ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్‌గా పేరు సంపాదించిన టూర్ డి ఫ్రాన్స్‌కు అమెరికా రైడర్ లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ వల్ల ఎంతటి పేరు ప్రతిష్ఠలు లభించాయో అంతకంటే ఎక్కువ నష్టం వాటిల్లింది. డ్రగ్స్‌ను వినియోగించి తాను ఏడు టైటిళ్లను గెల్చుకున్నానని అతను అంగీకరించడం యావత్ క్రీడా రంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన ఆర్మ్‌స్ట్రాంగ్ టైటిళ్లతోపాటు అంతర్జాతీయంగా తనకు ఉన్న పేరుప్రఖ్యాతుల్ని కూడా పోగొట్టుకున్నా డు. ఈసారి టూర్ డి ఫ్రాన్స్‌ను డోపింగ్ రహిత ఈవెంట్‌గా నిర్వహిస్తా మని అధికారులు హామీలు గుప్పిస్తున్నప్పటికీ, ఈ పోటీలపై అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు. ఆర్మ్‌స్ట్రాంగ్ వ్యవహారమే ప్రస్తుత దుస్థితికి ప్రధాన కారణం.
==============
పచ్చిక మైదానాలు... ఎత్తయిన కొండలు... పర్వతాలు... ఒక్కో ‘స్టేజీ’ని అధిగమిస్తూ వెళ్లే రైడర్లు... ఇవీ టూర్ డి ఫ్రాన్స్ సైకిల్ రేస్ ప్రత్యేకతలు. గంటల తరబడి అవిశ్రాంతంగా సైకిల్ తొక్కడం అనుకున్నంత సులభం కాదు. ఘాట్ రోడ్లపై సైకిళ్లను ముందుకు దూకించడానికి అపారమైన శక్తిసామర్థ్యాలేకాదు, అనంతమైన ఆత్మవిశ్వాసం కూడా కావాలి. అందుకే, ఠీవిగా నిలబడే పర్వతాలు కూడా వారి దృఢ సంకల్పం ముందు తల వంచుతాయ. 110 సంవత్సరాలు పూర్తి చేసుకొని, 111వ వసంతంలోకి అడుగుపెట్టిన టూర్ డి ఫ్రాన్స్, మరోసారి అభిమానులకు కనువిందు చేయనుంది. శనివారం ప్రారంభమైన ఈ ప్రతిష్ఠాత్మక రేసును గెల్చుకొని, ఒక చిరస్మరణీయ జ్ఞాపకాన్ని మిగుల్చుకోవడానికి 198 మంది రైడర్లు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. నిరుటి విజేత బ్రాడ్లీ విగిన్స్ టైటిల్ నిలబెట్టుకోవడం ఈసారి కష్టంగానే కనిపిస్తోంది. విగిన్స్‌తో చివరి వరకూ పోటీపడి, రెండో స్థానంలో నిలిచిన క్రిస్ ఫ్రూమ్ ఫేవరిట్‌గా బరిలో దిగుతున్నాడు. ఇటీవల ఒమాన్‌లో జరిగిన రేస్‌ను గెల్చుకొని సత్తా చాటిన 28 ఏళ్ల ఫ్రూమ్, ఆతర్వాత క్రిటెరియమ్ ఇంటర్నేషనల్, టూర్ ఆఫ్ రొమాండీ, ది క్రిటెరియమ్ డు డౌఫిన్ రేసులనూ తన ఖాతాలో చేర్చుకున్నాడు. టీ స్కై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతనికి మాజీ చాంపియన్ అల్బెర్టో కాంటడార్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురుకానుంది. 2007, 2009 సంవత్సరాల్లో విజేతగా నిలిచిన కాంటడార్‌తోపాటు జోక్విమ్ రొడ్రిగెజ్, కాడెల్ ఇవాన్స్ కూడా టైటిల్‌పై కనే్నశారు.
నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించి పట్టుబడిన లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్‌పై సస్పెన్షన్ వేటు పడిన తర్వాత టూర్ డి ఫ్రాన్స్ జరగడం ఇదే మొదటిసారి. ఏడు పర్యాయాలు విజేతగా నిలిచిన అతను డోపింగ్ కారణంగా టైటిళ్లను కోల్పోయాడు. రికార్డులు కూడా రద్దయ్యాయి. ఆర్మ్‌స్ట్రాంగ్‌పై వేటు పడిన తర్వాత మరెవరూ డోపింగ్‌కు పాల్పడరని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. 1997లో టైటిల్ సాధించి, మూడు పర్యాయాలు రెండో స్థానాన్ని ఆక్రమించిన జర్మనీ రైడర్ జన్ ఉల్రిచ్ తాను నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించానని వారం క్రితం చేసిన ప్రకటన వల్ల టూర్ డి ఫ్రాన్స్‌పై అనుమానం మేఘాలు కమ్ముకుంటున్నాయి. రక్తానికి ఉత్ప్రేరకంగా పని చేసే ఎరిథ్రోపొటిన్ (ఇపివో)ను వినియోగించిన ఫ్రెంచ్ స్టార్ లారెంట్ జలబెర్ట్ ఇప్పుడు టీవీ, రేడియో కామెంటేటర్‌గా అవతారం ఎత్తాడు. అంతర్జాతీయ సైక్లింగ్ యూనియన్ (యుసిఐ), టూర్ డి ఫ్రాన్స్ అధికారులను అతను నానా రకాల ప్రశ్నలతో వేధించడం ఖాయం. అతను చేసే వ్యాఖ్యలు అభిమానులపై తీవ్ర ప్రభావం చూపుతాయని టూర్ డి ఫ్రాన్స్ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మ్‌స్ట్రాంగ్ ఉదంతం తర్వాత రాజీనామా చేయాలంటూ యుసిఐ అధ్యక్షుడు పాట్ మెక్ కయిద్‌పై ఒత్తిడి పెరుగుతోంది. టూర్ డి ఫ్రాన్స్ రేస్‌ను ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహిస్తే, మరోసారి అధ్యక్ష స్థానానికి పోటీ చేయాలని కయిద్ ఆశిస్తున్నాడు. అతనికి కూడా ఈ రేస్ అత్యంత కీలకంగా మారింది.
తొలి చాంపియన్ గారిన్
ప్రతిష్ఠాత్మక టూర్ డి ఫ్రాన్స్ సైక్లింగ్ రేస్‌లో తొలి విజేత వౌరిస్ గారిన్. 1903లో జరిగిన మొదటి రేస్‌ను అతను గెల్చుకున్నాడు. 1871 మార్చి 3న ఇటలీలో జన్మించిన గారిన్ 1957 ఫిబ్రవరి 19న మృతి చెందాడు. 1885లో ఒక ఫ్యాక్టరీలో చినీ స్వీపర్‌గా పని చేసిన అతను 1889లో సైకిల్ కొన్నాడు. సైక్లింగ్ అంటే ఎంతో మక్కువ ఉండడంతో, చిన్నచిన్న రేసుల్లో పాల్గొనేవాడు. 1893లో అతను ఫ్రాన్స్‌కు వెళ్లి, అక్కడ స్థిరపడ్డాడు. అదే ఏడాది 701 కిలో మీటర్ల దూరాన్ని అతను 20 గంటల్లో పూర్తి చేసి సంచలనం సృష్టించాడు. 1896లో పారిస్-రొబాక్స్ రేస్ గెల్చుకున్నాడు. 1898లో మరోసారి ఇదే రేస్‌లో విజేతగా నిలిచాడు. 1901లో పారిస్-బ్రెస్ట్-పారిస్ రేస్‌ను కైవసం చేసుకున్నాడు. 1903 టూర్ డి ఫ్రాన్స్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచి, తొలి టైటిల్‌ను అందుకున్న సైక్లిస్టుగా రికార్డు సృష్టించాడు.
రికార్డులు.. విశేషాలు..
కెరీర్ మొత్తంలో అత్యధిక స్టేజీల్లో గెలుపొందిన రైడర్‌గా ఎడ్డీ మెక్‌కెక్స్ రికార్డు సృష్టించాడు. అతను 1969లో ఆరు, 1970లో ఎనిమిది, 1971లో నాలుగు, 1972లో ఆరు, 1974లో ఎనిమిది స్టేజీల్లో విజేతగా నిలిచాడు. కెరీర్‌లో అతను స్టేజ్ విజయాల సంఖ్య 34.
ఒక టూర్‌లో అత్యధిక స్టేజ్ విజయాలు ఎనిమిది. 1930లో చార్లెస్ పెలిసియర్, 1970, 1974 సంవత్సరాల్లో ఎడ్డీ మెక్‌కెక్స్, 1976లో ఫ్రెడ్డీ మార్టెన్స్ ఈ రికార్డును నమోదు చేశారు.
స్టేజ్ విజేతకు ఇచ్చే ఎల్లో జెర్సీని ఎక్కువ రోజులు ధరించిన రైడర్ ఎడ్డీ మెక్‌కెక్స్. అతు కెరీర్‌లో మొత్తం 96 రోజులు ఎల్లో జెర్సీ ధరించాడు.
