ఏలూరు, జూన్ 28 : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ మహిళా ఓటర్ల లెక్కింపు కోసం జూలై నెల 5వ తేదీ వరకూ నిర్వహించే ఇంటింటా సర్వే ఖచ్చితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గుర్తింపు సర్వే విషయంపై మున్సిపల్ కమిషనర్లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ మాట్లాడుతూ ఈ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించడంలో రాజకీయ పక్షాల ప్రతినిధులు కూడా తమ సహకారాన్ని అందించాలన్నారు. ఈ విషయంపై తరచూ రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్లు అతి జాగ్రత్తగా ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ జాగ్రత్తగా కుల ప్రాతిపదికపై ఓటర్ల సర్వేను నిర్వహించాలన్నారు. అవసరమైతే ఐసిడి ఎస్, వైద్య విభాగం సిబ్బందిని వినియోగించుకోవాలన్నారు. ఇంటింటా సర్వేపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు కరపత్రాలను ముద్రించడంతోపాటు స్థానిక సిటీకేబుల్ ఛానల్స్‌లో ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల నిర్ధారణపై ఎక్కడైనా ఫిర్యాదులొస్తే తక్షణమే స్పందించి పరిష్కరించాలన్నారు. ఇందుకోసం అన్ని మున్సిపాల్టీలలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలన్నారు. సర్వే నిర్వహణలో ఎవరికీ భయపడనవసరం లేదని, నిబంధనలు ప్రకారం నిర్వహించాలన్నారు. ఎక్కడైనా ఫిర్యాదులొస్తే అక్కడ వేరే బృందంతో పరిశీలింపచేయాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న బిసి ఓటర్ల సర్వే మాదిరిగా దీనికి అవసరమైన మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల చట్టాల సరవణ ద్వారా ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వు కాబడిన ఆ మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల లోపల నిర్ధుష్ఠమైన వార్డుల రిజర్వేషన్ నిమిత్తం ఓటర్ల లిస్టు ఆధారంగా ఇంటింటి సర్వే చేసి వారి శాతాన్ని గణించాలన్నారు. ఎంపిహెచ్ ఎస్ డేటా లేదా ఆధార్ కార్డు ఆధారంగా కూడా ఈ ఓటర్ల గుర్తింపు సర్వే నిర్వహించవచ్చన్నారు. డోర్ టు డోర్ సర్వే ఈ నెల 26వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకూ నిర్వహించాలని, ఎస్టీ ఓటర్లను గ్రీన్ బాల్ పాయింట్ పెన్ను, ఎస్‌సి ఓటర్లను రెడ్ బాల్ పాయింట్ పెన్‌తో మార్క్ చేయాలని, మహిళా ఓటర్లను బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో రౌండ్ మార్కు చేయాలన్నారు. జూలై 8వ తేదీన కమిషనర్, ఆర్‌డివో, ఎంపిడివో ఆఫీసుల్లో డ్రాఫ్ట్ ఓటర్ల ముసాయిదాను ఉంచడం జరుగుతుందన్నారు. ఇందులో అభ్యంతరాలు ఉంటే జూలై 9వ తేదీ నుండి 12వ తేదీ లోపు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు తెలియజేయవచ్చన్నారు. వీటిని జూలై 10వ తేదీ నుండి 15వ తేదీ లోపు పరిశీలించి పరిష్కరించాలన్నారు. జిల్లా రెవిన్యూ అధికారి ఎం మోహనరాజు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల కుల నిర్ధారణ కార్యక్రమానికి రాజకీయ పక్షాలు తమ వంతు సహకారాన్ని అందించాలన్నారు. 2013 జనవరి 1 ప్రాతిపదికగా 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు అవ్వవచ్చునని చెప్పారు. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతుందని, ఆన్‌లైన్‌లో కూడా తమ పేరు నమోదు చేసుకోవచ్చునన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించి వారి వివరాలు అందజేయాలని రాజకీయ పక్షాల ప్రతినిధులను ఆయన కోరారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కత్తి రాము మాట్లాడుతూ బిసి ఓటర్ల నిర్ధారణ మాదిరిగానే ఎస్‌సి, ఎస్‌టి, మహిళా ఓటర్ల నిర్ధారణ పారదర్శకంగా చేయాలన్నారు. వై ఎస్ ఆర్ పార్టీ నాయకులు జాన్ గురునాధ్ మాట్లాడుతూ ఈ సర్వే సమయంలో సంబంధిత కులాల ఉపకులాలను కూడా పేర్కొనాలని సూచించారు. సిపి ఎం పార్టీ కార్యదర్శి సోమయ్య మాట్లాడుతూ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ విషయంలో సరైన రీతిలో కులాల నిర్ధారణ చేయాలన్నారు. సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ జి నాగరాజు, డిప్యూటీ కలెక్టర్ జయరామ్, కాంగ్రెస్ నాయకులు కారే బాబూరావు, టిడిపి నాయకులు కొల్లేపల్లి రాజు, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జి శ్రీనివాస్, గుడిదేశి శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. సమావేశంలో టిడిపి నాయకులు పాలి ప్రసాద్, ఎస్‌కె ముస్త్ఫా, నరసాపురం ఇన్‌ఛార్జి కమిషనర్ వి కరుణాకర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలి
-ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు
దేవరపల్లి, జూన్ 28: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పంచాయతీలో జెండా ఎగురవేయాలని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కోరారు. గోపాలపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం యర్నగూడెంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత స్వగృహం వద్ద జరిగింది. ఈ సమావేశంలో గోపాలపురం నియోజకవర్గంలో గల గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, ద్వారకాతిరుమల, మండలాలకు చెందిన మండల కన్వీనర్లు, పార్టీ నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం నుండి అన్ని మండలాలకు చెందిన నాయకులతో సమీక్షించి పంచాయతీల్లో పార్టీ బలాలపై అంచనాపై చర్చించారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీక్షలు పూర్తి చేసినట్టు ఆయన వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే వనిత, నియోజకవర్గ కన్వీనర్లు తలారి వెంకట్రావు, డి సువర్ణరాజు పార్టీ అభ్యర్థుల విజయాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గెడా జగదీష్, గన్నమని జనార్థనరావు, పల్లి వెంకటరత్నారెడ్డి, మేడిబోయిన గంగరాజు, కాట్నం రాంబాబు, ముల్లంగి శ్రీనివాసరెడ్డి, గగ్గర శ్రీనివాస్, దూసనబోయిన సత్యనారాయణ, కొండపల్లి వీరభద్రరావు, పత్తిపాటి బేబి, సత్తి జగదీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిర్వాసితుల కోసం రెండు వేల ఎకరాల భూసేకరణ:జెసి
జంగారెడ్డిగూడెం, జూన్ 28: ఇందిరా సాగర్ (పోలవరం) ప్రాజెక్ట్ నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజి క్రింద భూమికి భూమి ఇవ్వడానికి ఇప్పటి వరకు రెండు వేల ఎకరాల భూమి సేకరించినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి.బాబూరావు నాయుడు చెప్పారు. స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికార్ల సమావేశంలో జె.