Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ

$
0
0

కడప, జూలై 4:గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాజంపేట డివిజన్ రిటర్నింగ్ అధికారులకు, వైఎస్సార్ నగర పాలక ఆడిటోరియంలో జమ్మలమడుగు డివిజన్ రిటర్నింగ్ అధికారులకు రాజంపేట సబ్ కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా, కడప ఆర్డీవో వీరబ్రహ్మం, జమ్మలమడుగు ఆర్డీవో రఘునాథరెడ్డిల ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి కోన శశిధర్ జడ్పీ సమావేశం మందిరంలో రిటర్నింగ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఏ రాజకీయ పార్టీకి లేదా గ్రూపునకు అనుకూలంగా వ్యవహరించ కూడదని స్పష్టం చేశారు. ఎంపిడిఓలు, తహశీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారుల కరదీపికలు క్షుణ్ణంగా చదువుకొని అందులోని సూచనలను తప్పకుండా అనుసరించాలన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి వక్తులుగాని, నాయకులు గాని ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేసినా దాన్ని నివృత్తి చేయడానికి అధికారులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికలను ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించాలన్నారు. సమయ పాలన ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. సర్పంచ్‌లు నామినేషన్ దాఖలు చేస్తున్న అభ్యర్థి నామినేషన్ ఫారంలో సంతకాలు చేశారా లేదా అనే విషయాన్ని తప్పకుండా గమనించాలన్నారు. సర్పంచ్‌గా పోటీ చేస్తున్న వ్యక్తి ఆ గ్రామానికి సంబంధించి ఏ వార్డులోనైనా ఓటరుగా ఉంటే చాలన్నారు. అలాగే వార్డు సభ్యులు పోటీ చేస్తున్న వ్యక్తి ఆ గ్రామ పంచాయితీలో ఏదో ఒక వార్డులో ఓటరుగా ఉండాలన్నారు. అతన్ని ప్రతిపాదించే వ్యక్తి అదే వార్డుకు చెందిన ఓటరుగా ఉండాలన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు నిర్ణీత ధరావత్తు చెల్లించారో లేదో గమనించాలన్నారు. నేర చరిత్ర ఉంటే నామినేషన్‌ను తిరస్కరించాలన్నారు. బలహీన వర్గాల వారికి ఓటు హక్కు ఉన్నప్పటికీ ఆధిపత్యం చెలాయించి వినియోగించుకోకుండా అడ్డుకోవాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించాలన్నారు. ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా అధికారులకు ఎవరికి అత్యవసర పరిస్థితులు అనివార్యకారణాలు మినహా సెలవులు మంజూరు చేసేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే సబ్ కలెక్టర్, ఆర్డీవో జడ్పీసిఇఓ పరిధిలోని అధికారులకు, సిబ్బంది కూడా సెలవులు మంజూరు చేయరాదని సూచించారు. దాదాపు 7 సంవత్సరాల తరువాత జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను సర్పంచ్ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. త్వరలో జిల్లాకు ముగ్గురు సీనియర్ అధికారులు ఎన్నికల పరిశీలకులుగా వస్తారన్నారు. ఎన్నికల విధులు చాలా ముఖ్యమని, నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఒక్కొక్క నియోజక వర్గానికి ఒక సంచార బృందాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణపై నిఘా ఉంచుతామన్నారు. ఈనెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారి, జాయింట్ కలెక్టర్ కలసి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశానికి తహశీల్దార్లు, ఎంపిడిఓలు, మండల ప్రత్యేక అధికారులు, పోలీసు అధికారులు హాజరు కావాలని ఆదేశించారు. అలాగే సబ్‌కలెక్టర్ ప్రీతి మీనా మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన రాజంపేట డివిజన్‌కు సంబంధించిన 258 గ్రామ పంచాయితీ సర్పంచ్ పదవులకు, 2574 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతాయన్నారు. నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రంలో కడప డివిజన్ మండలాల రిటర్నింగ్ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు, ఎ ఆర్ ఓలకు సంబంధించి గ్రామ పంచాయితీ ఎన్నికల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియమ నిబంధనలను అధికారులు సమగ్రంగా తెలుసుకోవాలన్నారు. 7782 వార్డులు, 790 పంచాయితీలకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. 10, 11 వేల నుండి అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉందన్నారు. వరుసగా ఎన్నికలు వస్తున్నందున మండల స్థాయి అధికారులు ఎన్నికల నిర్వహణపై ఆత్మ విశ్వాసంతో పని చేయాలన్నారు. ప్రతి మండలంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు బాధ్యత, స్పెషల్ ఆఫీసర్లు, తహశీల్దార్లు, ఎంపిడి ఓలదేనన్నారు. జిల్లా ఎన్నికల అధికారి నుంచి కింది స్థాయి అధికారి వరకు ఎన్నికలలో ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలన్నారు. వార్డులు, సర్పంచ్‌ల రిజర్వేషన్లకు సంబంధించి క్షుణ్ణంగా చేయడం వల్ల ఎవరి నుండి ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు.
