విజయవాడ, జూన్ 25: గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరదనీరు చేరుతుండటంతో సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఐదు గేట్లను ఒక అడుగు మేర పైకి ఎత్తి సుమారు మూడు వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలారు. గేట్ల పైనుండి నీరు ప్రవహిస్తే గేట్లు దెబ్బతింటాయనే ఉద్దేశంతోటే గేట్లను కొద్దిగా ఎత్తాల్సి వచ్చిందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కేంద్ర మంత్రులతో ఏరువాక నిర్వహిస్తున్నందున ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం చుక్క నీరుని కూడా వృధాగా సముద్రంలోకి వదలకుండా వచ్చిన నీటిని వచ్చినట్లే కాలువలకు సరఫరా చేయాలంటూ తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు, శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు నాయకత్వంలో ఆ పార్టీ నేతలు కొందరు మంగళవారం ఉదయం ప్రకాశం బ్యారేజీ గేట్ల దిగువన కొద్ది సేపు ధర్నా నిర్వహించారు. అనంతరం నేరుగా నీటిపారుదల శాఖ ఎస్‌ఇ కార్యాలయానికి చేరుకుని ఎస్‌ఇని కలిసారు. ఈ సందర్భంగా ఎస్‌ఇ కెఎల్ నరసింహమూర్తి మాట్లాడుతూ ఎంతోకాలం తర్వాత దశల వారీగా డెల్టా ఆధునికీకరణ పనులు నిర్వహిస్తున్నామని, వేసవిలో రూ. 200 కోట్లతో చేపట్టిన పనులు జూలై ఒకటో తేదీ నాటికి కానీ పూర్తికావని, అప్పటి వరకు నీటి విడుదల అసాధ్యమన్నారు. అయినా వేసవిలో తాగునీటి అవసరాల కోసం కొద్దిరోజులు పనులు నిలిపి వేసి తాగునీటి చెరువులన్నింటికీ నీటిని సరఫరా చేసిన విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఇక నాగార్జునసాగర్, శ్రీశైలం నీటి మట్టాలను దృష్టిలో ఉంచుకుని డెల్టా ఆయకట్టుకు నీరు సరఫరా విషయమై ప్రభుత్వమే ఓ తేదీ ఖరారు చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక మధ్యాహ్న సమయంలో డెల్టా కాలువలకు సాగునీటిని విడుదల చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి నాయకత్వంలో కార్యకర్తలు ప్రకాశం బ్యారేజీ వద్ద కొద్ది సేపు ధర్నా నిర్వహించారు.
* ప్రకాశం బ్యారేజీ వద్ద టిడిపి ధర్నా
english title:
kharif
Date:
Wednesday, June 26, 2013