కొవ్వూరు, జూన్ 27: గోదావరి నది పరీవాహక ప్రాంతాలలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోంది. అదిలాబాద్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉప నదులు పెన్‌గంగ, ప్రాణహిత, శబరి నదులు పొంగటంతో గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోంది. గోదావరి హెడ్ వర్క్స్ అధికారులు గురువారం సాయంత్రం అందించిన వివరాల ప్రకారం..గురువారం సాయంత్రం 6గంటలకు బ్యారేజ్ నుండి 3.84 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోనికి వదిలినట్టు చెప్పారు. అదే విధంగా తూర్పు డెల్టాకు 2,800, పశ్చిమ డెల్టాకు 4,300, మధ్య డెల్టాకు 1800 కూసెక్కుల నీటిని కాలువల ద్వారా వదిలినట్లు అధికారులు తెలిపారు.
పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు
గెజిట్ విడుదల చేసిన కలెక్టరు
ఏలూరు, జూన్ 27: గ్రామపంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. జిల్లా కలెక్టరు డాక్టరు జి వాణిమోహన్ గురువారం రాత్రి పంచాయితీలు, వార్డుల రిజర్వేషన్లను ప్రకటించారు. ఆర్డీవోల నుంచి వచ్చిన రిజర్వేషన్ల జాబితాల్లో చివరి నిముషంలో కొన్ని మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో జాబితాలు ప్రకటించడంలో జాప్యం జరిగింది. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని పంచాయితీల రిజర్వేషన్ల ఖరారు విషయంలో కొంత ఆలస్యం జరిగినట్లు సమాచారం. రెండురోజుల క్రితమే ఆర్డీవోల నుంచి జాబితాలు డిపిఓ కార్యాలయానికి చేరుకున్నాయి. అయితే జాబితాలను కూలంకషంగా పరిశీలించిన తర్వాతే విడుదల చేయాలని కలెక్టరు ఆదేశించటంతో మంగళ, బుధవారాల్లో స్ధానిక కలెక్టరేట్‌లో డిఆర్వో ఎం మోహనరాజు, డిపిఓ నాగరాజువర్మ, జడ్పీ సిఇఓ నాగార్జునసాగర్, వివిధ మండలాల ఎంపిడిఓలు రిజర్వేషన్లపై కసరత్తు జరిపారు. కొన్ని పంచాయితీల విషయంలో తలెత్తిన సాంకేతిక ఇబ్బందులను రాష్ట్ర స్దాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అక్కడ నుంచి ఆదేశాలు రావటంతో వాటికనుగుణంగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మరోసారి జాబితాలను పరిశీలించిన అనంతరం రాత్రికి విడుదల చేశారు. జిల్లాలో 884 పంచాయితీలుండగా వీటిలో 129 ఎస్టీలకు, 259 ఎస్సీలకు, 248 బిసిలకు, 316 జనరల్‌కు కేటాయించారు. వీటి ఆధారంగా అయా మండలాల పరిధిలోని పంచాయితీల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. అలాగే 9684 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను కూడా ప్రకటించారు. జిల్లాలో పంచాయితీ రిజర్వేషన్లను పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టరు డాక్టరు జి వాణిమోహన్, డిపిఓ నాగరాజు వర్మ తెలిపారు. నిబంధనలను ఖచ్చితంగా పాటించామని, అందుకు సంబంధించి అధికారులతో ధృవీకరణ కూడా నిర్వహించామన్నారు.