వైఎస్సార్ ఆడిటోరియంలో జరిగిన జమ్మలమడుగు డివిజన్ అధికారుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున కొత్త పథకాలు చేపట్టరాదని ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సిపి రోడ్డు, భవనాలు, కొత్త పథకాల పనులు చేపట్టరాదన్నారు. అత్యవసర పనులు, తాగునీటి సమస్యలుంటే తన దృష్టికి తేవాలన్నారు. గ్రామ పంచాయితీ రిజర్వేషన్లు పక్కాగా చేయడంపై ఎన్నికల కమిషన్‌ను నుండి అభినందనలు లభించాయన్నారు. శిక్షణా తరగతులకు గైర్హాజరైన వారికి నోటీసులు జారీ చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. 20 చెక్ పోస్టులు, కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మండల ప్రత్యేక అధికారులు బాధ్యతతో నిధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల సమయంలో కింది స్థాయి సిబ్బంది పంచాయితీ సెక్రటరీ, వి ఆర్వోలు, గ్రామ నౌకర్లు, ఆఫీసు సిబ్బంది, రాజకీయ పార్టీల వారితో కలసి ప్రచారంలో చెల్లరాదని, వారితో సంబంధాలున్నట్లు ఆర్వోల దృష్టికి వస్తే తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. మైదుకూరు, పులివెందుల, ఎంపిపివోలు, అమరనాధ్‌రెడ్డి, డాక్టర్ సి వెంకటేష్‌లు శిక్షణలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె నిర్మల, డిఆర్వో ఈశ్వరయ్య, జడ్పీ సిఇవో మాల్యాద్రి, శిక్షణ సహాయ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, డిపివో అపూర్వ సుందరి, జమ్మలమడుగు డివిజనల్ పంచాయితీ అధికారి లక్ష్మి, ఆర్వోలు, ఎఆర్వోలు, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడివోలు పాల్గొన్నారు.

మూడు విడతలుగా పోలింగ్
* 23న కడప, 27న రాజంపేట, 31న జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్
కడప, జూలై 4: ఎన్నికల నగారా మోగడంతో జిల్లా లోని మూడు రెవెన్యూ డివిజన్లలోని 791 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో ఆరు గ్రామ పంచాయతీలు పట్టణాల్లో విలీనమయ్యేందుకు రంగం సిద్ధం కావడంతో మిగిలిన వాటిలో ఎన్నికల ప్రక్రియ మొదలయింది. ఈనెల 23న మొదటి విడతలో కడప రెవెన్యూ డివిజన్‌లోనూ, రెండవ విడతలో 27న రాజంపేట రెవెన్యూ డివిజన్‌లోనూ, మూడవ విడతలో 31న జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ శశిధర్ ఆధ్వర్యంలో ఎన్నికల నియమావళికి కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ గురువారం ఎన్నికలు జరిగే అన్ని మండలాలకు చెందిన సంబంధిత అధికారులతో ప్రత్యేకించి సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్‌ను ఏ ఒక్క పార్టీ నేత విస్మరించినా వారిపై తక్షణమే సమాచారం ఇవ్వాలని ఆయన అధికారులను హెచ్చరించినట్లు తెలిసింది. సమాచారం ఇవ్వని అధికారులపై చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించే అభ్యర్థులపై చర్యలు తప్పవని ఆయన అధికారులతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈనెల 9న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. 13న నామినేషన్ దాఖలు చివరి తేదీగా ప్రకటించారు. 17న నామినేషన్ ఉప సంహరణ, అభ్యర్థుల గుర్తులను ప్రకటిస్తారు. మూడు విడతల ఎన్నికల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించి ఉప సర్పంచ్‌ను కూడా ఎన్నిక కూడా జరుగుతుంది. ఉప సర్పంచ్ ఎన్నిక జరగని ప్రాంతాల్లో మూడవ రోజు తప్పని సరిగా ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అక్రమ మార్గాలు, వేలం పాటల ద్వారా సర్పంచ్‌ల ఏకగ్రీవ ఎన్నికలకు బేరసారాలు సాగించరాదని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా దృష్టిసారించారు.

