సమాజంలో చాలామంది నైపుణ్యాలుండీ రాణించలేరు. అద్వితీయ మేధస్సు ఉన్నా మహనీయులు కాలేరు. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు పొందలేరు. ఉన్నత చదువులు అలంకరించినా ప్రజారంజకులుగా కీర్తి గడించలేరు. కోట్లు సంపాదించినా గౌరవ మర్యాదలు అందుకోలేరు. ఇలాంటి వారిని పరిశీలిస్తే మానసిక లోపమే అందుకు మూలమని తెలుస్తుంది. వ్యక్తిత్వ వైఫల్యం, ప్రవర్తనాలోపం మానసిక రుగ్మతలు, ఇతర పలు అంశాలు వారి సామర్థ్యాలకు అడ్డంకులుగా పరిణమిస్తాయి.
అందుకే ఆధునిక సమాజంలో వ్యక్తిత్వ వికాసం, మానసిక ఆరోగ్యం ప్రాధాన్యతాంశాలు అయ్యా యి. శక్తి సామర్థ్యాలకంటే గుణగణాలకు విలువనిస్తున్నారు. తెలివితేటలకంటే దృక్పథం ముఖ్యమని భావిస్తున్నారు. కార్పొరేటు సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీలు విద్యార్హతలు, నైపుణ్యాలతోపాటు మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించి ఉద్యోగాలు ఇస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇప్పుడిప్పుడే వ్యక్తిత్వానికి విలువ ఇచ్చే స్థితికి వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రతి వ్యక్తి మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. విద్యార్హతలు, నైపుణ్యాలతోపాటు మానసిక ఆరోగ్య నిర్మాణానికి ప్రాధాన్యతనివ్వాలి. అందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని స్వంతం చేసుకోవాలి. ఆరోగ్యం మానసిక రుగ్మతలపట్ల అవగాహన పెంచుకోవాలి.
సామర్థ్యమే ఆరోగ్యం
వ్యక్తిగత శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించుకుంటూ, ఒత్తిళ్ళను తట్టుకుంటూ, దినచర్యలను సక్రమంగా నిర్వహించడాన్ని మానసిక ఆరోగ్యంగా చెప్పవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం మానసిక, శారీరక, సామాజిక సమతుల్యతే ఆరోగ్యం. మానసిక ఆరోగ్యం కూడా సాధారణ ఆరోగ్య సూత్రాలకు అనుగుణంగానే ఉంటుంది. అయితే శారీరక లోపాలు, సామాజిక పరిస్థితులను సానుకూలంగా చూడగల సామర్థ్యమే మానసిక ఆరోగ్యం. ఒక మనిషి జీవనశైలి, వ్యవహారం, ప్రవర్తనా తీరును పరిశీలించి మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు.
సాధారణంగా మానసిక ఆరోగ్యవంతులు తమ వ్యక్తిగత జీవితాన్ని సజావుగా గడుపుతారు. ఇతరులతో సఖ్యతగా ఉంటూ, అవసరాలు తీర్చుకుంటూ, ఉమ్మడి లక్ష్యాలను సాధిస్తుంటారు. తమ పట్ల తమకు పరిపూర్ణ అవగాహన ఉంటుంది. నిత్యం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుంటారు. వాస్తవికంగా ఆలోచిస్తుంటారు. స్వీయ గౌరవం కలిగి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. సామాజిక స్పృహ కలిగి సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తారు. మానసిక ఉద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. తమ శక్తి సామర్థ్యాలపట్ల స్పష్టత కలిగి ఉంటారు. పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుంటారు. బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. ఒత్తిళ్ళను, సమస్యలను సవాళ్లుగా స్వీకరిస్తారు. మానవీయత, నైతిక విలువలు పాటిస్తారు. ప్రలోభాలు, ప్రతీకారాలకు దూరంగా ఉంటారు. సమూహం లేదా బృందంలో సభ్యులుగా ఉండేందుకు ఇష్టపడతారు. ఉత్సాహం, కుతూహలం కలుపుగోలుతనం వారి స్వభావంలో భాగమై ఉంటుంది. అవసరమైన నైపుణ్యాలను పెంచుకుంటారు. సామర్థ్యాలకు సానపట్టుకుంటారు. సమస్యలకు పరిష్కారాలు వెదుకుతారు. ఆత్మవిశ్వాసం, స్థిరచిత్తం కలిగి ఉత్పాదక శక్తులుగా ఎదుగుతారు. సుఖ సంతోషాలను స్వంతం చేసుకుంటారు. త్యాగనిరతి, కృతజ్ఞతాభావం కలిగి ఉంటారు.
ఒక మాటలో చెప్పాలంటే ఇంటా, బయటా అందరు హర్షించేలా ప్రవర్తించే వారిని మానసిక ఆరోగ్యవంతులుగా పేర్కొనవచ్చు. అంటే ప్రతివారికి ప్రీతిపాత్రులవుతారని కాదు. సామాజిక ధర్మాలు, ఆచారాలు, విలువలు పాటిస్తే చాలు. తమని వ్యతిరేకించేవారు, తమతో విభేదించేవారితో సైతం సానుకూలంగా వ్యవహరించగలగాలి. వ్యక్తిత్వాలు, అభిప్రాయాలు, నమ్మకాలు, విశ్వాసాలు వేరైనా స్నేహ సంబంధాలు కొనసాగించగలగాలి.
*
సమాజంలో చాలామంది నైపుణ్యాలుండీ రాణించలేరు
english title:
expertise
Date:
Wednesday, June 26, 2013