కందుకూరు, ఫిబ్రవరి 27: వేసవి కాలానికి ముందే సూర్యుడు మండుతున్నాడు. భూగర్భ జలాలు అడుగంటి నీటి పథకాలు ఒట్టిపోతున్నాయి. తాగునీటి ఎద్దడి అధికమై దాహార్తితో ప్రజలు అల్లాడుతున్నారు. జిల్లాలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాలు అలంకార ప్రాయంగా మారుతున్నాయి. ఈ పథకాలకు వెచ్చించిన వందల కోట్ల రూపాయలు నీటిపాలు అవుతున్నాయి. భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన స్కీములు పదుల సంఖ్యలో కూడా గ్రామాలకు తాగునీరు అందించలేని దుస్థితి నెలకొంది. నిర్వాహణ లోపం వీటికి శాపంగా మారింది. దీంతో వేసవి వచ్చిందంటే చాలు ప్రజలు గుక్కెడు నీటికోసం పడరానిపాట్లు పడుతున్నారు. ఇప్పటికీ అనేక గ్రామాల్లో ట్యాంకర్లే ద్వారా సరఫరా చేసే నీరే దిక్కు అవుతోంది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం అడుగు ముందుకు వేయడం లేదు. వేసవికి ముందే జిల్లాలోని అనేక గ్రామాల్లో ప్రజలు నీటికోసం పరితపిస్తున్నారు. జిల్లాలో 33 సామూహిక, 1672 సాధారణ రక్షిత నీటి పథకాలు ఏర్పాటు చేశారు. 22,565 బోర్లు, 7,800లకుపైగా బావులు ఉన్నాయి. వీటికోసం ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. అయినా జిల్లాలో 2,342 ఆవాసాలలో 727 ఆవాసాలకు మాత్రమే పూర్తి స్థాయిలో తాగునీరు అందుతుంది. గ్రామాలకు వౌలిక వసతులు కల్పించేందుకు రూపొందించిన ఇందిరమ్మ పథకం నీరుగారిపోయింది. ఈ పథకంలో 7 అంశాలలో ప్రధానమైంది ప్రజలకు తాగునీటి కల్పన. దీనికోసం అట్టహాసంగా ప్రజాధనంతో కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామాలలో తాగునీటి పథకాలను నిర్మించారు. సురక్షితమైన నీరు ఇస్తామని చెప్పి ప్రజాప్రతినిధులతో హడావుడిగా ప్రారంభోత్సవాలు చేశారు. ఆసమయంలో అరకొరగా పనిచేసిన పథకాలు తరువాత పనిచేసిన దాఖలాలు లేవు. అధికారుల పర్యవేక్షణ లోపం, గుత్తెదారుల స్వార్థంతో పథకాలను నాశిరకంగా నిర్మించారు. జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ నీటి పథకాలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. ఎన్నో ఎళ్ళ నుంచి ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు చమరగీతమే అనుకున్న వారంతా వైఎస్‌ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందిరమ్మ పేరున భారీ పథకానికి శ్రీకారం చుట్టారు. 2005లో జిల్లాలో 13.70కోట్ల రూపాయలతో ఇందిరమ్మ పథకాలను చేపట్టారు. ఒకటి రెండు విడతలుగా ఈ పథకాలను పూర్తి చేశారు. 105 పథకాలు అట్టహాసంగా ప్రారంభించినా ఏ ఒక్కటీ సక్రమంగా పనిచేయడం లేదు. ఆనిధులు అన్ని బూడిదలో పోసిన పన్నీరుగా తయారయ్యాయి. జిల్లాలోని అత్యధిక ప్రాంతాల ప్రజలు గుక్కెడు నీటికోసం తల్లడిల్లిపోతున్నారు. వేసవిలో ఏటా నీటికి ఇక్కట్లు షరామామూలుగా మారుతున్నాయి. రక్షిత నీరు కాకపోయినా, తాగేందుకు ఉపయోగపడే నీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వేల కోట్ల రూపాయలు వెచ్చించి, పెద్ద, చిన్న తాగునీటి పథకాలు ఏర్పాటు చేసినా వాటి నిర్వాహణ లోపం ప్రజలకు శాపంగా మారుతోంది. అనేక పథకాలు మూలన పడుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త పథకాలను ప్రభుత్వం మంజూరు చేస్తున్నా, వాటి నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతూనే ఉంది. ఈఏడాది వేసవిలోనూ జిల్లా ప్రజానీకం గుక్కెడు నీటికోసం గొంతెండిపోక తప్పని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి నెలలోనే ఎండలు అధికంగా ఉన్నాయి. చెరువులు, కుంటలు, బావులు ఇప్పటికే ఎండిపోయాయి. ఈఏడాది వర్షాభావ పరిస్థితి ఎక్కువగా ఉంది. దాంతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు సంబంధిత అధికారులు సిద్ధం చేసిన ప్రణాళికలు పరిశీలిస్తే ఈ పరిస్థితి అర్థం అవుతుంది. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో కలిపి ఈఏడాది నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు సుమారు 11.30కోట్ల రూపాయలతో సంబంధిత అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అందులో సుమారు 8.40కోట్ల రూపాయలు ట్యాంకర్లతో నీటి సరఫరాకు ప్రతిపాదించడమే గమనర్హం. దీనిని బట్టి చూస్తే తాగునీటి పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం అవుతోంది. జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉన్న వనరులు, కొత్త పథకాల నిర్వాహణపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పలు ప్రాంతాలలో నిర్వాహణ లోపం ప్రజలకు శాపంగా మారింది. కందుకూరు నియోజకవర్గ పరిధిలో నీటి ఎద్దడి నివారణ కోసం 2008జూలై 18న 10కోట్ల రూపాయలతో పథకం మంజూరు కాగా, అదే ఏడాది డిసెంబర్ 24న ఆపనికి అగ్రిమెంట్ పూర్తి అయింది. ఆప్రకారం 2009సెప్టెంబర్ 23వ తేది నాటికి ఆపని పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటికీ ఆపని కొనసాగుతూనే ఉంది. మూడుసార్లు గడువు పొడిగించినా ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. జిల్లాలోని 536 ఆవాసాలకు తాగునీరు అందించేందుకు 385కోట్ల రూపాయలతో చేపట్టిన 15రక్షిత నీటి పథకాల పనులు అడుగు ముందుకు పడడం లేదు. ప్రపంచ బ్యాంకు నిధులతో జిల్లాకు మంజూరైన 122కోట్ల రూపాయల పథకంలో తొలి దశ టెండర్లు కూడా పూర్తికాని పరిస్థితి నెలకొంది. పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన తాగునీటి నిర్వాహణ నత్తనడకన సాగుతోంది. కరవు ప్రాంతంగా ప్రకటించిన జిల్లాలో తాగునీటి సమస్యలు జఠిలంగా మారుతున్నాయి. పైసలు ఇవ్వనిదే గుక్క తడిసే పరిస్థితి లేదు. వేసవికి ముందే కార్యచరణ ప్రణాళికలు ఘనంగా తయారు చేయడం, ఆతరువాత నిధుల కోసం ప్రయత్నించకపోవడం జిల్లాలో ప్రజాప్రతినిధులకు రివాజుగా మారింది. ఇప్పటికే జిల్లాలో 15మండలాల్లో 33గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తుగా వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు అసంపూర్తిగా మిగిలిపోయిన రక్షిత మంచినీటి పథకాలను పూర్తిచేసి జిల్లా ప్రజలను తాగునీటి ఇక్కట్ల నుంచి బయట పడవేయాలని జిల్లా ప్రజానీకం ముక్త కంఠంతో కోరుతుంది.
అడుగంటిన భూగర్భ జలాలు దాహార్తితో అల్లాడుతున్న ప్రజలు
english title:
neeti yeddadi
Date:
Tuesday, February 28, 2012