Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మృత్యుశకటం..

$
0
0

మార్కాపురం, జూన్ 17: పెద్దారవీడు మండలం గొబ్బూరు - తోకపల్లి మధ్య సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోరరోడ్డుప్రమాదంలో మార్కాపురం మున్సిపల్ కమిషనర్ ఎం రవీంద్రారెడ్డితోపాటు బస్సులో ప్రయాణిస్తున్న మరో ఆరుగురు మృతి చెందగా 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి గిద్దలూరు వెళ్తున్న రాజాట్రావెల్స్‌కు చెందిన బస్సు గొబ్బూరు సమీపంలో మరమ్మతులకు గురై నిలిచి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈప్రమాదం జరిగింది. కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో ఉండగా శనివారం సాయంత్రం వెళ్ళి సోమవారం విధి నిర్వహణకు వస్తుండగా బస్సులో ముందుభాగంలో కూర్చొని ఉన్న మార్కాపురం మున్సిపల్ కమిషనర్ ఎం రవీంద్రారెడ్డి (40) ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. అర్ధవీడు మండలం నాగులవరం గ్రామానికి చెందిన కూరుమాని వెంకటసుబ్బమ్మ (50), కనిగిరి ఇందిరాకాలనీకి చెందిన సానికొమ్ము బ్రహ్మారెడ్డి (60), కొమరోలు మండలం భీమినేనిపల్లికి చెందిన ఆరపాటి సత్యవతి (50), పోరుమామిళ్ళ మండలం రాజాసాహెబ్‌పేటకు చెందిన సింగా తిరుపతమ్మ (70)లు మృతి చెందారు. కాగా కొమరోలు మండలం మిట్టమీదిపల్లి గ్రామానికి చెందిన వర్రా రవణమ్మ (30) ప్రథమ చికిత్స చేసి గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. అలాగే బేస్తవారపేటకు చెందిన చుంచు చెంచులక్ష్మి (48) గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న మార్కాపురం డివైఎస్పీ జి రామాంజనేయులు, సిఐ కెవి రాఘవేంద్ర, పెద్దారవీడు ఎస్సై దాసరి ప్రసాద్‌లు హుటావుటీన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. వైపాలెం సిఐ పాపారావు, త్రిపురాంతకం, కంభం, పెద్దారవీడు, మార్కాపురం రూరల్ ఎస్సైలు శ్రీనివాసరావు, రామకోటయ్య, దాసరి ప్రసాద్, రాములునాయక్‌లు ఏరియా వైద్యశాలకు చేరుకొని క్షతగాత్రులకు వైద్యచికిత్సలు చేయించారు.
అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం
అతివేగంతోపాటు నిర్లక్ష్యమే ఆరుగురి ప్రాణాలను తీయడంతోపాటు పలువురిని క్షతగాత్రులను చేసిందని బస్సులో ప్రయాణిస్తూ గాయాలపాలైన పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి 10గంటల సమయంలో బస్సు ఎక్కామని, మరో రెండుగంటల్లో గిద్దలూరు, కొమరోలు, బేస్తవారపేట ప్రాంతాల్లోని గ్రామాలకు చేరుకుంటామని అనుకుంటున్న సమయంలో క్షణకాలంలో జరిగిన ఈప్రమాదంలో తాము గాయపడగా తమ బంధువులు మృతి చెందడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రధానంగా అతివేగంగా వస్తూ ఎదురుగా నిలిచి ఉన్న వాహనాన్ని డ్రైవర్ దగ్గరకు వచ్చేంత వరకు గుర్తించకపోవడంతో కండెక్టర్‌వైపు పూర్తిగా బస్సు నుజ్జునుజ్జై ఆ సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ఆరుగురు మృతి చెందగా 9మంది వరకు గాయాలయ్యాయి. ఇందులో ఐదుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కొందరిని కర్నూల్, మరికొందరిని గుంటూరుకు తరలించారు. గాయపడిన వారిలో బేస్తవారపేటకు చెందిన చుంచు చెంచులక్ష్మీ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రథమ చికిత్స చేసి గుంటూరుకు తరలించారు. అదేకుటుంబానికి చెందిన చుంచు సత్యవతి, రెండేళ్ళ బాలుడు ఖేతేంద్రనాథ్‌లను పోలీసులు సంఘటన స్థలం నుంచే కర్నూల్ వైద్యశాలకు తరలించారు. కాగా వర్రా వీరనారాయణ, వర్రా రవణమ్మలను గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో రవణమ్మ మృతి చెందడంతో మృతదేహంతోపాటు భర్త వీరనారాయణను కూడా ఏరియా వైద్యశాలకు తీసుకువచ్చారు. కాగా కొమరోలుకు చెందిన మల్లికార్జున్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పీరమ్మ, పెద్దారవీడు మండలం రామచంద్రకోటకు చెందిన దర్శనం వెంకటయ్య, కూరాకుల గిరిబాబు, మరికొంతమందికి స్థానిక వైద్యశాలలో చికిత్సలు చేస్తున్నారు.

