Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మద్యం దుకాణం యజమానిపై కాల్పులు

$
0
0
కెపిహెచ్‌బి కాలనీ, జులై 3: మద్యం దుకాణాన్ని మూసివేసి రోజు మాదిరిగానే క్యాష్ బ్యాగును వెంట తీసుకువెళుతున్న యజమానిపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి బ్యాగును ఎత్తుకెళ్లే యత్నం చేసి విఫలమైన సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలానగర్, శోభనావద్ద గల బాలానగర్ బీర్ అండ్ వైన్ షాపు యజమాని సూరజ్ రోజూ మాదిరిగానే మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో షాపును మూసి వేసి క్యాష్ బ్యాగును వెంట తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో క్యాష్ బ్యాగును గమనించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సూరజ్‌పై దాడి చేసి నాలుగు లక్షలు నగదు గల క్యాష్ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఇరువురి మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో షాపులో పనిచేసే సంతోష్ ఇది గమనించి అక్కడికి చేరుకుని దుండగులను పట్టుకుని వారితో కలబడ్డాడు. దీంతో ఇద్దరు వ్యక్తుల్లో ఓ వ్యక్తి తనవద్ద గల పిస్తోల్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో స్థానికులంతా అక్కడ గుమిగూడారు. ఈ సంఘటనలో సంతోష్ కుడిచేతిలోకి 18 చెర్రాలు వెళ్లడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. క్యాష్ బ్యాగును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన దుండగుల ప్రయత్నం విఫలమైంది. ఈ మేరకు గాయపడిన సంతోష్‌ను ఆసుపత్రికి తరలించి బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలం ఎమ్మెల్యే రాజిరెడ్డి హామీ ఉప్పల్, జూలై 3: ఉప్పల్ పట్టణంలోని రహదారి వెడల్పులో భాగంగా ఫుట్‌పాత్ కబ్జాలను తొలగించడంతో చిరువ్యాపారులు వీధిన పడ్డారు. న్యాయం కోసం ఆందోళన చేయడంతోస్పందించిన ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడకుండా వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం విటి కమాన్ వద్ద ఫుట్‌పాత్‌లను పరిశీలించి పూల వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూరగాయల మార్కెట్‌లో ఉన్న ఖాళీ స్థలంలో పెట్టుకోవాలని చెబితే వారు ససేమిరా అని ఒప్పుకోలేదు. పూల వ్యాపారం ఇక్కడే నడుస్తుందని, పక్కనే స్థలం కేటాయించాలని వారు కోరడంతో ప్రాథమిక పాఠశాల ఎదుట ఉన్న ఫుట్‌పాత్ కబ్జాలను తొలగించి ఇక్కడే వీరికి ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయించాలని జిహెచ్‌ఎంసి అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారిలో రింగ్‌రోడ్డు నుండి చెక్‌పోస్టు వరకు ఇరువైపులా ఉన్న మిగతా డబ్బాలను, కబ్జాలను తొలగించి ట్రాఫిక్ సమస్య నుండి ప్రజలకు విముక్తి కల్పించాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పి.సుగుణాదయాకర్‌రెడ్డి, జిహెచ్‌ఎంసి ఉప్పల్ డిసి మహేందర్, ఇన్‌స్పెక్టర్లు పి.లక్ష్మికాంతరెడ్డి, దేవేందర్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, ఏసిపి ప్రసాద్, సూపర్‌వైజర్ శ్రీ్ధర్, ఎస్‌ఐలు, కాంగ్రెస్ నేతలు, ఇతర వ్యాపారులు పాల్గొన్నారు. గుర్తింపులేని పాఠశాలలపై చర్యలు నిల్ ఉప్పల్, జూలై 3: ఉప్పల్ మండలం పరిధిలో ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇరుకైన భవనాలలో ఆటస్థలం లేకుండా ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహించే పాఠశాలలను సీజ్ చేయాలని రంగారెడ్డి జిల్లా డిఇఓ ఇంచార్జి ఎంఇఓకు ఆదేశాలు జారీ చేసినా, వారి వద్ద మామూళ్లు తీసుకుంటూ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలను ఉల్లంఘించి ఎక్కడ బడితే అక్కడ పాఠశాలలను ఏర్పాటు చేస్తూ యాజమాన్యాలు తల్లిదండ్రులను మోసం చేస్తూ మధ్యలోనే