కొడవలూరు, ఫిబ్రవరి 28: రానున్న ఉప ఎన్నికల్లో ప్రజాశీర్వాదంతో విజయం సాధిస్తానని మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం కొడవలూరు మండలం నాయుడుపాలెం పంచాయతీలో వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థిగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ఎన్నికలు ఎంతో కీలకంగా మారాయన్నారు. తాను వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడ్తే ఢిల్లీ పెద్దలకు పార్టీ సత్తా, జగన్మోహన్ రెడ్డి శక్తిసామర్థ్యాలు, ప్రజల్లో వైఎస్ కుటుంబంపై చెరగని ఆదరాభిమానాలు ఎలాంటివో తెలిసి వస్తాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో తన గెలుపుకు పార్టీ కార్యకర్తలంతా సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఆయన వెంట పార్టీ నాయకులు గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్‌కుమార్, వీరి చలపతిరావు, నక్కల రవికుమార్, పెనాక శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల కోడ్ సక్రమంగా అమలు చేయాలి: కాకాణి
కోవూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికల సందర్భంగా జిల్లా అంతటా కోడ్ అమల్లోకి రాగా కొన్ని చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నాయుడుపాలెంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ నేతలు కోడ్ ఉల్లంఘిస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం తగదన్నారు. తాము ఈ అక్రమాలను సహించేది లేదని, తమ పార్టీ చోద్యం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
..................
వేధింపుల కేసుపై సబ్‌కలెక్టర్ విచారణ
కోట, ఫిబ్రవరి 28: కోటలోని సాంఘిక సంక్షేమశాఖ బాలికల వసతి గృహ విద్యార్థినులను మేట్రిన్ భర్త గత ఏడాది జూన్ మాసంలో వేధింపులకు గురి చేయడంతో మేట్రిన్‌ను సస్పెండ్ చేసి ఆమె భర్తపై కేసు నమోదు చేసిన విషయం పాఠకులకు విధితమే. అయితే ఆ కేసుపై మంగళవారం సాయంత్రం గూడూరు సబ్ కలెక్టర్ వీరపాండియన్ కలెక్టర్ ఆదేశాల మేరకు వసతి గృహంలో విద్యార్థినులను విచారించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించిన వివరాలను సమగ్రంగా విచారించి ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు. ఆయన వెంట మండల తహశీల్దార్ కె చెన్నయ్య, డిప్యూటీ తహశీల్దార్ శ్రీకాంత్‌కేదార్‌నాథ్, ఆర్‌ఐలు మల్లిఖార్జున్‌రావు, చంద్రయ్యలు వున్నారు.