ఒంగోలు, ఫిబ్రవరి 27: దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా మంగళవారం ఒంగోలు నగరంలో విజయవంతం చేసేందుకు సన్నాహాలు పూర్తిచేసినట్లు సిఐటియు ఒంగోలు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు దామా శ్రీనివాసులు, బి వెంకట్రావులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల రోజులుగా పట్టణంలోని సిఐటియు అనుబంధ యూనియన్ల జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించి సమ్మె ప్రాధాన్యతను వివరించి సమ్మె నోటీసులు ఇచ్చినట్లు వారు తెలిపారు. 20 వేల కరపత్రాలు, 2 వేల గోడపత్రికల ద్వారా నగరంలోని అన్ని కార్యాలయాలు, అన్ని వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించి సమ్మెను విజయవంతం చేయాలని కోరినట్లు తెలిపారు. నగరంలోని కూడలి ప్రాంతాలలో బ్యానర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమ్మె రోజున సిఐటియు అనుబంధం సంఘాల కార్యకర్తలంతా సిఐటియు కార్యాలయం నుండి ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకుని అక్కడ జరిగే సభలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.
సార్వత్రిక సమ్మెకు దళిత సంఘాలు మద్దతు
సార్వత్రిక సమ్మెకు దళిత సంఘాలు మద్దతు ప్రకటించాయి. సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో సార్వత్రిక సమ్మెలో దళిత సంఘాల భాగస్వామ్యంపై జరిగిన సమావేశంలో దళిత సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు మద్దతు ప్రకటించారు. సమావేశంలో దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల పట్ల సామాజిక బాధ్యతతో వ్యవహరించకపోవటం వల్లే కార్మిక రంగంలో అసంఘటిత కార్మికులు పెరిగినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ బాధ్యతల నుండి తప్పుకోవటం వల్లే కార్మికులు దోపిడీకి గురవుతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాలలో భూములు లేక, ఉపాధి అవకాశాలు లేక దళిత బహుజనులు అసంఘటిత కార్మికులుగా మారారన్నారు. దేశంలో అసంఘటిత కార్మికులుగా ఉన్నవారిలో దళిత బహుజనులే అధికంగా ఉన్నారని చెప్పారు. అసంఘటిత కార్మికుల కోసం సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని నాగేంద్రరావు డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధి భద్రత చట్టాలు లేనందున దళిత బహుజనుల శ్రమను పెట్టుబడిదారులు దోచుకుంటున్నారన్నారు. అంఘటిత కార్మికుల కోసం కేంద్రం చట్టం చేయటం కోసం ఒత్తిడి చేసే దిశగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు దళితులు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అసంఘటిత కార్మికులకోసం కేంద్రం చట్టం తీసుకొస్తే ఆటో కార్మికులు, ముఠా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు సామాజిక, ఆర్థిక భద్రత ఉంటుందన్నారు. దళిత బహుజన కార్మికులకోసం దళిత సంఘాలు సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పివి రావు మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దాసరి మాల్యాద్రి, రజక రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు పొటికలపూడి జయరాం, గ్రామీణ దళిత మహాసభ జిల్లా అధ్యక్షులు దుగ్గిరాల విజయ్‌కుమార్, అంబేద్కర్ యువజన సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షులు మిట్నసల రంగయ్య, దళితసేనా నాయకులు మల్లెల దిలీప్, దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు దార్ల కోటేశ్వరరావు, దళిత కళామండలి జిల్లా అధ్యక్షులు దాసరి కోటేశ్వరరావు, రజక యువజన సంఘం జిల్లా అధ్యక్షులు వేములపాటి ప్రసాద్, బేడజంగం జిల్లా అధ్యక్షులు ఉద్దంటి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా మంగళవారం ఒంగోలు నగరంలో విజయవంతం చేసేందుకు సన్నాహాలు పూర్తిచేసినట్లు
english title:
neti samme
Date:
Tuesday, February 28, 2012