కర్నూలు, జూలై 2: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకం ఆసుపత్రిలో ఓ బిడ్డ తారుమారైన విషయాన్ని బయటపెట్టింది. తమకు పుట్టిన బిడ్డ ఒకరైతే తమ చేతికి ఇచ్చిన బిడ్డ మరొకరంటూ చిన్నారి తల్లిదండ్రులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఆందోళనకు దిగారు. బిడ్డ తారుమారైన విషయం బంగారు తల్లి పథకం నమోదుకోసం వెళ్లగా బయట పడటం యాదృశ్చికమే అయినా ఇప్పుడు వైద్యాధికారులకు మాత్రం తీవ్ర ఇబ్బందులను తీసుకొచ్చింది. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన రమణమ్మ(21)ను ప్రసవం కోసం ఆమె భర్త భీమలింగప్ప మే 20వ తేదీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఇక్కడ ఆమె అదేరోజు బిడ్డకు జన్మనిచ్చింది. మూడు రోజుల తరువాత తల్లిదండ్రులు బిడ్డను తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయారు. ఇటీవల ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకం కింద తన బిడ్డపేరు నమోదు చేయడానికి వెళ్లిన భీమలింగప్పకు మీ సేవ నిర్వాహకులు అసలు విషయాన్ని చల్లగా చెప్పారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి రికార్డుల ప్రకారం మీకు మగపిల్లాడు పుట్టాడని బంగారు తల్లి పథకం వర్తించదని తేల్చి చెప్పారు. దాంతో కర్నూలు ఆసుపత్రి, నగర పాలక సంస్థ రికార్డులను మీ సేవ నిర్వాహకుల సహకారంతో మరోమారు తనిఖీ చేయించారు. ఆ రికార్డుల్లోనూ మగపిల్లాడు పుట్టినట్టుగా నమోదు కావడంతో తండ్రి భీమలింగప్ప నిర్ఘాంతపోయాడు. వెంటనే ఆడబిడ్డతో సహా భీమలింగప్ప దంపతులు కర్నూలు ఆసుపత్రికి వచ్చి తమకు పుట్టింది మగబిడ్డ అయితే ఆడపిల్లను ఎందుకిచ్చారని నిలదీశారు. ఆసుపత్రి సిబ్బంది మాత్రం తమ రికార్డుల్లో సరిగా ఉందని, మున్సిపాలిటీ రికార్డుల్లో పొరపాటు జరిగి ఉండవచ్చని బిడ్డ తారుమారు కాలేదని భీమలింగప్పకు సర్దిచెప్పారు. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు డిఎన్‌ఎ పరీక్ష చేయించాలని తల్లిదండ్రులు పట్టుబడ్డారు. అందుకు సిబ్బంది అంగీకరించకపోవడంతో వైద్యాధికారుల వద్దకు వెళ్లి తమ గోడు వెల్లబోసుకున్నారు. అక్కడా సరైన సమాధానం రాకపోవడంతో కలెక్టర్ సుదర్శన్‌రెడ్డిని కలిసి న్యాయం కోసం విజ్ఞప్తి చేయాలని భావించి వెళ్లగా ఆయన క్యాంపుకెళ్లిన విషయం తెలిసి తిరిగి ఆసుపత్రి కాన్పుల వార్డు వద్దకు చేరుకున్న దంపతులు ఆందోళనకు దిగారు. తమకు పుట్టింది ఆడో మగో తేల్చాలని పట్టుపట్టారు. రికార్డులు తారుమారంటూ ఆసుపత్రి సిబ్బంది బుకాయిస్తున్నారని, తమకు పుట్టింది మగబిడ్డ కాబట్టే రికార్డుల్లో అలాగే నమోదు చేశారని అంటున్నారు. కాగా ఆసుపత్రి రికార్డుల్లో ఆడబిడ్డ అని నమోదైనట్లు తెలుస్తోంది.
డిఎన్‌ఎ పరీక్ష కోసం తల్లిదండ్రుల పట్టు * ఆసుపత్రిలో బైఠాయింపు
english title:
k
Date:
Wednesday, July 3, 2013