విశాఖపట్నం, జూన్ 17: నానాటికీ దిగజారుతున్న భూగర్భ జలాల స్థాయిని పరిరక్షించుకునే చర్యలకు జివిఎంసి శ్రీకారం చుట్టింది. నగర పరిధిలో బహుళ అంతస్తుల భవనాల్లో ఇంకుడు గుంతలను తప్పనిసరి చేస్తూ జివిఎంసి ఆంక్షలు విధించింది. కొత్తగా బహుల అంతస్తుల భవనాలకు ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్ ఇవ్వాలంటే ఇంకుడు గుంతలను విధిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణ తెలిపారు. తన ఛాంబర్‌లో సోమవారం కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న బహుళ అంతస్తుల భవనాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. లేనిపక్షంలో వీరికి మంచినీటి సరఫరాను నిలిపివేయనున్నట్టు తెలిపారు. నగర పరిధిలో సుమారు 2000 వరకూ బహుళ అంతస్తుల భవనాలున్నాయని, వీటిలో ఏఒక్కదానికీ ఇంకుడు గుంతలు లేవని తెలిపారు.
జగదాంబ జంక్షన్‌కు కొత్త అందాలు
విశాఖ పేరు చెబితేనే గుర్తుకువచ్చే జగదాంబ జంక్షన్‌కు మహర్ధశ పట్టనుంది. జంక్షన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, పైనడక వంతెనల నిర్మాణం వంటివి చేపట్టనున్నట్టు కమిషనర్ వెల్లడించారు. అలాగే కలెక్టరేట్ జంక్షన్, సరస్వతి పార్కు, డైమండ్ పార్కులను పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించనున్నట్టు తెలిపారు. ఇందుకోసం 50 లక్షల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు తెలిపారు.
నగరంలోని ఫుట్‌పాత్‌లపై చెట్లను సంరక్షించే బాధ్యతను దుకాణ యజమానులకు అప్పగించనున్నట్టు తెలిపారు. నగర పరిధిలోని సుమారు 16.5 కిమీ మేర ఫుట్‌పాత్‌లు ఉన్నాయని, కిలోమీటరుకు 200 చొప్పున 3200 మొక్కలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఫుట్‌పాత్‌లు కాంక్రీటుతో కప్పివేయడం వల్ల మొక్కలకు నీరు అందదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని మొక్కకు ఇరువైపులా రెండు అడుగుల మేర కాంక్రీట్‌ను తొలగించి వాటిని సంరక్షించడం ద్వారా ఫుట్‌పాత్‌ల వెంబడి పచ్చదనాన్ని పెంపొందించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో చేపట్టిన నిర్మాణాలను తొలగించేందుకు కార్యాచరణ చేపట్టనున్నట్టు తెలిపారు. నగర పరిధిలో సుమారు 4000 వరకూ వాణిజ్య సముదాయాలున్నాయని, వీటిలో 1500 భవన సముదాయాల్లో ప్రైవేటు విద్యాసంస్థలు పాఠశాలలు నడుపుతున్నాయని తెలిపారు. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాల్లో పాఠశాలలు నడుపుతున్న వారికి నోటీసులు ఇవ్వడంతో పాటు సెల్లార్ నిర్మాణాలను కూల్చివేసేందుకు జివిఎంసి పట్టణ ప్రణాళిక విభాగం కార్యచరణ చేపట్టిందన్నారు. అలాగే కొన్ని బహుళ అంతస్తుల భవనాల్లో నడుస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులకు సైతం నోటీసులు జారీ చేసినట్టు ఆయన తెలిపారు.
నగరంలో రెవెన్యూ అధికారుల బదిలీల విషయాన్ని ప్రస్తావిస్తూ ఆదాయాన్ని పెంచి పనితీరు నిరూపించుకున్న వారికి బదిలీల్లో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అత్యధికంగా బహుళ అంతస్తులు, వాణిజ్య సముదాయాలు ఉన్న ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు నిబంధనల మేరకు ఆస్తిపన్ను మధింపు ప్రక్రియను చేపడతారని తెలిపారు.
రేపు ఎడిసి జానకి బాధ్యతల స్వీకరణ
* కొత్త ఛాంబర్ ఏర్పాటు
విశాఖపట్నం, జూన్ 17: మహావిశాఖ నగరపాలక సంస్థలో అదనపు కమిషనర్‌గా ఐఎఎస్ అధికారి జానకి ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రూరల్ విభాగం నుంచి ఆమె పట్టణాభివృద్ధి విభాగానికి వస్తున్నారు. ఐఎఎస్ అధికారికి ప్రాధాన్యత మేరకు కొత్త ఛాంబర్‌ను కేటాయించేందుకు జివిఎంసి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఎడిసి (జనరల్)గా బాధ్యతలు నిర్వహిస్తున్న కె రమేష్ ఛాంబర్‌నే ఆమెకు కేటాయించనున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న ఐఎఎస్ అధికారికి ఏబాధ్యతలు కేటాయిస్తారని కమిషనర్ ఎంవి సత్యనారాయణను విలేఖరులు ప్రశ్నించగా కీలక బాధ్యతలే అప్పగించనున్నట్టు తెలిపారు.