మూసేసి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. కనీస సౌకర్యాలను కల్పించకుండానే డొనేషన్లు, అధిక ఫీజులను వసూలు చేస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. అప్పుడప్పుడూ ఇన్‌స్పెక్ష్లను నిర్వహించి సౌకర్యాలు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోకుండా వారి వద్ద ముడుపులు స్వీకరించి చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలం పరిధిలోని రామంతాపూర్‌లో వైష్ణవి ఒలంపిక్ స్కూల్, వైష్ణవి మాడల్ స్కూల్, ఉప్పల్‌లోని శివసాయి స్కూల్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, ది హైదరాబాద్ స్కూల్, చిల్కానగర్ రోడ్డులోని ఆదర్శనగర్‌లో కాకతీయ స్కూల్, స్వరూప్‌నగర్‌లోని అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో గల మేధ హైస్కూల్, నాగోల్‌లో విజ్ఞాన్ హైస్కూల్, కామినేని హైస్కూల్, మల్లాపూర్‌లోని ముద్ర హైస్కూల్, హెచ్‌బికాలనీలోని కాకతీయ స్కూల్, వైష్ణవి హైస్కూల్‌కు ప్రభుత్వ అనుమతి లేదని స్వయంగా విద్యాశాఖ అధికారులే స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. కనీస సౌకర్యాలు కల్పించకుండా అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని గుర్తింపు ఉన్న పాఠశాలల అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి డిఇఓ పాఠశాలలతో పాటు మండల స్థాయి విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మద్యం విధానాన్ని రద్దు చేయాలి నేరేడ్‌మెట్, జూలై 3: కాంగ్రెసు ప్రభుత్వానికి ఖజానా నింపుకునేందుకు ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదని మల్కాజిగిరి టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి వికె మహేష్ అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం విధానాన్ని, బెల్టుషాపులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మల్కాజిగిరి టిడిపి అధ్వర్యంలో మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వికె మహేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం నూతన మద్యం విధానంతో ప్రజలను తాగుబోతులగా మార్చి తమ ఖజానా నింపుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో బెల్టు షాపులు నియంత్రిస్తున్నామని చెపుతున్న ప్రభుత్వం వైన్‌షాపులకు పర్మిట్ రూంల సౌకర్యం ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆదాయం మీద ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదన్నారు. నూతన విధానం వల్ల సామాన్య ప్రజలు రోడ్డున పడాల్సిన పరిస్థితి దాపురిస్తుందన్నారు. ప్రభుత్వం ప్రజలకు మేలు చేయకపోయినా ఇలాంటి విధానాలు ప్రవేశపెట్టి వారిని రోడ్డుపాలు చేయరాదన్నారు. నూతన విధానాలపై ఉన్న శ్రద్ధ నిత్యావసర సరుకుల ధరలు తగ్గించడంలో ఉంటే బాగుంటందని ఎద్దేవా చేశారు. అనంతరం ఎక్సైజ్ సిఐ సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రామ్మోహన్‌రావు, గౌలికర్ రవిందర్, రావుల అంజయ్య, నర్సింగ్‌రావు, పిట్లశ్రీను, వై.సుధాకర్‌రెడ్డి, కృష్ణగౌడ్, మురళీధర్, రాము, ధనంజయ్య, తుపాకుల జనార్థన్, లక్ష్మీ, నాగమణి, నర్సమ్మ, సుజాత, గొపాలకృష్ణ పాల్గొన్నారు. ఏసిబికి చిక్కిన సబ్‌రిజిస్ట్రార్ గచ్చిబౌలి, జూలై 3: ఐదువేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు ప్రత్యక్షంగా దొరికిపోయాడు శేరిలింగంపల్లి సబ్‌రిజిస్ట్రార్. ఏసిబి డిఎస్పీ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం- నల్లగండ్లలోని లక్ష్మీవిహార్‌లో వుండే అల్లూరి నాగరాజుకి బంటారం మండలం గోపన్నవరంలో 7.24 ఎకరాల భూమి వుంది. నాగరాజు అమెరికా వెళ్లే నిమిత్తం ఆయన పేరుమీదున్న భూమిని భార్య రెడ్డి కుమారి పేరుపై జిపిఏ ఇచ్చేందుకు గతనెల ఆరవ తేదీన పత్రాలు సిద్ధం చేసుకుని