విజయనగరం, జూన్ 26: గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఆశావహులు పెద్ద సంఖ్యలో పోటీపడుతుండటంతో ఈ దఫా ఏకగ్రీవాలు అంత తేలిగ్గా అయ్యే అవకాశాలు కన్పించడ లేదు. రాజకీయ పార్టీలు తమకు సంబంధం లేదంటూనే గ్రామ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే సర్పంచ్ పదవులు దక్కించుకునేందుకు నేతలు వివిధ మార్గాల్లో ప్రజల మెప్పు పొందడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొందరు లక్షల రూపాయలు ఖర్చు చేయగా, మరికొందరు వ్యక్తిగత అవసరాలను గుర్తించి వాటిని నెరవేర్చడం ద్వారా తమ గెలుపు ఖాయమన్న ధీమాలో ఉన్నారు. గ్రామ పంచాయతీలకు భారీగా వస్తున్న నిధులు, రాబోయే నిధులు, ప్రతి అంశానికి పంచాయతీ తీర్మానం అవసరాలు, ఉపాధి హామీ పథకం నిర్వహణలు ఇవన్నీ కూడా గ్రామ నేతల దృష్టిని ఆకర్షించాయి. అంతేగాకుండా అసెంబ్లీ ఎన్నికలకు కూడా గ్రామాల్లో పట్టు అవసరం ఉండటంతో అందరూ ఏకగ్రీవాలవైపు మొగ్గు చూపడం లేదు. వాటితోపాటు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా వచ్చే అవకాశాలు ఉండటంతో ఎవ్వరూ కూడా వెనక్కి తగ్గే అవకాశాలు కనబడటం లేదని గ్రామ స్థాయి నేతలు చెబుతున్నారు. కాగా, ఈ దఫా పోటీలోకి ప్రధాన పార్టీలతోపాటు వైకాపా కూడా పోటీ చేయనున్నట్టు సమాచారం. దీంతో మూడు పార్టీల నేతల మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఏ అభ్యర్థులను రంగంలోకి దించితే బాగుంటుందనేది కూడా అంచనా వేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ అయిన గ్రామాల్లో అభ్యర్థులకు ఖర్చు ఎవరు భరించాలన్నదీ చర్చనీయాంశంగా మారింది. రిజర్వేషన్లు అయిన గ్రామాల్లో ఎక్కువ శాతం బలమైన సామాజిక వర్గాలే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఎన్నికైన సర్పంచులను తమ గుప్పెట్లో పెట్టుకొని తమ పనులను చేసుకుంటున్నారు. మహిళలకు రిజర్వేషన్ అయిన గ్రామాల్లో కూడా భర్తలు, కొడుకులు కాకపోతే తండ్రి ప్రధానంగా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అవసరమైతే సమావేశాలకు వారే హాజరవుతున్న తీరు కూడా ఉంది. ఇదంతా బహిరంగ రహాస్యమే. కాగా, పోటీ లేకుండా రాజీలు పడితే భవిష్యత్ ఎన్నికల్లో పార్టీల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనుందనే అభిప్రాయం ఉంది. అందువల్ల గెలిచినా, ఓడినా తమ పార్టీకి గ్రామంలో ఒక నేత, ఒక వర్గం ఉండి తీరాలి కనుక పంచాయతీ ఎన్నికలను నేతలు తమ కనుసన్నల్లో నడపడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
తప్పుల్లేకుండా ఓటర్ల జాబితా
విజయనగరం, జూన్ 27: ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లకుండా చూడాలని రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం మినీ కానె్ఫరెన్స్ హాల్లో నియోజకవర్గాల వారీగా తహశీల్దార్లతో ఓటర్ల జాబితాల తయారీపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సిబ్బంది ఇంటింటికి వెళ్లి తనిఖీ చేసి తయారు చేసిన ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలన్నారు. ఓటర్ల జాబితాను తయారు చేయడం ఎంత ముఖ్యమో, డేటాను ఆన్‌లైన్లో నమోదు చేయడం కూడా అంతే ముఖ్యమన్నారు. కళాశాలలు