మార్కాపురం , జూన్ 30: కాంట్రాక్టర్ వైఫల్యమో..? అధికారుల నిర్లక్ష్యమో..? తెలియదు కానీ ప్రజలకు మాత్రం కష్టాలు తీరడం లేదు. మార్కాపురం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 58కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఎస్‌ఎస్ ట్యాంక్‌కు సాగర్ నీరు సరఫరా చేసే పైపులు మూడురోజులకో పర్యాయం పగిలిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోతుంది. వర్షాభావ పరిస్థితుల్లో తీవ్ర నీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతుంటే వారి దాహార్తి తీర్చాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రభుత్వంపై పోరాటం సాగించి సాగర్‌నీటిని విడుదల చేయిస్తే ఆ నీరు పట్టణానికి చేరడానికి పలు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీనితో ప్రజల గొంతు తడిసే పరిస్థితులు కరువవుతున్నాయి. సాగర్‌జలాలు పట్టణానికి విడుదల చేసి మూడేళ్ల కాలంలో సుమారు 34 పర్యాయలు పైపులైన్లు పగిలి వారాల పర్యంతం నీటి సరఫరా నిలిచిపోయింది. గత వారంరోజుల కిందట కేశినేనిపల్లి సమీపంలోనిం పెద్దదోర్నాల కోల్డ్‌స్టోరేజ్ వద్ద పైపులు పగిలి నీటి సరఫరా నిలిచిపోగా అధికారులు మరమ్మతులు చేశారు. కాగా ఆదివారం అదే ప్రాంతానికి కొద్దిదూరంలో మరో పర్యాయం పైపులైన్లు పగిలిపోవడంతో మరో నాలుగురోజుల పాటు పట్టణానికి నీరు వచ్చే అవకాశం లేకుండా పోయింది. గత 40రోజులుగా పట్టణంలో నీటి సరఫరా జరుగక ట్యాంకర్ల ద్వారా అరకొరగా సరఫరా చేస్తున్నారు. సాగర్‌జలాలు విడుదల చేసి ఆదివారం నుంచి నీటి సరఫరా జరుగుతుందని పట్టణ ప్రజలు ఆనందపడుతున్న సమయంలో ఆదివారం సాయంత్రం అధికారులు పిడుగులాంటి వార్తను ప్రకటించారు. దీనితో పట్టణ ప్రజలు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైపులైన్లు మరమ్మత్తులకు గురికాకుండా సక్రమంగా తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
పట్టుకోసం ఒకరు.. పంతంకోంస మరొకరు.. పరువుకోసం ఇంకొకరు
మార్కాపురం, జూన్ 30: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతుండటంతో ఒకపార్టీ పట్టుకోసం, మరోపార్టీ పంతం కోసం, ఇంకోపార్టీ పరువుకోసం కొట్టుమిట్టాడుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తాము బలపరచిన అభ్యర్థులను గెలిపించుకొని పట్టు నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీని ఏర్పాటు చేసి ప్రజల్లో బలం ఉందని చెప్పుకునే నేతలు ఎలాగైనా విజయం సాధించి తమ పంతం నెగ్గుకోవాలని తాపత్రయ పడుతున్నారు. కాగా తొమ్మిదేళ్ళపాటు అధికారంలో ఉండి మరో తొమ్మిదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేపట్టిన తెలుగుదేశంపార్టీ పరువు నిలుపుకునేందుకు కుస్తీ పడుతున్నారు. ఇప్పట్లో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే అవకాశం లేదని భావించిన అన్ని రాజకీయపార్టీలు సాధారణ ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించిన సమయంలో ఒక్కసారిగా పంచాయతీ ఎన్నికలు తెరపైకి రావడంతో ఇప్పుడెందుకు వచ్చాయిరా మాయదారి ఎన్నికలు అంటూ నేతలు ఆందోళన చెందుతున్నారు. మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఆ ఎన్నికలకు క్షేత్రస్థాయి మూలం స్థానిక సంస్థలు కావడంతో ఎలాగైనా తమ మద్దతుదారులను గెలిపించుకోవాలని మూడుపార్టీలు ఎత్తులకుపైఎత్తులు వేస్తున్నారు. దీనితో అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా పల్లెప్రాంతాల్లో మకాంలు వేసి అభ్యర్థుల ఖరారులో తలమునకలవుతున్నారు. ప్రధానంగా గెలుపుబాటలో ముందు ఉండేందుకు కాంగ్రెస్‌పార్టీకి చెందిన నేతలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇక రెండవస్థానంలో తెలుగుదేశంపార్టీ చోటామోటా నాయకులందరిని సమీకరించుకొని తనదైన శైలిలో పోరుకు సిద్ధం అవుతున్నారు. ఇక ఇటీవల ఏర్పాటైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా క్షేత్రస్థాయిలో తమకు బలం ఉందని ఎలాగైనా స్థానిక సంస్థల్లో అధిక పంచాయతీలు గెలిపించుకొని సత్తా చాటుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. అధికార కాంగ్రెస్‌పార్టీలో మాత్రం శాసనసభ్యుల వద్ద మెప్పుపొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. కాగా గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రజలు వివిధ పనులపై పగటిపూట పట్టణాల్లో సంచరిస్తుండగా రాజకీయ నేతలు రాత్రి సమయాల్లో గ్రామాల్లో మకాంవేసి గెలుపుకోసం చర్చలు జరుపుతున్నారు. ఏదిఏమైనా గత ఎన్నికల్లో రెండుపార్టీలు కావడంతో అనేక పంచాయతీలు ఏకగ్రీవం కాగా ప్రస్తుతం మూడు రాజకీయ పార్టీలు రంగంలో ఉండటంతో ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య భారీగా తగ్గి మూడు ముక్కలాటగా మారే పరిస్థితి ఏర్పడింది.
కాంట్రాక్టు అధ్యాపకులను అర్ధనగ్న ప్రదర్శన
ఒంగోలు, జూన్ 30: ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గౌర్నమెంట్ కాలేజెస్ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆద్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద అధ్యాపకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరుతూ అసోసియేషన్ ఆద్వర్యంలో అధ్యాపకులు స్థానిక కలెక్టరేట్ వద్ధ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 7వ రోజుకు చేరాయి . ఈ సందర్భంగా ప్రభుత్వ మొండివైఖరి నశించాలని, ఎపిపిఎస్‌సి ద్వారా జెఎల్ నోటిఫికేషన్ ఆపాలని. అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు చేతబూని పెద్దఎత్తున నినాదాలు చేశారు. తొలుత అధ్యాపకులు చేసిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యానం చిన యోగయ్య యాదవ్ సందర్శించి అధ్యాపకులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా యానం చిన యోగయ్య యాదవ్ మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకులను వెంటనే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధ్యాపకులు తమ సమస్యల పరిష్కారం కోసం గత 7 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేయటం వల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు తరగతులు జరగడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం కలుగచేసుకొని అధ్యాపకుల సమస్యలను పరిష్కరించి విద్యార్థులు నష్టపోకుండా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు కె సురేష్, ఆర్‌సి రంగయ్య, పి మాధవరావు, పి కరీమ్ ఖాన్, రసూలు, కాశీరత్నం, సుబ్బారెడ్డి, బాబూరావు, నరసారెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
* పట్టణంలో నిలిచిన తాగునీటి సరఫరా
english title:
water pipes
Date:
Monday, July 1, 2013