గుంటూరు, జూన్ 24: రాష్ట్రంలో ప్రజలు నానాకష్టాలు పడుతుంటే పట్టించుకోని అధికారంలోని కాంగ్రెస్ పార్టీకి, ప్రజాసమస్యలపై పోరాడని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలు ఎందుకు ఓటెయ్యాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో సోమవారం జరిగిన గుంటూరు, ప్రకాశం జిల్లాల పార్టీ ప్రాంతీయ సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సిద్ధంగా లేరని, పరిపాలనపై పట్టులేని ఆయన ఎన్నికలు ఏవిధంగా నిర్వహిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్‌ఆర్‌సిపి ఎక్కడ ఘన విజయం సాధిస్తుందోనన్న భయంతో వెనకడుగు వేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సిపి రెండేళ్లు పూర్తిచేసుకుని ప్రత్యర్థి పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోందని ఆమె అన్నారు. పార్టీ నాయకుల మధ్య సమన్వయం కొరవడిందని, దీన్ని గుర్తెరిగి పార్టీ శ్రేణులు ప్రతి పంచాయతీలో గెలుపు సాధించాలని పిలుపునిచ్చారు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉచిత విద్యుత్‌కు తూట్లు పొడుస్తున్నారని, ఆరోగ్యశ్రీ పథకంలో 90 ఆసుపత్రులను తీసివేశారని, ఇందిరమ్మ గృహాలకు నిధులు మంజూరు చేయడం లేదని, మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పి డ్వాక్రా గ్రూపులను నిర్వీర్యం చేస్తున్నారని విజయమ్మ ఆరోపించారు. పదవిని కాపాడుకోడానికి మాత్రమే సిఎం కిరణ్ ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని, ఇక ఆయన రైతులను ఏం పట్టించుకుంటారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి, మామ ఎన్‌టిఆర్‌పై పోటీకి సిద్ధమని చెప్పి టిడిపి అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలో చేరి మామనే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి, పార్టీ జెండాను లాక్కున్న చంద్రబాబు రాజకీయ నీచచరిత్ర కుట్రలు, కుతంత్రాలతో ముడిపడి ఉందని విజయమ్మ తీవ్రంగా ఆరోపించారు. రైతులను జైలులో పెట్టించిన చంద్రబాబు నేడు రుణమాఫీ అంటూ కపట ప్రేమను ఒలకబోస్తున్నారన్నారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసిన చంద్రబాబు నేడు అధికారంలోకి వస్తే బెల్టుషాపులను తీసివేస్తామని అనడం కేవలం ప్రజలను మోసగించేందుకేనన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబు ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేశారని, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థను మూసివేసి నూజివీడు సీడ్స్‌కు కాంట్రాక్టులు ధారదత్తం చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీకి హోల్‌సేల్‌గా అమ్మేస్తే, చంద్రబాబు టిడిపిని రిటైల్‌గా అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. సిబిఐ ద్వారా కేసులను బనాయించి మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, ములాయంసింగ్ యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించారు. నీతిగా వ్యాపారం చేసుకునే జగన్‌ను జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కుట్రలు, కుతంత్రాలు పనే్న కాంగ్రెస్, టిడిపిలకు ఓటు ఎందుకు వేయాలో ప్రజలు ఆలోచించాలని విజయమ్మ కోరారు.
గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రాంతీయ
సదస్సులో మాట్లాడుతున్న వైఎస్ విజయమ్మ
కాంగ్రెస్, టిడిపిలపై విజయమ్మ ధ్వజం
english title:
a
Date:
Tuesday, June 25, 2013