అందరివాడు కమిషనర్ రవీంద్రారెడ్డి
* సమస్యలు వినడం.. అందరినీ అమ్మా అని పిలవడం ఆయన మర్యాద
మార్కాపురం, జూన్ 17: బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారంతోపాటు పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన కమిషనర్ ఎం రవీంద్రారెడ్డి సోమవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదంలో మృతి చెందాడని తెలుసుకున్న పట్టణ ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం పట్టణంలో తీవ్రనీటి ఎద్దడి ఉన్న దృష్ట్యా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయిస్తూ ప్రతినిత్యం పట్టణంలో ఏదొక ప్రాంతంలో పర్యటిస్తూ ప్రజలను కలుసుకుంటూ ఉండే రవీంద్రారెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో ఉన్న తన చిన్నకూతురు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లి వస్తూ ప్రమాదంలో మృతి చెందాడు. ఎవరు ఏ సమస్యపై వెళ్ళిన నవ్వుతూ పలుకరిస్తూ సమస్యను తెలుసుకుని పరిష్కరించేందుకు తనవంతు కృషి చేయడం రవీంద్రారెడ్డికి ప్రజల్లో ఉన్న గుర్తింపుకు కారణం. అందరిని అమ్మా అంటూ పలుకరించడం ఆయన నైజం. ఈయన గ్రూప్-1 ఆఫీసర్‌గా ఎన్నికై మొట్టమొదటగా నెల్లూరుజిల్లా గూడూరు మున్సిపల్ కమిషనర్‌గా విధుల్లో చేరారు. కొద్దికాలం పనిచేసి అనంతరం అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపల్ కమిషనర్‌గా మూడేళ్ళపాటు విధులు నిర్వర్తించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో మెప్మా విభాగంలో కొద్దికాలం పనిచేసి గత రెండేళ్ళ కిందట మార్కాపురం మున్సిపల్ కమిషనర్‌గా వచ్చారు. అప్పటి నుంచి విధులు నిర్వర్తిస్తూ అటు ఉద్యోగుల్లోను, ఇటు ప్రజల్లోను ఒకరిగా ఉంటూ మంచి పేరు సంపాదించారు. కాగా ఈయన సతీమణి ఉపాధ్యాయవృత్తిలో ఉండగా ఈయనకు ఇరువురు కుమార్తెలు.
* 20 నిమిషాలైతే గమ్యం చేరేవారు
సోమవారం తెల్లవారుజామున బస్సు ప్రమాదంలో మృతి చెందిన మార్కాపురం మున్సిపల్ కమిషనర్ రవీంద్రారెడ్డి ప్రమాదం జరగకుండా ఉంటే మరో 20 నిమిషాల్లో మార్కాపురం చేరుకునేవారు. ఆదివారం రాత్రి 10గంటల సమయంలో మార్కాపురం వచ్చేందుకు రాజా ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సులో బయలుదేరారు. పెద్దారవీడు మండలం కుంట వద్దకు వచ్చి తన కారుడ్రైవర్‌కు ఫోన్ చేసి తాను మరో అరగంటలో మార్కాపురం వస్తానని, కారుతీసుకొని బస్టాండ్‌కు రావాలని ఆదేశించారు. అయితే కారుతీసుకొని బస్టాండ్‌కు వచ్చిన డ్రైవర్ 5గంటల నుంచి మున్సిపల్ కమిషనర్ కోసం ఎదురుచూసి ఎంతసేపటికి బస్సు రాకపోవడంతో ఫోన్ చేశాడు. రింగ్ అవుతున్నప్పటికీ ఫోన్ ఎత్తకపోవడంతో వస్తాడని ఎదురుచూస్తూ మరోసారి ఫోన్ చేయగా తోటిప్రయాణికులు ఫోన్ ఎత్తి కమిషనర్ ప్రమాదంలో మృతి చెందాడని చెప్పడంతో డ్రైవర్ నిర్ఘాంతపోయాడు.