చైనాలో ఆచూకీ లేని విశాఖ యువకుడు
* ఆరు మాసాలుగా లేని సమాచారం
* ఆందోళనలో తల్లిదండ్రులు
* కలెక్టర్, కమిషనర్‌కు ఫిర్యాదు
విశాఖపట్నం, జూన్ 17: చైనాలో ఉద్యోగం చేసేందుకు వెళ్లిన విశాఖ నగరగానికి చెందిన 26 ఏళ్ళ యువకుడి ఆచూకీ తెలియటం లేదు. ఆరు మాసాలుగా ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు సోమవారం జిల్లా కలెక్టర్ వి శేషాద్రిని ఆశ్రయించారు. ఇప్పటికే నగర పోలీసు కమిషనర్ శివధర్‌రెడ్డికి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. విశాఖ అల్లిపురం వెంకటేశ్వరమెట్టలో నివశిస్తున్న కన్నూరి రామారావు కుమారుడు వెంకటేశ్ ప్రైవేటు టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ, 2011 ఏప్రిల్ 21వ తేదీన హోటల్ మేనేజ్‌మెంట్ ఉద్యోగం నిమిత్తం చైనాకు వెళ్ళాడు. ఏడాదిన్నర పాటు ఉద్యోగం చేసిన తరువాత గత ఏడాది అక్టోబర్‌లో విశాఖలో తిరిగి వచ్చాడు. మళ్లీ చైనా వెళ్ళే ప్రయత్నంలో నవంబర్‌లో వీసాకు దరఖాస్తు చేసుకోవడంతో డిసెంబర్‌లో రావటంతో వెంటనే బయలుదేరివెళ్ళాడు. అక్కడ నుంచి ఈ ఏడాది జనవరి 5 తేదీ వరకు తల్లిదండ్రులు, సోదరిలతో ఫోన్‌లో మాట్లాడుతుండేవాడు. జనవరి 5 నుంచి ఫోన్ రాలేదు. ఇక్కడ నుంచి మాట్లాడేందుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. కనీసం ఈ నెల 13వ తేదీన పుట్టినరోజునైనా వెంకటేష్ నుంచి ఫోన్ వస్తుందని భావించిన కుటుంబ సభ్యులకు నిరాశే ఎదురైంది. అప్పటి నుంచి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్న కుటుంబ సభ్యులు నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఎంతకీ ఫలితంలేకపోవడంతో చివరకు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ వి శేషాద్రిని కలిసిన వెంకటేష్ తల్లి గంగమ్మ, సోదరి కనకమహాలక్ష్మి తమ గోడును వినిపించుకున్నారు. తన కుమారుని ఆచూకీ తెలిస్తే చాలని, ఉద్యోగం చేసుకుంటున్నాడనే సమాచారం తెలపాల్సిందిగా ఆమె కలెక్టర్‌ను వేడుకుంది. ఒకే మగ దిక్కు అయిన తన కుమారుడి ఆదాయంతోనే కుటుంబపోషణ ఉండేదని, ఎన్నో ఆశలు పెట్టుకున్న తామందరి పరిస్థితి దయనీయంగా మారిందని ఆమె కన్నీటి పర్యంతమైంది.
దేశంలో సైబర్ నేరాల్లో
రెండో స్థానంలో విశాఖ
* నగరంలో బీహారీలకు ప్రత్యేక శిక్షణ
* మొదటి స్థానంలో బెంగళూరు
* హైదరాబాద్‌లో గణనీయంగా తగ్గిన నేరాలు
* నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైం రికార్డ్స్ నివేదిక
విశాఖపట్నం, జూన్ 17: దేశంలో సైబర్ నేరాలు ఓపక్క తగ్గుముఖం పడుతుంటే, విశాఖలో వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైం రికార్డ్స్ సంస్థ తాజాగా వెల్లడించిన నివేదికలో సైబర్ నేరాల్లో బెంగళూరు నగరం మొదటి స్థానంలో నిలువగా, రెండో స్థానంలో విశాఖ నగరం నిలిచింది. సైబర్ నేరాలు అత్యధికంగా జరిగే రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, బెంగళూరు రెండో స్థానంలో, ఆంధ్ర ప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. ఒకప్పుడు సైబర్ నేరాలు ముంబై, బెంగళూరులతోపాటు హైదరాబాద్‌లో కూడా ఎక్కువగా జరిగేవి. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా తగ్గడం గమనార్హం. సైబర్ నేరాలు, వాటి తీరుతెన్నులు, ఇందుకు పాల్పడుతున్న వారి వివరాలను ఎన్‌బిసిఆర్ తెలియచేసిన వివరాలు అత్యంత ఆశ్ఛర్యకరంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సైబర్ నేరాలు ముఖ్యంగా వ్యక్తులు, ఆస్తులు, ప్రభుత్వాలపై జరుగుతుంటాయి. పిల్లలను, యువకులను సెక్స్ వైపు దృష్టి మళ్లించడం, పెద్దవారికి బెదిరింపు మెసేజ్‌లు పంపించడం, వారిని మానసికంగా హింసించడం, ఎటువంటి అడ్రస్ లేకుండా మహిళలకు మెసేజ్‌ల ద్వారా వేధించడం వంటివి జరుగుతున్నాయి. అలాగే ఆస్తులకు డాక్యుమెంట్లను అక్రమంగా చేజిక్కించుకోవడం, పెద్ద మొత్తంలో డబ్బు ఎర చూపుతూ మెసేజ్‌లు పంపి, వారి నుంచి లక్షల రూపాయల్లో డబ్బులు చేజిక్కించుకోవడం వంటివి జరుగుతున్నాయి. అలాగే కొంతమంది సినిమాలు డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఆకర్షిస్తునే, మనం ఆ పనిలో ఉండగా, మన కంప్యూటర్స్‌లోని ఫైల్స్ అక్రమంగా చేజిక్కించుకోవడం చేస్తున్నారు. ఆ తరువాత మన ఈ మెయిల్ అడ్రస్‌తో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. దేశ ద్రోహ నేరాలకు పాల్పడే వారు ఇటువంటి ఈమెయిల్స్ ద్వారానే మెసేజ్‌లు పంపుతున్నారు. అలాగే ప్రభుత్వ సమాచారం ఉన్న వెబ్‌సైట్‌లను హ్యాక్ చేయడం చేస్తున్నారు. ఇటువంటి సైబర్ నేరాల్లో పాల్గొనేవారిలో 18 నుంచి 30 సంవత్సరాలు మధ్య ఉన్న వారే ఎక్కువ మంది ఉండడం గమనార్హం. కొంతమంది హాబీగా చేస్తుంటే, మరికొంతమంది పనికట్టుకుని ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నట్టు ఎన్‌బిసిఆర్ పేర్కొంది.
2011తో పోల్చుకుంటే, 2012లో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా ఉంది. 2012లో దేశం మొత్తంమీద 1486 సైబర్ నేరాలు నమోదైనాయి. ఇందులో 908 మంది 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్కులే కావడం గమనార్హం. వీటిలో మహారాష్టల్రో 561 కేసులు నమోదైనాయి. గత ఏడాదితో పోల్చి చూస్తే 42.7 శాతం సైబర్ నేరాలు పెరిగాయి. కర్ణాటకలో 437, ఆంధ్ర ప్రదేశ్‌లో 454 కేసులు నమోదైనాయి. ఇందులో 125 మంది నడి వయస్కుల వారే కావడం గమనార్హం. అదే నగరాల వారీగా చూసుకుంటే, కర్ణాటకలో నమోదైన నేరాల్లో అత్యధికంగా బెంగళూరులోనే ఉన్నాయి. ఆ తరువాత విశాఖ నగరంలో 2011లో 107 కేసులు నమోదైతే, 2012లో 153 కేసులు నమోదైనాయి. అంటే ఈ క్రైం రేట్ 43 శాతం పెరిగింది. వీటిలో 89 కేసులు లైంగిక వేధింపులే కావడం గమనార్హం. ఈ ఏడాది దేశంలోని వివిధ నగరాల్లో నమోదైన సైబర్ నేరాల సంఖ్య ఈ విధంగా ఉంది. ఢిల్లీలో73, చెన్నైలో 15, హైదరాబాద్‌లో 2011లో 67 కేసులు నమోదు కాగా, 2012లో 42 కేసులు మాత్రమే నమోదైనాయి. హైదరాబాద్‌లో కేసు నమోదు ప్రతికూలంగా ఉందని రికార్డులు వెల్లడిస్తున్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో కూడా 2012లో ఏడు కేసులు నమోదైనాయి.
విశాఖ కేంద్రంగా ఎథికల్ హ్యాకింగ్‌లో శిక్షణ
విశాఖ కేంద్రంలో పైన పేర్కొన్న వివిధ సైబర్ నేరాల్లో (ఎథికల్ హ్యాకింగ్)లో శిక్షణ ఇస్తున్నారు. నగరంలో ఐదు కేంద్రాల్లో ఈ శిక్షణ జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. బీహార్‌కు చెందిన పలువురు యువకులు వచ్చి ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నట్టు తెలిసింది. పోలీసులు ఇటువంటి శిక్షణా సంస్థలపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది.
23న ముఖ్యమంత్రి రాక
* పలు ప్రారంభోత్సవాలు
* మోడల్ స్కూల్‌కు మోక్షం
* అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం ప్రారంభం
విశాఖపట్నం, జూన్ 17: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 23వ తేదీన ఇక్కడకు వస్తున్నారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆ రోజు ఉదయం ఇక్కడకు చేరుకునే ముఖ్యమంత్రి నేరుగా కశింకోటకు వెళ్తారని తెలిసింది. అక్కడి మోడల్ స్కూల్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఆ తరువాత అనకాపల్లిలో కొత్తగా మంజూరైన ఆర్డీవో కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఆ తరువాత ‘ఇందిరమ్మ పచ్చతోరణం’ కార్యక్రమాన్ని సిఎం లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిసింది. అధికారికంగా నిర్వహించే ఈ మూడు కార్యక్రమాలతోపాటు విశాఖ నగరంలో జరిగే మరికొన్ని కార్యక్రమాలను ఆయన చేతులమీదుగా ప్రారంభించవచ్చని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా విద్యా పక్షోత్సవాల్లో భాగంగా సిఎం పాల్గొనే అవకాశాలున్నాయి. అలాగే నగరంలో అదేరోజు నిర్వహించే ఒలింపిక్ రన్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఒకేరోజు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న దృష్ట్యా సంబంధితాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రభుత్వ అతిథిగృహం వద్ద పటిష్ట భధ్రతను ఏర్పాటు చేస్తున్నారు.
