హైదరాబాద్, జూలై 2: మద్యం బారు షాపులకు కొత్త పాలసీని ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు జీవో నంబర్ 397ను ప్రభుత్వం విడుదల చేసింది. మద్యం రిటెల్ షాపుల కొత్త పాలసీని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పెండింగ్‌ల పెట్టిన బార్ల పాలసీని కూడా ఎట్టకేలకు ప్రభుత్వం మంగళవారం ఖరారు చేసి విడుదల చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న 1458 బార్లకు యధావిధిగా లైసెన్స్‌లను రెన్యూవల్ చేసుకోవడానికి అవకాశం కల్పించడంతో పాటు, ప్రస్తుతం బార్ల లైసెన్స్‌ల ఫీజుపై ఐదు రెట్లు ఉన్న అమ్మకాల పరిమితిని ఆరు రెట్లకు పెంచినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో ఉన్న ఐదు రెట్లకు మించి అమ్మకాలు జరిపితే టర్నోవర్‌పై 15 శాతాన్ని ప్రభుత్వానికి ప్రివిలేజు ఫీజుగా చెల్లించాల్సి ఉండేది. అయితే కొత్త పాలసీలో దీనిని ఐదు నుంచి ఆరు రెట్లకు పెంచినట్టు పేర్కొన్నారు. దీని వల్ల బార్ల లైసెన్స్‌దారులకు కాసుల పంట పండనుంది. ప్రస్తుతం ఉన్న బార్లను కొనసాగిస్తూనే కొత్తగా పర్యాటక ప్రాంతాలు, స్టార్ హోటళ్లలో బార్లను ఏర్పాటు చేసుకునేందుకు కొత్త పాలసీలో అవకాశం కల్పించింది. అయితే వీటికి లైసెన్స్ ఫీజును సమీపంలోని పట్టణం, నగరం ఏది దగ్గరుంటే దాని జనాభా ప్రకారం లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే జనాభా ప్రాతిపదికన బార్లకు లైసెన్స్ ఫీజులను ఖరారు చేసింది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న బార్లకు 2001 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోగా, కొత్త పాలసీలో 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ లెక్కన 50 వేల జనాభా కలిగిన పట్టణాల్లో బార్లకు రూ. 25 లక్షలు, 50 వేల జనాభాకు పైబడి ఉంటే రూ. 35 లక్షలు, ఐదు లక్షల జనాభాకు పైబడి ఉంటే రూ. 38 లక్షలు, 20 లక్షల జనాభాకు పైబడి ఉంటే రూ. 31 లక్షల లైసెన్స్ ఫీజును ఖరారు చేసింది.
* బార్లకు కొత్త పాలసీ * జనాభా ప్రాతిపదికన ఫీజు * 1458కి రెన్యూవల్ అవకాశం
english title:
l
Date:
Wednesday, July 3, 2013