కంకిపాడు, జూలై 4: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చరమగీతం పాడి తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థుల విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు సీతారామా గార్డెన్స్‌లో గురువారం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల పార్టీ నాయకుల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మైలవరం నియోజకవర్గం శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని, 2014 శాసనసభ ఎన్నికల్లో విజయానికి, పార్టీ పటిష్టతకు సమిష్టి కృషి అవసరమని అన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. స్థానిక సంస్థల పటిష్టతకు కృషి చేసింది తెలుగుదేశం పార్టీయేనని, నీటి సంఘాలు, రైతు సంఘాలు, డ్వాక్రా గ్రూపులు, విద్యా కమిటీలు, ఐసిడిఎస్ వంటి వాటిని ఏర్పర్చి అభివృద్ధికి దోహదపడింది తెలుగుదేశం పార్టీ అని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. గ్రామాలు మంచి నాయకులను ఎన్నుకున్నప్పుడే ఆదర్శ గ్రామాలుగా మారతాయని అన్నారు. కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ పార్టీలకు చరమగీతం పాడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలవల్ల రాష్ట్రం అధోగతి పాలైందని అన్నారు. వేల కోట్ల రూపాయల మేర కుంభకోణాలు జరుగుతుంటే అభివృద్ధి ఏం జరుగుతుందని విమర్శించారు. 2012 నీలం తుఫాన్‌లో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందిస్తే రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం పెడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంకు అధికారం ఇస్తే విజయవాడ- గుంటూరును మెగా సిటీగా తీర్చిదిద్దుతానని, నెల రోజుల్లో దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడతామని, బందరు పోర్టు నిర్మాణం, విజయవాడ- గుంటూరు- రేపల్లె పట్టణాలకు అవుటర్ రింగ్‌రోడ్డు నిర్మించి అభివృద్ధి చేస్తామని వరాల జల్లు కురిపించారు. జిల్లా పార్టీ నాయకులు వర్ల రామయ్య, కాగిత వెంకట్రావ్, వైవిబి రాజేంద్రప్రసాద్, కొనకళ్ల నారాయణ, దాసరి బాలవర్థనరావు, తంగిరాల ప్రభాకరరావు, బచ్చుల అర్జునుడు, ఈడుపుగల్లు గ్రామ పార్టీ అధ్యక్షుడు అనుమోలు పద్మనాభ చౌదరి, మాగంటి బాబు, తదితరులు హాజరయ్యారు.
పంచాయతీ ఎన్నికల్లో
సమస్యాత్మక గ్రామాల్లో వెబ్ కాస్టింగ్
* జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్
విజయవాడ , జూలై 4: గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు, సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని పరిశీలించేందుకు వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ ఎం జ్యోతి పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై నగరంలోని కలెక్టర్ క్యాంపుకార్యాలయంలో రెవెన్యూ డివిజన్ అధికారులకు, పంచాయితీ అధికారులు, డివిజనల్ పంచాయితీ అధికారుల, బిఎస్‌ఎన్‌ఎల్, ఎపి ట్రాన్స్‌కో, రవాణా శాఖ, అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల లో జరిగే ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ద, చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు జరుగకుండా వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లు చేయాలని, అలాగే వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటుకు అవకాశం లేని గ్రామాల్లో వీడియో షూటింగ్ చేసి మైక్రో అబ్జర్వర్లను నియమించాలని సూచించారు. ఈప్రక్రియను పరిశీలించేందుకు గానుబిఎస్‌ఎన్‌ఎల్, విద్యుత్ శాఖ, రవాణా శాఖల నుంచి ప్రతి డివిజన్‌కు ఒక నోడల్ అధికారిని నియమించాలన్నారు. వీరందరూ రెవెన్యూ అధికారుల సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అలాగే సమస్యాత్మక గ్రామాలంటినీలో పోలీస్ బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. బుధవారం ఎన్నికల షెడ్యూల్డ్‌ను ప్రకటించడంతో జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని, అధికారులు ఈ ప్రవర్తనా నియమావళి అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్నికల ప్రవర్తనా నియమాలళి అమలుకు చైర్మన్‌గా వ్యవహరిస్తారని, ఎన్నికల కోడ్, పెయిడ్ న్యూస్ ఆర్టికల్స్, లను జాగ్రత్తగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంక్ అధికారులను డివిజనల్ స్థాయిలో మైక్రో అబ్జర్వర్లుగా నియమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. గత ఎన్నికల్లో జరిగిన అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఆయా గ్రామాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారులు, సంబంధిత డిఎస్‌పిలు సంయుక్తంగా పరిశీలించాలని పేర్కొన్నారు. ఎన్నికల విధులను నిర్వర్తించే సంబంధిత అధికారులు అలక్ష్యం లేకుండా మరింత జాగ్రత్తలు పాటించాలని ఆర్‌డిఓ లకు సూచించారు. గిరిజన, మత్స్యకార నివాసిత ప్రాంతాల్లో చిప్ లిక్కర్ పంపిణీని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నూతన ఓటర్ల నమోదు చేయటం జరగదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి ఉషాకుమారి, సబ్ కలెక్టర్ డి హరిచందన, అదనపు జాయింట్ కలెక్టర్ ఎన్ రమేష్‌కుమార్, డిపిఓ ఆనంద్, ట్రాన్స్‌కో ఎస్‌ఇ మొహనకృష్ణ, బిఎస్‌ఎన్‌ఎల్ అధికారి శ్రీనివాస్, డిటిసి శివలింగయ్య, నూజివీడు, గుడివాడ, బందర్ రెవెన్యూ డివిజనల్ అధికారులు బి సుబ్బారావు, వెంకట సుబ్బయ్య, సాయిబాబు పాల్గొన్నారు.
ఓటుహక్కు నిర్భయంగా వినియోగించుకోండి
* ఎస్పీ ప్రభాకరరావు
కూచిపూడి, జూలై 4: రాజ్యాంగం ప్రతి పౌరునికి కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ ప్రభాకరరావు అన్నారు. పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని గురువారం రాత్రి మొవ్వ మండలం కోసూరు, కాజ గ్రామాల్లో పోలీసు గ్రామసభల్లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. అవనిగడ్డ డిఎస్పీ హరిరాజేంద్ర బాబు అధ్యక్షత వహించారు. ప్రతి గ్రామంలో నిర్భయంగా ఓటుహక్కును వినియోగించుకునేందుకు సహకరించి సమస్యాత్మక గ్రామాల పేరును చెరిపి వేసుకునేందుకు ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చల్లపల్లి సిఐ దుర్గారావు, కూచిపూడి ఎఎస్‌ఐ సత్యనారాయణ, విఆర్‌ఓలు నాగమల్లేశ్వరరావు, సంధ్యారాణి, ఇఓలు పిచ్చయ్య, ఉమామహేశ్వరరావు, గ్రామ ప్రముఖులు గోగినేని పెరుమాళ్ళు, నాగవర్ధనరాజు, దగాని సుబ్బారావు, యార్లగడ్డ శ్రీనివాసరావు, తాతా రామ్మోహనరావు పాల్గొన్నారు.
రిక్షా తొక్కి కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన
మచిలీపట్నం (కల్చరల్), జూలై 4: ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట కాంట్రాక్టు అధ్యాపకులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం 11వ రోజుకు చేరుకున్నాయి. కాంట్రాక్టు అధ్యాపకులు రిక్షా తొక్కి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన సిపిఎం నాయకులు కొడాలి శర్మ, బహుజన సమాజ్ పార్టీ నాయకులు జి విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. 11 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం శోచనీయమన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు కెవి నాగేశ్వరరావు మాట్లాడుతూ 6న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కాంట్రాక్టు అధ్యాపకులు వరప్రసాద్, సురేష్, రాంబాబు దీక్షలో పాల్గొన్నారు. యండి మున్వర్, నాగరాజు, జాషువ, సతీష్‌కుమార్, వాసు, రమేష్ దీక్షా శిబిరాన్ని పర్యవేక్షించారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
కృత్తివెన్ను, జూలై 4: మండల పరిధిలోని పోడు గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నిడమర్రు గ్రామానికి చెందిన కూలీలు పశ్చిమ గోదావరి జిల్లా వెళుతుండగా ద్విచక్ర వాహనం అడ్డురావటంతో ఆటో పల్టీకొట్టింది. క్షతగాత్రులను భీమవరం ఆసుపత్రికి తరలించారు.