సమరానికి సిద్ధం కావాలి
* వైకాపాకు ప్రజల్లో తగ్గిన సానుభూతి
* తిరుపతి సభకు భారీగా తరలిరావాలి
* రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్
కడప, జూలై 4 : పంచాయతీ ఎన్నికల అనంతరం వైకాపా కనుమరుగు కావడం ఖాయమని రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ పేర్కొన్నారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీలో విలీనవుతుందని జోస్యం చెప్పారు. గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు కలసి కట్టుగా కృషి చేసి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు తాను, జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డితో కలిసి కడపలోనే ఉంటామన్నారు. పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లా పార్టీ కార్యాలయంలో హైదరాబాద్ నుండి ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను రప్పించి హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యాలయం నుండి తాము పంచాయతీ ఎన్నికలను పర్యవేక్షిస్తామన్నారు. జిల్లాలో ఎక్కడైనా కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం జరిగినా, ఇతర పార్టీల నాయకులు ఏదైనా ఆటంకాలు సృష్టించినా తమ దృష్టికి తేవాలన్నారు. సమస్యలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఏ సమస్య వచ్చినా కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటామన్నారు. పంచాయతీ ఎన్నికలు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు గీటురాళ్లుగా నిలుస్తాయన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏ నాయకులు కూడా నిర్లక్ష్యం చేయరాదన్నారు. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 2017కిలో మీటర్లు పాదయాత్ర నిర్వహించడంతో రాష్ట్రంలో పార్టీ బలోపేతమయిందన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లో బాధితులను అదుకోవడంలో చంద్రబాబు చూపిన చొరవను రాష్ట్ర ప్రజలందరూ అభినందించారన్నారు. ఉత్తరాఖండ్‌లో చిక్కుకుని పోయిన యాత్రికులకు చంద్రబాబు ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి తరలించడం జరిగిందన్నారు. ఇటీవల ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులైనట్లు తేలిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. కడప జిల్లాలో వైకాపాపై ప్రజల్లో సానుభూతి పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ కుటుంబం మొత్తం రోడ్డెక్కి తిరుగుతున్నారని విమర్శించారు. వైఎస్ మరణంతో ప్రజలు సానుభూతితో గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు వేశారన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ పట్ల ప్రజల్లో సానుభూతి తగ్గిందన్నారు. ప్రస్తుతం చంద్రబాబు లాంటి పాలనా దక్షత కలిగిన ముఖ్యమంత్రి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపడతారన్నారు. పార్టీ శ్రేణులు ఇప్పటి నుండే పంచాయతీ ఎన్నికలకు కష్టపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అన్ని నియోజకవర్గాలకు చెందిన ఇన్‌చార్జిలు పాల్గొన్నారు. వారితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గెలిచే వారికే టికెట్లు
* బద్వేలు, రాయచోటిపై దృష్టి సారించండి
* తమ్ముళ్లతో టెలీకాన్ఫరెన్స్‌లో బాబు
కడప, జూలై 4 : గ్రామ పంచాయతీ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ తరపున ప్రతి పంచాయితీలోనూ గెలిచే అభ్యర్థినే రంగంలో దింపాలని గురువారం ఉదయం తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా నేతలతో మాట్లాడారు. బాబు జిల్లాలోని ముఖ్యనేలతోపాటు అన్ని నియోజకవర్గాలకు చెందిన నేతలతోనూ మాట్లాడారు. ముఖ్యంగా జిల్లాలోని రాయచోటి, బద్వేలు నియోజక వర్గాలపై శ్రద్ధ చూపాలని బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మతో జిల్లా నేతలు సంప్రదించి ఆమె పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు. ఇక రాయచోటిలో జడ్పీ మాజీ చైర్మన్ ఎస్ సుబ్రమణ్యం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనేది తనకు బాగా