గెలుపే లక్ష్యంగా పనిచేయండి
ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి పిలుపు
విశాఖపట్నం, జూన్ 17: రానున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలకు సూచించారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులతో జరిగిన సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేల మధ్య ఏమైనా విభేదాలుంటే వెంటనే సరిచేసుకోవాలని, అలాగే మంత్రులతో ఉన్న పొరపొచ్చాలను కూడా సర్దుబాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే పార్టీకి పనికొచ్చే వారిని గుర్తించి తటస్థులుగా ఉండే వారిని పార్టీలోకి చేర్చుకోవాలని, పార్టీలోని వారికి మరింత ఉత్సాహం కల్పించాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థలు, మున్సిపాల్టీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి.బాలరాజు, ఎంపీ పురందీశ్వరితో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజక వర్గాల పార్టీ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.
గ్రామాల విలీనం లేనట్టే
విశాఖపట్నం, జూన్ 17: జివిఎంసిలో అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలతో పాటు మరో పది గ్రామాలను విలీనం చేయాలన్న ప్రతిపాదనకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. వీటి విలీనం పట్ల మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావులు తొందర పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో విలీనంపై అభ్యంతరాలు తెదలియజేయాలంటూ నోటిఫికేషన్ జారీ అయింది. దీనికి జూన్ 9 తేదీ గడువు విధించిన ప్రభుత్వం వేలాది వినతులను స్వీకరించింది. విలీనానికి అనుకూలంగా ఎక్కువ ధరఖాస్తులందాయి. భీమిలి నియోజక వర్గంలోని పది గ్రామాల విలీనాన్ని పంచాయితీరాజ్ శాఖ మంత్రి చాలా కాలంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఎన్నికలు జరిగే పంచాయతీల జాబితాలు కూడా పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. అందులో జివిఎంసిలో విలీనం కావాల్సిన పంచాయతీలు కూడా ఉన్నాయి. అయితే సోమవారం జరిగిన కేబినెట్ సమీక్ష సమావేశంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు ముందు మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో గ్రామ పంచాయతీలను విలీనం చేయరాదని తీర్మానించింది. ఇప్పటికే జివిఎంసిలో భీమిలి మున్సిపాలిటీ విలీనం ఇదమిద్ధంగా మారిన పరిస్థితుల్లో పంచాయతీల విలీనంపై నిషేధాన్ని విధిస్తూ కేబినేట్ తీర్మానించడం గమనార్హం. ఈ పరిస్థతుల్లో అనకాపల్లి, భీమిలి మున్సిపారిటీలను మాత్రమే విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తవౌతున్నాయి.
పిల్ కౌట్టివేత
భీమిలి మున్సిపారిటీని జీవిఎంసిలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ భీమిలికి చెందిన ఓ వ్యక్తి కోర్టులో దాఖలు చేసిన పిల్‌ని కొట్టి వేసినట్లు జివిఎంసి కమిషనర్ తెలిపారు. జివిఎంసిలో విలీనం చేయడం వల్ల భీమిలి చరిత్ర మరుగు పడుతుందని వేసిన పిటిషన్‌పై కోర్టు స్పందిస్తూ విలీనానికి చరిత్రకు సంబంధం లేదని కోర్టు పేర్కొన్నట్టు కమిషనర్ తెలియజేశారు.