1952లో స్టాన్ ఒకెర్స్‌పై ఫాస్టొ కొపీ 28 నిమిషాల 27 సెకన్ల తేడాతో విజయం సాధించాడు. టూర్ డి ఫ్రాన్స్ చరిత్రలోనే ఎక్కువ తేడాతో గెలుపొందిన రైడర్‌గా కొపీ రికార్డు సృష్టించాడు. కాగా, 1989లో లారెంట్ ఫిగ్నాన్‌పై గ్రెగ్ లెమాండ్ కేవలం 8 సెకన్ల తేడాతో గెలిచాడు. హోరాహోరీగా సాగిన రేస్ ఇదే. ఆ రేస్‌లోనే లెమాండ్ 24.5 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 54.930 కిలోమీటర్ల వేగంతో పూర్తి చేశాడు. టూర్ డి ఫ్రాన్స్‌లో అత్యంత వేగంగా సైకిల్ తొక్కిన రైడర్‌గా అతను మరో రికార్డును సృష్టించాడు.
ఫిర్మిన్ లాంబట్ 1922లో రేస్‌ను గెల్చుకునే సమయానికి అతని వయసు 36 సంవత్సరాలు. ఎక్కువ వయసులో విజేతగా నిలిచిన రైడర్‌గా అతని రికార్డును ఇప్పటి వరకూ ఎవరూ ఛేదించలేదు. హెన్రీ కార్నెట్ 1904లో టూర్ డి ఫ్రాన్స్ టైటిల్ అందుకునే సమయానికి అతని వయసు కేవలం 20 ఏళ్లు.
అత్యధిక పర్యాయాలు ఈ రేస్‌లో పాల్గొన్న రైడర్ జూప్ జొడెమెల్క్. 1970-1986 మధ్యకాలంలో అతను 16 పర్యాయాలు టూర్ డి ఫ్రాన్స్‌లో పాల్గొన్నాడు. ప్రతిసారీ అతను రేస్‌ను పూర్తి చేయడం మరో విశేషం.
రేస్‌లో పాల్గొనే ఒక్కో రైడర్ రోజుకు సుమారు 5,900 నుంచి 9,000 వరకూ కాలరీస్ శక్తిని ఉపయోగించుకుంటాడు.
ఇప్పటి వరకూ జరిగిన పోటీల్లో 1919లో అత్యల్పంగా కేవలం 10 మంది మాత్రమే రేస్‌ను పూర్తి చేశారు. 69 మంది రేస్‌ను మొదలుపెడితే, వారిలో 59 మంది మధ్యలోనే వైదొలిగారు.
జాక్వెస్ ఆంక్వెటిల్ (ఫ్రాన్స్) 1957 నుంచి 1961 వరకు, తిరిగి 1964లో టూర్ డి ఫ్రాన్స్ టైటిల్ సాధించాడు. ఆరు పర్యాయాలు విజేతగా నిలిచిన అతని పేరే రికార్డు పుస్తకాల్లో ఉంది. వాస్తవానికి లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ అత్యధికంగా ఏడు పర్యాయాలు ఈ టైటిల్ సాధించాడు. అయితే, తాను డోపింగ్‌కు పాల్పడినట్టు అంగీకరించడంతో అతని టైటిళ్లతోపాటు రికార్డులను కూడా రద్దు చేశారు. ఆర్మ్‌స్ట్రాంగ్ పేరు మాయం కావడంతో, ఎక్కువ టైటిళ్లు సాధించిన రైడర్‌గా ఆంక్వెటిల్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఎడ్డీ మెక్‌కెక్స్, బెర్నార్డ్ హినాల్ట్, మిగెల్ ఇండురైన్ తలా ఐదేసి పర్యాయాలు విజేతలుగా నిలిచారు.
మిగెల్ ఇండురైన్ 1991 నుంచి 1995 వరకూ వరుసగా ఐదు పర్యాయాలు టైటిల్ సాధించాడు. వరుస టైటిళ్ల రికార్డు ఇది. ఆర్మ్‌స్ట్రాంగ్ 1999 నుంచి 2005 వరకూ ఏడుసార్లు టూర్ డి ఫ్రాన్స్‌ను గెల్చుకున్నాడు. కానీ, అతని రికార్డును రద్దు చేశారు. అమెరికా తరఫున గ్రెగ్ లెమాండ్ (1986, 1989, 1990), లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ (1999, 2000, 2001, 2002, 2003, 2004, 2005) టైటిళ్లు రద్దయ్యాయి.
మూడు వారాల్లో ఒక్కో రైడర్ తన సైకిల్ పెడల్‌ను 3,24,000 నుంచి 4,86,000 పర్యాయాలు తొక్కుతాడు. ఒక్కో సైకిల్‌కు సగటున మూడు చైన్లను మార్చాల్సి వస్తుంది.
ఈ ఏడాది పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఏ స్టేజీని ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. ఉత్కంఠ భరితంగా సాగే రేసును గెలిచే అవ కాశాలు ఎవరికి ఉంటాయో ఊహించడం కూడా కష్టమే. విజయం ఎవరిదైనా ఈ రేస్ ఉత్కంఠ భరితంగా జరుగుతుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్‌గా పేరు
english title:
konda konallo
Date:
Sunday, June 30, 2013