ఆర్టీసీ కార్మికుల ధర్నా
అవనిగడ్డ, జూలై 4: ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులు 240 రోజులు పనిదినాలు పూర్తిచేసిన వారిని పర్మినెంట్ చేయాలని, గత ఏప్రిల్ 1నాటికి వేతన సవరణ ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు గురువారం ధర్నా జరిపారు. యూనియన్ నాయకులు రాంప్రసాద్, పూర్ణచంద్రరావు నాయకత్వం వహించారు.
అల్లూరికి ఘన నివాళి
మచిలీపట్నం టౌన్, జూలై 4: పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన నేత అని వక్తలు అన్నారు. స్థానిక చల్లరస్తా సెంటరులో సామాజిక కార్యకర్త మైనంపూడి సాయిబాబు ఆధ్వర్యంలో గురువారం అల్లూరి సీతారామరాజు 127వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, షేక్ అరీఫ్ పాషా, వనె్నంరెడ్డి నాగరాజు, ఆకుల సతీష్, చిరువోలు రామ్మోహన్, ఉడత్తు శ్రీనివాసరావు, డా. చిలంకుర్తి పాండురంగారావు పాల్గొన్నారు.
పింగళికి భారతరత్న ఇవ్వాలి
మచిలీపట్నం టౌన్, జూలై 4: జాతీయ పతాకానికి రూపకల్పన చేసి దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు పింగళి వెంకయ్య 51వ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. విజయకృష్ణా కోస్తా జాతీయ రహదారి జనజాగృతి సంస్థ, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు చిలకలపూడి పోలీసు స్టేషన్ పక్కనున్న పింగళి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పింగళి వెంకయ్యకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సికినం కాళిదాసు, నిడుమోలు వెంకటేశ్వర ప్రసాద్, చిలంకుర్తి పాండు రంగారావు, ఆకుల సతీష్, చిన్నం నానిబాబు, కొడమంచలి చంద్రశేఖర్, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, గంపల రాజగోపాల్, రామిశెట్టి ప్రసాద్, చిరువోలు రామ్మోహన్, ఆరీఫ్ పాషా, బి సత్యనారాయణ సింగ్, మైనంపూడి సాయిబాబు, తదితరులు పాల్గొన్నారు.
భట్లపెనుమర్రులో నివాళి
కూచిపూడి : ఎన్నికల కోడ్ పుణ్యమా అని జాతీయ నాయకుడైన పింగళి వెంకయ్య వర్ధంతిని గురువారం మొవ్వ మండలంలో సాదాసీదాగా నిర్వహించారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 51వ వర్ధంతి సందర్భంగా పాఠశాల విద్యార్థులను ఈ కార్యక్రమానికి దూరంగా ఉంచాలని మండల అధికారులు పేర్కొనటంతో పింగళి స్వగ్రామమైన భట్లపెనుమర్రులో ఆయన వర్ధంతిని నామ్‌కే వాస్తే అన్నచందంగా నిర్వహించారు. గ్రామంలోని పింగళి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పింగళి విద్యనభ్యసించిన ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు పింగళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ ప్రముఖులు చలసాని బెనర్జి, యలమంచలి నారాయణదాస్, తంగిశెట్టి సాంబశివరావు, శేషగిరిరావు, కంఠంనేని రామ్మోహనరావు, మేకా నాగేశ్వరరావు, చలసాని మోహనదాస్, గాంధి, గొట్టిపాటి శ్రీనివాసరావు, మేకా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
8 మంది రౌడీషీటర్లపై బైండోవర్ కేసులు
మచిలీపట్నం టౌన్, జూలై 4: గ్రామ పంచాయతీల ఎన్నికల దృష్ట్యా ఇనగుదురు స్టేషన్ పరిధిలో ఆరుగురు రౌడీషీటర్లపై గురువారం బైండోవర్ కేసులు నమోదు చేశారు. జలాల్‌పేటకు చెందిన గంజాల తులసీరామ్, చింతగుంటపాలేనికి చెందిన కొల్లు చరణ్, ఈడేపల్లికి చెందిన బలుసుపాటి సాంబశివరావు, అమృతపురానికి చెందిన మేకల బాజీలపై బైండోవర్ కేసులు పెట్టినట్లు ఎస్‌ఐ వెంకటనారాయణ తెలిపారు. అలాగే మచిలీపట్నం టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో బలరామునిపేటకు చెందిన బండారు శేఖరబాబు, రుస్తుంబాదకు చెందిన జయవరపు వెంకట సుందరరావు, తోటావారితుళ్ళు సెంటరుకు చెందిన రామిశెట్టి మాధవరావుపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ భాస్కరరావు తెలిపారు.