పూజారి దంపతుల ఆత్మహత్య
నర్సీపట్నం, జూన్ 17: గాజువాక మహాగణపతి ఆలయం అర్చకుడు భార్యతో సహా ఏలేరు కాలువలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అందించిన వివరాలివి. అర్చకుడు అమలాపురం సత్యసుబ్రహ్మణ్యం(55), భార్య పద్మావతి(50)లు సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో మాకవరపుపాలెం సమీపంలోని కొండల అగ్రహం గ్రామం వద్ద ఏలేరు కాలువలో పడి ఆత్మహత్య చేసుకున్నారు. చినగంట్యాడ ఎర్రగెడ్డ కాలనీలో నివాసం ఉండేవారు. వీరి కుమారులు ఇద్దరూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం గాజువాకకు చెందిన సాంబశివరావు, సత్యసుబ్రహ్మణ్యం స్నేహితులు. సాంబశివరావువద్ద సుబ్రహ్మణ్యం గతంలో 13 లక్షల 50 వేల రూ.లు అప్పుగా తీసుకున్నాడు. అప్పును తీర్చమని చాలా కాలంగా సాంబశివరావు అడుగుతున్నారు. ఈ విషయమై గాజువాక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అప్పు తీర్చలేకపోయిన సుబ్రహ్మణ్యం హైదరాబాద్ వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల కింద తిరిగివచ్చిన సత్యసుబ్రహ్మణ్యం భార్యతో కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఏలేరు కాలువ గట్టు మీద ఉన్న సంచిలో పురుగు మందు డబ్బా, ఎలుకల మందు, డ్రింక్ బాటిల్ ఉన్నాయి. పురుగుల మందు, ఎలుకల మందు డ్రింక్‌లో కలిపి తాగిన తర్వాత కాలువలో దూకివుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇన్‌చార్జి ఎస్‌ఐ అశోక్‌కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి
* మంత్రి బాలరాజు
కొయ్యూరు, జూన్ 17: పాడేరు నియోజకవర్గ ప్రతినిధిగానే కాకుండా రాష్ట్ర మంత్రిగా తనకు అన్ని ప్రాంతాల అభివృద్ధి ముఖ్యమేనని గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పసుపులేటి బాలరాజు పేర్కొన్నారు. ఆదివారం మండల పర్యటనకు వచ్చిన మంత్రిని సమీప తూర్పగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలానికి చెందిన తె.దే.పా.నియోజకవర్గ కో ఆర్డినేటర్ శివరామచంద్రరాజుతో పాటు వదరనాపల్లి మాజీ సర్పంచ్ పెద్దిరాజు, ఎం.పి.టి.సి. చినతల్లి, దూసరపాము మాజీ సర్పంచ్ దుర్గా ప్రసాద్‌లతోపాటు పలువురు నేతలు, ప్రజలు కలిసి తమ సమస్యలు విన్నవించారు. దీనిపై స్పందించిన మంత్రి ఒక్క పాడేరు నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి పర్చడం తన బాధ్యత అన్నారు. విశాఖ - తూర్పుగోదావరి జిల్లాలను కలిపే రహదారికి బొర్రంపేట నుండి వరదనాపల్లికి ఐదు కిలో మీటర్ల మేర నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే అక్కడ ఉన్న అటవీ సంబంధ సమస్యలపై పరిష్కార దిశగా సంబంధిత అదికారులను ఆదేశించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికై నిరంతరం శ్రమిస్తోందన్నారు. గత పాలకుల ఆశ్రద్ధ వల్లే ఈ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని, కాంగ్రెస్ పాలనలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగిందన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో పలు రాజకీయ పార్టీల నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి గతలంలో వలె మోసపోకుండా అభివృద్ధికి పట్టడం కట్టాలని ఈసందర్భంగా మంత్రి కోరారు. ఈసందర్భంగా మంత్రికి జిల్లా పరిధి పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలు విన్నవించి పరిష్కరించాలని కోరారు.
మన్యం బంద్ విజయవంతం
పాడేరు, జూన్ 17: విశాఖ ఏజెన్సీలోని కాఫీ ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సి.పి.ఎం., గిరిజన సంఘం ఇచ్చిన మన్యం బంద్ పిలుపు మన్యంలో సోమవారం విజయవంతమయ్యింది. సి.పి.ఎం., గిరిజన సంఘం తలపెట్టిన మన్యం బంద్‌కు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆందోళనకారులు ఉదయం ఐదు గంటలకే రోడ్లపైకి చేరి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో ఏజెన్సీ అంతటా సోమవారం ఎటువంటి వాహనాలు తిరగక రవాణా పూర్తిగా స్థంబించింది. బంద్‌ను పురస్కరించుకుని పాడేరు ఆర్.టి.సి. డిపోకు చెందిన బస్సులను నిలిపివేశారు. ఆర్టీసీ బస్సులతోపాటు ఇతర అన్ని రకాల ప్రయివేట్ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. వివిధ రకాల పరీక్షలకు విశాఖపట్నం వెళ్లాల్సిన విద్యార్థుల సౌకర్యార్థ పాడేరు నుంచి విశాఖకు రెండు బస్సు సర్వీసులను ఆందోళనకారులు అనుమతించారు. బంద్ సందర్భంగా పాడేరు పట్టణంలోని అన్ని రకాల దుకాణాలను వ్యాపారులు స్వచ్చంధంగా మూసివేసి బంద్ పాటించారు. పాడేరులోని బ్యాంకులు, పెట్రోలు బంకులు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు నామమాత్రంగా పనిచేసాయి. స్థానిక ఆర్.టి.సి. కాంప్లెక్స్ ఎదుట ప్రధాన రహదారిపై ఆందోళనకారులు బైఠాయించి కాఫీ నిధులను స్వాహా చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు నినాదాలు చేశారు. ఇదిలాఉండగా ఏజెన్సీలోని హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల తదితర మండలాల్లో బంద్ సంపూర్ణంగా జరిగినట్టు సమాచారం అందింది. పెదబయలులో సోమవారం జరగాల్సిన వారపు సంత బంద్ కారణంగా రద్దయ్యింది. మన్యం బంద్‌ను పురస్కరించుకుని ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. స్థానిక డి.ఎస్.పి. ఆదినారాయణ, సి.ఐ. సి.హెచ్.గఫూర్ ఆధ్వర్యంలో పాడేరు పట్టణంలో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించి శాంతి భద్రతలను పర్యవేక్షించారు. పాడేరులో జరిగిన బంద్ కార్యక్రమంలో సి.పి.ఎం. జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, పాడేరు డివిజన్ కార్యదర్శి ఎం.సూర్యనారాయణ, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కిల్లో సురేంద్ర, సి.పి.ఎం. నాయకులు ఆర్.రవిశంకర్, ఎస్.పుణ్యారావు, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు వంజంగి కాంతమ్మ, పి.పాండురంగస్వామి పాల్గొన్నారు.
