Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు చెక్‌పోస్టుపై ఎసిబి దాడి

$
0
0

శ్రీకాకుళం/ఇచ్ఛాపురం, జూన్ 17: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఇచ్ఛాపురం(పురుషోత్తపురం) వద్ద గల చెక్‌పోస్టుపై ఆదివారం రాత్రి అవినీతి నిరోధక శాఖాధికారులు దాడి చేసి కేవలం ఆరు గంటల్లోనే రెండు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఎసిబి డి.ఎస్.పి. రఘువీరా తెలిపిన వివరాల మేరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 43 మంది ఎసిబి అధికారులు ఆదివారం రాత్రి రెండుగంటల సమయంలో ఐదుగురు సి.ఐ.లు, ఎనిమిది మంది గజిటెడ్ అధికారులు, 15 మంది టాస్క్ఫోర్సు సిబ్బందితో పాటు మరో 15 మంది సిబ్బంది ఆర్టీసి బస్సులో చెక్‌గేటు వద్దకు చేరుకున్నారు. ఐదు గ్రూపులుగా విడిపోయిన వీరు నాలుగువైపుల నుండి కట్టడి చేశారు. అక్కడున్న వారు బయటకు వెళ్లేందుకు వీలులేకుండా 15 మంది దళారులను పట్టుకున్నారు. చెక్‌గేటులోకి వెళ్లిన సి.ఐ.లు వాహనాల డ్రైవర్లకు అనుమానం రాకుండా తనిఖీల్లో పత్రాలతోపాటు వారు ఇస్తున్న డబ్బులను తీసుకున్నారు. ఈ విధంగా రాత్రి రెండు గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల వరకు చేసిన తనిఖీల్లో ఒక్కో లారీకి 700 నుండి వెయ్యిరూపాయలు చొప్పున మొత్తం 1.10 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 15 మంది బ్రోకర్లలో ఒకరి వద్ద నుండి 70 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. ఎసిబి అధికారులకు చిక్కిన 15 మంది దళారుల వద్ద నుండి వ్యక్తిగత వాంగ్మూలం తీసుకొని ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరు కావాలని చెప్పి వారిని విడిచిపెట్టారు. అనంతరం ఎసిబి డిఎస్పీ మాట్లాడుతూ చెక్‌గేటుపై అనేక ఫిర్యాదులు రావడంతో ఆకస్మిక తనిఖీ చేశామన్నారు. ఎవరికి అనుమానం రాకుండా తమ సిబ్బందికి సైతం తెలియకుండా తనిఖీ కేంద్రం వద్దకు చేరుకున్నామని తెలిపారు. కేవలం రాత్రి రెండు నుండి ఆరు గంటల్లో రెండు లక్షలు వసూలైందని, అదే 12 గంటలు తనిఖీ చేసినట్లయితే ఏడు లక్షలకు పైగా వసూలవుతుందని వెల్లడించారు. లంచం ఇస్తున్న వారుంటే తీసుకున్నవారుండటం కొనసాగుతుందని, ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ తనిఖీల్లో జాప్యం జరిగి రోడ్డుపై ట్రాఫిక్ పెరిగిపోయిందని చెప్పారు. చెక్‌పోస్టు ఎ.ఒ కేశవరావు రాత్రిపూట విధులకు హాజరుకారని, పగలే ఉంటారని ఆయన తెలిపారు. తమ నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు.
చెక్‌పోస్టుపై కొరవడిన నిఘా!
చెక్‌పోస్టుపై నిఘా కొరవడడంతో అవినీతికి అంతే లేదు. నిఘా కెమెరాలు పనిచేయకపోవడం, ఎసిబి వార్షిక తనిఖీలు గత రెండేళ్లుగా జరుగకపోవడంతో అవినీతికి అంతులేకుండాపోయింది. ఆదివారం జరిగిన దాడిలో అవినీతి బట్టబయలైంది.
భారీ స్థాయిలో ఎసిబి దాడి
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అవినీతి నిరోధక శాఖాధికారులు ఒకేసారి 43 మంది దాడి చేసి దళారులు తప్పించుకునేందుకు వీలు లేకుండా నాలుగువైపుల నుంచి ముట్టడించారు. బస్సులో వచ్చే ఎసిబి డిఎస్పీ తమ సి.ఐ.లకు సైతం తెలియజేయకుండా డ్రైవర్లు, బ్రోకర్ల వలె లుంగీలతో దాడిలో పాల్గొన్నారు. ఇతరులకు అనుమానం లేకుండా దాడి చేశారు. పరుగులు తీసే దళారులు సైతం సిబ్బంది పట్టుకోగలిగారు. 15 మంది దళారులను చెక్‌పోస్టులో పట్టుకోవడం ఇదే ప్రథమం. తనిఖీ అనంతరం ఎసిబి డిఎస్పీ స్వయంగా చెక్‌గేటులో ఉన్న కౌంటర్లను, గదులను, బయట పరిసరాలను వీడియో తీశారు. ఈతనిఖీలో ఎసిబి సి.ఐ.లు రాఘవరావు, అజయ్, రమణమూర్తి, లక్ష్మూజీ, రమేష్‌లు, ఇతరసిబ్బంది పాల్గొన్నారు.

ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
కంచిలి, జూన్ 17: ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని కేంద్ర ఐటి సహాయ మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. సోమవారం రాహుల్‌సంకల్పయాత్రలో భాగంగా కంచిలి మండలంలో పర్యటించిన కేంద్రమంత్రి ముందుగా శాసనంకు చేరుకొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం గోకర్ణపురం, నారాయణపురం మీదుగా బూరగాంకు చేరుకొని పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పుక్కళ్లపుట్టుగ, సన్నాయిపుట్టుగ, తలతంపర గ్రామాల్లో పర్యటించినప్పుడు అక్కడ ప్రధానంగా బెంతు ఒరియాలు తమ కులదృవపత్రాలను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా, ఈ విషయంపై స్పందించిన మంత్రి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో మాట్లాడి ఎస్సీ కులాల్లో చేర్చేందుకు కృషి చేస్తానన్నారు. మండపల్లికి చేరుకున్న మంత్రిని పర్యావరణ నాయకులు 1107 జీవోను రద్దు చేయాలని ఆందోళనకు దిగారు. ఈ విషయమై మంత్రి మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగిందని, మరల ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో 1107 జీవో రద్దుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మండపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి బంజీరు, సత్తివరం, చిన్నకొజ్జిరి, పెద్దకొజ్జిరి గ్రామ పంచాయతీల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బసవపుట్టుగలో నూతనంగా నిర్మించిన స్కూల్ భవనాన్ని ప్రారంభించారు. జాడుపుడిలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ ప్రతి పేదవాడిని కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని, రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు కొరత లేకుండా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పేదవారికి పక్కా ఇళ్లు కూడ నిర్మించేందుకు కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్‌గాంధీ ఆశయాలకు అనుగుణంగా మనమంతా నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సోంపేట మాజీ జడ్‌పిటిసి దాస్, నవీన్‌కుమార్‌అగర్వాల్(బబ్లూ), ఇప్పిలి కృష్ణారావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లి ఈశ్వరరావు, చినబాబు, పిలక చినబాబు, రజనీకాంత్‌దొళాయి తదితరులు పాల్గొన్నారు.

