తిరుపతి, జూలై 4: స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ సదస్సులను నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ శుక్రవారం తిరుపతిలో కూడా ప్రాంతీయ సదస్సును నిర్వహించనున్నది. రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుండి తెలుగుదేశం పార్టీ నేతలు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, మాజీ ప్రతినిధులు సుమారు 20 వేల మంది రానున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో 6 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ నుండి హోటల్ ఉదయ్ ఇంటర్నేషనల్‌కు వెళ్లి అక్కడ బస చేయనున్నారు. అటు తరువాత 8 గంటలకు పూతలపట్టుకు బయలుదేరి ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీరజవాన్ వినాయకం ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు అక్కడ నుండి బయలుదేరి 10 గంటలకు తిరుపతి రూరల్ తనపల్లి క్రాస్ వద్ద ఉన్న రామానాయుడు కల్యాణ మండపంలో నిర్వహించే ప్రాంతీయ సదస్సులో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ ఈ సదస్సు జరుగుతుంది. అటు తరువాత సాయంత్రం 6 గంటలకు వివిధ జిల్లాల వారిగా ముఖ్యనేతలతో బాబు సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశాలను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సమీక్షా, సమావేశాలు నిర్వహించారు. భారీ ఎత్తున ప్రజలను తరలించేందుకు సమాయత్తం అవుతున్నారు. చంద్రబాబు దృష్టిలో పడేందుకు నేతలు పోటీపడుతున్నారు. సభావేదిక పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కటౌట్లు, బ్యానర్లను, తోరణ ద్వారాలను కట్టారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెట్టాల్సి వుంటుందని రెవెన్యూ అధికారులు హెచ్చరించడంతో టిడిపి నేతలు మీమాంశలో పడుతున్నారు. సదస్సు జరిగే ప్రాంతం మినహాయించి బయట బ్యానర్లను కడితే చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు హెచ్చరికలతో టిడిపి నేతల అత్యుత్సాహానికి బ్రేకులు వేసినట్లు అయింది. కాగా సభా ఏర్పాట్లను టిడిపి సీనియర్ నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, చదలవాడ కృష్ణమూర్తి, నరసింహయాదవ్, శ్రీధర్‌వర్మ, గౌనిగారి శ్రీనివాసులు, మాల్యాద్రి, నగర పార్టీ అధ్యక్షుడు దంపూరి భాస్కర్, బిజి కృష్ణయాదవ్, మస్తాన్‌నాయుడు, ఆర్‌సిమునికృష్ణ, మందాలపు మోహన్‌రావు, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఉప్పలపాటి శ్రీనివాస చౌదరి తదితరులు ఏర్పాట్లలో బిజీగా వున్నారు. మందాలపు మోహన్‌రావు ఆధ్వర్యంలో 20 వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా నరసింహయాదవ్ ఆధ్వర్యంలో వివిధ హంగుల్లో, రకరాల మోడల్స్‌లో స్వాగత కటౌట్లను ఏర్పాటు చేశారు. టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా ఆధ్యక్షుడు రవినాయుడు ఆధ్వర్యంలో నారాచంద్రబాబు నాయుడు సైనికుడి డ్రస్‌లో వస్తున్నట్లు ఏర్పాటు చేసిన కటౌట్ అందర్నీ ఆకట్టుకుంది.
ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ముగ్గురు కానిస్టేబుళ్లు అరెస్టు
బిఎన్ కండ్రిగ పోలీసులను అభినందించిన అర్బన్ ఎస్‌పి
తిరుపతి, శ్రీకాళహస్తి, జూలై 4: బుచ్చినాయుడు కండ్రిగ మండలం ఆళ్లత్తూరు వద్ద ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లను శ్రీకాళహస్తి పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాళహస్తి వన్‌టౌన్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అరుణ్, టూటౌన్‌లో పనిచేస్తున్న చిరంజీవి, మహేష్‌లను అర్బన్ ఎస్‌పి రాజశేఖర్‌బాబు ఆదేశాల మేరకు గురువారం శ్రీకాళహస్తి డిఎస్‌పి అభిషేకం ఆధ్వర్యంలో వన్‌టౌన్ సిఐ నాగరాజు, బిఎన్ కండ్రిగ ఎస్‌ఐలు తమ సిబ్బందితో కలిసి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన కానిస్టేబుళ్లను జడ్జి ముందు హాజరు పరిచి సబ్‌జైలుకు తరలించారు. ఆళత్తూరు వద్ద బుధవారం అర్ధరాత్రి 6 లక్షల రూపాయలు విలువ చేసే 31 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. ఈ స్మగ్లింగ్‌లో ప్రధాన సూత్రదారులుగా ముగ్గురు కానిస్టేబుళ్లు ఎర్రచందనం స్మగ్లర్లు గురవయ్య, మల్లికార్జున, నరేష్‌లతో సంబంధం పెట్టుకున్నారు. 3వతేది సాయంత్రం ఏపి 26 ఎహెచ్ 6276 ట్రైలర్, ఏపి ఏపి 26ఎహెచ్ 6277 నెంబర్‌గల వాహనాల్లో ఎర్రచందనాన్ని తరలిస్తుండగా అలత్తూరు - రెడ్డిగుంట బడవ రోడ్డులో బిఎన్ కండ్రిగ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఎర్రచందనం లారీలు వెళ్లేందుకు వీలుగా ముందు ఎపి 03 ఎఆర్ 5373 సిబిజెడ్ ద్విచక్ర వాహనంలో పైలట్స్‌గా కానిస్టేబుళ్లు మహేష్, ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ చిరంజీవిలను అరెస్టు చేశారు. ఈ విషయం బట్టబయలు కావడంతో ఆ కానిస్టేబుళ్లు పరారయ్యారు. పోలీసులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపారు. ఈ స్మగ్లింగ్ వెనుక పోలీసు ఉన్నతాధికారి ఒకరు అండగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కింది స్థాయి ఉద్యోగులను అరెస్టు చేసి, పై స్థాయి అధికారులను వదిలేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ఇంటి దొంగలైన పోలీసులను అరెస్టు చేసిన బిఎన్ కండ్రిగ ఎస్‌ఐ వెంకటరమణ, అతని సిబ్బందిని అర్బన్ ఎస్‌పి రాజశేఖర్‌బాబు అభినందించారు. ఈ కేసులో పరారైన స్మగ్లర్లు గురవయ్య, మల్లికార్జున, నరేష్‌లను త్వరలో అరెస్టు చేస్తామని అర్బన్ ఎస్‌పి తెలిపారు.
అధికారంలోకి వచ్చేంది టిడిపినే : ముద్దు
తిరుపతి, జూలై 4: రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీనేనని ఆ పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. గురువారం రామానాయుడు కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో ప్రాంతీయ సదస్సుకు విచ్చేయనున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకనున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని ఆగడాలు చేసినా అత్యధిక స్థానాలను గెలుచుకుంటామన్నారు. అవినీతి కాంగ్రెస్‌లో నుండి పుట్టిన కొమ్మ వైఎస్‌ఆర్‌సి అని అన్నారు. ఎప్పటికైనా వైఎస్‌ఆర్‌సిపి కాంగ్రెస్‌లో కలిసిపోవడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో టిడిపి నేతలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, చదలవాడ కృష్ణమూర్తి, నరసింహయాదవ్, డాక్టర్ కొడూరు బాలసుబ్రమణ్యం, బుల్లెట్ రమణ, శ్రీధర్‌వర్మ, దంపూరి బాస్కర్, ఆర్‌సి మునికృష్ణ, మందాలపు మోహన్‌రావు, ఉప్పలవాటి శ్రీనివాసులు , రవినాయుడు, రామారావు తదితరులు పాల్గొన్నారు.