మృత్యువులోను వీడని స్నేహబంధం
చోడవరం, జూన్ 17: వారిద్దరూ ప్రాణస్నేహితులు చివరకు మృత్యువు కూడా స్నేహితులిద్దరినీ రోజు గడవకముందే ఒకే తరహాలో కబళించిన సంఘటన పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్నేహితుని అంతిమ యాత్రలో పాల్గొన్న మిత్రబృందం ఊహించని రీతిలో తమ కళ్లెదుటే మరో స్నేహితుడు రోడ్డుప్రమాదానికి గురై మృతి చెందడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఎవరి శాపం తగిలిందో ఇలాంటి పరిస్థితులు సంభవించాయంటూ ఘోషిస్తున్నారు. పట్టణంలోని కోటవీధికి చెందిన దాడి రామకృష్ణ(30) బజాజ్‌మోటార్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నౌడువీధికి చెందిన గుడివాడ సూర్యప్రకాష్ విశాఖలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ స్నేహితులిద్దరూ ప్రతీరోజు కలుసుకుని ముచ్చటించుకుంటేనే గాని ఇళ్లకు వెళ్లేవారు కాదు. ఆదివారం రాత్రి దాడి రామకృష్ణ తమ కంపెనీ పనిమీద విశాఖ వెళ్లి తిరిగి వస్తుండగా సబ్బవరం మండలం గొటివాడ జంక్షన్ వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టి మృత్యువాత పడ్డాడు. ఈ మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఈసంఘటన తెలుసుకున్న స్నేహితుడు గుడివాడ సూర్యప్రకాష్ అర్ధరాత్రి పూటే ఆసుపత్రికి వెళ్లి స్నేహితుని మృతదేహాన్ని చూసి బోరున విలపిస్తూ భార్యబిడ్డలతో ఉన్న రామకృష్ణను కాకుండా తాను మరణించి ఉంటే బాగుండేదని వాపోయాడు. తధాస్తు దేవతలు ఉన్నారో లేరో తెలియదు గాని సోమవారం ఉదయం రామకృష్ణ మృతదేహాన్ని చోడవరం తీసుకువచ్చి అంతిమ సంస్కారాలు గావించేందుకు శ్మశానానికి తరలిస్తుండగా ఈ శవయాత్రలో పాల్గొన్న సూర్యప్రకాకాష్ మంచినీళ్లు తాగేందుకు రోడ్డుదాటుతుండగా శిరిజాం గ్రామానికి చెందిన రౌతు జానకీరామ్ మోటార్ సైకిల్‌పై వస్తూ సూర్యప్రకాష్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో రోడ్డుప్రమాదానికి గురైన సూర్యప్రకాష్ తీవ్రంగా గాయపడటంతో ప్రభుత్వాసుపత్రికి తరలించినప్పటికీ మృతిచెందాడు. ఇతనికి భార్య కిరణ్ తప్ప వెరెవరూ లేరు. భార్య కూడా గత కొంతకాలంగా విశాఖలోని తమ కన్నవారి ఇంటిలోనే ఉంటుంది. అయితే తమ మిత్రులిద్దరూ ఒకేరీతిలో రోజు గడవకుండానే మృత్యువాత పడటం జీర్ణించుకోలేని స్నేహితులు బోరున విలపిస్తూ ఎవరి శాపం తగిలిందో కాని తమకు ఇలాంటి పరిస్థితి సంభవించిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 24గంటల్లోపే పట్టణానికి చెందిన స్నేహితులిద్దరూ రోడ్డుప్రమాదానికి గురై మృతిచెందడం పట్టణంలో తీవ్ర విషాదచాయలు నింపింది.
