నిధులు
పెళ్లకూరు, జూన్ 17: కేంద్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణాలకు గాను రాష్ట్రానికి పిఎంజిఎస్‌వై పధకం 2200 కోట్ల నిధులను మంజూరు చేసిందని తిరుపతి ఎంపి చింతా మోహన్ వెల్లడించారు. మండల పరిధిలోని చిల్లకూరు, జీలపాటూరు, అక్కగారి పేట, దిగువ చావాలి, శిరసనంబేడు, కప్పగుంట కండ్రిగ గ్రామాల్లో సోమవారం ఎంపి చింతా పలు అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల సమక్షంలో ఒక్కో శాఖ పనితీరుపై విశే్లషణ జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. ఉపాధి హామీ పధకం కింద కూలీలకు రోజుకు 224 రూపాయలు ఇవ్వాల్సివుండగా ఇక్కడి అధికారులు తక్కువ కూలీలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇలాంటి అధికారుల వలన కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. గత ఐదేళ్లలో సోనియా గాంధీ 12 కార్యక్రమాలపై 7 లక్షల కోట్ల నిధులను ఇచ్చిందన్నారు. వచ్చే నెలల నుండి ఆహార భధ్రత చట్టం కింద ప్రతి కుటుంబానికి 100 రూపాయలకు 35 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దీంతో 70 కోట్ల మంది నిరుపేదలకు ఇది వరంగా మారుతున్నట్టు తెలిపారు. ఉపాధి పధకం ద్వారా ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 30 కోట్ల కుటుంబాలకు ఉపాధి కల్పించినట్టు తెలిపారు. అమ్మహస్తం, అమృతహస్తం పధకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొనాలన్నారు. అంతకు ముందు ఎంపి చింతాకు చిల్లకూరు గ్రామం వద్ద స్థానిక కాంగ్రెస్ నాయకులు, నాయుడుపేట ఎఎంసి చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎండివో సరళ, తహశీల్దార్ ఏడుకొండలు, మండల ప్రత్యేకాధికారి నరసోజీరావు, సిఐ రామారావు, ఎస్సై రామకృష్ణ, ఇతర అన్ని శాఖల అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు బైనా మల్లిఖార్జున రెడ్డి, కె రామలింగారెడ్డి, పి అనిల్‌కుమార్ రెడ్డి పగడాల సుబ్రహ్మణ్యం రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
గూడూరు డివిజన్‌లో 365 పంచాయతీలు
గూడూరు, జూన్ 17: గూడూరు డివిజన్‌లోని మూడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజక వర్గాల పరిధిలోని 365 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని గూడూరు డివిజనల్ పంచాయతీ అధికారి వివిఎం లక్ష్మణరావు తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం ఈ పంచాయతీ ఎన్నికల్లో నాయుడుపేట, సూళ్లూరు పేట పంచాయతీలు అయినందున వాటికి ఎన్నికలు నిర్వహించరని, డక్కిలి మండలంలోని డి వడ్డిపల్లి కొత్తగా పంచాయతీ అయినందున ఈ సారి డివిజన్‌లో 365 పంచాయతీలకు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. గత పంచాయతీ ఎన్నికలు 2006 ఆగస్టు 8న నిర్వహించడం జరిగిందని, వీరి పదవీ కాలం 2011 ఆగస్టు, 23కి ముగియడంతో అప్పటి నుండి అన్ని పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో జరుగుతున్నాయన్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో 68 పంచాయతీల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైనందున ప్రభుత్వం పంచాయతీకి 5 లక్షల రూపాయల చొప్పున ప్రోత్సాహకాలు అందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం 117 పంచాయతీలు ఎస్‌సిలకు, 44 ఎస్టీలకు, 90 బిసిలకు కేటాయించినట్టు, 1034 వార్డులు ఎస్సీలకు, 391 ఎస్టీలకు, 394 వార్డులు బిసిలకు కేటాయించారన్నారు.
‘పేదల సమస్యలు గాలికొదిలేసిన ప్రభుత్వం’
నెల్లూరు రూరల్, జూన్ 17: పేదలు పడుతున్న కష్టాలను గాలికి వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం ధనవంతులకు వెన్నుదన్నుకా నిలుస్తుందని సిపిఎం పార్టీ నాయకుడు, మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు ఆరోపించారు. సోమవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఇంటి స్థలాల కోసం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఫేజ్-1,2,3 స్కీమ్ కింద పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్లు నిర్మించి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిందని, అయితే ఇప్పటి వరకు అలాంటి చర్యలకు పూనుకోలేదని, పేద ప్రజల పట్ల అత్యంత క్రూరంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహిరిస్తుందని ఆరోపించారు. రోడ్లు విస్తురించటంలో భాగంగా కాలువ పక్కన, రోడ్డుపక్కన ఉన్నవారిని ఉన్నపళంగా వారి గుడిసెలను తొలగించటం చూస్తుంటే కాంగ్రెస్‌కు పేదల పట్ల ఎంతటి జాలి ఉందో తెలుస్తుందన్నారు. గుడిసెల తొలగించిన కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఆకుటుంబాలను రోడ్డుపాల్జేయటం కాంగ్రెస్‌కే చెల్లించిందన్నారు. అలాగే హరనాధపురం వారిని కొత్తూరుకు తరలించారని, అక్కడ వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఇళ్ల స్థలాలు, సాగు భూములు పంపిణీ చేయాలంటూ ధర్నా
గూడూరు, జూన్ 17: గూడూరు పట్టణంలోని ఇళ్లులేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు సాగు భూములు కేటాయించాలంటూ భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గూడూరు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహశీల్దార్ మైత్రేయకువినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపియం నాయకులుమాట్లాడుతూ గూడూరు పట్టణంలోని పేదలు అనేక సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు లేక అద్దె ఇళ్లలో నివసిస్తూ అద్దెలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎగువ వీరారెడ్డి, దిగువ వీరారెడ్డి పల్లి, అశోక్‌నగర్ తదితర ప్రాంతాల్లోని ఆటో కార్మికులు, ఆటోమోబైల్ కార్మికులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు స్వంత ఇళ్లు లేక అద్దె ఇళ్లల్లో నివసించ లేక నానా అవస్థలు పడుతున్నారని, వీరు అద్దెలు కట్టలేక పిల్లలను చదువుకు పంపలేక పోతున్నారన్నారు. అనారోగ్యం భారిన పడుతున్నారన్నారు. వీరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇందిరమ్మ గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గూడూరు మండలం కాండ్ర, విందూరు తదితర ప్రాంతాల్లోని వ్యవసాయ కార్మికులు ఉన్నారని, రోజూ సరైన పనిలేక పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారని, వీరికి సరైన భూ వసతి లేక వీరి జీవనం దుర్భరంగా మారిందన్నారు. వీరికి ప్రభుత్వం వ్యవసాయోగ్యమైన భూమిని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
గూడూరు పట్టణంలోని ఇళ్ల స్థలాలను సర్వే చేయించి అర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి గట్టి ఇళ్లను నిర్మించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేయించి వ్యవసాయ కూలీలకు తదితర పేద, బడుగు, బలహీన వర్గాల వారి సాగుకు భూమిని మంజూరు చేయాలని టౌన్ కార్యదర్శి ఎ కేశవులు, జోగి శివకుమార్, పలువురు పట్టణ, గ్రామీణ ప్రాంత రైతులు, కార్మికులు పాల్గొన్నారు.
తీర్థయాత్రల నిమిత్తం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని
english title:
utharakhand
Date:
Tuesday, June 18, 2013