విశాఖపట్నం, జూన్ 24: ఉత్తరాఖండ్ వరదల్లో రాష్ట్రానికి చెందిన వారు ఎనిమిది మంది మాత్రమే మరణించారని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విశాఖ ఎయిర్‌పోర్టులో విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రం నుంచి 2,624 మంది యాత్రికులు చార్‌ధామ్ యాత్రకు వెళ్లారని చెప్పారు. అక్కడ సంభవించిన వరదల్లో మరణించింది ఎనిమది మంది కాగా, 35 మంది జాడ ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఇప్పటి వరకూ 1500 మందిని సురక్షితంగా ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీలోని ఎపి భవన్‌కు చేర్చామని, అక్కడి నుంచి వారిని వారి స్వస్థలాలకు పంపించామని చెప్పారు. ఇంకా ఎపి భవన్‌లో 140 మంది ఉన్నారని, 19 మంది అస్వస్థతకు గురవడంతో వారికి ఢిల్లీలోనే చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ ఉత్పాతం బాధాకరమైనదన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యలు చేపట్టిందని అన్నారు. ఎపి భవన్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు అక్కడి తెలుగువారి సమాచారాన్ని తెలుసుకుంటున్నామని అన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రోజూ మాట్లాడుతున్నారన్నారు. అలాగే మన చీఫ్ సెక్రటరీ కూడా ఉత్తరాఖండ్ సిఎస్, ఇతర కలెక్టర్లతో మాట్లాడుతున్నారని రఘువీరారెడ్డి తెలియచేశారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నందున విఐపిలను అక్కడికి రావద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆర్మీ అధికారులు చెప్పినందువలన మన ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి వెళ్లలేదని రఘువీరా రెడ్డి చెప్పారు. విఐపిలు వెళ్లడం వలన అక్కడ సహాయక చర్యలకు తీవ్ర అవరోధం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వెళ్లలేదన్నారు. రాజకీయాకలకు అతీతంగా అక్కడ సహాయక చర్యలు జరుగుతుంటే, చంద్రబాబు నాయుడు అక్కడివెళ్లి ఆ పరిస్థితిని కలుషితం చేశారని రఘువీరా అన్నారు. అసెంబ్లీలో బంగారుతల్లి పథకానికి చట్టబద్ధత కల్పించేందుకు జరిగిన చర్చలో చంద్రబాబు పాల్గొనకుండా, అమెరికా వెళ్లిపోయి, ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఉత్తరాఖండ్ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న ప్రతి తెలుగు వారిని సురక్షితంగా మన రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
విఐపిలను రావద్దన్నారని సిఎం వెళ్లలేదు: రఘువీరా
english title:
m
Date:
Tuesday, June 25, 2013