Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

కళ్లెదుటే జల సమాధి

విజయవాడ, జూన్ 24: ఐదేళ్లుగా ఉజ్జయినీ, బదరీనాథ్ వంటి ద్వాదశ జ్యోతిర్లింగాల పుణ్యక్షేత్రాల్లో యాగాలు చేయిస్తున్న తాను జూలై 10నుంచి వారం రోజులపాటు కేదార్‌నాథ్‌లో పవిత్ర యాగ నిర్వహణ కోసం స్థానిక పురోహితుడు వంశీకృష్ణతో కలిసి వెళ్లానని, వరదల బీభత్సంలో తామిద్దరమూ బతికి తిరిగిరావటం పునర్జన్మగా భావిస్తున్నామని నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారి సతీష్ అగర్వాల్ అన్నారు. ఆకలి దప్పులతో నిద్రహారాలు లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అష్టకష్టాలతో తాము నగరానికి చేరగలిగామని చెప్పారు. వ్యయప్రయాసలతో ఢిల్లీకి చేరి అక్కడి నుంచి విమానంలో నగరానికి చేరుకున్న అగర్వాల్ సోమవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మీడియా ప్రతినిధులతో కన్నీటి పర్యంతమవుతూ మాట్లాడారు. ఈ నెల 15న రాత్రికి తాము కేదార్‌నాథ్ వెళ్లామన్నారు. ఆ సమయంలో తమవెంట 110 మంది యాత్రికులు ఉంటే వారిలో 20మందికి పైగా కళ్లెదుటే జలపాతాల్లో కొట్టుకుపోయారని ఆయన విలపించారు. రుద్రప్రయాగ, గౌరీఖండ్, కేదార్‌నాథ్ అనే గ్రామాల్లో వ్యాపారస్తులు సహా 10వేల మంది పైనే ఉన్నారని, 16న ఉదయం దిగువకు చేరుకుందామని బయలుదేరితే కుంభవృష్టితో రహదారులు కొట్టుకుపోయాయని తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో నడవటానికి దారి కూడా లేకుండాపోయిందన్నారు. అంత ఎత్తులో వృక్షాలు లేక ఆక్సిజన్ అందక వృద్ధులు ఇబ్బందులు పడ్డారన్నారు. కేదార్‌నాథ్‌కు 14 కి.మీల దూరంలో మూడు షెల్టర్లలో భయంకరమైన శబ్దాల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నాలుగు రాత్రులు గడిపామన్నారు. బైటపడదామని దారితప్పి ఓ ప్రాంతానికి చేరితే దుకాణాలు కనిపించాయని, అక్కడ బిస్కెట్లు, తాగునీరు, కూల్‌డ్రింక్‌లు లభించాయన్నారు. 19వరకు ఎలాంటి హెచ్చరికలు లేవని, 19న మాత్రం రెండు హెలికాప్టర్‌లు దర్శనమిచ్చాయని చెప్పారు. అప్పటికి మార్గంమధ్యలో వందలాది మంది కన్పించడంతో నేవీ అధికారులు నడకమార్గం చూపించి తమను దారితప్పించి మరో రెండు రోజులు వేధించారని ఆయన విమర్శించారు. 20న 20మంది సైనికులు సహాయక చర్యలు చేపట్టారని, హెలికాప్టర్‌ల నుంచి ఆహార పొట్లాలు విసురుతున్నా అవి కొండచరియల్లోనే పడిపోయాయని వివరించారు. హరిద్వార్ సమీపంలో కేవలం గుజరాతీయులకే సహాయం, పునరావాసం లభించాయని ఆయన చెప్పారు. మైక్‌ల ద్వారా ఎక్కడెక్కడ వసతిగృహాలు, భోజన సదుపాయాలున్నాయో వారికి చెబుతూవచ్చారే తప్ప తమను పట్టించుకోలేదన్నారు. నరకయాతన అనుభవించాం ఎమ్మిగనూరు: ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తాము నరకయాతన అనుభవించామని బాధితులు వాపోయారు. కేధార్‌నాథ్, బద్రీనాథ్ దర్శనానికి ఎమ్మిగనూరు ఉప్పరిపేట వాసులు పూల వీరేష్, అతని భార్య పూల శారద, పిల్లలు పవన్, సిద్దార్థ, అక్షయ కెకె ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లారు. వరదల్లో చిక్కుక్కున్న వీరు అష్టకష్టాలు పడి కట్టుబట్టలతో సోమవారం ఎమ్మిగనూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా వీరేష్ విలేఖరులతో మాట్లాడుతూ ఈనెల 4న కుటుంబ సభ్యులతో కేధార్‌నాథ్ దైవదర్శనార్థం కెకె ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లామన్నారు. 