కొంపముంచుతున్న
విదేశీ శనగలు
గోదాముల్లో మగ్గుతున్న దేశీయ శనగలు
దిక్కుతోచని రైతులు
నేటి నుండి తహశీల్దార్ల కార్యాలయాల ముట్టడి
ఒంగోలు, జూన్ 17:విదేశీ శనగల దిగుమతితో దేశీయ శనగలు గోదాముల్లో పేరుకుపోతున్నాయి. దీంతో జిల్లాలోని శనగ రైతులు లబోదిబోమంటున్నారు. విదేశీ శనగల దిగుమతులు మూలంగా దేశీయ శనగలకు రేట్లు లేకపోవటమే కాకుండా వ్యాపారులు శీతలగిడ్డంగుల్లో ఉన్నవాటిని కొనుగోలు చేయని పరిస్ధితి జిల్లాలో నెలకొంది. ఆస్ట్రేలియా, కెనడా దేశాల నుండి సుమారు రెండు లక్షల టన్నుల శనగలు ఇటీవల దిగుమతి అయ్యాయి. ఆ శనగలు చెన్నై, కాండ్ల ఓడరేవుల్లో ఉన్నట్లు రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు నాగబోయిన రంగారావు ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. జిల్లావ్యాప్తంగా రెండు లక్షల ఎకరాల్లో సాధారణంగా ఒంగోలు రూరల్, పర్చూరు, కొండెపి, కారంచేడు, ఇంకొల్లు, యద్దనపూడి, చినగంజాం, నాగులుప్పలపాడు, టంగుటూరు, కొండెపి, జరుగుమల్లి, జె పంగులూరు, కొరిశపాడు మండలాల్లో శనగ పంటను రైతులు సాగుచేస్తారు. ప్రస్తుతం జిల్లాలో రైతుల వద్ద సుమారు 25 లక్షల క్వింటాళ్ల శనగలు గోదాముల్లో పేరుకుపోయాయి. కనీసం ఇతర జిల్లాల నుండి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఈసంవత్సరం అక్టోబర్‌లో శనగ పంటను సాగు చేసేందుకు వెనకంజ వేసే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం తమ భూములను చదును చేసుకుంటే అక్టోబర్ నెలలో పంట వేసుకునేందుకు వీలుంటుంది. అదేవిధంగా శనగలకు రేట్లు లేకపోవటంతో భూములను కౌలుకు తీసుకునేందుకు కూడా కౌలుదారులు వెనకంజ వేస్తున్నారు. గతంలో ఎకరాను 12వేల నుండి 15వేల రూపాయల వరకు కౌలుదారులు కౌలుకు తీసుకునేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో భూముల రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కాక్-2, బోల్డ్క్రం శనగలు క్వింటా 2780 రూపాయలకు, ఎర్రశనగలు 3,100 రూపాయలకు మాత్రమే అరకొరగా కొనుగోలు చేస్తున్నారు. విదేశీ శనగలను కూడా 3500 రూపాయల లోపు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. కాని విదేశీ మోజులో దేశీయ శనగలను పెద్దగా కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది. ఇదిలాఉండగా శనగ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అఖిలపక్షం సంఘం ఆధ్వర్యంలో మండల కార్యాలయాల ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్లు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగబోయిన రంగారావు, దుగ్గినేని గోపీనాథ్ తెలిపారు. ఈసంవత్సరం ఒక్క వ్యాపారి కూడా ఒక్క లారీ శనగలను కూడా కొనుగోలు చేయలేదని వారు పేర్కొన్నారు. జిల్లాలో శనగ రైతుల గురించి ఏ ఒక్క ప్రజాప్రతినిధి పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ప్రభుత్వ రంగం సంస్ధలైన నాఫెడ్, మార్కెఫెడ్‌ల ద్వారా బోల్డ్ శనగలను క్వింటా ఏడువేలకు, కాక్-2 శనగలను ఆరువేల రూపాయలకు, ఎర్రశనగలు ఐదువేల రూపాయల మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేయాలని వారు కోరారు.

ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలం
టిడిపి నేత శిద్దా ధ్వజం
దర్శి, జూన్ 17:రోజు రోజుకు పెరుగుతున్న ధరలను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి శిద్దా రాఘవరావు విమర్శించారు. సోమవారం పల్లెపల్లెకు టిడిపి యాత్రలో భాగంగా మండలంలోని తానం చింతల పోతవరం, శేషంవారిపాలెం , కట్టుబడివారిపాలెం, రాజంపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభలలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. కొనబొతే కొరివి అమ్మబోతే అడవి అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వ పాలన తయారైయిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నా రైతులకు కావల్సిన విత్తనాలను సరఫరా చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. రాష్ట్రంలో పరిపాలన గాడిలో పడాలంటే చంద్రబాబు నాయకత్వం అవసరమని మహిళలు, రైతులు కోరుకుంటున్నారన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టిడిపికి అండగా నిలవాలన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి యన్‌టిఆర్ సుజల పథకం ద్వారా అందించేందుకు చంద్రబాబు నాయుడు ప్రణాళిక రూపొందించారన్నారు. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు మాట్లాడుతూ వైయస్‌ఆర్‌సిపి కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందన్నారు. గతంలో పుట్టిన పార్టీలన్నీ కాలగర్భంలో కలిసి పోయాయని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాలగర్భంలో కలిసిపోనుందని పేర్కొన్నారు. సురక్షితమైన పాలన అందించాలంటే ఒక్క చంద్రబాబుకే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బల్లగిరి శీనయ్య, మాజీ సొసైటీ అధ్యక్షులు తంగా తిరుపతిరావు, ఆర్ మోషా, జోసఫ్ , శోభారాణి, అంజమ్మ, ఉల్లి రాములు, పి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.

శతడిసి బూజుపట్టిన పౌష్టికాహారం
* అంగన్‌వాడీ కేంద్రాలకు తరలించేందుకు సిద్ధం
* అడ్డుకున్న గ్రామస్థులు
తర్లుపాడు, జూన్ 17: చిన్నారులకు అందించే పౌష్ఠికాహారం ఇటీవల కురిసిన వర్షాలకు తడిసి బూజుపట్టగా సోమవారం ఉదయం అంగన్‌వాడీ కేంద్రాలకు తరలించేందుకు కాంట్రాక్టర్ సిద్ధమయ్యాడు. విషయాన్ని గమనించిన స్థానికులు పాడైపోయిన పౌష్టికాహారాన్ని ఎక్కడికి తరలిస్తున్నారంటూ అడ్డుకోవడంతో ఏమి చెప్పాలో తెలియని పరిస్థితుల్లో కాంట్రాక్టర్ తడపడ్డాడు. పిల్లలు పౌష్టికంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ పౌష్టికాహారాన్ని ఎంతో జాగ్రత్తగా భద్రపరచాల్సిన అధికారులు అండర్‌గ్రౌండ్‌లో నిల్వ ఉంచడంతో ఇటీవల కురిసిన వర్షాలకు నీరు లేక తడిసి బూజుపట్టింది. ఎలాగైనా ఈ పౌష్ఠికాహారాన్ని తమ నుంచి తరలించేందుకు అధికారులు సిద్ధమై కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇదే అదునుగా భావించిన కాంట్రాక్టర్ సోమవారం తరలించేందుకు ప్రయత్నించగా గ్రామస్థులు పట్టుకోవడంతో ముందుగా సమాధానం చెప్పేందుకు తడపడిన కాంట్రాక్టర్ చివరకు కురిచేడు సెక్టారుకు తరలిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. సరుకు పంపిణీని చేయాలంటే నిబంధనల ప్రకారం రూట్ ఆఫీసర్ ఉండాలి. అలా లేకుండా తరలించేందుకు ప్రయత్నించడంతో అసలు ఈ పౌష్ఠికాహారం అంగన్‌వాడీ కేంద్రాలకా..? నల్లబజారుకా..? తరలించేది అన్న అనుమానం రావడంతో జిల్లా జాయింట్‌కలెక్టర్ యాకూబ్‌నాయక్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న జెసి పౌష్ఠికాహారాన్ని స్థానిక రెవెన్యూ సిబ్బందికి అప్పగించాలని ఆదేశిస్తూ జిల్లా పిడిని సంఘటన స్థలానికి వెళ్ళి విచారణ జరపాలని ఆదేశించారు. దీనితో సోమవారం సాయంత్రం పిడి విద్యావతి తర్లుపాడు చేరుకొని విచారణ ప్రారంభించారు. ఈవిషయంపై విలేఖరులు ఆమెను వివరణ కోరగా తడిసి బూజుపట్టిన మాట వాస్తవమేనని, ఈ పౌష్టికాహారం విద్యార్థులకు పంపిణీ చేస్తే ఇబ్బందులు వస్తాయని చెబుతూ విచారణ జరిపి వాస్తవ నివేదికను జిల్లా జాయింట్‌కలెక్టర్‌కు అందచేయడం జరుగుతుందని, బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని తెలిపారు. ఈమె వెంట సిడిపిఓ పి శారదమ్మ, తహశీల్దార్ విద్యాసాగరుడు, ఆర్‌ఐ మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.