25లోపు డిఎడ్ పరీక్ష రుసుము చెల్లించాలి
మచిలీపట్నం (కల్చరల్), జూలై 4: నవంబర్‌లో నిర్వహించే డిఎడ్ పరీక్షకు మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, తప్పిన విద్యార్థులు ఈ నెల 25లోపు అపరాధ రుసుము లేకుండా పరీక్ష రుసుము చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి డి దేవానందరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డైట్ ప్రిన్సిపాల్ 26న పరీక్ష రుసుమును ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలన్నారు. రూ.50లు అపరాధ రుసుముతో ఆగస్టు ఒకటి లోపు విద్యార్థులు చెల్లించిన పరీక్ష రుసుమును 2న చెల్లించి 5న సిడిలు, హార్డ్ కాపీ, నామినల్ రోల్స్, చలానాలు, దరఖాస్తులు, రికగ్నిషన్ ఉత్తర్వులు, డిఎస్సీ ఆర్డర్స్‌ను డిఇఓ కార్యాలయంలో అందించాలన్నారు. 4, 5 సబ్జెక్టులు ఉంటే రూ.150లు, మూడు సబ్జెక్టులకు రూ.140లు, రెండు సబ్జెక్టులకు రూ.120లు, ఒక సబ్జెక్టుకు రూ.100లు పరీక్ష రుసుముగా నిర్ణయించినట్లు దేవానందరెడ్డి వివరించారు.
చేతివృత్తులను రక్షించాలని ధర్నా
మచిలీపట్నం టౌన్, జూలై 4: చేత్తివృత్తిదారులకు జనాభా ప్రాతిపదికన 25శాతం నిధులతో సబ్‌ప్లాన్ అమలు చేయాలని, వృత్తి కులాల ఫెడరేషన్‌లకు ఇచ్చిన నిధులను వెంటనే సొసైటీలకు మంజూరు చేసి లబ్ధిదారులకు రుణాలు అందించాలని, బిసి మార్జిన్ మనీ, రాజీవ్ అభ్యుదయ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. చేతివృత్తులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వృత్తిదారుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎపి వృత్తి సంఘాల రాష్ట్ర నాయకులు లెల్లెల బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు వృత్తిదారుల సంఘాల ప్రతినిధులు కాటూరి నాగభూషణం, పివి ఆంజనేయులు, చల్లారి సుబ్బారావు, వనమాడి సుబ్బారావు, ఆలేటి విఠల్, పంచల నరసింహరావు పాల్గొన్నారు. సిపిఎం నాయకులు కొడాలి శర్మ, బూర సుబ్రహ్మణ్యం, గుంటూరు విద్యాసాగర్, తదితరులు సంఘీభావం తెలిపారు.
మహిళ హత్య కేసులో నిందితుని అరెస్టు
చల్లపల్లి, జూలై 4: సంచలనం సృష్టించిన వక్కలగడ్డ మహిళ దారుణ హత్య కేసులో చల్లపల్లి పోలీసులు గురువారం నిందితుడిని అరెస్టు చేశారు. స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డిఎస్పీ హరిరాజేంద్ర బాబు నిందితుడు చందోలు రాజశేఖర్‌ను మీడియాకు చూపించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 8న అర్ధరాత్రి వక్కలగడ్డలో కొమ్ము శకుంతల(55) దారుణ హత్యకు గురైందన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. పాత నేరస్థుల కార్యకలాపాలపై నిఘా పెట్టి దర్యాప్తు చేయగా శకుంతల హత్యోదంతం బయట పడిందన్నారు. అత్త వరుసయ్యే శకుంతలతో సన్నిహితంగా ఉంటున్న నిందితుడు రాజశేఖర్ ఆమె నివాసగృహం వెనుక ఉన్న తాడిచెట్టు దగ్గర కొంత సమయం గడిపి డబ్బులు ఇవ్వాలని అడగ్గా అందుకు శకుంతల నిరాకరించింది. దీంతో చెంప మీద కొట్టడంతో శకుంతల పక్కనే ఉన్న తాడిచెట్టుకు గుద్దుకుని గాయపడిందన్నారు. గాయపడిన శకుంతల తలను బలంగా అదే తాడిచెట్టుకు కొట్టి హత్య చేశాడని తెలిపారు. మృతురాలి చెవిదిద్దులు, సెల్‌ఫోన్ తీసుకుని మృతదేహాన్ని ఇంట్లో పడేసి పరారయ్యాడన్నారు. రాజశేఖర్‌పై చల్లపల్లి, చెరుకుపల్లి పోలీసు స్టేషన్‌లలో కేసులు ఉండగా పెదకాకాని స్టేషన్‌లో మరో హత్య కేసు ఉందన్నారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం మేడూరు గ్రామానికి చెందిన రాజశేఖర్ కుటుంబం గత పదేళ్ల క్రితం చల్లపల్లిలో స్థిరపడిందన్నారు. రాజశేఖర్ భార్య, పిల్లలు మేడూరులో ఉంటుండగా గత రెండేళ్ల నుండి మరో మహిళను వివాహం చేసుకుని స్థానిక నారాయణరావు నగర్‌లో ఉంటున్నాడని ఆయన వివరించారు. ఈ సమావేశంలో సిఐ దుర్గారావు, ఎస్‌ఐ గౌస్‌పాషా పాల్గొన్నారు.
