ఏలూరు, జూన్ 28 : తెలంగాణ దస్త్రం కదులుతోందా? ఇప్పుడు ఇదే అనుమానం, దీనిపైనే చర్చ అన్ని వర్గాల్లోనూ కనిపిస్తోంది. గతంలో సమైక్యాంధ్ర ఉద్యమానికి పశ్చిమ నుంచే పునాది పడిన సంగతి గుర్తుండే వుంటుంది. అప్పట్లో వస్తుందా? అన్న అనుమానంతోనే పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టగా తాజా పరిణామాలు చూస్తే మళ్లీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయన్న అనుమానాలకు తావిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి అటు ఛానళ్లలోనూ, ఇటు పత్రికల్లోనూ కూడా తెలంగాణ దస్త్రం కదులుతోందని, ఏదో ఒక నిర్ణయం తీసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పావులు కదుపుతోందన్న వార్తలే కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యం సీమాంధ్రలోనూ కొంత కలవరాన్ని కలిగిస్తోంది. సహజంగానే పార్టీల్లోనూ ఇది చర్చకు తావిస్తోంది. మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజాన వేసుకుని నడిపించిన సంఘాల్లో ఇప్పుడు మళ్లీ కదలిక కనిపిస్తోంది. ఏది ఏమైనా హస్తిన పరిణామాలు తెలంగాణ విభజన దిశగా కదులుతున్నాయా? అన్న అనుమానాలకు తావిస్తోంది. ప్రధానంగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఏలూరు ఎంపి కావూరి సాంబశివరావు శుక్రవారం నాటి వ్యాఖ్యలను పరిశీలిస్తే ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోందని పార్టీల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి గత కొద్దిరోజుల పరిణామాలను పరిశీలిస్తే గతంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దాదాపు భుజాన వేసుకుని నడిపించిన వారిలో ఏలూరు ఎంపి కావూరి సాంబశివరావు ప్రధమ స్థానంలో నిలుస్తారనే చెప్పుకోవాలి. అప్పట్లో రాష్ట్ర విభజన అంశాన్ని పరిశీలనలోకి తీసుకుంటేనే ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తాయని సీమాంధ్ర ప్రజానీకం భగ్గున మండుతుందని కూడా కావూరి పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలు సీమాంధ్ర ప్రజానీకాన్ని ఒక రకంగా ఆశ్చర్యంలోనూ, మరో విధంగా నిరాశలోనూ ముంచేశాయనే చెప్పుకోవాలి. తెలంగాణ అంశంపై కేంద్ర మంత్రిగా వున్న కావూరి సాంబశివరావు శుక్రవారం మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో రాజీ పడక తప్పదని అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేయడం, అదే సమయంలో పొరపొచ్చాలు వచ్చిన సందర్భాల్లో కుటుంబ సభ్యులు కూర్చుని మాట్లాడుకోవడం ఏదో ఒక పరిష్కారానికి రావడం సహజమేనని వ్యాఖ్యలు చేయడం పట్ల సీమాంధ్ర ప్రాంతంలో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కావూరి వ్యాఖ్యల పట్ల సమైక్యాంధ్ర జె ఎసిలు నిప్పులు కక్కాయి. జిల్లాలోనూ అదే పరిస్థితి కనిపిస్తుందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ పరిణామాలు మాత్రం రాష్ట్ర విభజన దిశగానే కేంద్రం కదులుతోందా? అన్న అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయనే చెప్పుకోవాలి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణాయక మండలిగా వున్న సిడబ్ల్యుసిలో శాశ్వత ఆహ్వానితునిగా కావూరి సాంబశివరావును నియమించడం ఆ తరువాత రోజే ఆయనకు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టడం తెలిసిందే. అయితే గురువారం సిడబ్ల్యుసి పదవికి కావూరి రాజీనామా సమర్పించి శుక్రవారం ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వెనుక వ్యూహాత్మకంగానే ఆయన ఈ విధంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. తెలంగాణ విభజన విషయమే తెరపైకి వచ్చి దానిపై నిర్ణయం తీసుకునే పరిస్థితి వుంటే ఆ నిర్ణయం తప్పనిసరిగా సిడబ్ల్యుసిలో ముందుగా ఖరారవుతుంది. అలాంటి నిర్ణయం తీసుకునే సమయంలో దానిలో భాగస్వామిగా వుండటం మంచిది కాదన్న వ్యూహంతోనే కావూరి రాజీనామా సమర్పించారని ప్రచారం జరుగుతోంది. అందువల్లే తరువాత రోజే సమైక్యాంధ్ర విషయంలో కావూరి భిన్నమైన ప్రకటనలు చేయడం విశేషంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ పరిస్థితులు మాత్రం హస్తినలో తెలంగాణ విషయంలో ఏదో జరుగుతోందని మాత్రం స్పష్టం చేస్తున్నాయి. దీనిపై సమైక్యాంధ్ర సంఘాలు కూడా ఇప్పుడు సమాయత్తమవుతూ ఈ సమయంలో తగిన విధంగా తమ వాణి వినిపించకుంటే భవిష్యత్తు పరిణామాలు ఆందోళనకరంగా మారే అవకాశముందని భావిస్తున్నాయి.
*తెలంగాణ దస్త్రం కదులుతోందా?*అన్ని పార్టీల్లో చర్చలు *కావూరి వ్యాఖ్యలతోకలకలం*కదులుతున్న సమైక్యాంధ్ర సంఘాలు
english title:
lolli
Date:
Saturday, June 29, 2013