తెలుసని వారి విషయంలో తానే జోక్యం చేసుకొని సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. జిల్లా నేతలతోనూ, రాయచోటి నియోజక వర్గపార్టీ నేతలతో ఇప్పటికే తాను మాట్లాడానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో సానుభూతి బాగా ఉందని, కాంగ్రెస్, వైకాపా విధానాల్లో లోపాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు 2014 సాధారణ ఎన్నికలకు నాంది అని నేతలు, కార్యకర్తలు అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి కలసి పని చేయాలని ఆయన సూచించారు. పంచాయతీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులకు చేయూతనివ్వడానికి పార్టీ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని ఆయన చెప్పారు. ఈ నెల రోజులు పార్టీ శ్రేణులు కష్టపడి దేశం మద్దతు దారులను ఎన్నికల్లో దింపి గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తి లేదు
* అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు
* పిసిసి సభ్యుడు రాంప్రసాద్‌రెడ్డి
రాయచోటి, జూలై 4 : కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, పత్రికల్లో వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని పిసిసి సభ్యుడు, రాయచోటి కాంగ్రెస్ నేత మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తాను పార్టీని వీడిపోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కార్యకర్తలు నమ్మవద్దన్నారు. లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రమేష్‌రెడ్డికి రాయచోటి కాంగ్రెస్ ఇన్‌చార్జి పదవి కట్టపెట్టారని, ఈ నేపథ్యంలో తాను అలిగి పార్టీని వీడనున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. గత 20 ఏళ్ల కాలంగా తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతోందని, అలాంటి పార్టీని తాను వీడే ప్రసక్తి లేదన్నారు. రమేష్‌రెడ్డిని ఇన్‌చార్జిగా నియమించినట్లు తనకు ఏ మాత్రం తెలియదన్నారు. అయితే ఈరోజు ఉదయానే్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాకం అశోక్‌కుమార్‌తో మాట్లాడినా ధ్రువీకరించలేదని వివరించారు. పార్టీకి చేసిన సేవలను అధిష్టానం గుర్తించడం వల్లే పార్టీ హైకమాండ్ గత ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించిందన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఇకపోతే టిడిపిలో కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు కాంగ్రెస్‌లోకి వస్తే తనకు ఏ రకమైన అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షునితో చెప్పినట్లు తెలిపారు. అలాగే రాయుడు రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే బాగుంటుందన్న రాష్ట్ర హైకమాండ్ సూచనను తాను కూడా సమర్థించినట్లు పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో తాను ఓటమి పాలు కావడంతో కొంత మంది కార్యకర్తలు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యారన్నారు. ఉప ఎన్నికల్లో కూడా సొంత పార్టీలోని కొందరు నాయకుల కుట్రల వల్లే ఓటమి చెందానన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, దివంగత సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కంటే ఏం తీసిపోరన్నారు. కిరణ్ హయాంలో రాష్ట్భ్రావృద్ధి కోసం నిరుపేదలు, బడుగులు, బలహీన వర్గాల కోసం ఎన్నో వినూత్నమైన పథకాలు చేపడుతున్నారన్నారు. ఇక స్ధానిక పోరును ప్రత్యర్థులను సమర్థవంతంగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి మండలంలో వీలైనన్ని ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకుంటారన్నారు. అభ్యర్థులను త్వరలో ప్రకటించడంతో పాటు వారి విజయం కోసం అంకిత భావంతో కృషి చేస్తామన్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుండే అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. అందుకోసం కార్యకర్తలు, నాయకులు కష్టించి పని చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సుధాకర్‌రెడ్డి, లయన్ నాగేశ్వరావు, కొండారెడ్డి, మోహన్ పాల్గొన్నారు.

