భారత ఆర్చరీ సంఘం (ఎఎఐ) వ్యవహారం కొత్త సమస్యలకు దారితీస్తున్నది. దేశంలోని అన్ని జాతీయ క్రీడా సంఘాలకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎన్నికలు జరిగాయంటూ ఎఎఐ గుర్తింపును కేంద్రం రద్దు చేసింది. అయితే, అంతర్జాతీయ ఆర్చరీ సమాఖ్య (్ఫటా) గుర్తింపు కొనసాగుతున్నది కాబట్టి ప్రభుత్వ నిర్ణయంతో తమకు సంబంధం లేదని ఎఎఐ స్పష్టం చేస్తున్నది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నది. సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విజయ్ కుమార్ మల్హోత్రా మొండి వైఖరే ప్రస్తుత వివాదానికి ప్రధాన కారణం. కేంద్రం సూచిస్తున్న కొత్త మార్గదర్శకాలను అనుసరించి 70 సంవత్సరాలు పైబడిన వారెవరూ క్రీడా సమాఖ్యలకు పోటీ చేయడానికి లేదా పదవులు నిర్వహించడానికి అనర్హులు. దీని ప్రకారం 81 ఏళ్ల మల్హోత్రా ఎఎఐ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం లేదు. అయితే, పదవి నుంచి వైదొలగేందుకు అతను ససేమిరా అంటున్నాడు. ఎన్నికల తంతును ముగించాడు. భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) తాత్కాలిక అధ్యక్షుడిగా తనను గుర్తించిన ప్రభుత్వం, ఎఎఐ విషయంలో ఎందుకు కాదంటున్నదని అతని వాదన. ఆర్చరీ సంఘానికి వర్తించే వయసు నిబంధనను ఐఒఎకు వర్తించదా అని ప్రశ్నిస్తున్నాడు. కానీ మల్హోత్రా వాదనలో పస లేదన్నది వాస్తవం. ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నదన్న ఆరోపణపై ఐఒఎ గుర్తింపును అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) రద్దు చేసే సమయానికి మల్హోత్రా తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. నిజానికి ఐఒఎ అప్పటి అధ్యక్షుడు సురేష్ కల్మాడీపై అవినీతి ఆరోపణలు వచ్చే సమయానికి కేంద్రం ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేయలేదు. ఐఒసి సస్పెండ్ చేసినప్పటికీ వెనక్కు తగ్గని ఐఒఎ ఎన్నికలను నిర్వహించింది. అభయ్ సింగ్ చౌతాలా అధ్యక్షుడిగా కొత్త కమిటీ ఎన్నికైంది. అయితే, ఈ కొత్త కమిటీని గుర్తించడం లేదని ఐఒసి తేల్చిచెప్పింది. తాము సస్పెన్షన్ నిర్ణయం తీసుకునే సమయానికి మల్హోత్రా తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించిన కమిటీతోనే ఏవైనా సంప్రదింపులు జరుపుతామని స్పష్టం చేసింది. ఒలింపిక్స్ మొదలుకొని అన్ని అంతర్జాతీయ ఈవెంట్స్‌లో భారత్ పాల్గొనాలంటే, ఐఒసి గుర్తింపు ఉండితీరాలి. లేకపోతే, జాతీయ పతాకాన్ని ధరించకుండా, ఐఒసి పతాకం కింద పోటీపడాలి. సస్పెన్షన్‌ను పునఃసమీక్షించే విషయంపై లాసనే్నలో జరిగిన సమావేశానికి భారత ప్రభుత్వ ప్రతినిధులతోపాటు, మల్హోత్రా తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించిన కిమటీని ఐఒసి ఆహ్వానించింది. కానీ, ఐఒసి సభ్యుడు రణ్‌ధీర్ సింగ్‌తోపాటు మల్హోత్రా కూడా ఆ సమావేశానికి