తెరవడంతో అక్కడకు వెళ్లి అర్హులైన ఓటర్లను చేర్పించాలన్నారు. దీనిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించేటపుడు వారికి నోటీసులు జారీ చేయాలన్నారు. ఆ నోటీసులను రికార్డునందు పొందుపరచాలన్నారు. పాత ఓటర్లు ఒకటి, రెండు చోట్ల ఓటుహక్కు కలిగి ఉంటే వారు కోరుకున్న చోటనే ఓటును ఉంచాలన్నారు. సంవత్సరాల తరబడి ఓటు ఉన్న గ్రామంలో లేని వారిని మాత్రం తొలగించాలన్నారు. డేటా నమోదు కార్యక్రమం జూలై 10 కల్లా పూర్తి చేయాలన్నారు. వెరిఫికేషన్ చేసిన నివేదికలను పోలింగ్ స్టేషన్ల వారీగా ఫైల్ చేయాలన్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో విజయనగరం, సాలూరు నియోజక వర్గాల్లో అతి తక్కువ శాతం ఓట్లు పోలైయ్యాయని, ఓటు విలువపై అవగాహన కల్పించి ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఆయన తహశీల్దార్లను ప్రశ్నించారు. దీనికి తహశీల్దార్లు మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులకు వేతనాలు అందలేదని, ఇచ్చే వేతనాన్ని కూడా పెంచితే బాగుంటుందని తెలిపారు. బిఎల్‌ఒ వేతనాలకు ఆమోదం లభించిందని, వచ్చే నెలలో చెల్లించే వీలుందని అయితే వేతనాల పెంపు విషయం ఫైనాన్స్ శాఖ వద్ద ఉందన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వేతనాలు చెల్లించడం లేదని తహశీల్దార్లు తెలపగా ఏజెన్సీల ద్వారా చెల్లించినట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అదనపు జెసి యుసిజి నాగేశ్వరరావు, పార్వతీపురం ఆర్డీవొ వెంకటరావు, పలువురు తహశీల్దార్లు పాల్గొన్నారు.
విశాఖ చేరుకున్న చార్‌ధామ్ యాత్రికులు
గాజువాక, జూన్ 27: శివుని కటాక్షం వలనే పునర్జన్మ లభించిందని చార్‌ధామ్ యాత్రకి వెళ్లి తిరిగి గురువారం విశాఖపట్నం చేరుకున్న భక్తులు పేర్కొన్నారు. విజయనగరం, విశాఖపట్నం ప్రాంతానికి చెందిన భక్తుల తెలిపిన వివరాలు వారి మాటలోనే.. ప్రకృతి సృష్టించిన బీభత్సం భక్తులకు ప్రత్యక్ష నరకం చూపించింది. ఒక వైపు వర్షం..మరోవైపు ఆకటి..ఆపై ఎముకల కొరికే చలి ఎక్కడ ప్రాణాలు హరిస్తాయా అని భక్తుల్లో భయాందోళన. హోరున కురిసే వర్షానికి కొండ చెరియలు విరిగి పడుతున్నాయి. రాక పోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిన్నది. ఒక వైపు ఆకలి..మరో వైపు ప్రాణ భయంతో ఎనిమిది రోజులు పాటు ఉత్తరాఖండ్ రాష్ట్రం యమనోత్రి సమీపంలో జానికీ చెట్టు, హనుమంతుచెట్టు ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాం. వందలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. అందరూ వృద్ధులే.. ఎలా తిరిగి రావాలో తెలియలేదు. అయిన వారికి దూరంగా కొండ ప్రాంతాల్లో ఉన్న మమ్మలిని పలకరించే వారే లేరు. సైన్యం సహాయ చర్యలు చేపడుతున్న ఫలితం శూన్యం. ఏమి కొనాలన్నా అత్యధిక ధరలు. అయినా దొరకడం గగనం. 