శేరిలింగంపలి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. డాక్యుమెంట్ రైటర్‌ద్వారా వెళ్లగా జిపిఏ చేయకుండా పెండింగులో పెట్టారు. డాక్యుమెంట్ రైటర్ అఖిల్‌ని సంప్రదించగా, రిజిస్ట్రార్ తమ జిపిఏని పెండింగులో పెట్టారని, స్వయంగా కలిసి మాట్లాడమని చెప్పాడు. నాగరాజు సబ్‌రిజిస్ట్రార్ గణపతిని కలవగా- 8వేలు ఇవ్వాలని డిమాండ్ చేసాడు. చివరికి ఐదువేలకు బేరం కుదిరింది. దీంతో నాగరాజు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా ఏసిబి డిఎస్పీ వెంకటేశ్వర్లు తన బృందంతో దాడిచేసి డాక్యుమెంట్ రైటర్ అఖిల్‌ద్వారా డబ్బు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏసిబి అధికారులు సబ్‌రిజిస్ట్రార్ గణపతిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాయల్ తెలంగాణకు వైకాపా వ్యతిరేకం: శోభానాగిరెడ్డి రాజేంద్రనగర్, జూలై 3: రాయల తెలంగాణకు వైఎస్సార్‌కాంగ్రెస్ వ్యతిరేకమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. బుధవారం హైదర్‌గూడలో రంగారెడ్డి జిల్లా వైకాపా పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదని, రాయలసీమను విడగొడితే చూస్తూ ఊరుకోమని ఆమె హెచ్చరించారు. రాయలసీమ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని విభజించాలని, ఎక్కడో ఢిల్లీలో కూర్చుని మాట్లాడితే సరికాదన్నారు. రాష్ట్రాన్ని విడగొడితే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేయాలని ఆమె డిమాండ్ చేసారు. రాయలసీమను ముక్కలుగా చేసి వేరే ప్రాంతాల్లో విలీనం చేస్తే సహించమని మండిపడ్డారు. కాంగ్రెస్, టిడిపి లోపాయికారి ఒప్పందంతోనే జగన్‌ను దెబ్బతీయడానికి రాయల తెలంగాణను తెరపైకి తెచ్చారని, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు వారికి తగిన బుద్ధిచెబుతారని ఆమె వెల్లడించారు. వైకాపాకు భయపడి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకుండా వెళ్లడం సిగ్గుచేటన్నారు. రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో వైకాపా నేతలు కె.శ్రీనివాసరెడ్డి, ఎం.రూపానందరెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, దయానంద్, తిరుపతిరెడ్డి, విష్ణుమూర్తి పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల బందోబస్తుకు పోలీసు యంత్రాంగం సిద్ధం తాండూరు, జూలై 3: పంచాయతీల ఎన్నికల బందోబస్తు, నిర్వహణకు పోలీసు యంత్రాంగం సన్నద్ధంగా ఉందని రంగారెడ్డి జిల్లా రూరల్ ఎస్పీ బి.రాజకుమారి అన్నారు. బుధవారం తాండూరులో ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గత ఎన్నికల్లో నేరాలు పాల్పడిన, పాతనేర చరిత్ర కలిగిన వారిని గుర్తించి నిర్బంధంలోకి తీసుకుంటామని అన్నారు. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా మద్యం విక్రయాల పట్ల ఆంక్షలు ఉంటాయని చెప్పారు. కర్ణాటక సరిహద్దుద ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేసి అక్రమ రవాణా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పాఠశాల వేళల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. భారీ వాహనాలు తాండూరు పట్టణంలోని రాకుండా చూడాలని ఆదేశించారు. ఆకతాయిల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని హోటళ్లను రాత్రి 10గంటలకే మూసివేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టి కఠిన చర్యలు చేపట్టాలని తాండూరు పోలీసులను ఆదేశించారు. వంటగ్యాస్ సిలిండర్ వల్లే వికారాబాద్ రాజీవ్‌గృహకల్ప కాలనీలో పేలు చోటుచేసుకుందని స్పష్టం చేశారు. స్థానిక డిఎస్పీ, సిఐలు, ఎస్‌ఐలు గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమం ప్రారంభించాలని ఎస్పీ రాజకుమారి ఆదేశించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు: కలెక్టర్ చాంద్రాయణగుట్ట, జూలై 3: వచ్చే రెండు నెలల్లో హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ భూములన్నీ గుర్తించి వాటిని సక్రమంగా వినియోగంలోకి తెచ్చేందుకు చర్య తీసుకుంటానని కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వారం మూడు, నాలుగు మండలాలలో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తానని అన్నారు. త్వరలో అర్బన్ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని దానికి అనుగుణంగా రెవెన్యూ అధికారులు క్రీయశీలంగా పనిచేయాలని సూచించారు. రికార్డులను సవరించి సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీధర్, జిల్లా రెవెన్యూ అధికారి రహీముద్దీన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఏనుగుల నర్సింహారెడ్డి, సరళ వందనం, రఘురాం శర్మ, ఆర్టీవోలు హరీశ్, రవీందర్, తహశీల్దారులు పాల్గొన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఎస్‌బిఐది అగ్రస్థానం కంటోనె్మంట్, జూలై 3: దేశంలో బ్యాంకింగ్ రంగంలో వినియోగదారులకు సేవలు అందించడంలో భారతీయ స్టేట్ బ్యాంక్ అగ్రస్థానంలోవుందని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ ఐజిపి జితేందర్ తెలిపారు. బుధవారం భారతీయ స్టేట్‌బ్యాంక్ 57వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సికిందరాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో మారుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా సేవలు అందించాల్సిన బాధ్యత ఉద్యోగులు అందరిపైనా ఉందని ఎస్‌బిఐ హైదరాబాద్ మాడ్యుల్-1 డిజిఎం రవీంద్ర సిన్హా తెలిపారు. ప్రతి ఉద్యోగి ఉత్తమ సేవలు అందించినప్పుడు వినియోగదారుల నుంచి మంచి గుర్తింపు, ప్రశంసలు ఉంటాయని హైదరాబాద్ మాడ్యుల్-2 డిజిఎం నితిన్‌కుమార్ శర్మ తెలిపారు. ప్రతి ఉద్యోగి విధి నిర్వహణలో తనకున్న పరిధిలో సేవలు సక్రమంగా అందించినప్పుడు సంస్థ యాజమాన్యంనుండి, వినియోగదారులనుండి గుర్తింపు పొందుతారని ఆయన చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో వస్తున్న సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ప్రతి ఉద్యోగిపై ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ట్ఫా యూనియన్ హైదరాబాద్ మాడ్యుల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆర్.శ్రీరామ్ తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో సవాళ్లను ఎదుర్కొంటూ ఎస్‌బిఐ ముందుకు సాగుతుందని, ఎస్‌బిఐ ఆఫీసర్స్ అసోసియేషన్ డిజిఎస్ ఎ.ఆంజనేయులు తెలిపారు. కార్యక్రమానికి సికిందరాబాద్ బ్రాంచ్ ఎజిఎం ఆనోజీరావు అధ్యక్షత వహించగా, స్ట్ఫా యూనియన్ వైస్ ప్రెసిడెంట్ కె.జగన్నాధరావు ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎజిఎంలు మునిస్వామి, రమణ, రహీముద్దీన్‌లతోపాటు ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశానికి ముందు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘బ్యాంక్ డే’ సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. సమావేశంకంటేముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం ఆహుతులను అలరించింది. మహిళలు అన్ని రంగాలలో రాణించాలి ఘట్‌కేసర్, జూలై 3: మహిళలు అన్ని రంగాలలో రాణించాలని యూనియన్ బ్యాంక్ మేనేజర్ కేధరిన్ అన్నారు. ఘట్‌కేసర్ మండల కేంద్రంలోని పద్మారెడ్డి గార్డెన్‌లో సాయి సోషల్‌ఎంపవర్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన చేతివృత్తి కళకారులకు రుణాల పంపిణీ కార్యక్రమంలో అమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అబలలు కాదు సబలలు అని నిరూపించాలన్నారు. దేశంలోని అనేక రంగాలలో మహిళలు రాణిస్తున్నారన్నారు. మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడేందుకు ప్రభుత్వ సహకారంతో స్వచ్ఛంద సంస్థలు అనేక ఉపాధి