కందుకూరు, ఫిబ్రవరి 27: జిల్లాలో ప్రధాన పట్టణాలు, నగరాలకే పరిమితమైన రియల్ ఏస్టేట్ రంగం నేడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ భూములుగా మార్చి వ్యాపారం చేస్తున్నారు. కొత్త లేఅవుట్‌లలో పరిమితిని కుదింపు చేస్తూ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వులు అటు వ్యాపార వర్గాల్లో, ఇటు మధ్యతరగతి ప్రజల్లో నూతనోత్సాహం నింపింది. ఇప్పటికే పట్టణాల్లో పరిమితుల కట్టడిలో కష్టాలు పడుతున్నామని భావిస్తున్న వ్యాపారులకు ఈ జీవో ఎంతో ఊరటనివ్వగా, సామాన్యుడి సొంతింటి కల రానున్న రోజుల్లో నిజం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ నిబంధనలతో ఇబ్బందికరంగా వ్యాపారాలు సాగిస్తున్న పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఊరటనిచ్చాయి. అంతేగాకుండా పంచాయతీ పరిధిలోని లేఅవుట్‌లకు 160చదరపు మీటర్లు ఉండగా, దానిని 120 చదరపు మీటర్లకు కుదించింది. దీంతో పట్టణాలను వదిలి పల్లెల్లో వ్యాపారాలు చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పలువురు అనేక ప్రాంతాల్లో పంట పొలాలను ప్లాట్లుగా మార్చి అమ్మకాలు చేస్తుండగా, మరికొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు పెరుగుతున్న జనాభా దృష్ట్యా పట్టణ శివారు ప్రాంతాలపై మొగ్గు చూపుతున్నారు. ప్లాట్లు, లేఅవుట్‌లపై స్పష్టమైన అవగాహన లేని మధ్యతరగతి ప్రజలు స్థలం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా, కొందరు వ్యాపారులు వాయిదాల పద్ధతిపై ప్లాట్లు ఇచ్చేందుకు కొన్ని పథకాలను రూపొందించారు. మధ్య తరగతి వారిని ఆకర్షించేందుకు ఇప్పటికే లక్ష రూపాయలకు ఐదు ప్లాట్లు, నాలుగు ప్లాట్లు, మూడు ప్లాట్లు అంటూ కొత్తకొత్త పథకాలతో ప్రజలను ఆకర్షిస్తున్నారు. దీంతో ఇకపై రియల్ ఎస్టేట్ రంగం జిల్లా వ్యాప్తంగా మరింత ఊపందుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరోవైపు అధికార యంత్రాంగం మాత్రం అనధికార లేఅవుట్‌లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అప్రూవల్ లేఅవుట్‌లపై వివరాలను సంబంధిత పంచాయతీరాజ్, పురపాలక సంఘాలలో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. అంతేగాకుండా నిబంధన ప్రకారం రోడ్డు నిర్మాణంలో పార్కు, డ్రైనేజి, ప్రజోపయోగార్థం విడిచిపెట్టాల్సిన ఖాళీ స్థలాల కొలతలు లేవని పేర్కొంటున్నారు.
లేఅవుట్ కొలతల్లో కుదింపు
ప్రభుత్వ జిఓ నెం.67 ప్రకారం నిబంధనలు 2006 నుంచి అమలులో ఉన్నా, పెద్దగా ప్రచారం లేదు. ఆయా ప్రాంతాల పరిస్థితులు, భూమి ధర ఆధారంగా అధికారులు దీన్ని 1610 మీటర్లుగా మాత్రమే అనుమతి మంజూరు చేశారు. కాగా, ప్రస్తుతం పెరుగుతున్న భూమి ధరను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం లేఅవుట్ కొలతల్లో కొద్ది మార్పులను చేసింది. దీంతో ప్రస్తుతం పంచాయతీ పరిధిలో 100చదరపు మీటర్ల నుండి అనుమతి లభించనుంది. కాగా, ప్రస్తుతం సవరించిన నిబంధననలతో పేద, మధ్యతరగతి వారికి ఊరటనిచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అయితే దీనిని ఆయా ప్రాంతాల భూమి ధరను బట్టి పరిగణలోకి తీసుకోనున్నట్లు వారు పేర్కొంటున్నారు. ప్రధానంగా భూమి ధర అధికంగా ఉన్న ప్రాంతాల్లో వెసులుబాటుకు అనుమతి ఇవ్వనున్నట్లు, అంతేతప్ప వ్యాపార ధోరణితో వ్యవహరిచే లేఅవుట్‌లకు కొత్త నిబంధనలు తప్పవని అధికారులు అంటున్నారు. పేదలకు సొంత ఇంటిని నిర్మించుకొనే అవకాశం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అన్న దిశగా ప్రభుత్వం ఉందని అధికారులు అంటున్నారు.
వ్యాపార వర్గాలు, మధ్యతరగతి ప్రజలకు ఊరట
english title:
lay outs kudimpu
Date:
Tuesday, February 28, 2012