తిరుపతి, జూలై 2: అన్ని వర్గాల ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్‌ను ఎవరు నమ్మరని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినా ఆ పార్టీకి ఓట్లు రాలవని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు అన్నారు. కాంగ్రెస్ పరిస్థితి చివరకు రెంటికి చెడ్డ రేవటవుతుందన్నారు. తిరుపతిలో జరుగుతున్న భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మంగళవారంతో ముగిసాయి. ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజన అంశం నుంచి తప్పించుకోడానికి కాంగ్రెస్ రోజుకో నాటకం ఆడుతోందన్నారు. తొమ్మిదేళ్ల పాటు అనిశ్చితి కల్పించిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. ఇటువంటి పరిస్ధితుల్లో తెలంగాణ ఇచ్చినా, ఇవ్వకున్నా కాంగ్రెస్‌కు ఓట్లు రాలే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణా రాష్ట్రం ఇవ్వాలని బల్లగుద్ది చెపుతున్న ఏకైక పార్టీ బిజెపి మాత్రమేనన్నారు. మిగతా రాజకీయ పార్టీలన్నీ ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నాయన్నారు. తృతీయ ఫ్రంట్ ఒక ఎండమావన్నారు. సభకు అధ్యక్షత వహించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపికి అనుకూల ఫవనాలు వీస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బిజెపినే అని, వచ్చే వర్షాకాలం పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ ప్రకటించాలని సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని చేశారు. కాగా మీడియా తన బాధ్యతలను విస్మరిస్తుందని బిజెపి మాజీ జాతీయ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు విమర్శించారు. ఒక అత్యున్నత రాజకీయ నాయకుడ్ని హత్య చేసేందుకు సరిహద్దులు దాటి వచ్చిన ఒక ఉగ్రవాద సంస్థ ఏర్పాటు చేసిన ఇస్రాత్ జహాన్ మరణించడాన్ని, ఆమె సహచరులను మృతవీరులుగా అభివర్ణిస్తూ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసిందన్నారు. ఆమె మృతికి లష్కరే తోయిబా కూడా నివాళులు అర్పించిందన్నారు. కేంద్ర హోంశాఖ అమె ఒక టెర్రరిస్టు అని చెప్పిందన్నారు. దేశంలో 401 ఎన్‌కౌంటర్లు జరిగాయని, వాటికి ఇవ్వని ప్రచారం ఉగ్రవాది ఇస్రాత్ జహాన్‌కు ఇవ్వడం సబబా అని ఆయన ప్రశ్నించారు.
దక్షిణాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం, జూలై 2: ఒడిశా నుంచి దక్షిణాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడనద్రోణి కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరిక కేంద్రం మంగళవారం రాత్రి తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల వర్షాలు, ఉరుములతో కూడిల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ కేంద్రం పేర్కొంది.
* బిజెపి నేత వెంకయ్యనాయుడు అభిప్రాయం
english title:
t
Date:
Wednesday, July 3, 2013