హైదరాబాద్, జూలై 3: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి కౌన్సిల్ సమావేశం బుధవారం మొక్కుబడిగా జరిగింది. ఒక కోణంలో అధికారులను నిలదీసే ధోరణిలో మాట్లాడిన సభ్యులు మొత్తానికి మొదటి రోజు సమావేశాన్ని మమ అన్పించారు. ఇదివరకు జరిగిన సమావేశాల్లో ప్రస్తావించిన సమస్యలను, అనేకరకాలైన ప్రశ్నలనే సభ్యులు అధికారులపై సంధించినా, అధికారుల సమాధానం అంతంతమాత్రమే. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సమావేశం ప్రారంభమైనా, అజెండాపై చర్చ మాత్రం మధ్యాహ్నం సుమారు ఒకటిన్నర గంటలకు ప్రారంభమైంది. సభ్యుల ప్రశ్నలకు, పలుపనుల పట్ల జరుగుతున్న జాప్యం పట్ల అధికారులను ప్రశ్నించినా, సభ్యులు సంతృప్తి చెందే తరహాలో సమాధానం రాకపోవటానికి ఒకరకంగా సభ్యులే కారణమని చెప్పవచ్చు. మేయర్ మహ్మద్ మాజీద్ హుస్సేన్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో తొలుత ఉత్తరాఖండ్ వరదల్లో మృతి చెందిన వారికి సంతాప తీర్మానం చేసి, ఆ తర్వాత గ్రేటర్‌లోకి పలుశివార్ల విలీనం ప్రతిపాదనపై చర్చను ప్రారంభించారు. విలీనం ప్రతిపాదనను ప్రస్తావించిన వెంటనే తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర కార్పొరేటర్లు, బిజెపి ఫ్లోర్ లీడర్ బంగారిప్రకాశ్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సహదేవ్ యాదవ్‌లు లేచి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే పనె్నండు శివారు మున్సిపాల్టీలను విలీనం చేసి అక్కడి ప్రజలను నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ముందు ఆయాప్రాంతాల్లో కనీస వసతులను కల్పించిన తర్వాతే ప్రభుత్వం ఈ విలీనం ప్రతిపాదనను గ్రేటర్‌కు పంపాలని డిమాండ్ చేశారు. అంతలో మజ్లిస్ శాసన సభ్యుడు ముంతాజ్ ఖాన్‌తో పాటు మరికొందరు కార్పొరేటర్లు కూడా జోక్యం చేసుకుని, రోజురోజుకీ హైదరాబాద్ విస్తీర్ణం పెరుగుతుందే తప్పా, పెరుగుతున్న జనాభాకు సరిపోయే విధంగా సేవలు మెరుగుపడటం లేదని, తాము విలీనం ప్రతిపాదనను అంగీకరించటం లేదని తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దిడ్డిరాంబాబు జోక్యం చేసుకుని మరిన్ని శివార్ల విలీనానికి ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించి, అందులో ఏ ఏ గ్రామపంచాయతీలను విలీనం చేయాలన్న నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించాలని సూచించారు. విలీనం చేస్తే గ్రేటర్‌కు, లేనిపక్షంలో విలీనం అయిన గ్రామపంచాయతీకైనా ప్రయోజనం చేకూరాలని ఆయన సూచించారు. ఇందుకు కమిషనర్ ఎం.టి.కృష్ణబాబు సమాధానం చెబుతూ మరిన్ని శివారు గ్రామపంచాయతీలను విలీనం చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదన పంపినా, అందులో కొన్నింటినైనా విలీనం చేసుకుంటే విస్తీర్ణం మరింత పెరుగుతుందని, దీని ద్వారా రెవెన్యూ కూడా పెరుగుతుందని వివరిస్తూనే, నగరంలో ప్రతిరోజు పోగవుతున్న చెత్తను వేసేందుకు ప్రభుత్వం సూచించిన పంచాయతీల్లో నాగారం, జవహర్‌నగర్, దమ్మాయిగూడలను విలీనం చేసుకోవల్సిన అవసరముందని సూచించారు. అంతలో మజ్లిస్ ఎమ్మెల్యే బలాలా జోక్యం చేసుకుని విలీనం అంటే అభివృద్ధి కోసం కాదా? కేవలం చెత్త డంపింగ్ చేసుకునేందుకా? అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత విలీనంపై మరికొందరి సభ్యుల అభిప్రాయాలను తీసుకున్న మేయర్ ఇందుకు వ్యతిరేకంగా కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుందని ప్రకటించారు. కానీ అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లలో విలీనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత సీవరేజీ పనులపై, డెబ్రిస్ తొలగింపు, అలాగే నత్తనడకన కొనసాగుతున్న జంక్షన్ల అభివృద్ధి, కన్సల్టెన్సీల నియామకం, వరుసగా ముగ్గురు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేసినా, నేటికీ ప్రారంభం కానీ పెండింగ్ పనులు, ప్రార్థనా మందిరాల్లో కనీస వసతుల కల్పన, అభివృద్ధి పనులపై కూడా రసవతర్తమైన చర్చ జరిగింది. కొన్ని సందర్భాల్లో పార్టీలకతీతంగా అన్ని పార్టీల కార్పొరేటర్లు అధికారులపై ముప్పేట దాడికి దిగినా, కమిషనర్ ఎం.టి.కృష్ణబాబు సమర్థవంతంగా ఎదుర్కొని వారికి సమాధానం చెప్పగలిగారు. సాయంత్రం ప్రార్థనా మందిరాల విషయంలో మజ్లిస్, బిజెపిల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవటంతో టీ బ్రేక్ ఇచ్చిన మేయర్ ఆ తర్వాత సమావేశాన్ని ప్రారంభించి చివరకు అయిదున్న గంటల సమయంలో గురువారానికి వాయిదా వేశారు.
మేయర్‌కో న్యాయం..మాకో న్యాయమా?
మేయర్ మాజీద్ హుస్సేన్ కార్పొరేటర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న అహ్మద్‌నగర్ డివిజన్‌లో వౌలిక వసతుల కల్పనకు రూ. కోటి 70లక్షలను కేటాయించటం పట్ల బిజెపి సభ్యులు సభలో గందగోళ వాతావరణాన్ని సృష్టించారు. మేయర్‌కో న్యాయం, మాకో న్యాయమా? అంటూ పొడియం వద్ద చుట్టుముట్టి మేయర్‌ను నిలదీసే ధోరణిలో మాట్లాడారు. ప్రతి కార్పొరేటర్‌కు కూడా డివిజన్‌లో వౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టేందుకు కోటి రూపాయలను కేటాయించాలని డిమాండ్ చేస్తూ దాదాపు పదిహేను నిమిషాల పాటు సభను స్తంభింపజేశారు.
* అనేక ప్రశ్నలు.. అంతంతమాత్రంగా సమాధానాలు * శివార్ల విలీనానికి వ్యతిరేకంగా తీర్మానం
english title:
m
Date:
Thursday, July 4, 2013