రూ. 5 కోట్ల ఎర్రచందనం పట్టివేత
* 100 మందిపై కేసులు నమోదు
* టాస్క్ఫోర్స్ అధికారుల వెల్లడి
రైల్వేకోడూరు, జూలై 4: రాయలసీమ ప్రాంతంలో ఇటీవల కాలంలో విస్తృతంగా దాడులు జరిపి రూ. 5 కోట్ల విలువచేసే ఎర్రచందనాన్ని పట్టుకున్నామని టాస్క్ఫోర్స్ అధికారులు మధుబాబు, విశే్వశ్వరరావు తెలిపారు. గురువారం వారు రైల్వేకోడూరు ప్రాంతంలో ఎర్రచందనం అక్రమరవాణా నిర్మూలన కోసం విసృత్తంగా దాడులు నిర్వహించారు. అనంతరం స్థానిక అటవీశాఖ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి, తిరుపతి, మైదుకూరు, ఖాజీపేట తదితర ప్రాంతాల్లో అటవీ అధికారుల సహకారంతో టాస్క్ఫోర్స్ అధికారులు ప్రత్యేక పోలీస్ బలగాలతో ఎర్రచందనం అక్రమ రవాణా నిర్మూలనకోసం పెద్దఎత్తున దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎర్రచందనం అక్రమ రవాణా నిర్మూలన కోసం ప్రత్యేక పోలీస్ బలగాలతో గాలింపుచర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కేసుల్లో పట్టుబడే స్మగ్లర్లపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతామన్నారు. డబ్బును సులభతరంగా సంపాదించాలన్న అత్యాశతో కొందరు యువకులు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అటవీ ప్రాంతంలో ఎర్రచందనం కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.
బాబు సిఎం అయితే రుణమాఫీపైనే తొలి సంతకం
* టిడిపి నేతలు పుట్టా, రెడ్యం
బ్రహ్మంగారిమఠం, జూలై 4 : 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అత్యధిక శాసనసభ స్థానాలను కైవసం చేసుకొని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి పదవి చేపట్టాక మొదటి సంతకం రుణమాఫీ ఫైలుపైనే పెట్టనున్నట్లు మైదుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్ యాదవ్, రాష్ట్ర తేదేపా ప్రధాన కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం బిమఠం మండలంలోని ఎర్రంపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బాబు ముఖ్యమంత్రి అయ్యాక రెండవ సంతకం బెల్ట్ షాపులు తీసివేయడం పైన రెండవ సంతకం ఉంటుందన్నారు. చంద్రబాబు ప్రజలకు గతంలో చేసిన అభివృద్ది పనులు కానీ, గతంలో ఎన్ని కరువుకాటకాలువచ్చినా రైతులకు గానీ, ఇళ్ళకుగానీ 9గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందించారని, అలాగే రైతులకు అన్ని రకాల వస్తువులను అందించారని, అందువల్లె అన్ని పార్టీలకు చెందిన నాయకులు, ప్రజలు, టిడిపిలో చేరుతున్నారన్నారు. అందులో భాగంగానే ఎర్రంపల్లె, కొత్తపల్లె గ్రామాలకు సంబంధించిన మాజీ ఎంపిటిసి వీరయ్య, మోపురు సిద్దయ్య, మేకల గుర్రయ్య, కృష్ణయ్య , శ్రీనివాసులు, బాల సుబ్బారెడ్డి, నరశింహారెడ్డి, దుగ్గుల కామాక్షిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డిల ఆధ్వర్యంలో 40 కుటుంబాలు కాంగ్రెస్ , వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందినవారు తమ పార్టీలోకి కండువాలు వేసి స్వాగతించామన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ధరలు నియంత్రించడంలో కానీ, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, రైతులకు నాణ్యతగా అందించడంలో కానీ, ధరలు తగ్గించడంలోకానీ ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, గిట్టుబాటు ధరలు అందించడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలం అయిందన్నారు. అలాగే వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని టిడిపివైపు మొగ్గుచూపుతున్నారన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి అక్రమాలుచేసి జైలుకు పోయాడని, జైలుకెళ్ళి 14 నెలలు గడుస్తున్నా ఆయనకు సంబంధించి విజయమ్మ, షర్మిల, భారతి