18మంది బృందం ఒక్కచోట ఉండి బియ్యం కొనుగోలు చేసుకుని వంట చేసుకుని జీవనం సాగించాం. ఐదు రోజుల పాటు జానికీ చెట్టు వద్ద, మూడు రోజులు పాటు హనుమాన్ చెట్లు వద్ద కాలం గడిపాం. చార్‌ధామ్ యాత్రలో చిక్కుకున్నామని విజయనగరంలో ఉన్న మా బంధువులంతా వెంటనే పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ వద్దకు వెళ్లారు. ఆమె వెంటనే డెహ్రడూన్ కలెక్టర్ పురుషోత్తంకు సమాచారం అందించారు. మా ఫోన్ నెంబర్లను ఆయనకు అందించడం జరిగింది. దీనిపై కలెక్టర్ పురుషోత్తం మా క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. ఎనిమిది రోజుల తరువాత కలెక్టర్ పురుషోత్తం సూచన మేరకు 18మంది బృందాన్ని మిలటరీ వాహనంలో ఈ నెల 25న డెహ్రడూన్‌కు తరలించారు. అక్కడ నుండి బుధవారం రాత్రి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బుధవారం హైదరాబాద్‌కు, అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో గురువారం విశాఖపట్నం చేరుకున్నాం. 9వ తేదీన విశాఖపట్నం నుండి రైలులో బయలుదేరి ఉత్తరాఖండ్ చేరుకున్నాం. అక్కడ నుండి ఈ నెల 13వ తేదీన హరిద్వార్ చేరుకుని అక్కడ నుండి 14వ తేదీన యమనోత్రి వెళ్లడం జరిగింది. 15వ తేదీన యమనోత్రిలో దర్శనం చేసుకున్న తిరిగి వస్తున్న సమయంలో భారీ వర్షాలు పట్టుకున్నాయి. కొండ చరియలు విరిగి పడడంతో పాటు రహదారులు తెగి పోయాయని వారు తెలియజేశారు. యమనోత్రి సమీపంలో గల హనుమాన్ చెట్టు వద్ద గల ఆశ్రమంలో తలదాసుకున్నట్లు భక్తులు తెలియజేశారు. విజయనగరం, విశాఖపట్నం ప్రాంతానికి చెందిన 16మంది భక్తుల బృందం గురువారం మధ్యాహ్నం విశాఖకు చేరుకున్నారు. నలుగురు భక్తులు విశాఖపట్నం ప్రాంతానికి చెందిన వారు కాగా, మిగిలిన 14మంది భక్తులు విజయనగరం జిల్లా లక్కవరపుకోట ప్రాంతానికి చెందిన వారు. అత్యధిక మంది వృద్ధులే. ఒక 10 ఏళ్ల చిన్నారి ఉంది. 18మంది బృందంగా ఏర్పడి చార్‌ధామ్ యాత్రకు వెళ్ళారు. 18మందిలో ఇద్దరు భక్తులు హైదరాబాద్‌లో ఉండి పోయారు. మిగిలిన 16మంది విశాఖపట్నం చేరుకున్నారు. వారిలో విశాఖపట్నం సమీపంలో మర్రిపాలెం ప్రాంతానికి చెందిన జ్యోతీష్యుడు హరికృష్ణమాచార్యులు, ఎస్‌టిపి శ్రీనివాసాచార్యులు కలిసి చార్‌ధామ్ యాత్రకు బయలదేరి వెళ్లగా వీరు శ్రీనగర్‌లో నిలిచి పోయారు. అనంతరం వారిని తిరిగి పంపడం జరిగింది. విజయనగరానికి చెందిన ఎల్.సన్యాసిరావు, సూర్యకళ, కుమారి, నరసింహులు, వి.కేశవరావు, అన్నపూర్ణ, కె.రామదేవ్, విశాల, వి.రామకృష్ణ, వి.లక్ష్మి, వివిఆర్‌జె శర్మ, సుందరి, చిన్నారి శశిప్రభ, హరికిశోర్ శర్మలతో పాటు విశాఖపట్నం ప్రాంతానికి చెందిన ఎస్.పెంటయ్య, వరలక్ష్మిలు గురువారం సొంత గ్రామాలకు చేరుకున్నారు. విజయనగరం ప్రాంతానికి చెందిన భక్తులు ఎన్‌ఎడి కొత్త రోడ్డులో బస్సు దిగి ఇంటికి చేరుకున్నారు. చార్‌ధామ్ యాత్రకు వెళ్లి యమనోత్రి వద్ద వద్ద చిక్కుకు పోయిన విజయనగరం, విశాఖపట్నం ప్రాంతానికి చెందిన 18మంది భక్తులకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దారి ఖర్చులు కింద ఉత్తరాఖండ్ ప్రభుత్వం రెండువేల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5వేల రూపాయలను అందించందని భక్తులు తెలియజేశారు. హైదరాబాద్ విమానాశ్రయం నుండి 27 మంది భక్తులతో గరుడ ప్రత్యేక బస్సు విశాఖపట్నం బయలుదేరిందని విశాఖ రూరల్ డివిఎం జీవన్‌ప్రసాద్ తెలిపారు. వీరిలో 11 మంది భక్తులు కాకినాడలో దిగిరారన్నారు. వారంతో రావులపాలెం, కాకినాడ ప్రాంతానికి చెందిన వారు అన్నారు. మిగిలిన 16 మంది విశాఖపట్నం చేరుకున్నారు.