కన్నుల పండుగగా మావుళ్లమ్మ జ్యేష్ఠమాస జాతర
జాతరలో ఆకట్టుకున్న శక్తివేషాలు
భీమవరం, జూన్ 27: భీమవరం ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ఠమాస విశేష జాతరమహోత్సవం గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. బ్యాండ్‌మేళాలు, డప్పు వాయిద్యాలు, గరగ నృత్యాలు, శక్తివేషాలు, కోలాటం, తప్పిటగుళ్ళు, కోబ్రాడ్యాన్స్‌లు తదితర వాటితో ఈ ఉత్సవం అత్యంత వైభవంగా సాగింది. తొలుత ఎమ్మెల్యే రామాంజనేయులు ఉత్సవ విగ్రహానికి హరతులు ఇచ్చి జాతర నిర్వహించారు. తదుపరి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో డేలైట్లు, వివిధ రకాల విద్యుత్ దీపాలకాంతులతో అమ్మవారి విశేష జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పలివెల శివపార్వతీ గరగ నాట్యబృందంచే గరగ నృత్యం, విజయవాడ ఆలమూరుకొండ బృందంచే శక్తివేషాలు, నవగహ్రాల నృత్యం, భీమవరం గోపి మ్యూజికల్ బ్యాండ్ మేళం, విజయనగరం జిల్లా చిన్నతాడివారిచే తప్పిటగుళ్ళ ప్రదర్శన, విశాఖపట్నం భీమవరం దుర్గా ఆర్కెస్ట్రా సిస్టమ్‌తో ఆఫ్రికాన్ సఫారీ కోబ్రాడ్యాన్స్ పలువురిని ఆకట్టుకున్నాయి. అలాగే కరీంనగర్ రాజస్ధాన్ తీన్‌మార్ నాసిక్‌డోల్ పార్టీ బృందంచే రీసౌండ్ డప్పుల వాయిద్యం, తిరుమల తిరుపతి దేవస్థానం దాససాహిత్య అండ్ చిన్నకేశవస్వామి భజన మండలి హరేశ్రీనివాసం, ఉప్పులూరి వారిచే మురళీ కోలాటాలు, ఏలూరు వారిచే గ్రాడ్జిల్లా, విజయవాడ వారిచే పొడుగుమనిషి, కోతిప్రదర్శన, భారీ మందుగుండు, బాణా సంచాకాల్పుల మధ్య అత్యంతరంగరంగ వైభవంగా జాతర నిర్వహించారు. శక్తివేషాల నృత్యాలు జాతరకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ జాతర తిలకించడానికి అధిక సంఖ్యలోప్రజలు చుట్టూ పక్కలా గ్రామాల నుంచి తరలివచ్చారు. జాతర నిర్వహకులు మాట్లాడుతూ సుమారు రూ.7లక్షలతో అమ్మవారి రాత్రి జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉత్కంఠ భరితంగా రీ కౌంటింగ్
*టిఎన్‌టియుసికి ఆధిక్యం*జూట్‌మిల్లు ఎన్నికల్లో మలుపు
ఏలూరు, జూన్ 27 : ఏలూరులోని శ్రీ కృష్ణా జూట్‌మిల్లు గుర్తింపు సంఘం ఎన్నికల్లో గురువారం ఆసక్తికరమైన మలుపు చోటు చేసుకుంది. ఇంతకుముందు ఈ నెల 18న గుర్తింపు సంఘం ఎన్నికలు జరగగా ఆ సమయంలో ఇఫ్టూ టిఎన్‌టియుసిపై రెండు ఓట్ల మెజార్టీని సాధించినట్లు వెలుగు చూసింది. అయితే దీనిపై ఎన్నికల్లో పాల్గొన్న సంఘాలన్నీ అభ్యంతరం తెలపడం, అనంతరం గురువారం రీ కౌంటింగ్ నిర్వహించడం జరిగింది. గురువారం నాటి రీ కౌంటింగ్‌లో మార్పులు చోటు చేసుకుని టి ఎన్‌టియుసి నాలుగు ఓట్ల మెజార్టీని సాధించినట్లు తేలడంతో ఆ సంఘం విజయం సాధించినట్లు కార్మిక శాఖాధికారులు ప్రకటించారు. అయితే ఈ రీ కౌంటింగ్ ప్రక్రియను ఇఫ్టూ బహిష్కరించింది. గురువారం ఉదయం నుంచి జూట్‌మిల్లులో రీ కౌంటింగ్ ప్రక్రియకు భారీ ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జూట్‌మిల్లుకు సంబంధించి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఇటువంటి పరిణామం గతంలో చోటు చేసుకున్న దాఖలాలు లేకపోవడం ఇఫ్టూ, టి ఎన్‌టియుసిల మధ్య పోరు పోటాపోటీగా సాగడంతో కార్మికులు, కార్మిక వర్గాల నాయకుల్లో రీ కౌంటింగ్ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి ఇంతకుముందు జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అప్పుడు మొత్తం 3926 ఓట్లకు గాను 3600 ఓట్లు పోలు కాగా వాటిలో 16 ఓట్లు చెల్లలేదు. మిగిలిన ఓట్లలో ఇఫ్టూకు 1685, టి ఎన్‌టియుసికి 1683, ఐ ఎన్‌టియుసికి 96, సి ఐటియుకు 88, జూట్ కార్మిక సమాఖ్యకు 32 ఓట్లు వచ్చాయి. కేవలం రెండు