జోగిపేట, జూన్ 25: త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ మద్యం, డబ్బులు పంపిణీ చేస్తే దీటైన వ్యూహంతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం మెదక్ జిల్లా జోగిపేట పట్టణంలోని వెంకటేశ్వర గార్డెన్స్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి స్థానిక సంస్థల ఎన్నికల ప్రాంతీయ సదస్సులో ఆమె మాట్లాడారు. గతంలో జరిగిన సహకార ఎన్నికల్లో అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడిందని ఆమె ఆరోపించారు. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు వైకాపా సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. త్వరలో జరగనున్న అన్ని ఎన్నికల్లో పార్టీ పోటీచేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. తమ కుటుంబంపై ప్రజలకు అభిమానం ఉన్నందున ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తామన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు అదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతుతో తాము అధికారం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం మరో 6 నెలల పాటే అధికారంలో ఉంటుదన్నారు. తెలంగాణ వాదాన్ని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డిలు గౌరవించారని విజయమ్మ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేతులోనే ఉంటుందన్నారు. రాజశేఖర్‌రెడ్డి సిఎంగా ఉన్న సమయంలో 7 జిల్లాలను అభివృద్ధి చేయడానికి ప్రణహిత చేవేళ్ల ప్రాజెక్టు పనులను ప్రారంభించిన నేటి వరకు పూర్తి చేయలేదన్నారు. 108, 104 వంటి సేవలు నేడు ప్రజలకు ఉపయోగకరంగా లేవన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.
సిబిఐ పథకం ప్రకారమే జగన్‌కు బెయిల్ రాకుండా చేయడం జరిగిందన్నారు. జిల్లా అధ్యక్షుడు బట్టి జగపతి మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ జోగిపేట పట్టణంలో వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఆయన పేరుమీదే గెలిచి నేడు ఇలాంటి కార్యక్రమం పునుకోవడం సరికాదన్నారు. గోనే ప్రకాశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో వచ్చే ఎన్నికల్లో తెరాసకు ప్రజల నుంచి మద్దతు ఉండదన్నారు. కేసిఆర్ కుటుంబ పార్టీగా తెరాస మారిందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా శాసన సభ్యులు కూన శ్రీశైలంగౌడ్, గోవర్ధన్, అందోల్ ఇన్‌చార్జి నల్లా సూర్యప్రకాశ్, సంగారెడ్డి ఇంచార్జి శ్రీ్ధర్‌రెడ్డి, పటాన్‌చెరువు ఇన్‌చార్జి మహిపాల్‌రెడ్డి, నారాయణఖేడ్ ఇన్‌చార్జి హనుమంతు, నాయకులు ఉజ్వల్‌రెడ్డి, బాలకిష్టారెడ్డి, నరేందర్‌రెడ్డి, రాఘవరెడ్డి, మహేందర్‌గౌడ్, రవిందర్‌గౌడ్, నర్సింలు పాల్గొన్నారు.
వైకాపా శ్రేణులకు విజయమ్మ పిలుపు
english title:
vijayamma
Date:
Wednesday, June 26, 2013