ఏలూరు, జూన్ 28: ఒక అడుగు ముందుకు...రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను శరవేగంగా ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నో వివాదాల్లో చిక్కుకుపోయిన పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్దితుల్లోనూ నిర్మించితీరుతామని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి పలుమార్లు ప్రకటించారు. దానికనుగుణంగానే రాజధానిలో ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రాజెక్టు నిర్మాణ పనులను ముందుకు తీసుకువెళ్లటంతోపాటు నిర్వాసితులను ఆదుకునేందుకు పెద్దఎత్తున ప్యాకేజీలు అమలుచేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనిలోభాగంగానే జిల్లా కలెక్టరు డాక్టరు జి వాణిమోహన్, జిల్లా జాయింట్ కలెక్టరు డాక్టరు టి బాబూరావునాయుడు గత కొద్దినెలలుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణపనులపై ప్రత్యేక శ్రద్ద కనపరుస్తూ వస్తున్నారు. వారానికి రెండు,మూడుసార్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనులు వేగవంతం చేసేందుకు తగు సలహాలు, సూచనలు అందించటంతోపాటు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశిస్తూ వస్తున్నారు. గురువారం కూడా కలెక్టరు ఆ ప్రాంతాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడటం కూడా జరిగింది. అలాగే ప్రాజెక్టు పనుల పురోగతిని కూడా సమీక్షించారు. కాగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పితాని సత్యనారాయణ శనివారం ఉదయం 11గంటలకు స్ధానిక కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించనున్నారు.
--నేడు సమీక్షించనున్న మంత్రి పితాని--
english title:
pitani
Date:
Saturday, June 29, 2013