నెల్లూరుఅర్బన్, ఫిబ్రవరి 28: నగరంలోని బోడిగాడితోటలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో సజీవ దహనం కాగా, ఆమె నివసిస్తున్న పూరింటితో సహ పక్కనే ఉన్న మరో నాలుగు గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. స్థానిక బోడిగాడితోటకు చెందిన ఖాదర్ ఉన్నీసా (18)కు రెండేళ్ల క్రితం అల్లాభక్షుతో వివాహమైంది. ఆమెకు ఒక పాప ఉంది. భర్త అల్లాభక్షు పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, కుటుంబ కలహాల కారణంగా ఉన్నీసానే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడం వల్ల సజీవ దహనమైందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ సంఘటనలో ఖాదర్ ఉన్నీసా ఇంటి పక్కనే ఉన్న చిన్నా షరీఫ్, ఎస్‌కె ముస్త్ఫా, ఎస్‌కె ఖైరున్నీసా, ఎస్‌కె ఫయాజ్ అనే వ్యక్తులకు చెందిన నాలుగు పూరిళ్లకు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. మొత్తం నాలుగు లక్షల రూపాయల సొత్తు అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాసరావు, నెల్లూరు నగర ఫైర్ అధికారి హనుమంతరావు, ఈస్ట్ సర్కిల్ సిఐ కోటారెడ్డి, రెండవ నగర ఎస్సై కిషోర్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు. ఉన్నీసా భర్త అల్లాభక్షును పోలీసులు అదుపులోకి తీసుకుని రెండవ నగర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉన్నీసా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఈస్ట్‌జోన్ సిఐ కోటారెడ్డి తెలిపారు.
* బోడిగాడి తోటలో అగ్నిప్రమాదం * ఐదు పూరిళ్లు దగ్ధం
english title:
a
Date:
Wednesday, February 29, 2012