సి మాట్లాడుతూ పునరావాస ప్యాకేజి పనుల్లో భాగంగా భూసేకరణ వేగవంతం చేయాలని రెవెన్యూ అధికార్లను ఆదేశించారు. ఇప్పటి వరకు సేకరించిన రెండు వేల ఎకరాలను గిరిజన నిర్వాసితులకు భూమికి భూమి అప్పగించాలని ఆదేశించారు. సేకరించిన భూములు సర్వే చేసి, హద్దులు నిర్ణయించి, నిర్వాసితులకు పట్టాతో పాటు పట్టాదార్ పాస్‌పుస్తకం, డైటిల్ డీడ్ ఇవ్వాలని, వారి పేర్లు రెవెన్యూ రికార్డులలో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ పనులు చేసేందుకు పది బృందాలను నియమించినట్టు తెలిపారు. సర్వేశాఖ డిప్యుటి ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యంలో పని చేసే ఈ బృందాలు తక్షణమే విధుల్లోకి దిగాలని, సత్వరమే సర్వే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్క నిర్వాసితునికి భూమికి భూమి అప్పగించే వరకు కార్యాచరణ కొనసాగుతుందన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్థార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, విఆర్‌ఒలు తమ విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. కాగా, నిర్వాసిత గ్రామాలలో గిరిజన భూముల్లో చెట్లకు 1.34 కోట్ల రూపాయల నష్టపరిహారం విడుదలైందని జె.సి చెప్పారు. ఈ నష్టపరిహారం త్వరలో చెట్లు కోల్పోయిన గిరిజనులకు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. పునరావాస కాలనిల నిర్మాణంపై గృహనిర్మాణ శాఖ దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఒ వి.నాన్‌రాజ్, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డిబిఎల్‌బి కుమార్, డిప్యుటి ఇన్‌స్పెక్టర్ కరాటం రామకృష్ణ, గృహనిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోములు, డివిజన్‌లోని తహశీల్థార్లు పాల్గొన్నారు.
100 కోట్లతో రక్షిత మంచినీటి పథకాల అమలుకు
ప్రతిపాదనలు
-కలెక్టర్ వాణీమోహన్
ఏలూరు, జూన్ 28 : జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో రక్షిత మంచినీటి సరఫరా కోసం వంద కోట్ల రూపాయల వ్యయంతో 443 మంచినీటి పధకాలు అమలు చేయడానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ చెప్పారు. స్థానిక కలెక్టరు ఛాంబరులో శుక్రవారం గ్రామీణ మంచినీటి సరఫరా పధకాల అమలు తీరుపై ఆర్‌డబ్ల్యు ఎస్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షితమైన తాగునీటిని సమృద్ధిగా అందించాలనే లక్ష్యంతో ప్రతిపల్లెలోనూ మంచినీటి రిజర్వాయర్లను నిర్మిస్తామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 443 పధకాలను రూపొందించి అందుకు వంద కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని చెప్పారు. ప్రతీ సంవత్సరం వేసవిలో తాగునీటి సరఫరాకు ఇబ్బంది పడే గ్రామాలను ముందుగానే గుర్తించి శాశ్వత తాగునీరు అందించేందుకు ఈ పధకాలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. జిల్లాలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా పల్లె ప్రాంతాలలో అవసరమైన చోట్ల అదనపు మంచినీటి రిజర్వాయర్ల ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో సత్యసాయి మంచినీటి సరఫరా పధకం కింద పెద్ద ఎత్తున తాగునీటిని అందించి ప్రజల దాహార్తిని తీర్చడం జరుగుతుందని ఈ పధకం వల్ల ఏజెన్సీ ఏరియాలో చాలా గిరిజన గ్రామాలు కూడా లబ్ధి చేకూర్చే విధంగా ఎప్పటికప్పుడు తగు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యు ఎస్ ఎస్ ఇ రమణ, జె ఇ నారాయణరావు పాల్గొన్నారు.
