మార్కాపురం, జూన్ 30: పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు కసరత్తు ప్రారంభించారు. మార్కాపురం డివైఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో డివిజన్‌లోని పలు మండలాల్లో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలను గుర్తించే ప్రక్రియను పోలీసులు ప్రారంభించారు. గతంలో జరిగిన ఎన్నికల ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని ఆ గ్రామాలను సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అప్పట్లో కేసుల్లో ఉన్న వారిని ముందస్తు బైండోవర్లు చేసుకుని స్థానిక తహశీల్దార్ వద్ద హాజరుపరచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో పోలీసులు, రెవెన్యూ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బన్వర్‌లాల్ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. దీనితో జిల్లాఎస్పీ జిల్లాపరిధిలోని పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీనితో పోలీసులు గత చరిత్రను సేకరించి కేసుల్లో ఉన్న వారిపై బైండోవర్లు పెట్టడంతోపాటు సమస్యాత్మక గ్రామాల్లో అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో భారీఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. మార్కాపురం డివైఎస్పీ జి రామాంజనేయులు భూమితో మాట్లాడుతూ ఇప్పటికే రెవెన్యూ, మండలపరిషత్, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించడం జరిగిందని, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని, రిజర్వేషన్ల కోటాలో వచ్చిన పంచాయతీలలో పెద్దగా ఇబ్బందులు ఉండవని, ఓసి రిజర్వేషన్ వచ్చిన పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
* సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల గుర్తింపు * ఘర్షణలు జరిగిన గ్రామాల్లో బైండోవర్లకు ప్రయత్నాలు * చర్యలు ప్రారంభించాం-డివైఎస్పీ రామాంజనేయులు
english title:
police
Date:
Monday, July 1, 2013