ఆదిలాబాద్, జూన్ 25: ఆదిలాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు ఉధృతంగా పోటెత్తి ప్రవహిస్తున్నాయి. మహారాష్ట్ర సరిహద్దుల నుండి జిల్లాలో ప్రవహించే పెన్‌గంగా, ప్రాణహిత పరవళ్ళు తొక్కుతుండగా, బెజ్జూర్, కౌటాల, వేమనపల్లి, చెన్నూర్, సిర్పూర్-టి పరీవాహక మండలాల్లోని 18 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సాయంత్రం వరణుడు శాంతించడంతో వరద ముప్పు నుండి ఆయా గ్రామాల ప్రజలు తేరుకుంటున్నారు. ఇదిలావుంటే బెజ్జూర్ మండలంలోని రేచిని, కృష్ణపల్లి, కుకుడ వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో రేచిని, సోమిని, ఇందర్‌గాం, సుశ్మీర్, పిప్పల్‌గూడ, కృష్ణపల్లి, మొగవెల్లి, జరిగూడ, సోయాపల్లి, నాగపల్లి గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఆదిలాబాద్ మండలంలోని బంగారుగూడ వాగు, జైనథ్ మండలంలోని నీరాల వాగు ఉధృతంగా ప్రవహించడంతో మహారాష్టక్రు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా వుంటే మత్తడివాగు ప్రాజెక్టు నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో రెండు గేట్లను, సాత్నాల ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తివేసి వరద నీటిని వదిలి పెట్టారు. సల్గుపల్లి వద్ద సంగం ఒర్రె ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తోంది. వేమనపల్లి మండలం గొర్రపల్లి వాగు వరదలతో ఉప్పొంగడంతో 9 గ్రామాలకు రాకపోకలు స్తంభించగా, అత్యవసర పనుల నిమిత్తం ఆయా గ్రామాల ప్రజలు నాటుపడవలతో ప్రయాణం సాగిస్తున్నారు.
------------
కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం, జూన్ 25: ఒడిశా తీరాన్ని అనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఆవరించింది. దీనితోపాటు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఈ కారణంగా కోస్తాంధ్రలో రానున్న 24 గంటల్లో వర్షాలు కురిసే అవకావం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు మంగళవారం తెలిపారు. ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లోను, దక్షిణ కోస్తాలో ఒకటిరెండు చోట్ల చెదురుమదులు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా
english title:
pen ganga
Date:
Wednesday, June 26, 2013