చెప్పెమాటలు బూటకాలని, వారు ఏ తప్పు చేయకపోతే ఇన్నిరోజులు జైల్లో ఎందుకు ఉన్నారన్నారు. వారు సంపాధించిన వేల కోట్ల రూపాయలు ప్రజలదేనని, ప్రజలు తెలుసుకున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి అసమర్ధుడని తన పదవిని నిలుపుకునేందుకు కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. చంద్రబాబు ఆద్వర్యంలో టిడిపి బలోపేతం అవుతుందని స్తానిక ఎన్నికలు సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి, తదితర ఎన్నికలలో మైదుకూరు నియోజకవర్గంలో అన్ని స్థానాలను గెలుచుకొని టిడిపి సత్తా ఏమిటో నిరూపిస్తామని వారు సవాల్ విసిరారు. ఈకార్యక్రమంలో వెంకటసుబ్బయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో
80 శాతం సీట్లు వైకాపావే
* ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి
సుండుపల్లె, జూలై 4: స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతం సీట్లు వైకాపా మద్దతుదారులు కైవసం చేసుకుంటారని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం మండలంలోని రెడ్డివారిపల్లె వైకాపా మండల కన్వీనర్ వై. ఆనంద్‌రెడ్డి స్వగృహంలో పంచాయతీ వారీగా నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో వైకాపా మద్దతుతో పోటీ చేసేందుకు అన్ని పంచాయతీల నుంచి అభ్యర్థులు చాలామంది ముందుకొస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే నాయకుల సమక్షంలోనే అభ్యర్థులను ఖరారు చేసుకునేందుకు సుండుపల్లెకు వచ్చానన్నారు. ప్రతి పంచాయతీలో నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి కలిసి కట్టుగా పార్టీ కోసం పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా కన్వీనర్ వై. ఆనంద్‌రెడ్డి, నాయకులు నరసింహారెడ్డి, ఆరంరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, జయరామనాయుడు, హకీం, ఇర్ఫాన్, చంద్రానాయక్ పాల్గొన్నారు.

విభజిస్తే అగ్నిగుండమే
* కలెక్టరేట్ ముట్టడిలో జెఎసి నాయకుల హెచ్చరిక
కడప (రూరల్), జూలై 4 : కొంతమంది నేతల స్వార్థం కోసం చరిత్ర కలిగిన రాయలసీమ జిల్లాలను విడకొట్టాలని చూస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని జెఎసి నేతలు మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, సింగారెడ్డి రామచంద్రారెడ్డిలు హెచ్చరించారు. జెఎసి ఆధ్వర్యంలో గురువారం నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉందన్నారు. అలాంటి సీమను స్వార్థ రాజకీయాల కోసం విడగొట్టాలనుకోవడం క్షమించరాని విషయమన్నారు. ఇప్పటికైనా రాయలసీమ జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు ఇలాంటి ప్రతిపాదనలను అడ్డుకోవాలని కోరారు. ఇందుకు పార్టీలకు అతీతంగా మేథావులు, రచయితలు, విద్యా వంతులు, యువత, రైతులు, కార్మికులు ఉద్యమ బాట పట్టాలని పిలుపునిచ్చారు. వైకాపా నేతలు అంజాద్ బాషా, అఫ్జల్‌ఖాన్‌లు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు గీత దాటి ఉద్యమాలకు తరలిరావాలని పిలుపునిచ్చారు. టిడిపి నాయకులు బాలకృష్ణయాదవ్ మాట్లాడుతూ రాయలసీమ కోసం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు మూకుమ్మడి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రి తనయుడు అషఫ్,్ర శ్రీనివాసరావులతో పాటు వందలాదిగా విద్యార్థులు, యువత పాల్గొన్నారు.

* పంచాయతీ ఎన్నికలపై సమీక్ష * కోడ్ అమలుతో కొత్త పనులకు చెక్ * సమస్యాత్మక ప్రాంతాలపై అప్రమత్తం * నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు * కలెక్టర్ కోన శశిధర్ ఆదేశం
english title: 
election

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>