పంచాయతీ పోరుకు పకడ్బందీ ఏర్పాట్లు
అజిత్‌సింగ్‌నగర్, జూలై 4: గ్రామ పంచాయితీ ఎన్నికలను సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు, సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని పరిశీలించేందుకు వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ ఎం జ్యోతి పేర్కొన్నారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై నగరంలోని కలెక్టర్ క్యాంపుకార్యాలయంలో రెవెన్యూ డివిజన్ అధికారులకు, పంచాయితీ అధికారులు, డివిజనల్ పంచాయితీ అధికారుల, బిఎస్‌ఎన్‌ఎల్, ఎపి ట్రాన్స్‌కో, రవాణా శాఖ, అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల లో జరిగే ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ద, చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు జరుగకుండా వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లు చేయాలని, అలాగే వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటుకు అవకాశం లేని గ్రామాల్లో వీడియో షూటింగ్ చేసి మైక్రో అబ్జర్వర్లను నియమించాలని సూచించారు. ఈప్రక్రియను పరిశీలించేందుకు గానుబిఎస్‌ఎన్‌ఎల్, విద్యుత్ శాఖ, రవాణా శాఖల నుంచి ప్రతి డివిజన్‌కు ఒక నోడల్ అధికారిని నియమించాలన్నారు. వీరందరూ రెవెన్యూ అధికారుల సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అలాగే సమస్యాత్మక గ్రామాలంటినీలో పోలీస్ బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. బుధవారం ఎన్నికల షెడ్యూల్డ్‌ను ప్రకటించడంతో జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని, అధికారులు ఈ ప్రవర్తనా నియమావళి అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్నికల ప్రవర్తనా నియమాలళి అమలుకు చైర్మన్‌గా వ్యవహరిస్తారని, ఎన్నికల కోడ్, పెయిడ్ న్యూస్ ఆర్టికల్స్, లను జాగ్రత్తగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంక్ అధికారులను డివిజనల్ స్థాయిలో మైక్రో అబ్జర్వర్లుగా నియమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. గత ఎన్నికల్లో జరిగిన అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఆయా గ్రామాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారులు, సంబంధిత డిఎస్‌పిలు సంయుక్తంగా పరిశీలించాలని పేర్కొన్నారు. ఎన్నికల విధులను నిర్వర్తించే సంబంధిత అధికారులు ఎటువంటి అలక్ష్యం లేకుండా మరింత జాగ్రత్తలు పాటించాలని ఆర్‌డిఓ లకు సూచించారు. మూడు విడతలుగా నిర్వహించే పంచాయితీ ఎన్నికలలో ఈనెల 23వ తేదీన నూజివీడు, 27వ తేదీన విజయవాడ, 31వ తేదీన బందర్, గుడివాడ డివిజన్లలో జరుగుతాయన్నారు. నూజివీడు డివిజన్‌లలో 14మండలాలను, 279 గ్రామ పంచాయితీలు, విజయవాడ డివిజనలలో 14 మండలాలకు గాను 238 గ్రామ పంచాయితీలు, బందర్ డివిజన్‌లలో 12 మండలాలకు గాను 233 గ్రామ పంచాయితీలు, గుడివాడ డివిజన్లలో 9 మండలాలకు గాను 219 గ్రామ పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సకల చర్యలు తీసుకొంటున్నామన్నారు. గిరిజన, మత్స్యకార నివాసిత ప్రాంతాల్లో చిప్ లిక్కర్ పంపిణీని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నిలక విధులు నిర్వర్తించే అధికారులందరూ మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పోలింగ్ ప్రక్రియను సమర్ధవంతంగా చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. డివిజన్ వారీగా ఇప్పటికే స్టేజ్ -1, స్టేజ్ -2 అధికారులకు శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేసామని, ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సక్రమంగా చేస్తున్నట్లు ఆర్‌డిఓలో కలెక్టర్‌కు వివరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నూతన ఓటర్ల నమోదు చేయటం జరగదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి ఉషాకుమారి, సబ్ కలెక్టర్ డి హరిచందన, అదనపు జాయింట్ కలెక్టర్ ఎన్ రమేష్‌కుమార్, డిపిఓ ఆనంద్, ట్రాన్స్‌కో ఎస్‌ఇ మొహనకృష్ణ, బిఎస్‌ఎన్‌ఎల్ అధికారి శ్రీనివాస్, డిటిసి శివలింగయ్య, నూజివీడు, గుడివాడ, బందర్ రెవెన్యూ డివిజనల్ అధికారులు బి సుబ్బారావు, వెంకట సుబ్బయ్య, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