కార్పొరేట్ విద్యాసంస్థల్లో డిప్యూటీ డిఇఓ తనిఖీ
కందుకూరు, జూన్ 17: పట్టణ పరిధిలోని ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థలైన భాష్యం, శ్రీచైతన్య, నారాయణ పాఠశాలలపై డిప్యూటీ డిఇఓ చాంద్‌బేగం సోమవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తొలుత చైతన్య టెక్నోస్కూల్ ఆవరణానికి చేరుకుని టెక్నో అనే పదాన్ని తొలగించాలని యాజమాన్యానికి ఆదేశించారు. పాఠశాలకు సంబంధించిన అన్ని అనుమతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థుల నుండి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను ఈనెల 27వ తేదిలోపు పాఠశాల ఆవరణలో బహిరంగంగా నోటీసు బోర్డులో ఉంచాలని ఆదేశించారు. తదుపరి నారాయణ పాఠశాలకు చేరుకుని పాఠశాల అనుమతి పత్రాలను అందజేయాలన్ని యాజమాన్యానికి సూచించారు. అయితే యాజమాన్యం అనుమతి పత్రాలు ఒంగోలు విద్యాసంస్థల ప్రధాన కార్యాలయంలో ఉన్నాయని ఫ్యాక్స్ ద్వారా తెప్పిస్తామని పది నిమిషాల తదుపరి అనుమతి పత్రాల నకలు డిప్యూటీ డిఇఓకు అందజేశారు. అగ్నిమాపక అధికారులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని చూపించాలని డిప్యూటీ డిఇఓ ప్రశ్నించగా సాయంత్రంలోపు అందజేస్తామని యాజమాన్యం సర్దిచెప్పుకుంది. అనంతరం భాష్యం పాఠశాలను తనిఖీ చేశారు. డిప్యూటీ డిఇఓ పాఠశాలకు చేరుకున్న సందర్భంలోనే యాజమాన్యం వివిధ తరగతులకు చెందిన పుస్తకాలను సంచులలో చేర్చి విక్రయిస్తున్నారు. పుస్తకాలు విక్రయించడం గమనించిన డిప్యూటీ డిఇఓ అక్కడికి చేరుకుని పుస్తకాలు ఎంతకు విక్రయిస్తున్నారు అని యాజమాన్యాన్ని ప్రశ్నించగా వౌనం వహించారు. ఈక్రమంలో ఆప్రాంతంలో తల్లిదండ్రులు నర్సరీ పాఠ్యపుస్తకాలు 2,050రూపాయలకు విక్రయించినట్లు డిప్యూటీ డిఇఓకు తెలిపారు. సంపూర్ణ సమాచారం కోసం ఒక్కొక్క తరగతి గదికి వెళ్లి విద్యార్థులను పాఠ్యపుస్తకాలు విక్రయించిన ధరల వివరాలు తెలుసుకుని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి పాఠ్యపుస్తకాలు పాఠశాల ఆవరణలో విక్రయిస్తే కేసులు నమోదు చేయిస్తానని హెచ్చరించారు. పాఠశాలలో మరుగుదొడ్లలో నీటి సౌకర్యం లేదని ఈవిధంగా వ్యవహరిస్తారా అని మందలించారు. పాఠశాల అనుమతిపత్రాలు ప్రధాన కార్యాలయంలో ఉంచకూడదని, పాఠశాలలోనే ఉంచాలని ఆదేశించారు.