కార్యక్రమాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని వాటిని ఉపయోగించుకుని లబ్ధి పొందాలన్నారు. దేశ జనాభాలో సగంవరకు ఉన్న మహిళలు తలచుకుంటే సాధించనిది ఉండదన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే దేశాభివృద్ధి త్వరితగతిన జరుగుతుందని ఆమె అన్నారు. ఆ సంస్థ అధ్యక్షుడు ఎంఎన్ ప్రసాద్ మాట్లాడుతు గతంలో రుణాలు తీసుకున్న చేతివృత్తుల కళాకారులు సకాలంలో చెల్లిస్తే తిరిగి రుణాలు అందించటానికి బ్యాంక్‌లు ముందుకు వస్తాయన్నారు. స్థానిక సర్పంచ్ మేకల సుజాత నర్సింగ్‌రావు మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాలలో తీర్చి దిద్దేందుకు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మండలంలోని 13 చేతివృత్తుల సంఘాలకు రూ.26 లక్షల రుణాలను బ్యాంక్ మేనేజర్ కేథరిన్ చేతులుమీదుగా అందజేశారు. రాజీవ్ స్వస్థ బీమా యోజన పథకం కింద వచ్చిన మెడికల్ రీయింబర్సుమెంట్ చెక్‌లను అందచేశారు. బ్యాంక్ అధికారి రజనీష్, మేకల నర్సింగ్‌రావు, సంస్థ ప్రతినిధులు మంజుల, శ్రీనివాస్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలు, భవన నిర్మాణ కార్మికుల కోసం బీమా పథకం ఘట్‌కేసర్, జూలై 3: అంగన్ వాడీ వర్కర్స్‌కు కనీస వేతనాలు అమలు పరుస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షురాలు కొరిపెల్లి నిర్మల అన్నారు. ఘట్‌కేసర్ మండల కేంద్రంలోని మండల తహశీల్ధార్ కార్యాలయం ఆవరణలో అంగన్‌వాడీ కార్మికుల రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐసిడిఎస్ ప్రారంభించి 37 సంవత్సరాలు గడిచిందని, అప్పటినుండి ఇప్పటి వరకు వారితో సేవలు చేయించుకుంటూ వెట్టచాకిరీ చేయిస్తున్న ప్రభుత్వం వారికి వేతనాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించటంలో విఫలం అయిందని ఆమె విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి రెండు పూటలా తిండికి నోచుకోలేక పోతున్నారని ఆమె తెలిపారు. కేంద్రంతో సమానంగా అంగన్‌వాడీ వర్కర్‌కు 2300, అయాకు 1050 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసేవారికి లక్ష రూపాయలు ఇవ్వాలని, వచ్చే జీతంలో సగం జీతం పెన్షన్‌గా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టియుటిఎఫ్ నాయకులు కైలాసం పాల్గొని సంఘీభావం తెలిపారు. సిఐటియు నాయకులు సుధ, అంగన్‌వాడీ కార్మికులు కవిత, సబిత, విశాలి, పుష్ప, మంజుల, విజయలక్ష్మి, కుర్షిద్ ధనలక్ష్మి, వెంకటలక్ష్మి, బాలమణి, సునిత, సులోచన, పున్నమ్మ, తులసి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవే పరమావధిగా విధులు నిర్వహించాలి మేడ్చల్, జూలై 3: ప్రజాసేవే పరమావధిగా పోలీసులు విధులు నిర్వహించాలని మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ రాంరెడ్డి అన్నారు. మేడ్చల్ ఠాణా నుంచి ఇటీవల 13 మంది కానిస్టేబుళ్లు బదిలీ కావడంతో బుధవారం స్థానిక దివాన్ ఫంక్షన్‌హాల్‌లో విడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో ఆటుపోట్లు తప్పవని, అన్నింటిని సమర్దవంతంగా ఎదుర్కొని విధులు నిర్వహించాలని సూచించారు. విధి నిర్వహణలో ఓర్పు, సహనం ఎంతో అవసరమని, ప్రజలకు జవాబుదారితనంతో కూడిన సేవను అందించాలని పోలీసుల ధర్మమని అన్నారు. బదిలీ అయిన కానిస్టేబుళ్లను సన్మానించారు. ఇటీవల ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్ గణేశ్‌కు సంతాపం తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు నాగార్జున్, సాయిదాస్, హెడ్‌కానిస్టేబుళ్లు చందుసింగ్, అశోక్‌రెడ్డి, తులసీరాం, మాణిక్యం, టిడిపి నేత రమేశ్ ముదిరాజ్ పాల్గొన్నారు.
మద్యం దుకాణాన్ని మూసివేసి రోజు మాదిరిగానే క్యాష్ బ్యాగును వెంట తీసుకువెళుతున్న యజమానిపై
english title: 
m

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>