విశాఖపట్నం, జూన్ 28: షెడ్యూల్డు కులాల వారికి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కార్యక్రమాలను మరింత మెరుగ్గా అమలుపర్చేందుకు చర్యలు చేపట్టాలని ఎస్సీ సంక్షేమ కమిటి చైర్మన్ లబ్బి వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సింహాచలంలో సమావేశం అనంతరం అక్కడ నుంచి బయలుదేరి నేరుగా ఇక్కడి ప్రభుత్వ అతిథిగృహానికి చేరుకున్నారు. దళిత సంఘాల నాయకులు, ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంగా చెప్పారు. ఈ కారణంగా దళితులకు, గిరిజనులకు మరింత మేలు చేకూరిందన్నారు. ప్రభుత్వపరంగా వివిధ శాఖల ద్వారా షెడ్యూల్డు కులాలకు అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, 52 ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ అభ్యర్థుల నియామకాలు, పదోన్నతులపై సమీక్షిస్తామన్నారు. వీటి అమల్లో ఏమైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు లేదా మరింత మెరుగ్గా అమలు చేసేందుకు తగిన సలహాలు సూచనలు తెలియజేయాల్సిందిగా కోరారు. వీటన్నింటిని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. ఆరోగ్యం, విద్య, గృహనిర్మాణం, ఐకెపి, ఉపాధిహామీ, పారిశుద్ధ్యం, తాగునీరు, సాంఘిక సంక్షేమశాఖ ద్వారా అమలు చేస్తున్న వసతి గృహాలు, అస్పృశ్యత, అత్యాచార నివారణ చర్యలు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అ మలు చేస్తున్న రుణ సౌకర్యం, శిక్షణా కార్యక్రమాలను గురించి దళిత సంఘాలు తమ అభిప్రాయాలను తెలియజేయాలన్నారు. కార్యక్రమాలన్నీ పారదర్శకంగా అమలు కావాలన్నారు. రెల్లి కులస్తులు, సఫాయి కర్మచారీస్ సమస్యలపై జిల్లా మోనటిరింగ్ కమిటి, మాలమహానాడు ప్రాంతీయ అధ్యక్షులు ఎస్‌సిల వర్గీకరణ, స్కాలర్‌షిప్‌లు, బ్యాంకు రుణాలు తదితర సమస్యల గురించి, ఆంధ్రవిశ్వవిద్యాలయ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు, ఫిర్యాదులు సమర్పించారు. ఈ సమావేశంలో కమిటి సభ్యులు హనుమంత్, షిండే, పంచకర్ల రమేష్‌బాబు, విశాఖపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్.రంగయ్య, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.
* ఎస్సీ సంక్షేమ కమిటి చైర్మన్ లబ్బి వెంకటస్వామి
english title:
venkata swamy
Date:
Saturday, June 29, 2013