ఒంగోలు, ఫిబ్రవరి 27: వేసవి ప్రారంభంలోనే భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఈ ఎండల ధాటికి జిల్లా ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఫిబ్రవరి చివరిలోనే ఎండలు ఈవిధంగా ఉంటే ఇక రానున్న రోజుల్లో ఏవిధంగా ఉంటాయోనన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు. గత కొద్ది రోజుల నుండి 34 డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి 37 సెంటీగ్రేడ్‌ల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఉదయం పది గంటల తర్వాత బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొంది. కొంతమంది గొడుగుల సాయంతో రోడ్లపైకి వస్తున్నారు. ప్రధానంగా చెట్లను నరికివేయటం, వాతావరణంలో కాలుష్యం పెరగటం, మంచు కరిగిపోవటం వంటి పరిస్థితుల కారణంగానే ఎండలు ఈవిధంగా ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. గత సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీన గరిష్ఠంగా 32.9 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవగా ఈసంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీన 34 సెంటీగ్రేడ్‌లుగా నమోదైంది. గత సంవత్సరం 21వ తేదీన 31.9 ఉండగా ప్రస్తుతం 35.2, గత సంవత్సరం 22వ తేదీన 31.7 ఉండగా ప్రస్తుతం 34.8, గతంలో 23న 31.6 ఉండగా ప్రస్తుతం 33.6 గాను, 24వ తేదీన గతంలో 24.7 ఉండగా ప్రస్తుతం 36.7 గాను, 25వ తేదీన గతంలో 31.5 డిగ్రీలు ప్రస్తుతం 36.6 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా నమోదైంది. అలాగే గత ఏడాది 26వ తేదీన 31.2 డిగ్రీలు ఉండగా ప్రస్తుతం 37.2 డిగ్రీలు, ప్రస్తుతం 27వ తేదీ సోమవారం 36.3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటికే మంచినీటి వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. శీతలపానీయాల షాపులు భారీగా వెలిశాయి. ఇదిలావుండగా జిల్లాలో గత కొద్ది రోజుల నుండి విద్యుత్ కోతలు పెరిగిపోయాయి. దీనికితోడు జిల్లావ్యాప్తంగా , అనధికార విద్యుత్ కోతలు అమలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు పరుగులు తీస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడు విద్యుత్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా మున్సిపాలిటీల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల వరకు విద్యుత్ కోతలను విధిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే నెల నుండి జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థులు రాత్రివేళ విద్యుత్ కోతలతో అవస్థలు పడుతున్నారు. ఇదిలాఉండగా రానున్న రోజుల్లో ఎండలు భగ్గుమంటే భూగర్భ జలాలు సైతం అడుగంటిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈపాటికే కొన్ని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. మొత్తంమీద వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా జిల్లావ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి.
అల్లాడుతున్న ప్రజలు
english title:
bhaggumantunna endalu
Date:
Tuesday, February 28, 2012