సమాచార హక్కు చట్టం కమిషనర్ రాక
విజయవాడ (క్రైం), జూలై 4: రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ ఎం విజయనిర్మల ఈనెల 5న శుక్రవారం జిల్లాకు రానున్నట్లు రాష్ట్ర సమాచార శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఉదయం 11 గంటలకు విజయవాడ చేరుకుంటారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ శాఖల జిల్లా అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ అతిధి గృహంలో సమావేశమైన జిల్లాలో సమాచార హక్కు చట్టం అమలు తీరుపై సమీక్షిస్తారు. రాత్రి బస అనంతరం 6వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 10:30 గంటలకు ఏలూరు వెళతారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు ఏలూరు నుంచి బయలుదేరి విజయవాడ చేరుకుని రాత్రి బస చేస్తారు. 7వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు విజయవాడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి హైదరాబాద్ వెళతారు.
‘అవినీతి రాజకీయాలకు జగన్ జైలుజీవితం గుణపాఠం’
కంకిపాడు, జూలై 4: ప్రతీ అవినీతి రాజకీయ నాయకుడికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి జైలుజీవితం గుణపాఠం కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు సూచించారు. కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని శ్రీ సీతారామ గార్డెన్స్‌లో గురువారం జరిగిన నాలుగు రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలపై ఘాటుగా విమర్శల వర్షం కురిపించారు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిపి చంచల్‌గూడ జైలులో గడుపుతూ జైలు నుండే రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. అవినీతి మంత్రులు కూడా జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని జోస్యం చెప్పారు. అయ్యన్నపాత్రుడి తనయుడు విజయకుమార్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాల పేరుతో వేలకోట్లు దండుకున్నారని, ప్రజా ధనాన్ని దుర్వినియోగపర్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పాలని సూచించారు. గద్దే రామ్మోహన్ తనయుడు గద్దే రాజేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పటిష్టతకు, పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ముఖ్యంగా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నా, ఎన్టీఆర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని అన్నారు. అవినీతి అంతమై సుపరిపాలన రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, అందుకు కాంగ్రెస్ అవినీతి పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ మాట్లాడుతూ ఉత్తరాఖండ్ బాధితులకు సహాయమందించడంలో ప్రభుత్వం విఫలమైన తీరును చెప్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై ఉద్వేగంతో విమర్శలు చేస్తుంటే చంద్రబాబు అసహనం వ్యక్తంచేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతో కూడుకున్న విమర్శలు చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞత కల్పించే విధంగా మనం స్పందించడం చాలా అవసరమని పుంచుమర్తికి సూచించారు. అనంతరం సభలో మాట్లాడినవారిలో పార్టీ నాయకులు వర్ల రామయ్య, కోడెల శివప్రసాదరావు, నన్నపనేని రాజకుమారి, బచ్చుల అర్జునుడు, కొనకళ్ల నారాయణ తదితరులున్నారు.