16వ తేదీ గౌరీఖండ్ చేరుకుని దేవుని దర్శనం చేసుకున్నామన్నారు. అనంతరం అక్కడే నాలుగు అంతస్తుల లాడ్జిలో దిగామన్నారు. కొద్దిసేపటికే వరదలు ముంచెత్తడంతో అక్కడి వంతెన కొట్టుకుపోయిందన్నారు. దీంతో తామంతా భయంతో లాడ్జి వెనుకభాగం గుండా కొండప్రాంతంలోకి పరుగులు తీశామన్నారు. తమ కళ్లెదుటే గౌరీకుండ్‌లో గుడివాడకు చెందిన 10 మంది, విజయవాడకు చెందిన 44 మంది, హైదరాబాద్ వారు నలుగురు వరదలో కొట్టుకుపోయారన్నారు. కొండల్లోనే నిద్రహారాలు లేక రెండు రోజులు గడిపామన్నారు. చలికి తట్టుకోలేక పిల్లలు గజగజవణికిపోతుంటే గుర్రాలకు కప్పే దుప్పట్లతో వారిని కాపాడుకున్నామన్నారు. అక్కడి నుండి నాలుగు కిలోమీటర్లు కొండల్లో నడిచామన్నారు. కూతురు అక్షయకు కడుపునొప్పి వచ్చినా అలాగే ముందుకు నడిచామన్నారు. అనంతరం హెలిక్యాప్టర్‌లో ఢిల్లీ చేరుకున్నామన్నారు. కెకె ఎక్స్‌ప్రెస్‌లో ఎమ్మిగనూరు చేరుకున్నామన్నారు. ఆకలితో అలమటించాం గుంతకలు: వరదల్లో చిక్కుకుని వారం రోజులపాటు ఆకలి దప్పులతో అలమటిస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బితుకుబితుకు మంటూ గడిపిన తమపట్ల సహాయక బృందాలు వివక్ష చూపాయని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వృద్ధులు ఉత్తరాఖండ్ సంఘటనను తలుచుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. సోమవారం ఉదయం కెకె ఎక్స్‌ప్రెస్ రైలు దిగిన నంద్యాలకు చెందిన తిరుపాలయ్య, అతని భార్య జయమ్మ విలేఖరులతో తమగోడు వెల్లబోసుకున్నారు. ఉత్తరకాశీ యాత్రకు వెళ్లిన తాము చార్‌ధాం వద్ద వరదల్లో చిక్కుకున్నామన్నారు. భయానక వాతావరణంలో నీళ్లలో తేలియాడుతున్న శవాల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపామన్నారు. హెలిక్యాప్టర్‌లో వచ్చిన సహాయక బృందాలు తెలుగువారి పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించాయని జయమ్మ పేర్కొన్నారు. సహాయక బృందాలను చూడగానే ప్రాణాలు లేచి వచ్చినట్లయ్యిందన్నారు. బృందాలు బాధితులకు బిస్కెట్లు, తాగునీరు అందిస్తుంటే వరుసలో నిలుచున్నామన్నారు. అయితే అందరికీ బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేసిన సహాయక బృందాలు తెలుగువారికి మాత్రం రెండంటే రెండు బిస్కెట్లు, తీర్థం పోసినట్టుగా తాగునీరు అందించారన్నారు. మా వాళ్లను త్వరగా పంపే ఏర్పాట్లు చేయండి - ఉత్తరాఖండ్ సిఎంకు కిరణ్ ఫోన్ - ఆంధ్రభూమి బ్యూరో విశాఖపట్నం, జూన్ 24: ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని త్వరగా ఆంధ్రప్రదేశ్‌కు పంపించేలా ఏర్పాట్లు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణను రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. ఆదివారం రాత్రి విశాఖ సర్క్యూట్ హౌస్‌లో బస చేసిన ఆయన సోమవారం ఉదయం ఫోన్‌లో ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న తెలుగు వారి గురించి ఆరా తీశారు. ఆ తరువాత ఢిల్లీ ఎపి భవన్‌లో వరద బాధితులకు అందుతున్న సహాయ సహకారాల గురించి మంత్రులు శ్రీ్ధర్‌బాబు, దానం నాగేంద్రను అడిగి తెలుసుకున్నారు. 3 రోజులూ చెట్టుపై ఉన్నాం విజయవాడ, జూన్ 24: బావాజీపేట నుంచి 10మంది యాత్రికులు యాత్రకు వెళ్లగా ఐదుగురి ఆచూకీ లభించింది. వీరిలో ఒకరైన అన్నపూర్ణ నగరానికి చేరుకుని మృత్యువు కోరల నుంచి తాను ఎలా బైటపడిందీ వివరించారు. వరద ధాటికి తట్టుకోలేక మరో ఆశ్రయం లేక మూడురోజులపాటు చెట్టుపై వుండి ప్రాణాలు కాపాడుకోగలిగానని అన్నపూర్ణ కన్నీటి పర్యంతవౌతూ చెప్పారు. కేదార్‌నాథ్‌కు డోలీలో వెళుతుంటే ఒక్కసారిగా రెండంతస్తుల మేర వరద ఉద్ధృతి పెరగటంతో డోలీ మోసేవారు తనను వదిలి వెళ్లిపోయారని చెప్పారు. దీంతో దిక్కుతోచక సమీపంలోని చెట్టెక్కానని, తర్వాత హెలికాప్టర్ సిబ్బంది సాయంతో బైటపడ్డానన్నారు. కేదార్‌నాథ్ వెళ్లేముందు హరిద్వార్ హోటళ్లలో తాము భద్రపరచిన విలువైన పరికరాలు, లాప్‌ట్యాప్, ఇతర ఆభరణాలు చోరీకి గురయ్యాయని, క్షేమంగా తిరిగివచ్చిన బాధితులు పలువురు వివరించారు.
ప్రాణాలు అరచేత పట్టుకుని రోజులు గడిపాం* ఉత్తరాఖండ్ బాధితుల రోదన
english title: 
k

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>