సాయిగణేష్ పాఠశాల మూసివేత
పట్టణ పరిధిలోని టిఆర్‌ఆర్ కళాశాల సమీపంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న శ్రీసాయిగణేష్ పాఠశాలను డిప్యూటీ డిఇఓ చాంద్‌బేగం ఆధ్వర్యంలో ఎంఇఓ బండి గోవిందయ్య మూసివేశారు. అనుమతులు లభించే వరకు పాఠశాలను తెరవరాదని, తెరిస్తే జరిమానా, క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని పాఠశాల యాజమాన్యానికి హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఎంఇఓ బండి గోవిందయ్య, సిఆర్‌పిలు రవికుమార్, శ్రీనివాసరావు, రమణారెడ్డి, ప్రతిభ, కిరణ్ పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం
* లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కలెక్టర్
మార్కాపురం టౌన్, జూన్ 17: ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను అన్నిరకాలుగా ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ విజయకుమార్ భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు సోమవారం మార్కాపురం వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. బాధ్యత కలిగిన ఉద్యోగిగా ఉంటూ అందరితో కలిసిమెలిసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే వ్యక్తిగా ఉద్యోగానికి వనె్న తెచ్చిన అధికారి మార్కాపురం మున్సిపల్ కమిషనర్ రవీంద్రారెడ్డి అని, ఆయన మృతి చెందడం బాధకరమని అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన ప్రతిఒక్కరికి ప్రభుత్వపరంగా అందే ప్రయోజనాలను సమకూరుస్తామని, మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతేకాక వాహనదారుల నుంచి కూడా అదనపు పరిహారం చెల్లించేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రైవేటు వాహనాల యాజమాన్యం ప్రయాణికుల పట్ల అభద్రతతో వ్యవహరిస్తుందని, ఒక రిజిస్టర్ ఒకే నెంబర్‌తో సదరు వాహన యజమాని మూడు బస్సులను నడపుతున్నాడని, ఒక్క వాహనానికి ఇద్దరు డ్రైవర్లు మాత్రమే నెలంతా పని చేస్తారని, ప్రమాదాలకు గల ప్రధాన కారణాలను విలేఖరులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనితో స్పందించిన కలెక్టర్ ఆర్‌టిఓతో చర్చించి ప్రైవేటు వాహనాలపై చర్యలు తీసుకుంటామని, ట్రావెల్స్‌పై నిఘా ఉంచి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

‘వడ్డెరలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి’
ఒంగోలు అర్బన్, జూన్ 17 : జిల్లాలోని నిరుపేదలైన వడ్డెరలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని శ్రమజీవుల వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు తన్నీరు శేషగిరిరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుపేదలైన వడ్డెరులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో బాధితులతో కలిసి వినతిపత్రాలు సమర్పించామన్నారు. నిరుపేదలైన వడ్డెరుల బతుకుదెరువు కోసం కులవృత్తికి సంబంధించిన పనిముట్లను పంపిణీ చేయాలని కోరారు. వారందరికీ విరివిగా రుణాలు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. ఇప్పటికే ఈ విషయాలపై ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డితో చర్చించడం జరిగిందని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారన్నారు.జిల్లాలోని మువ్వావారిపాలెం, మర్రిపాలెం, వడ్డెరులకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు జిల్లాలోని అన్నీ మండలాల్లో నివాసం ఉంటున్న వడ్డెరులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని కోరారు. సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో చీమకుర్తి మండలం నుండి 25 మంది వడ్డెరులు తమకు వ్యాపార నిమిత్తం రుణాలు మంజూరు చేయాలని వినతి పత్రాలు సమర్పించారు. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాలని కోరారు. వడ్డెర వృద్ధులకు పెన్షన్లు ఇవ్వాలని, కంటి శుక్లాల ఆపరేషన్లు ఉచితంగా చేయించాలని కోరారు.

* ఆగిన లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు * ఏడుగురు దుర్మరణం * మృతుల్లో మార్కాపురం మున్సిపల్ కమిషనర్ రవీంద్రారెడ్డి * 8 మందికి తీవ్రగాయాలు * గుంటూరు, కర్నూలు వైద్యశాలలకు తరలింపు * నెత్తురోడిన నంద్యాల - గుంటూరు రహదారి
english title: 
death

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>