విశాఖపట్నం, జూన్ 28: విశాల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన చేయాలని సమైక్యాంధ్ర జేఎసి డిమాండ్ చేసింది. రాష్ట్ర విభజనను అడ్డుకునే అంశంలో సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు చిత్తశుద్ధి లేదని జెఎసి ఆరోపించింది. సమైక్యాంధ్రను కోరుతూ సీమాంధ్రకు చెందిన 14 యూనివర్శిటీల జెఎసి ప్రతినిధులు శుక్రవారం నాడిక్కడ ఆంధ్రాయూనివర్శిటీలో సమావేశమై సమైక్యాంధ్ర సాధనకు తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈసందర్భంగా సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ప్రతినిధులు లగుడు గోవిందరావు, ఎ మహేష్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమ పదవులను త్యాగం చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రతినిధులు కేవలం మాటలకే పరిమితం అవుతున్నారని ఆరోపించారు. ఈనెల 30 విశాఖ వస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ను కలసి సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరనున్నట్టు తెలిపారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలని, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వెనుబడిన ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నంలో సెంట్రల్ యూనివర్శిటీ, విజయనగరంలో ఐఐఎం, శ్రీకాకుళంలో ఐఐటి నెలకొల్పి ఈప్రాంతంలో విద్యాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా జూలై 3న విజయవాడలో సీమాంధ్ర ప్రతినిధులతో రాజకీయ సమావేశం, జూలై మొదటి వారంలో ఎయులో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే సమైక్యాంధ్ర వాణిని విన్పిస్తూ విశాఖ నుంచి రథయాత్రను చేపట్టనున్నట్టు వెల్లడించారు.
ప్రజాప్రతినిధులపై ఆగ్రహం
సమైక్యాంధ్రను కోరుతూ విద్యార్థి జెఎసి తలపెట్టిన సీమాంధ్ర సదస్సుకు ప్రజాప్రతినిధులు గైర్హాజరు కావడం పట్ల జెఎసి ప్రతినిధులు మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు సదస్సుకు ఆహ్వానించనా హాజరుకాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ఉండికూడా ఎమ్మెల్యేలు వ్యక్తిగత కారణాలు, కుంటి సాకులు చెప్పి తప్పించుకోవడం బాధాకరమన్నారు. వీరికి ప్రజలే తగిన గుణపాఠం చెపుతారని అన్నారు. సమావేశంలో పొలిటికల్ జెఎసి ప్రతినిధి జెటి రామారావు, సీమాంధ్రకు చెందిన 14 యూనివర్శిటీల నుంచి విద్యార్థి జెఎసి ప్రతినిధులు హాజరయ్యారు.
* సమైక్యాంధ్రపై స్పష్టమైన ప్రకటన చేయాలి * సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి డిమాండ్
english title:
seemandhra
Date:
Saturday, June 29, 2013