విభేదాలు వదిలేసి విజయమే లక్ష్యంగా పనిచేయాలి
విజయవాడ, జూలై 4: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి నావంతుగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాను.. నెలల తరబడి పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరినీ పలుకరించాను... పార్టీ పట్ల స్పందన బాగానే ఉంది... అందుకే సాధ్యమైనంత మేర అన్ని గ్రామ పంచాయతీల్లోనూ పాగా వేయటానికి ఇప్పటి నుంచి నిద్రాహారాలు లేకుండా పని చేయండి అంటూ గురువారం రాత్రి ఓ స్టార్ హోటల్‌లో జరిగిన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల ముఖ్యుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. కాస్తంత కటువుగా... కాస్తంత సున్నితంగా మధ్యమధ్యలో నవ్వుతూ మొత్తంపై నాయకులకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెల్సింది. ఇన్‌చార్జులు తమతమ నియోజకవర్గాల్లో పని చేయండి... వచ్చే ఎన్నికల్లో సీటు కోసం ఇతర సామాజిక వర్గాలపై దృష్టి సారించవద్దని గట్టిగా చెప్పారు. అంతర్గత విభేదాలు విస్మరించి మమైకమై పని చేయండి. కులం వర్గం అంటూ లేకుండా గెలుపొందే వారిని పోటీకి నిలుపండన్నారు. అత్యుత్సాహంతో గత సొసైటీ ఎన్నికల్లో ఓటమి పాలైన విషయాన్ని పదేపదే గుర్తించుకోవాలన్నారు. నేతల పనితీరు గమనిస్తుంటా వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే వారందరికీ ప్రభుత్వంలో సముచిత స్థానం పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని పదేపదే చెప్పారు. సమావేశం అనంతరం రోడ్డు మార్గాన గుంటూరు వెళ్లి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతికి బయలుదేరి వెళ్లారు.
సిఐ మెడకు చుట్టుకున్న ఆటోడ్రైవర్ ఆత్మహత్య కేసు
విజయవాడ , జూలై 4: కంకిపాడుకు చెందిన ఆటోడ్రైవర్ ఆత్మహత్య కేసులో ప్రస్తుతం ఇబ్రహీంపట్నం సిఐగా పని చేస్తున్న అప్పటి కంకిపాడు ఎస్‌ఐ పి కనకారావుతోపాటు మరోవ్యక్తిపై కేసు నమోదైంది. మృతుని బాబాయి దాఖలు చేసిన ప్రైవేటు కేసును స్వీకరించిన మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈనెల 30న కేసు విచారణకు నిందితులు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కంకిపాడు పోలీస్టేషన్ పరిథిలోని తెనే్నరు గ్రామ భూస్వామి అయిన మొగులూరు భాస్కరరావు మేనకోడలు 2011 మే 21న ఇంటికి వెళ్ళేందుకు ఆటో ఎక్కింది. ఆటోడ్రైవర్ రాధాకృష్ణ (22)తోపాటు ఆటో వెనుక మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అయితే సదరు ముగ్గురూ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ విషయం తెలిసిన భూస్వామి భాస్కరరావు ఆటోస్టాండు వద్దకు వచ్చి ఆటోడ్రైవర్ రాధాకృష్ణను కొట్టి పోలీస్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు రెండురోజుల పాటు రాధాకృష్ణను స్టేషన్‌లో ఉంచి తమదైన శైలిలో విచారించారు. ఆతర్వాత రాధాకృష్ణ 2011 మే 23వ తేదీ రాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను చనిపోతూ తన మరణానికి కంకిపాడు సిఐ పి కనకారావు, భాస్కరరావుల వేధింపులే కారణమని సూసైడ్‌నోటు రాశాడు. లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆత్మహత్యపై కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై మృతుని బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా దిగారు. కాగా ఈకేసు దర్యాప్తు నగర పోలీసులు కాకుండా సిఐడికి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. విచారణ పూర్తి చేసిన సిఐడి ఆటోడ్రైవర్ రాధాకృష్ణ మరణానికి పోలీసు అధికారి కనకరావు ప్రమేయం లేదని 2012 జూలై 9న అనుకూలంగా నివేదిక సమర్పించింది. దీంతో మృతుని బాబాయి చిమట సాంబశివరావు కనకారావు, భాస్కరరావులకు వ్యతిరేకంగా ఆయన తరుఫు పౌరహక్కుల న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ ద్వారా మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో 2012 