ఓట్ల ఆధిక్యాన్ని ఇఫ్టూ సాధించిన నేపధ్యంలో రీ కౌంటింగ్ నిర్వహించాలని అన్ని సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే దీన్ని ఇఫ్టూ పూర్తిగా వ్యతిరేకించింది. దీనిపై న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం, అనంతరం న్యాయస్థానం ఇఫ్టూ విజ్ఞప్తిని తిరస్కరించడంతో గురువారం కార్మిక శాఖాధికారులు రీ కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు. ఈ రీకౌంటింగ్ ఫలితాల్లో టి ఎన్‌టియుసి 4 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించినట్లు తేలింది. తాజా రీ కౌంటింగ్ ఫలితాలను పరిశీలిస్తే టి ఎన్‌టియుసికి 1687, ఇఫ్టూకు 1683, ఐ ఎన్‌టియుసికి 97, సి ఐటియుకు 85, జూట్ కార్మిక సమాఖ్యకు 32 ఓట్లు వచ్చినట్లు తేలింది. గతంలో మాదిరిగానే చెల్లని ఓట్లు 16 గానే వున్నాయి. రీ కౌంటింగ్‌లో విజయం సాధించడంతో టి ఎన్‌టియుసి అధ్యక్షులు బి కరుణకుమార్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం విజయోత్సవాలను నిర్వహించారు. స్థానిక పవర్‌పేటలోని అంబికా ప్రజా కార్యాలయంలో సమావేశాన్ని కూడా నిర్వహించారు.
ఇదిలా ఉంటే రీ కౌంటింగ్ ప్రక్రియ పట్ల ఇఫ్టూ పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేసింది. బ్యాలెట్ బాక్సుల్లో జరిగిన మోసానికి ఈ రీకౌంటింగ్ అద్ధం పట్టిందని ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి ప్రసాద్ ఆరోపించారు. ఇఫ్టూ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అయిదు యూనియన్ల కౌంటింగ్ ఏజెంట్ల ఆమోదంతో ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి ఈ నెల 18న వెల్లడించిన తరువాత చట్టప్రకారం ఆయనకే రీ కౌంటింగ్ చేసే అధికారం ఉండదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉంటే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీన్ని తిరస్కరించడం వెనుక బ్యాలెట్ బాక్సుల మోసం దాగి వుందని ఆయన ఆరోపించారు. తమకు పడ్డ ఓట్లు రెండు ఎలా తగ్గాయని, టి ఎన్‌టియుసికి నాలుగు ఓట్లు అధికంగా ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బోగస్ రీ కౌంటింగ్ ఫలితంపై ఇఫ్టూ న్యాయపోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పారు.
కన్నుల పండువగా సామూహిక అక్షరాభ్యాసం
ద్వారకాతిరుమల, జూన్ 27: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని గురువారం కన్నుల పండువగా నిర్వహించారు. దేవాదాయ శాఖ, హిందూ ధర్మపరిషత్, స్థానిక దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇందుకు ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం వేదికైంది. అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పురస్కరించుకుని తూర్పు రాజ గోపుర ప్రాంతాన్ని సుందరీకరించారు. ఈ సందర్భంగా అక్కడ వేదికను ఏర్పాటుచేసి, దానిపై సరస్వతీ దేవి విగ్రహాన్ని ఉంచి పుష్పమాలికలతో అలంకరించారు. అక్షరాభ్యాసం చేయించుకునే చిన్నారులు, వారి తల్లిదండ్రులు వేదిక ఎదురుగా కూర్చోగా వేదికపై ఉండే ఆలయ అర్చకులు, పండితులు ఈ అక్షరాభ్యాస కార్యక్రమ తంతును ప్రారంభించారు. ఆయల ఇఒ వేండ్ర త్రినాధరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సుమూహుర్త సమయమైన ఉదయం 9.26గంటలకు చిన్నారులతో అక్షరాలను దిద్దించారు. ఈ సందర్భంగా గణపవరానికి చెందిన సుబ్బరాజు విద్యార్థులకు 306 పుస్తకాలు, 306 పెన్నులను పంపిణీ చేయగా, కీర్తి పబ్లిక్ స్కూలు యాజమాన్యం వంద పలకలు, బలపాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సంస్కృతోన్నత పాఠశాల హెచ్‌ఎం ఎస్‌వి వేణునాథ్ పాల్గొన్నారు.