‘విద్యార్థులకు అంటువ్యాధులపై అవగాహన అవసరం’
విజయనగరం, జూన్ 27: విద్యార్థులకు అంటువ్యాధులపై అవగాహన కల్పించాలని డిఎంహెచ్‌ఒ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి చెప్పారు. గురువారం ఆమె తన కార్యాలయంలో వైద్యాధికారులు, ఆషా సిబ్బందితో మాట్లాడుతూ మలేరియా, డయేరియా, డెంగ్యూ వంటి వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా వాటిని నియంత్రించగలమన్నారు. కాగా, జిల్లా కేంద్రంలో డెంగ్యూ నిర్థారణ కేంద్రం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. డెంగ్యూ నిర్థారణ కేంద్రం ఉన్నందున ఎవరైనా డెంగ్యూ లక్షణాలతో ఉన్నట్టయితే ఇక్కడ పరీక్షించుకోవచ్చని తెలిపారు. కాగా, అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రతి గ్రామంలో కీటక జనిత వ్యాధుల నిర్మూలనకు స్ప్రేయింగ్ చేపట్టినట్టు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 1029 గ్రామాలకుగాను 645 గ్రామాల్లో వీటిని పూర్తి చేశారని చెప్పారు. కాగా, హై రిస్క్ ప్రాంతాల్లో మలేరియా వ్యాధి నివారణకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కాగా, జిల్లాలో పిహెచ్‌సిలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పనితీరుపై ఆకస్మిక తనిఖీలు చేశామన్నారు. ఆసుపత్రుల్లో అత్యవసర మందుల కొనుగోలు నిమిత్తం నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు.
పాఠ్యాంశాల ద్వారా ప్రభుత్వ పథకాల ప్రచారం
విజయనగరం, జూన్ 27: ఈ ఏడాది పాఠ్య పుస్తకాల్లో సమాజంలో మనపాత్ర, ప్రభుత్వ పథకాలు, చట్టాలపై అవగాహన, నైతిక విలువలు పెంపొందించడం తదితర విషయాలను పొందుపరుస్తూ పాఠ్యాంశాలు రూపొందించారు. ఈ ఏడాది 4, 5, 8, 9 తరగతులకు కొత్త పాఠ్య పుస్తకాలను సరఫరా చేశారు. కార్పొరేట్ పుస్తకాల మాదిరిగా ఆకర్షణీయమైన రంగుల్లో బొమ్మలతో రూపొందించారు. విద్యార్థులు సులువుగా అర్థం చేసుకునేలా పాఠ్యాంశాలను చేర్చారు. కాగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పాఠ్యాంశాలలో చేర్చారు. ఎనిమిదో తరగతిలో ఉపాధి హామీ పథకం అమలు, సామాజిక తనిఖీ, పనుల ఎంపిక గురించి వివరించారు. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ, అంత్యోదయ, అన్నపూర్ణ రేషన్ కార్డులు వల్ల కలిగే లబ్ధి గురించి పేర్కొన్నారు. 104, 108 వాహనాల సేవలు, ఆరోగ్య శ్రీ పథకం గురించి వాటిలో చేర్చారు. అలాగే తొమ్మిదో తరగతి సాంఘిక శాస్త్రంలో వివిధ చట్టాల గురించి పాఠ్యాంశాలలో చేర్చారు. విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, వరకట్న నిషేధం, గృహహింస చట్టం, బాల్య వివాహాలు, విపత్తుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హైదరాబాద్, ముంబైలలో తీవ్రవాదుల దాడుల గురించి పేర్కొన్నారు. ఈ విధంగా తొలిసారిగా పాఠశాల విద్యార్థులకు చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించనున్నారు.