రైతులకు అన్ని విధాలా సహకరిస్తాం
* జిల్లా కలెక్టర్
శ్రీకాకుళం, జూన్ 17: జిల్లాలో పూర్తిస్థాయిలో విత్తనాలు, ఎరువులు అందించి రైతులకు అన్ని విధాలా సహకరిస్తామని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సెట్‌కాన్ఫరెన్సులో వివిధ శాఖల పనితీరుపై ఆయ న సమీక్షించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు 50 వేల క్వింటాల విత్తనాలు సరఫరా లక్ష్యంగా నిర్ధేశించామని, ఇప్పటివరకు 41 వేల క్వింటాల విత్తనాలు జిల్లాలో సరఫరా అయ్యాయని తెలిపా రు. రెండువేల క్వింటాల విత్తనాలను నిల్వగా ఉంచగా మరో ఏడువేల క్వింటాలు మార్క్‌ఫెడ్ ద్వారా రప్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో 17,700 మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేసేందుకు లక్ష్యంగా నిర్ధేశించామని పేర్కొన్నారు. జిల్లాలో అన్ని గ్రామాలకు విత్తనాలు, ఎరువులను సరఫరా చేసేందుకు మండలాల వారీగా వాహనాలను సిద్ధం చేసుకోవాలన్నారు. గత ఏడాదికంటే ఎక్కువ శాతం విత్తనాలను పంపిణీ చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం- ఆరోగ్యంపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీతంపేట ఏజన్సీలో మలేరియా వ్యాధి ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 17 నుండి 23 వరకు పారిశుద్ధ్య వారోత్సవాలను నిర్వహించాలని తెలిపారు. ఈ సెట్‌కాన్ఫరెన్సులో డిఆర్వో నూర్‌భాషాఖాసీం, జిల్లా పరిషత్ సిఇఒ కైలాసగిరీశ్వర్, వ్యవసాయ శాఖ జె.డి మురళీకృష్ణారావు, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, డిఇఒ అరుణకుమారి, డ్వామా పి.డి కల్యాణచక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

‘గెలుపే లక్ష్యంగా పనిచేయండి’
శ్రీకాకుళం, జూన్ 17: పంచాయతీ ఎన్నికల్లో పట్టుసాధించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించినట్టు తెలిసింది. సోమవారం రాత్రి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై సమావేశం నిర్వహించారు. జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులు, ముఖ్యనేతలను కలుపుకొని అన్ని పంచాయతీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించేలా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు అందిస్తున్నాయా, లేదా అన్న విషయాన్ని కూడా ఈ ఎన్నికలు రుజువు చేస్తాయన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. నియోజకవర్గాల వారీగా క్యాడర్‌తో సమావేశాలు నిర్వహించి అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు విజయపథంలో పయనించేలా ముందస్తు ప్రణాళిక అమలుచేయాలని స్పష్టంచేసారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమపథకాలను పార్టీ శ్రేణుల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లి పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు. సమన్వయంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తిస్థా యి విజయాలు సొంతం చేసుకున్నట్లయితే మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు వంటి స్థానిక సంస్థలు కాంగ్రెస్ ఖాతాలో జమ అవుతాయన్న విషయాలన్ని దృష్టిలో ఉంచుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా పనిచేయాలన్నారు. ఈ ఎన్నికలు 2014 శాసనసభ, పార్లమెంట్‌కు జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు నాంది కావాలన్న లక్ష్యంతో శాసనసభ్యులంతా శ్రమించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఏరేసు ప్రతాప్‌రెడ్డి, మంత్రులు శతృచర్ల విజయరామరాజు, కోండ్రు మురళీమోహన్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, శాసనసభ్యులు బొడ్డేపల్లి సత్యవతి, మీసాల నీలకంఠంనాయుడు, కొర్ల భారతి, జుత్తు జగన్నాయకులు, నిమ్మక సుగ్రీవులు హాజరయ్యారు.

చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలి
శ్రీకాకుళం , జూన్ 17: జిల్లా ఆమదాలవలస మండలం దూసి కాన్‌కాస్ట్ పరిశ్రమ కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుప్పల గోవిందరావు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద కాన్‌కాస్ట్, నీలం జూట్ మిల్లు కార్మికులతో సంయుక్తంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్ నాయకులకు యాజమాన్య ప్రతినిధులకు మద్య గతంలో నిర్వహించిన ఒప్పందం ప్రకారం చార్టర్ ఆఫ్ డిమాండ్ అమలు మార్చి నెలతో ముగిసి మూడు నెలలు కావస్తున్నా అమలు కాకపోవడం అన్యాయమన్నారు. వెంటనే జిల్లా యంత్రాంగం చొరవ చూపి చార్టర్ ఆప్ డిమాండ్స్‌ను అమలు చేసి కార్మికుల హక్కులను కాపాడాలని కోరారు.
* అక్రమ లాకౌట్ ఎత్తివేయాలి
రూరల్ మండలం మునసబుపేట వద్ద ఉన్న నీలం జూట్ మిల్లు అక్రమ లాకౌట్ ఎత్తివేయాలని సిటు నాయకులు డిమాండ్ చేశారు. అక్రమ లాకౌట్ కారణంగా సుమారు వెయ్యిమంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 24 ఏళ్లుగా కార్మికులకు కనీసవేతనం అమలు చేయకుండా యాజమాన్యం శ్రమదోపిడీకి పాల్పడటంతో కార్మికులు పోరాటమార్గం పట్టారని, దీనికి యాజమాన్యం లాకౌట్ ప్రకటించడం అన్యాయమన్నారు.
కార్మిక చట్టాలు అమలుచేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. ఇప్పటికైనా యంత్రాంగం చొరవచూపి కార్మిక హక్కులను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో ఎం.సూర్యనారాయణ, ఎన్.సూరిబాబు, ఎన్.ఆదినారాయణ, తంగి సూర్యనారాయణ, డి.రాములు, ఎస్.సుందరరావు, డి.సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

అర్చకస్వాములకు విజయపత్రాలు
శ్రీకాకుళం, జూన్ 17: ఆగమపరీక్షల్లో ఉత్తీర్ణులైన అర్చక స్వాములకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్‌చార్జి సహాయ కమిషనర్ శ్యామలాదేవి విజయపత్రాలు అందించారు. ఫిబ్రవరి మూడవ తేదీన అరసవల్లి కేంద్రంగా నిర్వహించిన రాత, వౌఖిక పరీక్షలు జరిగాయి. 422 మంది పురోహితులు హాజరు కాగా 131 మంది పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఇదిలా ఉండగా ప్రవేశ 91, వర 123, ప్రవరలో 77 మంది ఉత్తీర్ణులైన స్వాములకు ధృవపత్రాలు అందుకున్నారు. హాల్‌టిక్కెట్ నకలు కార్యాలయానికి సమర్పించిన వారికే సర్ట్ఫికేట్లు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె అర్చకులకు పలు సూచనలిచ్చి అభినందించారు.

రైలు ఢీకొని ఒకరి మృతి
* 40 గొర్రెలు మృతి
నరసన్నపేట, జూన్ 17: మండలంలో కంబకాయ గ్రామ శివార్లలో జరిగిన రైలు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా 40 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. సోమవారం మధ్యాహ్నం ఇచ్ఛాపురం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న ఘటనలో మండలం లకిమేర గ్రామానికి చెందిన బి.సూర్యనారాయణ(55) మృతిచెందగా అతనికి చెందిన 40 గొర్రెలు మృతిచెందాయి. రైల్వే హెచ్.సి కృష్ణారావు మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నిమిత్తం సూర్యనారాయణ మృతదేహాన్ని నరసన్నపేట ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. మృతునికి భార్య లచ్చమ్మ, ఇద్దరు కుమారులున్నారు. తెల్లవారుఝామున లకిమేర గ్రామం నుండి 300 గొర్రెలను మేత నిమిత్తం సూర్యనారాయణ బయటకు తీసుకువెళ్లాడని బంధువులు తెలిపారు. పశువైద్యాధికారి ఎల్.లక్ష్మణరావు గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించారు.

