శ్రీకాకుళం: రాష్ట్ర రాజధానికి శివారుగా ఉన్న శ్రీకాకుళం జిల్లా ఉద్యమాల కిల్లాగా ఫరిఢమిల్లింది. ఇక్కడ నేతలు రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించే చరిత్ర మూటగట్టుకున్నారు. వెనుకబడిన జిల్లాగా పేరున్న సిక్కోల్‌కు అధికారులు కరువవడంతో ప్రగతికి ఎంతో అవరోధం ఏర్పడింది. ప్రభుత్వ లక్ష్యాలు అధిగమించేందుకు సర్కార్ ఫీట్లు చేస్తుంటే దీనికి తగ్గ అధికారగణం జిల్లాలో లేకపోవడంతో ఆ లక్ష్యాలు చేరుకోవడం కష్టంగా మారింది. తాజాగా పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక పాలన కొనసాగడం, ఉన్నతాధికారులంతా ప్రత్యేకాధికారులుగా ద్విపాత్రాభినయం సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఓ పక్క ఆర్థిక సంవత్సరం దగ్గరపడుతున్నప్పటికీ ఆదిశగా లక్ష్యాలు సాధించడంతో అధికార యంత్రాంగం వెనుకబడి ఉందనే చెప్పాలి. నిన్నటివరకు జాయింట్ కలెక్టర్‌గా వ్యవహరించిన శ్రీ్ధర్ సెలవుపై వెళ్లడంతో ఆ కుర్చీ ఖాళీగా మిగిలింది. ఎ.జె.సి.గా విధులు నిర్వహించిన బాబూరావునాయుడు జె.సి. పదోన్నతిపై వెళ్లడంతో ఆ బాధ్యతలను వంశధార భూసేకరణ పరిపాలన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్.ఎస్ .రాజ్‌కుమార్ మోయాల్సి వస్తుంది. విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్న విషయం అందరికీ తెలిసిందే. జిల్లా విద్యాపరంగా వెనుకబడి ఉంది. ఈ జిల్లాను శతశాతం అక్షరాస్యులుగా తీర్చిదిద్దాల్సిన సర్కార్ జిల్లా విద్యాధిశాఖాధికారిని గత ఏడాదిగా భర్తీచేయకపోవడంతో డైట్ లెక్చరర్‌గా వ్యవహరిస్తున్న బి.మల్లేశ్వరరావు ఈ బాధ్యతలు నెత్తినేసుకోవాల్సిన ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి.
టెక్కలి, పాలకొండ, శ్రీకాకుళం డివిజన్లకు డిప్యూటీ డిఇఒలుగా ఇన్‌ఛార్జిలే బాధ్యతలు నిర్వర్తించడం విశేషం. దీనికి తోడు అభివృద్ది ఫలాలు క్షేత్రస్థాయిలో అందించేందుకు ప్రధాన భూమిక పోషించే మండల ప్రజాపరిషత్ అధికారులు సైతం జిల్లాలో కరువవ్వడం మరింత దురదృష్టకరం. 38 మండలాల్లో ఎంపీడీఒలు ఉండాల్సి ఉన్నప్పటికీ 12మండలాల్లో ఇన్‌ఛార్జిలే ఈ బాధ్యతలు వెలగబెడుతున్నారు. ఎచ్చెర్ల, జి.సిగడాం, హిరమండలం, కోటబొమ్మాళి, కొత్తూరు, ఎల్.ఎన్. పేట, మెళియాపుట్టి, నందిగాం, రేగిడి ఆమదాలవలస, టెక్కలి, వంగర, వీరఘట్టం మండలాల్లో అక్కడ ఇ.ఒ. ఆర్డీలు, కార్యాలయ సూపరింటెండెంట్‌లే ఎంపీడీవోలుగా ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. దీనికితోడు పాఠశాల విద్యను పర్యవేక్షించాల్సిన మండల విద్యాశాఖాధికారులు కేవలం తొమ్మిది మంది మాత్రమే రెగ్యులర్ సిబ్బంది ఉండగా, మిగిలిన 29 మండలాల్లో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎం.ఇ.ఒ.లుగా కాలం వెలిబుచ్చుతున్నారు. మధ్యాహ్న భోజన నిర్వహణ నుండి పాఠశాలల పనివేళల వరకు తనిఖీలు చేయాల్సిన క్షేత్రస్థాయి అధికారులు లేమి జిల్లాను ఎంతగానో వేదిస్తోంది. ఇక మంచినీటి ఎద్దడిని నివారించాల్సిన గ్రామీణ నీటి సరఫరా విభాగం జె.ఇ.లు 17 మండలాలకు లేకపోవడం విశేషం.
పాలకొండ, సంతకవిటి, వంగర, సీతంపేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస, పలాస సబ్‌డివిజన్‌లతోపాటు భామిని, రాజాం, హిరమండలం, కొత్తూరు, కవిటి, నరసన్నపేట, కంచిలి, వంగ, పోలాకి మండలాల్లో వీరి కొరత ఉంది. ఈ బాధ్యతలను ఆయా మండలాల్లో పంచాయతీ రాజ్ శాఖ జె.ఇ.లు నిర్వర్తించక తప్పదు. ఇలా రెండు గుర్రాల స్వారీ చేయడం వలన అధికారులు అడుగడుగునా అవస్థలు ఎదుర్కొంటున్నారు. పౌరులకు అందించాల్సిన మంచినీటి సమస్య నుంచి ఉపాధి హామీ పనులు లక్ష్యాలకు ఆటంకాలు, అలాగే విద్యా వ్యవస్థకు తప్పని అవస్థలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పౌరులకు సకాలంలో అందని ప్రత్యేక పరిస్థితులు జిల్లాను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ఇప్పటికైనా కిరణ్ సర్కార్‌లో ప్రధాన భూమిక పోషించి అమాత్యులుగా ఉన్న మంత్రులు ధర్మాన, శత్రుచర్ల, కోండ్రులు ఈ దిశగా ఆలోచించి జిల్లా అభివృద్దికి కావాల్సిన అధికారులను నియమించేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
* జెసి, ఎజెసి కుర్చీలు ఖాళీ * ఇన్‌ఛార్జిల పాలనే గతి * నిలిచిన జిల్లా ప్రగతి
english title:
officers wanted
Date:
Tuesday, February 28, 2012