హాజరుకాలేదు. మిగతా ఐఒఎ ప్రతినిధులు హాజరుకావడంతో సమావేశం సంతృప్తికరంగా సాగింది. కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ స్వయంగా లాసనే్న వెళ్లి, ఐఒసి అధికారులతో చర్చించడంతో ఐఒఎపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఐఒసి ఆదేశాలకు అనుగుణంగానే కేంద్రం వ్యవహరించింది. దీనిని అడ్డం పెట్టుకొని, ఎఎఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొనేది లేదంటూ మల్హోత్రా భీష్మించుకోవడం విచిత్రం. ప్రతి దేశంలోనూ జాతీయ క్రీడా సమాఖ్యలన్నీ ఒకే విధానాన్ని అనుసరిస్తాయి. మన దేశంలో మాత్రం ఎవరి దారి వారిది. దేశ వ్యాప్తంగా ఒకే క్రీడా విధానం ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ క్రీడా బిల్లును ప్రవేశపెట్టేందుకు అప్పటి క్రీడాశాఖ మంత్రి అజయ్ మాకెన్ శక్తివంచన లేకుండా కృషి చేశాడు. అయితే, ఎక్కువ శాతం జాతీయ క్రీడా సమాఖ్యల్లో రాజకీయ నాయకులే కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. క్రీడా బిల్లును ఆమోదిస్తే వారిలో ముప్పాతిక శాతం తమ పదవులను వదులుకోవాల్సి వస్తుంది. ఈ కారణంతోనే కేబినెట్‌లోనే కొంత మంది క్రీడా బిల్లును వ్యతిరేకించారు. కారణాలు ఎలావున్నా, క్రీడా బిల్లుకు ఇంకా ఆమోద ముద్ర పడలేదు. ఈలోగా మార్గదర్శకాలను కేంద్రం ఖరారు చేసినప్పటికీ, ఎఎఐ వంటి సమాఖ్యలు వీటిని అమలు చేయడానికి సిద్ధంగా లేవు. స్వార్థ ప్రయోజనాల కోసం యావత్ క్రీడా రంగాన్ని భ్రష్టుపట్టిస్తున్న సంఘాలు, సమాఖ్యల్లో ఆర్చరీది అగ్రస్థానం. అంతర్జాతీయ ఈవెంట్స్‌లో మెరికల్లాంటి ఆర్చర్లను పంపాల్సిన బాధ్యతను విస్మరించిన ఎఎఐ మిగతా సమాఖ్యలు కూడా ప్రభుత్వాన్ని ధిక్కరించేలా ప్రవర్తిస్తున్నది. మన దేశంలో క్రికెట్‌ను మినహాయిస్తే, మిగతా ఏ ఒక్క ఆట కూడా కేంద్ర ఆర్థిక సాయం లేనిదే మనుగడ సాగించే పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి డబ్బు కావాలిగానీ ప్రభుత్వ మార్గదర్శకాలను మాత్రం పాటించమంటూ ఎఎఐ పట్టుబట్టడం హాస్యాస్పదం. ఇందులో మల్హోత్రా స్వార్థమే తప్ప ఆర్చరీకి ఒరిగే మేలు ఏమీ లేదు. దేశంలో ఆర్చరీ సంఘం గురి తప్పింది. చక్కదిద్దే చర్యలు చేపట్టకపోతే అంతర్జాతీయ వేదికపై భారత క్రీడా రంగం నవ్వులపాలయ్యే ప్రమాదం ఉంది. ఎనిమిది పదుల వయసు నిండిన మల్హోత్రా తన పదవి నుంచి గౌరవంగా తప్పుకొని, ఉన్నత విలువలను నెలకొల్సిన అవసరం ఉంది. లేకపోతే, మిగతా క్రీడల మాదిరిగానే ఆర్చ రీ కూడా అవినీతి ఊబిలో కూరుకుపోయే ప్రమా దం ఉంది. ఆర్చరీలో పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన వారికి సంఘంలో తగిన గుర్తింపునిచ్చి, వారి సేవ లను వినియోగించుకునేలా ప్రభుత్వం మార్గదర్శ కాలను విడుదల చేయాలి. నిబంధనలను అమలు చేయాలి.
భారత ఆర్చరీ సంఘం (ఎఎఐ) వ్యవహారం
english title:
archery
Date:
Sunday, June 30, 2013