ఉత్తమ అధ్యాపకులుగా ఎదగాలి
ఎచ్చెర్ల, జూన్ 17: మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠ్యాంశాలను విద్యార్థులకు బోధించడంలో మెళకువలు పాటించి ఉత్తమ అధ్యాపకులుగా ఎదగాలని అంబేద్కర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ హెచ్.లజపతిరాయ్ స్పష్టంచేశారు. ఇక్కడ సేవలందిస్తున్న టీచింగ్ అసోసియేట్స్‌కు రెండురోజుల పాటు నిర్వహించిన వౌఖిక పరీక్షల్లో భాగంగా సోమవారం వీటిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిహెచ్‌డిలు, డాక్టరేట్‌లు ముఖ్యం కాదని, సమస్యను ఛేదించేలా అధ్యాపకులు ముందుకు సాగాలన్నారు. పునశ్చరణ తరగతులతోనే తాజా పరిజ్ఞానం పెంపొందుతుందన్నారు. ఈ పరిజ్ఞానంతోనే విద్యార్థులకు పాఠాలు బోధించిన నాడు సత్ఫలితాలు సాధించవచ్చునన్నారు. పరిశోధనాత్మక పుస్తకాలు రచించేటప్పుడు పిహెచ్‌డి అభ్యర్థులే రచయితలుగా తయారు కావాలన్నారు. స్వతంత్రంగా ఆర్టికల్స్ రూపొందించి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఎన్ని సెమినార్లకు హాజరైనా ఐదు మార్కులే లభిస్తాయని, పబ్లికేషన్‌పై దృష్టిసారిస్తే అధికమార్కులు సాధించవచ్చునన్నారు.
ఇంటర్నల్‌కు 20, ఎక్స్‌టర్నల్‌కు 80 మార్కులు పి.జి స్టూడెంట్లకు లభించేలా పాఠాలు బోధించాలన్నారు. నెట్, పిహెచ్‌డి అర్హతలే ముఖ్యం కాదని, విశే్లషణాత్మక బోధన సాగించాలని సూచించారు. మరో రెండు, మూడురోజుల్లో బోధనా సిబ్బంది కోసం నోటిఫికేషన్ జారీ చేస్తామని , వీటిలో ప్రతిభ కనబర్చి నియామకాలు పొందాలన్నారు. జర్నల్స్, మ్యాగజైన్స్‌లో ఉన్న అంశాలను విద్యార్థులకు బోధన చేసేటప్పుడు కొత్తదనాన్ని అందించాలన్నారు. ఈయనతోపాటు సిడిసి డీన్ తులసీరావు, ప్రిన్సిపాల్ ఎం.చంద్రయ్యలు ఉన్నారు. విభాగాల వారీగా టీచింగ్ అసోసియేట్స్‌కు వౌఖిక పరీక్షలు నిర్వహించారు.

పట్టణంలో మంచినీటి వసతి కల్పించండి
* గ్రీవెన్స్‌లో కమిషనర్‌ను ఆదేశించిన కలెక్టర్
శ్రీకాకుళం , జూన్ 17: పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ పి.రామలింగేశ్వర్‌ను జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫిర్యాదుల విభాగంలో కలెక్టర్ సౌరభ్‌గౌర్, జాయింట్ కలెక్టర్ పోలా భాస్కర్‌లు అర్జీలు స్వీకరించారు. పట్టణంలోని దమ్మలవీధి దిగువ ప్రాంతంలో నివసిస్తున్న ఎస్సీ రిక్షా కార్మికులకు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారని, పరిష్కరించాలని కోరగా కలెక్టర్ పై విధంగా స్పందించారు. బూర్జ మండలం కొల్లివలస గ్రామానికి చెందిన టి.రమణమ్మ అనే వికలాంగురాలుకు మూడు చక్రాల సైకిళ్లను డిఆర్‌డిఎ ద్వారా అందజేశారు. వంశధార ప్రోజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన సుమారు 30 మంది నిర్వాశిసుతలో 13 మంది తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్నారని, వారికి 12 నెలలుగా జీతభత్యాలు అందక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హిరమండలానికి చెదిన ఎం.్భస్కరరావు తెలిపారు. పొందూరు మండలం కనిమెట్ట గ్రామానికి చెందిన మహిళలు తమకు జాతీయ ఉపాధిహామీ పనుల కల్పన నిలుపుదల చేయుట వలన ఉపాధికి తాము ఇబ్బంది పడుతున్నామని, పునరుద్ధరించాలని కోరారు. మున్సిపాల్టీలో గత 20 ఏళ్లుగా 25 మంది ఆయాలుగా పనిచేస్తున్నప్పటికీ వారికి కనీస వేతనం అమలుచేయడం లేదని అది అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సభ్యులు కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో ఎజెసి రాజ్‌కుమార్, డుమా పిడి కళ్యాణ్‌చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