కావూరికి ఘన స్వాగతం పలకాలి
ఎఎంసి ఛైర్మన్ గురునాధరావు
జంగారెడ్డిగూడెం, జూన్ 27: కేంద్ర జౌళి శాఖా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి తొలిసారిగి జూలై 2వ తేదీన జిల్లాకు వస్తున్న కావూరి సాంబశివరావుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలకాలని పోలవరం వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్ జెట్టి గురునాధరావు పిలుపునిచ్చారు. గురువారం పాతబస్టాండ్ వద్ద మాజీ ఎంపిపి కొండపల్లి కేశుబాబు అధ్యక్షతన జరిగిన మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కావూరికి ఘనస్వాగతం పలికేందుకు జిల్లా కాంగ్రెస్ కమిటి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల నుండి భారీగా తరలి వెళ్ళి కావూరికి ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటి నుండే కార్యకర్తలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ఇదే సమావేశంలో శ్రీనివాసపురం, పేరంపేట గ్రామాల నుండి వంద మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గురునాధరావు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. పార్టీలో చేరడమే కాకుండా పార్టీ పురోభివృద్దికి పాటు పడాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అర్హునికి అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వామిశెట్టి నాగేశ్వరరావు, కాంగ్రెస్ నేతలు ముప్పిడి శ్రీనివాసరావు, బల్లే రాజారావు, పోల్నాటి ప్రభాకరరావు, అచ్యుత శ్రీనివాసరావు, గౌతు సత్యేంద్రబాబు, విజ్జు వెంకటస్వామి నాయుడు, సత్రం లక్ష్మణరావు, ఎలికే తాతారావు, ఆలపాటి సత్యనారాయణ, బుద్దాల సత్యనారాయణ, కఠారి వీర్రాజు, తిరుమలశెట్టి సత్యనారాయణ, కుక్కల ధర్మరాజు, పోల్నాటి ప్రసాద్, ఓరుగంటి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
30 పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రి నిర్మించాలని ధర్నా
భీమవరం, జూన్ 27: భీమవరంలో 30 పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రి నిర్మించి కార్మికులందరికీ వైద్యసదుపాయం కల్పించాలని సిఐటియు డివిజన్ ప్రధానకార్యదర్శి బి వాసుదేవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఇఎస్‌ఐ లేబర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ భీమవరం ప్రాంతం పారిశ్రామిక ప్రాంతమని, వేలాదిమంది కార్మికులు ఇఎస్‌ఐలో సభ్యులుగా ఉన్నారని, వారికి సరైన వైద్యసదుపాయాలు లేవని విమర్శించారు. చట్టప్రకారం 8 గంటలు పని ఎక్కడా అమలు కావడం లేదని, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. అధికారులు ఇప్పటికైనా 8 గంటల పని అమలు చేయాలని కోరారు. ఇఎస్‌ఐ భీమవరం ఎస్సై రెండు సంవత్సరాల నుండి కనిపించడం లేదని, ఆసుపత్రిలో రోగులకు సరిపడా మందులు కూడా ఇవ్వడం లేదని, పూర్తిగా అన్నిరకాల మందులు ఇవ్వాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.
గోదావరి నది పరీవాహక ప్రాంతాలలో గత మూడు రోజులుగా కురుస్తున్న
english title:
varada godavari
Date:
Friday, June 28, 2013