ఆగస్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశాడు. మృతుని సూసైడ్‌నోటు, చేతిరాత, ఫోరెన్సిక్ రిపోర్టు, ఇతర సాక్ష్యాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆటోడ్రైవర్ రాధాకృష్ణ ఆత్మహత్యకు కారణం సిఐ కనకారావు, భాస్కరరావులేనని ప్రాధమిక ఆధారాలున్నట్లు అభిప్రాయపడి నిందితులపై ఐపిసి 306 రెడ్‌విత్ 34 సెక్షన్ కింద కేసు విచారణకు స్వీకరించి 30న హాజరుకావాలని న్యాయమూర్తి సమన్లు జారీ చేశారు. ఇదిలావుండగా యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ముగ్గురు వ్యక్తుల గూర్చి సమాచారం తెలియచేయాలని ఆటోడ్రైవర్ రాధాకృష్ణను పోలీసులు వేధింపులకు గురి చేసినట్లు వినిపిస్తున్న ఆరోపణల వెనుక మరో కథనం దాగి ఉన్నట్లు ఫిర్యాది తాలూకూ పౌర హక్కుల న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ చెబుతున్నారు. ఈ ఘటనకు ముందు ఒక సందర్భంలో రాధాకృష్ణ ఆటో ప్రమాదానికి గురైనప్పుడు కంకిపాడు పోలీసులు ఆటోను అదుపులోకి తీసుకుని 70 రోజుల పాటు తిరిగి ఇవ్వకుండా నిర్బంధించారు. తన ఆటో ఇవ్వాలని కోరిన రాధాకృష్ణను ఎస్‌ఐ కనకారావు ఐదువేల రూపాయలు లంచం డిమాండు చేయగా రెండువేలు ముట్టచెప్పి ఆటో తీసుకెళ్లాడు. ఈ విషయం తెలిసిన రాధాకృష్ణ బంధువు ఒకరు ఎస్‌ఐని నిలదీయగా అది మనసులో పెట్టుకుని అవకాశం రాగానే తీవ్ర వేధింపులకు గురి చేయడం ద్వారా రాధాకృష్ణ ఆత్మహత్యకు పాల్పడినట్లు సదరు న్యాయవాది చెబుతున్నారు.
పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం కార్యాలయం ప్రారంభం
విజయవాడ, జూలై 4: 2014 సాధారణ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతున్నది. దీనిలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో ఇన్‌చార్జీలను నియమించడమే గాక ఎన్నికల కార్యాలయాలను హైటెక్ సౌకర్యాలతో దశల వారీగా సమకూర్చుకుంటున్నది. శాసనసభ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీల నియామకం, కార్యాలయాలు ప్రారంభం ఇప్పటికే జరిగాయి. దీనిలో భాగంగా సమీపంలో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేశినేని శ్రీనివాస్ (నాని) సొంత ఖర్చుతో పాత బస్‌స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసుకున్న కార్యాలయం (కేశినేని భవన్)ను గురువారం సాయంత్రం నారా చంద్రబాబు నాయుడు హంగూ ఆర్భాటంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబును పూలబాటలో నడిపించారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలు మార్మోగాయి. కార్యాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినందులకుగాను కేశినేని నానిని చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నగర అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, నాగుల్ మీరా, అసెంబ్లీ నియోకవర్గాల ఇన్‌చార్జీలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, శాసనసభ్యులు తంగిరాల ప్రభాకర్, శ్రీరాం తాతయ్య, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.
ఉరేసుకుని రిక్షా కార్మికుడి ఆత్మహత్య
పాతబస్తీ, జూలై 4: కంటిచూపు మందగించిందని ఇద్దరు ఆడపిల్లలను భార్యను బతికించలేననే మనోవేదనకు గురైన ఓ రిక్షా కార్మికుడు తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా వున్నాయి... కెఎల్‌రావు నగర్ అంబేద్కర్ నగర్‌కి చెందిన పమ్మిడి కృష్ణ (35) గత కొంతకాలంగా కంటిచూపు మందగించి బాధపడుతున్నాడు. ప్లాట్‌ఫాం రిక్షా కార్మికునిగా జీవనం సాగిస్తున్న కృష్ణా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో వైద్య సేవలు పొందినప్పటికీ కంటిచూపు మెరుగుపడలేదు. దాంతో జీవితంపై విరక్తి కలిగిన కృష్ణ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కి చీరతో ఉరి వేసుకున్నాడు. సమాచారం అందిన కొత్తపేట పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య దుర్గా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.