‘అధికారులు సమన్వయంతో పని చేయాలి’
దత్తిరాజేరు, జూన్ 27 : మండల స్థాయి అధికారులు సమన్వయంతో పని చేసిన ప్రజలకు సక్రమంగా సేవలు అందించాలని కలెక్టర్ కాంతిలాల్‌దండే సూచించారు. గురువారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ సమాశ మందిరంలో వివిద శాఖల అధికారులతో సమీక్షించారు. రానున్నది వర్షాకాలం కావడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో మంచినీరు కలుషితం కాకుండా ఎప్పటి కప్పుడు క్లోరినేషన్ చేయాలని సూచించారు. గ్రామాల్లో కాలువల్లో పూడికలు తీయించాలని అధికారులను అదేశించారు. బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించేందుకు కృషి చేయాలని ఎంఇఓ సూర్యనారాయణను ఆదేశించారు. అంగన్‌వాడీ సిడిపిఓ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లలోపు చేర్పించి పౌష్టికాహారం అందేలా కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ మొదలైనందున రైతులకు అసరమైన ఎరువులు విత్తనాలు సక్రమంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారి లచ్చన్నను ఆదేశించారు. అలాగే మండలంలో పక్కా గృహాన్ని ఎన్ని మంజూరయ్యాయని వాటిని పూర్తి చేసేందుకు కృషి చేయాలని హౌసింగ్ ఎఇ ఆచారికి సూచించారు. అలాగే ప్రతి గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేందుకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటి మంజూరుకు కృషి చేయాలని ఎపిఓ భానును ఆదేశించారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో విద్యాపక్షోత్సవాలు సందర్భంగా పలువురు విద్యార్ధులకు ప్రతిభా అవార్డులను పంపిణీ చేశారు. ఆర్డీవో రాజకుమారి, మండల ప్రత్యేక అధికారి కుమార్, తహశీల్దార్ అప్పలనర్సయ్య, ఐకెపి కోఆర్డినేటర్ రాజేశ్వరి, వివిద శాఖలు మాజీ సర్పంచ్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
క్వెస్ట్ పుస్తకాల పంపిణీ తీరు పరిశీలన
పార్వతీపురం, జూన్ 27: గిరిజన విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి తయారు చేసిన క్వెస్ట్ పుస్తకాలను గురువారం గిరిజన సంక్షేమశాఖ కమిషనరేట్ నుండి వచ్చిన డిప్యూటీ డైరక్టర్ రత్నమాల పరిశీలించారు. స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల (ఇంగ్లీషు మీడియం) నుండి సరఫరాచేస్తున్న ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. అలాగే గిరిజన సంక్షేమ పాఠశాలలోని సైన్సు ఎక్విప్‌మెంట్ పరిశీలించారు. అదేవిధంగా వసతి గృహం నిర్వహణ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యా పక్షోత్సవాల సందర్భంగా గిరిజన సంక్షేమ పలు గిరిజన సంక్షేమ పాఠశాలలను పరిశీలిస్తున్నామన్నారు. కొత్తగా రాష్ట్రంలోని 269 గిరిజన సంక్షేమ వసతి గృహాలు మంజూరయ్యాయన్నారు. అలాగే 230 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అలాగే పక్షోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోని పలు గిరిజన సంక్షేమ పాఠశాలల్లో అదనపువసతులు కల్పన కోసం 650 కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నట్టు ఆమె తెలిపారు. గిరిజనాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమశాఖ డిడి సి ఎ మణికుమార్‌తో పాటు పి ఎం ఆర్ సి ప్రతినిధి ఎస్ ఎ ఆర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
‘ఖరీఫ్‌లో లక్ష ఎకరాలకు సాగునీరు’
బొబ్బిలి, జూన్ 27: ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టుల పరిధిలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు లక్ష్యంగా నిర్ణయించామని ఇరిగేషన్ ఎస్. ఇ. పి.శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ఇరిగేషన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వి.ఆర్.ఎస్, ఆండ్ర, తాడిపూడి, తోటపల్లి, తదితర ప్రాజెక్టుల ద్వారా జూలై నుంచి సాగునీరు అందిస్తామని తెలిపారు. అలాగే తోటపల్లి పరిధిలో ఉన్న కాలువల ద్వారా 39,574 ఎకరాలకు సాగునీరందించేందుకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇందులో విజయనగరం జిల్లాకు 7,836, శ్రీకాకుళం జిల్లాకు 31,704 ఎకరాలకు అందిస్తామన్నారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్ పరిధిలో 9వేల చెరువులున్నాయని, వీటి ద్వారా 2లక్షల 6వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. నీలం తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రెండు జిల్లాలలో 20కోట్ల రూపాయలతో పనులు చేయించామన్నారు. ఇందులో శ్రీకాకుళం జిల్లాలో 404పనులకు 12కోట్లు, విజయనగరం జిల్లాలో 407పనులకు 9కోట్లు వ్యయం చేశామన్నారు. అలాగే వెంగళరాయసాగర్, వట్టిగెడ్డ, తాడిపూడి రిజర్వాయర్‌లో ఆధునీకరణకు 100కోట్ల రూపాయల జపాన్ నిధులకు ప్రతిపాదనలు పంపించామన్నారు. అలాగే ఖరీఫ్‌లో తోటపల్లి,నారాయణపురం,మడ్డువలస ప్రాజెక్టుల ద్వారా జూలై 10వ తేదీనుంచి నీటిని విడుదల చేస్తామన్నారు.
