చిత్తూరు, జూలై 2: ఉత్తరాఖండ్ రాష్ట్రం చార్‌ధామ్ వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వెళ్లి హెలికాప్టర్ ప్రమాదంలో అశువులు బాసిన వీరజవాన్ వినాయకం త్యాగం చిరస్మరణీయం. గత మంగళవారం హెలిక్టాపర్ ప్రమాదంలో మృతి చెందిన వినాయకం మృతదేహం ఈ మంగళవారం మధ్యాహ్నం 1.30గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొంది. అక్కడి నుండి 3.30గంటలకు మండల కేంద్రమైన పూతలపట్టు చేరుకుంది. అక్కడి నుంచి అంబులెన్సులో ఉన్న వినాయకం మృతదేహాన్ని పోలీసులు పుష్పాలతో అలంకరించిన మినిలారీలో ఉంచి ఊరేగింపుగా ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నబండపల్లెకు తీసుకెళ్లారు. మండల కేంద్రమైన పూతలపట్టులోనే వినాయకం మృతదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి జిల్లాకలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్, ఎస్పీ కాంతిరాణాటాటా నివాళులు అర్పించారు. రేణిగుంట నుండి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అమాస రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం తరుపున మృతదేహంతోపాటు చిన్నబండపల్లె వరకు వచ్చారు. ఇదిలా ఉండగా పూతలపట్టులో ఇంకా తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షులు జంగాలపల్లె శ్రీనివాసులు, చిత్తూరుపార్లమెంటు సభ్యులు డాక్టర్ ఎన్.శివప్రసాద్, మాజీ ఎం.పి ఎన్.పి.దుర్గారామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ఎల్.లలితకుమారి, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు తలపులపల్లె బాబురెడ్డి, సుబ్బారెడ్డిలు వినాయకం మృతదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అక్కడి నుండి పోలీసు లాంచనాలతో ఊరేగింపుగా బయలుదేరిన వినాయకం శవం సాయంత్రం 5.45గంటలకు స్వగ్రామమైన చిన్నబండపల్లె చేరుకొంది. వినాయకం మృతదేహంతోపాటు ఆర్కోణంకు చెందిన ఆర్మీ కమాండర్ ఎం.కె.వర్మతోపాటు పలువురు సైనికులు వెంటవచ్చారు. గత ఎనిమిదిరోజులుగా వినాయకం మృతదేహంకోసం ఎదురు చూస్తున్న గ్రామస్థులు, తల్లిదండ్రులు ఒక్కసారిగా శవపేటిక రాగానే బోరున విలపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఎవరూ చూడలేని విధంగా మిలటరీవారు బాక్సులో పెట్టి తీసుకురాగానే వారి తల్లిదండ్రులు ఖిన్నులయ్యారు. కడసారి చూపు లభించలేదని బాధపడ్డారు. వినాయకం అంత్యక్రియలు బుధవారం జరుపనున్నట్లు తల్లిదండ్రులు, గ్రామస్థులు తెలిపారు. ఇదిలావుండగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం సొమ్ము ఐదు లక్షల రూపాయల చెక్కును వినాయకం తల్లిదండ్రులు కృష్ణన్, రాణెమ్మకు కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ మంగళవారం అందజేశారు.కాగా ఎస్పీ కాంతి రాణాటాటా తన వంతు సాయంగా మరో లక్ష రూపాయలు చెక్కును అందజేశారు.
రేణిగుంటకు విమానంలో తీసుకువచ్చిన
జవాన్ వినాయకం మృతదేహం ఉన్న
శవపేటికను వెలుపలకు తెస్తున్న సైనికులు
ఉత్తరాఖండ్ రాష్ట్రం చార్‌ధామ్ వరదల్లో చిక్కుకున్న
english title:
v
Date:
Wednesday, July 3, 2013