హజ్‌యాత్రకు రాష్ట్రం నుంచి 7525 మందికి అర్హత కల్పిస్తాం
* రాష్ట్ర హజ్‌యాత్ర కమిటీ చైర్మన్ స్పష్టం
మదనపల్లె, జూలై 4: జిల్లా నుంచి హజ్ యాత్రకు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వెళ్ళే యాత్రికులకు గురువారం మదనపల్లె పట్టణం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్‌లో శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిధిగా రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ కమాల్ ఉద్దీన్ అహ్మద్ హజ్ యాత్రికులను ఉద్దేశించి మాట్లాడుతూ మదనపల్లె డివిజన్ పరిధి నుంచి బయలుదేరే హజ్ యాత్రికులకు మూడురోజుల శిక్షణ ఇవ్వాలన్నారు. దేశవ్యాప్తంగా 1.25లక్షల మంది, రాష్టవ్య్రాప్తంగా 7525, చిత్తూరు జిల్లా నుంచి 460మందికి అవకాశం ఉంటుందని తెలిపారు. వారిలో శిక్షణ పొందిన యాత్రికులకు హెల్త్ అండ్ ట్రైనింగ్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్డు ఉన్నవారికి మాత్రమే యాత్రలో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తిచేసిన వారిలో అర్హులను ఎంపిక చేస్తామన్నారు. అనంతపురం, చిత్తూరుజిల్లా యాత్రికులకు బెంగళూరు నుంచి హజ్‌యాత్ర ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు జిల్లా మైనార్టీ సంక్షేమ, వక్ఫ్‌బోర్డు కమిటీ ఇఓ అబ్దుల్‌హమీద్, సభ్యులు మహ్మద్‌ఖాన్, ఇమ్రాన్‌ఖాన్, మహ్మద్ ఇబ్రహీమ్, కలీల్ ఉద్దీన్, మతగురువులు, ముస్లింలు హాజరయ్యారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
యాదమరి, జూలై 4: రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన సంఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై ఉమామహేశ్వరరావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని పాచిగుంట గ్రామానికి చెందిన ఉదయకుమార్, ఉత్తరకుమార్ చిత్తూరు నుంచి మోటార్‌సైకిల్‌పై స్వగ్రామమైన పాచిగుంటకు వెళ్తుండగా భూమిరెడ్డిపల్లె క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న మరో మోటార్‌సైకిల్ ఢీకొనడంతో అదుపుతప్పి పక్కనే వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఉదయకుమార్(20) సంఘటనా స్థలంలో మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన ఉత్తరకుమార్(22)ను 108 అంబులెన్సు ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. మరో మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్న జాఫర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని మెరుగైన చికిత్సల కోసం వేలూరు సిఎంసికి తరలించారు. ఈమేరకు యాదమరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
‘మేధావుల్లారా... సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వాములు కండి’
ఆంధ్రభూమిబ్యూరో
తిరుపతి, జూలై 4: సమైక్యాంధ్ర కోసం మేధావులు ఉద్యమంలో భాగస్వాములు కావాలని, రాష్ట్ర ఐక్యతను సాధించి భవిష్యత్ తరాల వారికి భవిష్యత్ కల్పిద్దామని శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం ఎటిఎన్ డిగ్రీ కళాశాలలో సమైక్యాంధ్ర విద్యార్థుల చైతన్య సదస్సు శాప్స్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ నరేంద్ర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాల విభజన డిమాండ్ దాదాపు 16 రాష్ట్రాల్లో ఉందని, ఒక్క ఆంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తే తేనెతుట్టెను కదలించినట్లేనన్నారు. రాష్ట్రాల విభజనకు సంబంధించి రెండవ ఎస్‌ఆర్‌సిని వేసి చర్చించాలన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని చీల్చితే కాంగ్రెస్ పార్టీ లాభపడుతుందని దిగ్విజయ్‌సింగ్ చెప్పడం విడ్డూరమన్నారు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టుపై లోతైన చర్చ జరగాలన్నారు. ప్రత్యేక తెలంగాణపై రాష్ట్రఅసెంబ్లీలో చర్చించి చేసిన తీర్మానాన్ని అంగీకరించాలన్నారు. ఎస్వీయూనివర్శిటీ ప్రొఫెసర్ బాలాజీ ప్రసంగిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ కొరకు రాష్టవ్య్రాప్తంగా విద్యార్థులు, యువకులు ఉద్యమాలను ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, మేధావులు వౌనంగా ఉంటే సమాజం చెడిపోతుందన్నారు. శాప్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రలో ఉన్న ప్రజాప్రతినిధులు గతంలో మాదిరిగా రాష్ట్ర ఐక్యతకోసం ఉద్యమాల్లోకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల ఓట్లకోసం చేస్తున్న ప్రకటనలను నమ్మవద్దని, కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తెలంగాణ ప్రజలు సైతం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు కెవి ప్రసాద్, తేజ్‌ప్రకాష్, నిజాముద్దీన్, భారతి, యశోధ, మోహన్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
డయల్ 100కు మంచి స్పందన : ఎస్పీ
చిత్తూరు, జూలై 4: డయల్ యువర్ 100కు చిత్తూరు జిల్లాకు సంబంధించి 1,738 మంది ఫిర్యాదు చేసినట్లు జిల్లా ఎస్పీ కాంతిరాణాటాటా ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ప్రమాదాలకు సంబంధించి 879, దొంగతనాలు, హత్యలు తదితర నేరాలకు సంబంధించి ఫిర్యాదులు అందాయన్నారు. డయల్ 100 విభాగానికి ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు చెందిన సిబ్బంది ఫిర్యాదు చేసిన వ్యక్తుల వద్దకు పట్టణ ప్రాంతాల్లో 20 నిమిషాల లోపు, గ్రామీణ ప్రాంతాలకు 45 నిమిషాలలోపు చేరుకొని సంబంధిత ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుంటారన్నారు. జూన్ నెలకు సంబంధించి 174 కేసులు నమోదయ్యాయన్నారు. ఇటీవల బి.కొత్తకోట పోలీస్టేషన్ పరిధిలోని వేమిలికోట గ్రామ సమీపంలో ఒక మహిళపై దాడిచేసి నగలు దోచుకున్న సంఘటన గురించి డయల్ 100కు సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి సకాలంలో చేరుకొని తగు చర్యలు తీసుకున్నారన్నారు. అదేవిధంగా పుంగనూరు పట్టణంలోని మారెమ్మ గుడి వద్ద జరిగిన ఒక హత్య కేసులో కూడా డయల్ 100కు సమాచారం రాగా, పోలీసులు సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకొని నిందితుల్ని అరెస్టు చేశారన్నారు. కావున జిల్లా ప్రజలు డయల్ 100ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కాంతిరాణాటాటా కోరారు.
ప్రభుత్వ సామగ్రిని తరలించుకెళ్లిన ప్రైవేటు సంస్థ
* లాసావాసా కంపెనీ నిర్వాకం
* పట్టించుకోని తెలుగుగంగ అధికారులు
శ్రీకాళహస్తి, జూలై 4: ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 7 ఏళ్ల కాలపరిమితి ముగిసిన తరువాత మొత్తం సామగ్రిని తెలుగుగంగ అధికారులకు స్వాధీనం చేయాల్సిన లాసా వాసా సంస్థ కొంత సామగ్రిని బహిరంగంగా తరలించుకుని వెళ్లినా అధికారులు పట్టించుకోలేదు. ఇదేమిటని ప్రశ్నించిన వారితో ఒప్పందం వివరాలు తమకు తెలియదంటూ తెలుగుగంగ అధికారులు దాట వేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. తెలుగుగంగ ప్రాజెక్టు పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించడానికి 2005లో రాష్ట్ర ప్రభుత్వం లీ అసోసియేట్ సౌత్ ఆసియా ప్రైవేటు లిమిటెడ్ జాయింట్ వెంచర్ విత్ వాస్ కన్‌స్టలెన్సీ (లాసావాసా) కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. కాలపరిమితి