వివాహిత అనుమానాస్పద మృతి
సబ్బవరం, జూన్ 17: మండలంలోని నారపాడు పంచాయతీ పరిధిలోని అమ్ములపాలెంలో వివాహిత తుమ్మపాల శాంతి (23) సోమవారం ఉదంయ అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది. ఆదివారం రాత్రి అనకాపల్లి మండలం శంకరంలోని తన తండ్రితో సెల్‌ఫోన్‌లో మాట్లాడిన శాంతి సోమవారం ఉదయం 8 గంటలకు కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుని మృతి చెందిందనే వార్త ఆమె తల్లిదండ్రులను కలిచివేసింది. సంఘటనా స్ధలంలో శాంతి మృతదేహాన్ని చూసిన తల్లితండ్రులు తల్లిదండ్రులు కరణం వెంకటరమణ, రాధ తల్లడిల్లిపోయి తమ కుటుంబ బంధువైన కరణం ధర్మశ్రీ కి సమాచారం అందించారు. తమబిడ్డను చంపేసిన తర్వాతనే కిరోసిన్ పోసుకున్నట్లు అత్తింటివారు చెబుతున్నారన్నారు. కనీసం తమకు బయటి వ్యక్తులు ఫోన్ సమాచారం అందించే వరకు శాంతి భర్త కబురుపెట్టలేదన్నారు.తమ కుమార్తెశాంతికి ఏడాదిన్నర క్రితం 3లక్షల వరకట్నం,2తులాల బంగారం,బైక్,తదితర లాంఛనాలతో ఘనంగా పెళ్లిచేసి కాపురానికి పంపించామని వారు రోదిస్తూ తెలిపారు. సబ్బవరంలోరెడీమేడ్ గార్మెంట్స్ నడుపుకుంటున్న తమ అల్లుడు శివ ఆదివారం రాత్రి తన కుమార్తెతోఫోన్ మాట్లాడించినప్పుడు ఆమె అసహనంగా మాట్లాడి ముక్తసరిగా ఫోన్ పెట్టిందన్నారు.తమ బిడ్డ మృతి పై తమకు అనుమానాలున్నాయని, ఇరుగుపొరుగువారిని సైతం విచారించి తమకు న్యాయం చేయాలని మృతురాలి తండ్రి స్ధానిక ఎస్‌ఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్గొన్నారు. ఈమేరకు అనుమానాస్పద మృతి సెక్షన్ ఐపిసి 174కింద కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని ఎస్‌ఐ జి.గోవిందరావుతెలిపారు. అనకాపల్లిడిఎస్‌పి విఎస్‌ఆర్ మూర్తి పర్యవేక్షణలో,సబ్బవరం తహశీల్దార్ ఎం.నాగభూషణరావుసమక్షంలో సోమవారం అమ్ములపాలెంలో శాంతి మృత దేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టంకోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. డిసిసి అధ్యక్షుడు కరణం ధర్మశ్రీకి స్వయంగా మృతురాలి తండ్రి కరణం వెంకటరమణ పినతండ్రి అయినందున ఆయన పరామర్శించటంతోపాటు పోలీసులు,అధికారులతోమాట్లాడారు.
విజయమ్మ వెంట మంత్రి గంటా అనుచరులు
పట్టించుకోలేదని అలక
కశింకోట, జూన్ 17: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వెంట జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరులు ఆదివారం విజయనగరం బయలుదేరి వెళ్లారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలను మంత్రి గంటాశ్రీనివాసరావుగాని, నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రత్యూష భాస్కరరావుగాని అసలు పట్టించుకోకపోవడంతో వేరే పార్టీలోకి వెళ్లేందుకు కార్యకర్తలు సిద్దమవుతున్నారు. ముఖ్యంగా కశింకోటతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో విజయమ్మ పర్యటనకు గొబ్బూరుపాలెం, నరసాపురం గ్రామాలకు చెందిన కొంతమంది గంటా అనుచరులు సొంత ఖర్చులతో వాహనాలను ఏర్పాటు చేసుకుని మరి విజయనగరం వెళ్లారు. ఇటీవల మండల కాంగ్రెస్‌పార్టీ కమిటి ఏర్పాటులో కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత లేకుండా గతంలో ఉన్న ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలకే సముచిత స్థానం కల్పించారని సీనియర్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు గంటాపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా అసంతృప్తి కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ వారినే ప్రత్యుష భాస్కరరావు పట్టించుకుంటున్నారని తమకు ఏ విధమైన సహకారం అందజేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రెవెన్యూ,పంచాయతీ, పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యలను సైతం మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం మండల, జిల్లాస్థాయిలో ఉన్న నాయకులను తప్ప సామాన్యకార్యకర్తలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మాజీ ఎంపిపి, విశాఖ డెయిరీ డైరక్టర్ మలసాల ధనమ్మ, రమణారావులు అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. వీరితోపాటు ఉగ్గిని రమణమూర్తి, పిఎసిఎస్ మాజీ డైరక్టర్ సూరిశెట్టి ఆదిబాబు, తగరంపూడి గణపతి, కత్తిర శ్రీ్ధర్ కాంగ్రెస్‌పార్టీకి దూరంగా ఉంటున్నారు. మండల కమిటిలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు వేగి రామకోటేశ్వరరావుకు మినహా మిగిలిన వారంతా ప్రజారాజ్యంపార్టీకి