పాతరైలు వంతెన
పాదచారుల వంతెనగా మార్చాలని
మానవహారం
కొవ్వూరు, జూన్ 28: గోదావరి నదిపై వున్న పాత రైలు వంతెనను పాదచారుల వంతెనగా మార్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ పాత రైలు వంతెన పరిరక్షణ సమితి చేపట్టిన ప్రజా ఉద్యమానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని సమితి కన్వీనర్ పరిమి రాథాకృష్ణ వెల్లడించారు. పాత రైలు వంతెన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక విజయవిహార్ సెంటర్‌లో జరిగిన మానవహారానికి అనూహ్య స్పందన లభించింది. సమితి కో కన్వీనర్ వీరంశెట్టి రాజా వరప్రసాద్ మాట్లాడుతూ ఈ ఉద్యమంలో భాగంగా ఈ నెల 29వ తేదీ ఉదయం పది గంటలకు పట్టణంలోని మెరకవీధిలో వున్న వాటర్ ట్యాంకు సెంటర్‌లో రాస్తారోకో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎండి రఫీయుల్లా బేగ్, జిల్లా ఐఎన్‌టియుసి ఉపాధ్యక్షుడు పాశం సాయిప్రతాప్, కాంగ్రెస్ నాయకులు ఇంటి వీర్రాజు, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పి సత్యనారాయణ, అసోసియేషన్ సభ్యులు సింగులూరి బాపిరాజు, నున్న సాయి, మట్టె నారాయణమూర్తి, చలంకుర్తి బాబి, కె త్రిమూర్తులు, ఎస్ సందీప్‌కుమార్ పాల్గొన్నారు.
తీర ప్రాంతాలకు సాగునీరు అందేలా చర్యలు
మొగల్తూరు, జూన్ 28: తీర ప్రాంతాలకు సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. శుక్రవారం మండలంలో 66 పనులకు సుమారు రూ.3కోట్లతో నిర్మించే రహదారులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖాధికారులు సాగునీరు సమస్య తలెత్తకుండా శివారు గ్రామాలలో చిట్టచివరి భూమికి కూడా సాగునీరు అందేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. మొదటి పంటకు నీరు ఆలస్యమైతే రెండవ పంటకు కూడా ఆలస్యమవుతుందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మాదే
జిల్లాలో జరగబోయే గ్రామ పంచాయతీల ఎన్నికలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించటం ఖాయమని ఎమ్మెల్యే కొత్తపల్లి ధీమా వ్యక్తం చేశారు. నియోజక వర్గంలో పార్టీ క్యాడర్ అంతా సమిష్టిగా తమ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తారన్నారు. ఎమ్మెల్యే వెంట ఇరిగేషన్ డిఇలు నరసింహన్, విజయకుమార్, కృష్ణారెడ్డి, సొసైటీ అధ్యక్షుడు కందులపాటి ముత్యాలరావు, ఇందుకూరి శీనురాజు, మాజీ ఎంపిపి సత్తినేని మోహనరావు, డిసిసిబి డైరెక్టర్ మోటుపల్లి రామభాస్కరరావు, కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు పాల రాంబాబు, అందె రాంబాబు, అడ్డాల సత్యనారాయణ, మేకల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాలి
మంత్రి పితాని
పెనుమంట్ర, జూన్ 28: తెలుగు భాషాభివృద్ధికి, తెలుగుభాష ఔన్నత్యాన్ని కాపాడేందుకు తెలుగువారంతా కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పితాని సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం మార్టేరు బిడి జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా పక్షోత్సవాల్లో భాగంగా తెలుగు భాషా దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలుగుభాష ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. తెలుగుభాషాభివృద్ధికి తమ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందిస్తున్నామన్నారు. 9.7 గ్రేడు పాయింట్లతో ఈ పాఠశాల విద్యార్థిని ఉత్తీర్ణత సాధించడమే దీనికి నిదర్శనమన్నారు. గత సంవత్సరం ట్రిపుల్ ఐటిలో సీటు సాధించిన మాధవిని మంత్రి అభినందించారు. కొద్దిసేపు విద్యార్థినులతో మంత్రి ముచ్చటించారు. అనంతరం యూనిఫారం, పుస్తకాలు మంత్రి విద్యార్థినులకు పంపిణీ చేశారు. ఎంఇఒ షేక్ మీరాసాహెబ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇంటింటా సర్వే సమగ్రంగా చేయాలి కలెక్టర్ వాణీమోహన్
english title:
collector
Date:
Saturday, June 29, 2013