ముగిసిన తరువాత మొత్తం సామగ్రిని తెలుగుగంగ ప్రాజెక్టుకు స్వాధీనం చేయాలనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు శ్రీకాళహస్తిలోని తెలుగుగంగ కాలనీలోని లాసావాసా సంస్థ కార్యాలయాలకు, ల్యాబ్‌లకు భవనాలను కేటాయించారు. ఇందులో కంప్యూటర్లు దగ్గర నుండి ఫర్నీచర్ వరకూ అన్ని రకాల సౌకర్యాలను కల్పించింది. ఈ ఒప్పందం గత నెల 30వతేదికి ముగిసింది. ఒప్పందం కుదుర్చుకున్న అధికారులు ప్రస్తుతం లేకపోవడంతో లాసావాసా కంపెనీ ప్రతినిధులు కార్యాలయంలోని ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతరత్రా సామగ్రిని గురువారం తరలించుకెళ్లారు. కళ్ల ముందే సామగ్రి తరలిపోతున్నా తెలుగుగంగ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. విలువైన వస్తువులన్నీ తరలించినట్లు సమాచారం. ఈ విషయంపై తెలుగుగంగ ఇఇ ప్రసాద్‌ను వివరణ అడుగగా ఒప్పందం వివరాలు తమకు తెలియదని, లాబొరేటరీలో పరికరాలు మాత్రమే ఉన్నాయని, ఇతరత్రా సామగ్రిని మొత్తం వారు తీసుకువెళ్లిన మాట వాస్తవమేనన్నారు.
సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీల రిలే దీక్షలు
చిత్తూరు, జూలై 4: అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు గురువారం రెండోరోజుకు చేరుకున్నాయి. అంగన్‌వాడీ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వేతనంతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనం పెంచాలని, అంగన్‌వాడీ కేంద్రాలను ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదని, అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం గాంధీ రోడ్డులోని సిడిపిఓ కార్యాలయం వద్ద ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈకార్యక్రమానికి అంగన్‌వాడీ వర్కర్లు, అండ్ హెల్పర్స్ జిల్లా ఉపాధ్యక్షురాలు సుజని, గుడిపాల మండల నాయకులు ఉష, బుజ్జి, శశికళ, సిఐటియు డివిజన్ కార్గదర్శి గంగాధరగణపతి, సురేంద్రతోపాటు అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గల్లా ఫుడ్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
* తప్పిన పెనుప్రమాదం
* రూ. కోటి 81లక్షల ఆస్తి నష్టం
పూతలపట్టు, జూలై 4: మండలంలోని రంగంపేట క్రాస్ సమీపంలో ఉన్న గల్లా ఫుడ్స్ ఫ్యాక్టరీలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీకి అనుబంధంగా మామిడి జ్యూస్ నిమిత్తం నిల్వ ఉంచిన మామిడి పండ్ల షెడ్లలో నాలుగు షెడ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో కోటి 81లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్ తెలిపింది. సకాలంలో గల్లా ఫుడ్స్ సిబ్బంది స్పందించి పాకాల అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించకుంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని సిబ్బంది తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని ప్యాక్టరీ యాజమాన్యం తెలిపింది. ఈప్రమాదంలో నాలుగు షెడ్లలో నిల్వ ఉంచిన వివిధ రకాలైన మామిడి పండ్లు పూర్తిగా కాలిపోయాయి. గల్లా ఫుడ్స్ ప్యాక్టరీ మేనేజర్ జగన్మోహన్ మాట్లాడుతూ ప్రమాదం తెలిసిన వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బందిని అభినందించారు. అమరరాజా సిబ్బంది కూడా మంటలను అదుపుచేయడంలో సాయపడ్డారు. అగ్నిమాపక జిల్లా అధికారి శ్రీనివాసులు, హార్టికల్చర్ అధికారులు, విద్యుత్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాద సంఘటనపై పూతలపట్టు పోలీసులకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.
