విశాఖపట్నం, జూలై 2: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్టు స్పష్టమైన ప్రకటన చేయాలంటూ సమైక్యాంధ్ర విద్యార్ధి జెఏసి (14విశ్వవిద్యాలయాల కమిటీ) ఆధ్వర్యంలో మంగళవారం విశాఖ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రామాటాకీస్ నుంచి బయలుదేరిన ఈ ర్యాలీ ఆశీలమెట్టు, ఆర్టీసీకాంప్లెక్స్ మీదుగా జివిఎంసి గాంధీ విగ్రహానికి చేరుకుంది. అక్కడ గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జెఏసి రాష్ట్ర కన్వీనర్ లగుడు గోవిందరావు, యువజన జెఏసి రాష్ట్ర చైర్మన్ ఆరేటి మహేష్‌లు మాట్లాడుతూ తాజా పరిణామాల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్య రాష్ట్రంగా ఉంచుతున్నట్టు స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. డిసెంబర్ 23 ప్రకటనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర, తెలంగాణ రోడ్డు మ్యాప్‌లపై ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
ఆత్మగౌరవ ఉద్యమం
తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో ముందుకు వెళ్ళి ఆంధ్ర రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని విశాఖలో మంగళవారం సమైక్యాంధ్ర ప్రజాపోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతినిధులు తీర్మానించారు. ఈ సందర్భంగా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జిఏ నారాయణరావు మాట్లాడుతూ టిఆర్‌ఎస్, తెలంగాణ కాంగ్రెస్, బిజెపి నాయకుల సవాళ్ళను తిప్పికొట్టేందుకు సమైక్యవాదులు ఐక్యంగా ముందుకు వెళ్ళాలని పిలుపునిచ్చారు. శాంతియుతంగా గాంధేయ మార్గంలో సమైక్యాంధ్ర గురించి అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని గత మూడేళ్ళుగా పోరాటాలు చేస్తున్నామన్నారు. విభజనపై సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు కల్లబొల్లి కబుర్లతో మొసలి కన్నీరు కారుస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. వీళ్ళంతా ఢిల్లీ వెళ్ళి కేంద్రంపై వత్తిడి తీసుకువచ్చి ఉద్యమించాలని, అలాగే రాష్ట్ర విభజన జరగదని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీమాంధ్ర ప్రజలు క్షమించరన్నారు. అలాగే త్వరలో దీనిపై స్పష్టత కోసం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ను తామంతా కలుస్తామన్నారు.
శాప్స్, విద్యార్థి జెఎసి నేతలు అరెస్ట్
తిరుపతి: ఒక వైపు రాష్ట్రంలో విభజనపై ఉద్యమాలు జరుగుతుండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకోసం మద్దతు ఇచ్చే బిజెపి నాయకులు సీమాంధ్రలో భాగమైన తిరుపతిలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టడానికేనని శాప్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, ప్రచార కార్యదర్శి కెవి రత్నం, సమైక్యాంధ్ర ముస్లింమైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, విద్యార్థి జెఎసి రాష్ట్ర కో- కన్వీనర్ ఎన్ శేషాద్రినాయుడు విమర్శించారు. తిరుపతిలో జరుగుతున్న బిజెపి రాష్టక్రార్యవర్గ సమావేశాలను అడ్డుకునేందుకు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకుని ఈస్టు పోలీసుస్టేషన్‌కు తరలించారు. కాగా తమ సంఘం నేతలను అక్రమంగా అరెస్టుచేయడాన్ని నిరసిస్తూ తిరుపతిలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద శాప్స్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, విద్యార్థి జెఎసి నేతలు కిరణ్, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు భారతి ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
ఎన్నికల కోసమే తెలంగాణ నాటకం!
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, జూలై 2: తెలంగాణ విషయంలో కాంగ్రెస్ మరోసారి ప్రజలను మోసం చేస్తోందని సిపిఎం రాష్టక్రార్యదర్శి బివి రాఘవులు విమర్శించారు. మంగళవారం ఒంగోలులోని వసతిగృహాలను సందర్శించిన అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. పంచాయితీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తెలంగాణా విషయంలో మరోనాటకమాడుతోందన్నారు. పంచాయతీ ఎన్నికలకోసం తెలంగాణా అంశాన్ని ముందుకు తీసుకువచ్చిందే తప్ప సమస్యను పరిష్కరించడానికి కాదన్నారు. ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజులు వేలకువేలు వసూలు చేయటం వెనుక ప్రభుత్వపెద్దల భాగస్వామ్యం ఉందన్నారు.
14 వర్శిటీల జెఏసీ హెచ్చరిక
english title:
r
Date:
Wednesday, July 3, 2013