జాతీయ రహదారి పక్కన ఉన్న బెల్ట్‌షాపులు ఎత్తివేయాలి
* దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బాబ్జి
శ్రీకాకుళం, జూన్ 17: జిల్లాలో జాతీయ రహదారి వెంబడి ఉన్న బెల్టుషాపులు ఎత్తేయాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు బెల్టుషాపులను నివారించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి (బాబ్జి) అన్నారు. సోమవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇటీవల బెల్టుషాపులు ఎత్తేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. కొత్త మద్యం షాపుల ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని హితవు పలికారు. జాతీయ రహదారి వెంబడి మద్యం షాపులను ఎత్తేయాలని న్యాయాస్థానాలు చెబుతున్నా, మద్యం షాపులు తగ్గాల్సింది పోయి బెల్టుషాపులు పెంచుకుపోతున్నారని ఆరోపించారు. దీంతో విచ్చలవిడి అమ్మకాలు జరిగి ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు. ఎచ్చెర్ల మండలం అల్లినగరంలో గత మూడు మాసాలుగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్న విషయాన్ని అధికారుల దృష్టికి అనేక పర్యాయాలు తీసుకువెళ్లినా ఇంతవరకు చర్యలు కానరావడం లేదని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన తామే అనేక పర్యాయాలు వినతులు అందజేసినా అధికారులు స్పందించనపుడు ఇక సామాన్యుడి గతేంటని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, పార్టీ నాయకులు బగాది శేషు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో సిపిఎం సర్వే
శ్రీకాకుళం , జూన్ 17: పట్టణంలోని పలు పాఠశాలల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ, నిర్వహణ కొరవడి అధ్వాన్నంగా ఉన్నాయని, పిల్లలకు ఇంత వరకూ పాఠ్యపుస్తకాలు అందక చదువులు కుంటుపడుతున్నాయని, ఆటస్థలం వంటి వౌలిక సదుపాయాలు లేవని సర్వే సందర్భంగా కనుగొన్నట్లు వారు వెల్లడించారు. ఈ సందర్బంగా సిపియం పట్టణ కార్యదర్శి పంచాది పాపారావు మాట్లాడుతూ హడ్కోకాలనీలోని బలగ మున్సిపల్ హైస్కూల్‌లో 547 మంది విద్యార్ధులు ఉన్నారన్నారు. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న వారికి నేటికీ పాఠ్యపుస్తకాలు అందక చదువులు కుంటుపడుతున్నాయని, సర్కారు బడుల పరిస్థితి ఈ విధంగా ఉందని నిరుత్సాహం వ్యక్తం చేశారు. స్కూల్‌లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ నిర్వహణ కొరవడటంతో దుర్గంధం వ్యాప్తిచెంది విద్యార్ధులు రోగాల బారిన పడే అవకాశముందన్నారు. వంటగది అసంపూర్ణంగా ఉండటంతో పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆటస్థలం ఉన్నప్పటికీ చిన్నపాటి చినుకుపడితే చిత్తడిగా మారి, కనీసం పాఠశాలలో ప్రవేశించడానికి వీల్లేని విధంగా రహదారి ఉందని తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచి, విద్యార్ధుల చదువులకు ఆటంకం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎప్‌ఐ జిల్లా కార్యదర్శి వై.చలపతిరావు, డి.మనోహర పట్నాయక్, ఆర్.చిన్నమ్మడు, సిపియం నాయకులు పి.ప్రభావతి, ఎస్.సూరమ్మ, వై.లలిత తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఇచ్ఛాపురం(పురుషోత్తపురం) వద్ద గల చెక్‌పోస్టుపై
english title: 
acb raid

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>