పాకాలలో ఎసిబి కలకలం
* మారువేషంలో తచ్చాడిన అధికారులు
పాకాల,జూలై 4: అవినీతి నిరోధకశాఖ అధికారులు గురువారం పాకాలలో మఫ్టీలో తిరగడం ప్రభుత్వ అధికారులను వణికించింది. ఎసిబి సిఐ స్థాయి అధికారులు ఇద్దరు లుంగీలతో తహసీల్ధార్, ఎంపిడిఓ, వ్యవసాయ శాఖ అధికారుల కార్యాలయాల వద్ద తిరుగుతూ కనిపించారు. ఎవరికి అనుమానం రాకుండా రైతులవలే వీరు వేషధారణతో రావడం, నిఘా పెట్టడంతో ఏ కార్యాలయంలో ఏ అధికారికి మూడిందోనంటూ తెలిసిన వారు కొంత మంది చర్చించుకోవడం కనిపించింది. ఇటీవల రెవెన్యూశాఖపై ప్రత్యేక దృష్టిపెట్టిన ఎసిబి అధికారులు పాకాలలో తిష్టవేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎసిబి అధికారులు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉండటాన్ని తెలుసుకున్న ఆయా శాఖల అధికారులు వణికిపోతున్నారు. అవినీతి అధికారుల గుట్టురట్టు చేయడంలో భాగంగా రైతుల వలే మారువేషంలో వచ్చారా? లేక ఏ అధికారిపైనైనా నిఘా పెట్టేందుకు వచ్చారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
వికలాంగ విద్యార్థులకు చేయూతనివ్వాలి
* డిఇఓ ప్రతాప్‌రెడ్డి పిలుపు
గంగాధర నెల్లూరు, జూలై 4: వికలాంగ విద్యార్థులకు చేయూతనందిస్తే వారు ఉన్నత విద్యావంతులు అవుతారని జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంఆర్‌సిలో జరిగిన విద్యాపక్షోత్సవాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం కోసం కోట్లాది రూపాయల నిధులు ఖర్చుచేస్తున్నాయని, శారీరక, బుద్ధిమాంద్యత వల్ల కొంతమంది బాలబాలికలు విద్యలో వెనుకబడుతున్నారని, ఇలాంటి వారికి చేయూతను అందించి సహాయం చేస్తే అందరికంటే వారు మిన్నగా తయారవుతారన్నారు. ఈసందర్భంగా చిన్నారి శ్రవణం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. చిన్న వయస్సులో వినికిడి లోపంతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులను గుర్తించి వారికి ప్రాథమిక దశలో చికిత్స అందించడంతోపాటు వినికిడి యంత్రాలను పంపిణీచేస్తే అందరితోపాటు వారు మంచి విద్యను నేర్చుకుంటారన్నారు. దీంతోపాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సైతం వికలాంగ విద్యార్థులకు కొద్దిపాటి సలహాలు, సూచనలు అందచేసి వారిలో నూతన ఉత్తేజాన్ని కల్పిస్తే వారు నూతన ఉత్తేజతులై అందరికన్నా మెరుగ్గా రాణించే అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయన్నారు. దేశ చరిత్రలో ఎంతో మంది వికలాంగులు శాస్తజ్ఞ్రులతోపాటు బహుళ కంపెనీల్లో పలు పదవులను పొందిన సంగతి ఆయన గుర్తు చేశారు. ఈకార్యక్రమాలు ఆర్‌విఎం పథకం కింద అమలవుతున్నాయని, మరింత అభివృద్ధి చెందడం కోసం అందరి కృషి అవసరమన్నారు. ఈకార్యక్రమంలో మండల ఇన్‌చార్జి విద్యాశాఖాధికారి రాజేంద్రప్రసాద్, ఆర్‌విఎం పిఓ లక్ష్మిదేవి, ఆర్‌డబ్ల్యూఎస్ డిఇ స్టాలిన్, వైద్యాధికారులు జానకిరావు, గీతతోపాటు వెదురుకుప్పం, ఎస్‌ఆర్‌పురం మండలాలకు చెందిన అనేక మంది వికలాంగ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.