నిరుపయోగంగా ‘పచ్చతోరణం’ మొక్కలు
పార్వతీపురం, జూన్ 27: పచ్చతోరణాల కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నప్పటికీ దానిని అమలు ఆశించిన స్థాయిలో జరిగడం లేదని పలువురు అంటున్నారు. నిరుపేదలకు అట్టడుగు వర్గాలకు చెందిన రైతాంగం ద్వారా చెరువుగట్లు మీద పచ్చతోరణాల కింద మొక్కల పెంపకం బాధ్యత అప్పగిస్తున్నారు. అయితే వాటి ద్వారా వచ్చే ప్రతిఫలం మీద మాత్రమే హక్కు కల్పించడానికి ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అయినప్పటికీ ఈ పథకం ఇంకా ఫలాలు అందిండం మాట అటు ఉంచితే మొక్కలు నాటే కార్యక్రమం ఎలా ఉంటుందోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల పచ్చతోరణాల కోసం వేసిన మొక్కలు నిరుపయోగంగా పడి ఉండటం విమర్శలకు గురి అవుతోంది.
‘పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాలి’
మెంటాడ, జూన్ 27 : మైదాన ప్రాంతాలతోపాటు గిరిజన ప్రాంతాలలో పౌష్టికాహర లోపంతో భాద పడుతున్న చిన్నారి బాలలకు పోషకాహారం అందజేయాలని జిల్లా కలెక్టర్ కాంతిలా దండే అన్నారు. గురువారం జిల్లా కలక్టర్ తన పర్యటనలో భాగంగా మండల పరిషత్ సమావేశ భవనంలో మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. మండల ప్రగతి గురించి ఆరా తీసారు. గజపతినగరం, ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోగల మండలంల9 120 మంది పౌష్టికాహారలోపం వలన తక్కువ బరువు కల్గివున్నారని పిఓ అనురాధ చెప్పడంతో అంగన్‌వాడీ కేంద్రాలు ఉండేది అందుకేనని, కేంద్రాల ద్వారా సక్రమం పౌష్టికాహరం అందేటట్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయాధికారి కె.గోవిందమ్మ మాట్లాడుతూ రైతులకు సరిపడా వరి విత్తనాలు సరఫరా కాలేదన్నారు. విత్తనాలు కొరతగా వుందని 650 టన్నులకు ప్రతిపాదనలు పంపించామని 1500 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయన్నారు. విత్తనాల కొరత లేకుండా పంపిస్తామని అందరికీ విత్తనాలు అందే విధంగా చూడాలని ఆమెకు కలెక్టర్ తెలిపారు. అలాగే త్రాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య, విద్య, తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజకుమారి, డిఎర్‌ఓ బి.మోహన్‌రావు, గ్రమీణ నీటి పారుదల ఇఇ ఎన్ మోహన్‌రావు, ఇరిగేషన్, డిఇ శ్రీనివాసరావు, మండల ప్రత్యేక అధికారి ఎపిఓ జి.సుందరరావు, ఎపిఎం కె.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఆశావహులు పెద్ద సంఖ్యలో
english title:
gp
Date:
Friday, June 28, 2013