చెందిన వారేనని సీనియర్ కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. కొంతమంది కాంగ్రెస్‌పార్టీకి చెందిన కార్యకర్తలు అనకాపల్లి మార్కెట్‌కమిటి చైర్మన్ మలసాల కిషోర్‌ను కలుస్తున్నట్లు తెలిసింది. ఆ పార్టీకి చెందిన మరికొంతమంది సీనియర్ నాయకులు మాజీ మంత్రి దాడి వీరభద్రరావును కలిసి స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు తెలిసింది. ఇదిఇలా ఉండగా మంత్రి గంటాశ్రీనివాసరావు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వేరే ప్రాంతానికి వెళ్లిపోటీచేస్తారని, ఇప్పటినుండే స్థానిక నాయకులతో టచ్‌లో ఉండటం మంచిదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మంత్రి గంటాశ్రీనివాసరావు నియోజకవర్గంలో పార్టీకేడర్ బీటలు వారుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
రాజధానిలో ఎయు అధికారులు బిజీబిజీ
* వర్శిటీ ఆర్థిక, విద్యా పరిస్థితులపై చర్చ
విశాఖపట్నం, జూన్ 17: ఆంధ్రా యూనివర్శిటీ అధికారులు సోమవారం హైదరాబాద్‌లో బిజీ బిజీగా గడిపారు. వర్శిటీలో పేరుకుపోతున్న అనేక సమస్యలపై వీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆంధ్రా యూనవర్శిటీని గట్టెక్కించేందుకు ప్రభుత్వ నిధులు రాబట్టేందుకు వైస్ చాన్స్‌లర్ రాజు గట్టి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఎయు అధికారులు ఫైనాన్స్ సెక్రటరీని కలిసి పరిస్థితిని వివరించారు. ఇక మంగళవారం ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి వై రామకృష్ణ, కాలేజియేట్ విద్యా కమిషనర్ కె సునీతను విసి రాజు కలవనున్నారు. ఈ నెలాఖరుకు రెక్టార్ ప్రసాదరావు, సిడిసి డీన్ భరతలక్ష్మి పదవీ విరమణ చేయనున్నారు. ఈ స్థానాలను ఎవరితో భర్తీ చేయాలన్న అంశాన్ని కూడా విసి సంబంధిత అధికారులతో చర్చించనున్నారు. అలాగే కొత్త విద్యా సంవత్సరం ఆరంభం కానుంది. అయితే, ఈ ఏడాది ఎయులో చాలా మంది ప్రొఫెసర్లు పదవీ విరమణ చేయనున్నారు. వీరి స్థానంలో టిచింగ్ అసోసియేట్స్‌ను నియమించాలా? లేక పదవీ విరమణ చేసిన వారినే ఆయా స్థానాల్లో కొనసాగించాలా? అన్న అంశంపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి.
ఫోర్జరీ సంతకాల్లో సిబ్బంది హస్తం?
* ‘పాస్‌పోర్టు’పై కొనసాగుతున్న సిబిఐ దాడులు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 17: పాస్‌పోర్టు సేవా కేంద్రంపై సిబిఐ దాడులు కొనసాగుతున్నాయి. స్లాట్ బుకింగ్ కోసం పాస్‌పోర్టు అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసిన విషయం బయటకు పొక్కడంతో సిబిఐ అధికారులు రంగంలోకి దిగి గత మూడు రోజులుగా దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే. అసలు ఈ ఫోర్జరీ సంతకాల వెనుక ఎవరి హస్తం ఉంది? తెర వెనుక ఎవరెవరు ఉన్నారన్న సమాచారాన్ని రాబట్టేందుకు సిబిఐ అధికారులు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వారు పాస్‌పోర్టు స్లాట్ బుకింగ్ విశాఖలోనే చేయించుకోవాలి. పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు తరలి వస్తుండడంతో స్లాట్ బుకింగ్ చాలా మందికి దొరకడం లేదు. దీన్ని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. పాస్‌పోర్టు సేవా కేంద్రంలో, పాస్‌పోర్టు కార్యాలయంలో సిబ్బందితో వీరికి లాలూచీలు ఉన్నట్టు తెలుస్తోంది. స్లాట్ బుకింగ్‌కు అసిస్టెంట్ పాస్‌పోర్టు ఆఫీసర్ సంతకం చేయాల్సి ఉంటుంది. అటువంటి సంతకానే్న ఫోర్జరీ చేయగలిగారంటే, ఈ నేరగాళ్లకు సిబ్బంది సహకారం కచ్చితంగా ఉండి తీరాలి. ఇప్పటికే 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న సిబిఐ, దీని వెనుక ఉన్న పెద్ద మనుషుల వివరాలను సేకరిస్తోంది. నేడో, రేపో వారిని బయటపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో పాస్‌పోర్టు కార్యాలయ సిబ్బందికి చమటలు పడుతున్నాయి. ఒకవేళ సిబిఐ ఈ కేసు చేధించగలిగితే, చాలా మంది నేరగాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పాస్‌పోర్టు కార్యాలయం వద్ద ఏజెంట్ల బెదడ కూడా వదలి అవకాశం ఉంది.
పేదలకు అండగా ఇందిరమ్మ పచ్చతోరణం
* 1600 లబ్ధిదారులకు ‘చెట్టుపట్టా’ల పంపిణీ
విశాఖపట్నం, జూన్ 17: పేదల నేరుగా ఉపాధి కల్పించే సదుద్దేశ్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ పచ్చతోరణం’ పథకం కింద పేద కుటుంబాలకు ‘చెట్టుపట్టా’ను కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ వి.శేషాద్రి తెలిపారు.